న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు.
రైతుల కపాలాలతో ర్యాలీకి..
వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్‌స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు.
రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment