ryally
-
ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత
నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారతీయ కిసాన్ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్ వరకు ర్యాలీ తలపెట్టారు. దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
రాజులా మోదీ
కిచ్చ: ‘‘అందరి మేలు కోసం పని చేయని ప్రధాని ఆ పదవిలో ఉండేందుకు అనర్హుడు. అలా చూస్తే మోదీ ప్రధానే కాదు’’ అని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. కరోనా కష్ట కాలంలో, వణికించే చలిలో రైతులను మోదీ ఏడాదికి పైగా నిర్దయగా నడిరోడ్డుపై వదిలేశారని దుయ్యబట్టారు. ‘‘మన దేశాన్నిప్పుడు ప్రధానికి బదులు ఒక రాజు పాలిస్తున్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా జనం నోరెత్తొద్దని భావిస్తున్నాడు’’ అంటూ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో శనివారం కిసాన్ స్వాభిమాన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో రైతులకు 10 రోజుల్లో పంట రుణాలు మంజూరయ్యేవన్నారు. అది వారికిచ్చిన ఉచితవరం కాదని, రైతులు 24 గంటలూ దేశం కోసమే శ్రమిస్తారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, యువత, పేదలతో కలిసి పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. ‘‘మన ముందు రెండు భారత్‌లున్నాయి. ఒకటి ధనిక పారిశ్రామికవేత్తలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మెర్సిడెజ్ కార్లది. ఇంకోటి పేదలు, నిరుద్యోగులది. దేశం జనాభాలో 40 శాతం మంది దగ్గరున్నంత సంపద కేవలం 100 మంది చేతుల్లో పోగుపడింది. ఆదాయపరంగా ఇంతటి అసమానతలు మరెక్కడా లేవు. మనకు కావాల్సింది అందరికీ సమానావకాశాలుండే ఒకే ఇండియా. అసమానతలు పోయినప్పుడే అది సాధ్యం’’ అన్నారు. -
బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే) శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌లపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల విధానం మొత్తం భారత్‌కే ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ‘బీజేపీ, ఆరెస్సెస్‌ల సైద్ధాంతిక విధానంతో మొత్తం భారత్‌కే ముప్పు కలుగుతుంది. వారు ముస్లింలను మాత్రమే లక్ష్యంగా చేసుకోరు. వారు క్రిస్టియన్లను, సిఖ్‌లను, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలను కూడా తమ వేధింపులకు లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే ఈ వర్గాలను వారు తమతో సమానులుగా భావించరు’ అని ఇమ్రాన్ విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో కశ్మీరీలపై వేధింపులు మరింత పెరిగాయన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపై తాను కశ్మీరీల తరఫున బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తున్నానన్నారు. కశ్మీరీల న్యాయమైన పోరాటంలో పాకిస్తాన్ వారికి తోడుగా ఉంటుందన్నారు. జులై 25న పీఓకేలో ఎన్నికలు జరగనున్నాయి. -
బెంగాల్ దంగల్: మోదీ–దీదీ మాటల యుద్ధం
ఖరగ్‌పూర్/ హల్దియా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మధ్య మాటల తూటాలు పేలాయి. మమత సర్కార్ దోపిడి విధానాలను మోదీ ఎత్తి చూపిస్తే, బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద దోపిడి పార్టీ అంటూ దీదీ ఎదురు దాడి చేశారు. శనివారం ఖరగ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీకి భారీగా తరలివచ్చిన జన సమూహాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. మమత సర్కార్ దోపిడి విధానాల వల్ల రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని, కేవలం మాఫియా ఇండస్ట్రీ మాత్రమే పని చేస్తోందని ధ్వజమెత్తారు. మమత మేనల్లుడు, డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీని సింగిల్ విండోగా అభివర్ణించారు. ఆయనతో మాట్లాడకపోతే ఒక్క పని జరగడం లేదని పారిశ్రామికవేత్తలందరూ హడలెత్తిపోతున్నారని అన్నారు. ‘‘పారిశ్రామికీకరణ కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు దీనిని పాటిస్తూ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. బెంగాల్లో కూడా సింగిల్ విండో ఉంది. మమత మేనల్లుడే ఇక్కడ సింగిల్ విండో. ఆ విండోని దాటకుండా ఒక్క పని కూడా జరగదు’’అని ఆరోపించారు. అన్నీ అమ్మేస్తున్నారు హల్దియా రేవు పట్టణంలో జరిగి ఎన్నికల సభకి వీల్ చైర్లోనే హాజరైన సీఎం మమతా బెనర్జీ మోదీ మాటల్ని తిప్పి కొట్టారు. ప్రపంచంలోనే బీజేపీ అతి పెద్ద దోపిడీ పార్టీ అని ఆరోపణలు గుప్పించారు. పీఎం కేర్స్ఫండ్ ద్వారా ఆ పార్టీ ఎంత డబ్బు సంపాదించిందో ఒక్క సారి చూడండని అన్నారు. మోదీని మించిన అమ్మకం దారుడు మరెవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రధాని అన్నీ అమ్మేస్తూ భారత ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. ౖ‘‘రెల్వేలను ప్రైవేటు పరం చేశారు. బొగ్గు, బీఎన్ఎన్ఎల్, బీమా, బ్యాంకులు ఇలా అన్నీ అమ్మేస్తున్నారు’’అంటూ విమర్శించారు. ఏదో ఒక రోజు హల్దియా ఓడరేవుని కూడా అమ్మకానికి పెట్టేస్తారని హెచ్చరించారు.. బెంగాల్‌ని కాపాడుకోవాలంటే తృణమూల్ కాంగ్రెస్‌కే ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేసిన మమత అప్పుడే రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లదని అన్నారు. -
26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 26వ తేదీన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఎనిమిదో దఫా చర్చలు శుక్రవారం జరగనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తప్ప రైతుల నుంచి వచ్చే ఏ ఇతర ప్రతిపాదనైనా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గురువారం పునరుద్ఘాటించారు. రైతులు, ప్రభుత్వం మధ్య శుక్రవారం చర్చల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
పాక్‌లో గురుద్వారాపై దాడి.. పలువురి ఖండన
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని చారిత్రక నాన్కానా సాహిబ్ గురుద్వారాపై జరిగిన దాడిని పలువురు ఖండించారు. ఇది పిరికిపందల సిగ్గుమాలిన చర్య అంటూ శనివారం ఢిల్లీలో వందలాది మంది ర్యాలీ చేపట్టారు. సిక్కులకు, సిక్కుల ప్రార్థనా స్థలాలకు పాక్ ప్రభుత్వం తగు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పాక్ రాయబార కార్యాలయం వైపు దూసుకు వచ్చేందుకు ప్రయత్నించగా చాణక్యపురి పోలీస్‌స్టేషన్ వద్దే వారిని పోలీసులు నిలువరించారు. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే రోడ్డుకిరువైపులా నిలబడి పాక్‌కు, ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిక్కు నేతలు పాక్ రాయబారికి వినతిపత్రం అందజేశారు. ఇలాంటి దాడులు జరక్కుండా పాక్ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కోరారు. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్‌ల్లో మత వివక్షను ఎదుర్కొంటూ భారత్‌కు ఆశ్రయం కోరి వచ్చిన వారికి పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం సబబేనని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ, విశ్వహిందూ పరిషత్ పేర్కొన్నాయి. ఈ ఘటనపై బీజేపీ నేత మీనాక్షి లేఖి, పాక్ మంత్రి ఫవాద్ ట్విట్టర్లో విమర్శలు చేసుకున్నారు. -
పోటాపోటీ ప్రదర్శనలు
న్యూఢిల్లీ/కోల్‌కతా/తిరువనంతపురం/ముంబై: పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రశాంతంగా ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో ర్యాలీలు నిర్వహించారు. పౌర చట్టంపై కాంగ్రెస్ సత్యాగ్రహం! పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సత్యాగ్రహం చేపట్టింది. ‘ఐకమత్యం కోసం సత్యాగ్రహం’పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్, రాహుల్, ముఖ్య నేతలు పాల్గొన్నారు. విద్వేషాలను పెంచుతూ దేశాన్ని ముక్కలు చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. భరత మాత గొంతు అణచివేసేందుకు, రాజ్యాంగంపై దాడికి చేస్తున్న యత్నాలను ప్రజలు కొనసాగనివ్వబోరని హెచ్చరించారు. చెన్నైలో డీఎంకే ర్యాలీ తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సోమవారం చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ పక్కన కాంగ్రెస్ నేత పి.చిదంబరం ‘పౌర’చట్టానికి వ్యతికేకంగా ప్లకార్డులు పట్టుకుని నడిచారు. పెళ్లిళ్లు, వేడుకల్లోనూ ‘పౌర’ నిరసనలు కేరళలో పెళ్లిళ్లు, వేడుకలు, క్రిస్మస్ సంబరాలే నిరసన వేదికలుగా మారాయి. ఈ ఒరవడి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు, వధువు పెళ్లి విందు సందర్భంగా ఎన్నార్సీకి, పౌర చట్టానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని ముందు నడుస్తుండగా వారి బంధువులు నినాదాలు చేసుకుంటూ వస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాజకీయ లబ్ధికే బెంగాల్ సీఎం మొగ్గు.. పౌరసత్వ సవరణ చట్టంపై సాధారణ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జాతీయ ప్రయోజనాల కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. ‘పౌర’చట్టానికి అనుకూలంగా కోల్‌కతాలో సోమవారం బీజేపీ చేపట్టిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఆశ్చర్యం కలిగించాయి: పవార్ దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)అమలు చేసే విషయమై పార్లమెంట్లో చర్చే జరగలేదన్న మోదీ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఎన్నార్సీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ పార్లమెంట్ సంయుక్త సమావేశం సందర్భంగా రాష్ట్రపతిæ వెల్లడించారని గుర్తు చేశారు. మమతా బెనర్జీ లేఖ బీజేపీ ప్రభుత్వం కారణంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కలిసికట్టుగా ఉండి దేశాన్ని రక్షించుకుందామన్న బెంగాల్ సీఎం మమత.. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల సీనియర్ నేతలకు లేఖలు రాశారు. అందుకే ఎన్నార్సీపై వెనక్కు! జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ)పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వచ్చాక ఎన్నార్సీపై కేబినెట్లోగానీ, పార్లమెంట్లోగానీ చర్చించలేదని ఆదివారం ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో మోదీ చెప్పడం తెల్సిందే. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీలపై నిరసనలు, హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో కొన్నాళ్లు ఎన్ఆర్సీని పక్కనపెట్టాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే ప్రధాని ఆ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు. అందుకే ఎన్నార్సీ, సీఏఏ వేరువేరు అని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారని విశ్లేషకులు భావిస్తున్నారు. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు ఇంత తీవ్ర స్థాయిలో జరుగుతాయని ఊహించలేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నార్సీపై ముస్లింల ఆందోళన కూడా ఈ స్థాయిలో నిరసనలు జరగడానికి కారణమని పేర్కొన్నారు. -
నా పేరు రాహుల్ సావర్కర్ కాదు
న్యూఢిల్లీ: దేశంలో అత్యాచారాల గురించి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గబోనని, క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాహుల్ ‘రేప్ ఇన్ ఇండియా’వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని ఉద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారత్ బాచావో ర్యాలీలో పాల్గొన్న రాహుల్.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. తనకు తానుగా దేశభక్తుడిగా అభివర్ణించుకునే ప్రధాని.. ఒంటి చేత్తో ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సమయమిదే: సోనియా ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ చివరి శ్వాస వరకూ పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. భారత్ బచావో ర్యాలీలో సోనియా మాట్లాడారు. ప్రజలందరూ అన్యాయంపై గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. దేశంలో ప్రస్తుతం అరాచక రాజ్యం నడుస్తోందని, సబ్కా సాథ్, సబ్ కా వికాస్ అన్న అధికార పక్ష నినాదం స్ఫూర్తి ఏదని దేశం మొత్తం ప్రశ్నిస్తోందని ఆమె భారతీయ జనతా పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ నాటి అరాచకత్వంపై పోరాడకపోతే మనం చరిత్రలో పిరికివాళ్లుగా మిగిలిపోతామని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ తన భారత్ బచావ్ ర్యాలీ ప్రసంగంలో స్పష్టం చేశారు. గాంధీ, నెహ్రూల్లానే సావర్కర్ కూడా.. రాహుల్ ‘సావర్కర్’ వ్యాఖ్యలపై శివసేన స్పందించింది. హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. సరిపోయే పేరు.. ‘రాహుల్ జిన్నా’: బీజేపీ ముస్లింల ఓట్ల కోసం రాజకీయాలు చేసే రాహుల్‌కు ‘రాహుల్ జిన్నా’అనే పేరు అతికినట్లు సరిపోతుందంటూ బీజేపీ ఎద్దేవా చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ‘ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు చేసే నువ్వు మొహమ్మద్ అలీ జిన్నా వారసుడివే తప్ప, సావర్కర్‌కు కాదు’అని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ ఇన్నాళ్లకు నిజం మాట్లాడారు. ఆయన ఎన్నటికీ రాహుల్ సావర్కర్ కాలేరు. నెహ్రూ–గాంధీ కుటుంబంలో 5వ తరం వ్యక్తి సావర్కర్ స్థాయికి సరితూగరు ’అని బీజేపీ ఐటీ విభాగం అధిపతి అమిత్ మాల్వీయ ట్విట్టర్లో పేర్కొన్నారు. -
జోరు వర్షాన్ని లెక్కచేయకుండా.. పవార్.. పవర్!
సతారా: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్(80) చేవతగ్గలేదని మరోసారి నిరూపించారు. జోరున వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ప్రచారం ఆఖరి రోజైన శనివారం సతారాలో ఎన్నికల ర్యాలీ నిర్వహించడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తు తున్నాయి. ఈ సందర్భంగా శరద్ పవార్ పార్టీ అభ్యర్థి ఎంపికలో తప్పు చేసినట్లు అంగీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ‘తప్పు చేస్తే ఒప్పుకోవాలి. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి ఎంపికలో తప్పు చేశా. ఆ విషయాన్ని మీ ముందు అంగీకరిస్తున్నా. కానీ, ఆ తప్పును సరిదిద్దుకోబోతున్నందుకు సంతోషంగా ఉంది. 21న జరగనున్న పోలింగ్ కోసం సతారా ఓటర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో ఎన్సీపీకి వరుణ దేవుడి ఆశీస్సులు కూడా లభించాయి. వరుణుడి కటాక్షంతో సతారా ప్రజలు అద్భుతం సృష్టించబోతున్నారు’అని తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న మిగతా నేతలంతా వర్షంలో తడవకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆయన ఆగలేదు. తడుస్తూనే ప్రసంగం కొనసాగించారు. పోరాట యోధుడు కాబట్టే శరద్ పవార్ 5 దశాబ్దాలుగా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కాగా, సతారా ఉప ఎన్నికకుగాను ఛత్రపతి శివాజీ వంశీకుడు ఉదయన్ భోసాలేకు ఎన్సీపీ టికెట్ కేటాయిం చింది. ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చు కుని, ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. -
‘370’ని మళ్లీ తేగలరా?
జల్గావ్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇవ్వగలరా అని ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ జల్గావ్లో మొట్టమొదటి ర్యాలీలో పాల్గొన్నారు. ‘జమ్మూకశ్మీర్ అంటే కేవలం చిన్న భూభాగం కాదు, దేశానికి అది మకుటం వంటిది. 40 ఏళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థాయికి తేవటానికి మాకు నాలుగు నెలలు కూడా పట్టలేదు. ఎంతో కీలకమైన ఆర్టికల్ 370 రద్దును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. పొరుగు దేశం(పాకిస్తాన్) మాదిరిగా మాట్లాడుతున్నాయి. కశ్మీర్‌పై దేశమంతటా ఏకాభిప్రాయంతో ఉండగా ప్రతిపక్ష నేతలు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఆర్టికల్ 370, 35ఏలను తిరిగి అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి చూద్దాం’అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతలు కశ్మీర్‌పై మొసలి కన్నీరు కార్చడం మానాలన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే ప్రతిపక్షాలకు భవిష్యత్తే ఉండదన్నారు. ‘వేర్పాటు వాదం, ఉగ్రవాదం వేళ్లూనుకున్న కశ్మీర్ పూర్తిగా వెనుకబాటుకు గురయింది. జమ్మూ, కశ్మీర్, లఢాఖ్ల్లో నివసించే వాల్మీకి వర్గం వారికి కనీస హక్కులు కూడా కరువయ్యాయి. అందుకే ఎవ్వరూ ఊహించలేని విధంగా కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం తీసుకున్నాం. మా ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది’అని మోదీ అన్నారు. అలాగే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ తాము తెచ్చిన చట్టంపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. చేతనైతే ట్రిపుల్ తలాక్ విధానాన్ని తిరిగి ఆచరణలోకి తెస్తామని ప్రకటించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఫడ్నవిస్ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొందని ప్రశంసించారు. ‘సముద్రంతో సంభాషణ’ ప్రధాని కవిత మామల్లపురంలోని బీచ్‌లో శనివారం ఉదయం ఒంటరిగా నడక సాగించిన ప్రధాని మోదీ సముద్రంతో నా సంభాషణ పేరుతో కవిత రాశారు. ‘నా ఆలోచనలకు ప్రతిరూపమే ఈ సంభాషణలు. కవిత రూపంలో నా అనుభూతులను మీతో పంచుకుంటున్నాను’అంటూ ఆదివారం ఆయన తన కవితలను ట్విట్టర్లో ఉంచారు. ఆ పోస్ట్ నమిషాల్లోనే వైరల్ అయింది. ‘హే..సాగర్’అంటూ మొదలై ఎనిమిది పేరాలుగా సాగే ఆ కవితల్లో సముద్రానికి సూర్యుడితో అనుబంధం, అలలు, వాటి వేదనను మోదీ వర్ణించారు. బీచ్‌లో నడక సాగిస్తూ సముద్రంలో సంభాషించే క్రమంలో తనను తాను మరిచిపోయానన్నారు. కాగా, ‘ఎ జెర్నీ’పేరుతో ప్రధాని మోదీ ఇప్పటికే ఒక కవితా సంకలనం విడుదల చేశారు. మాతృమూర్తితో సంభాషణలతో కూడిన కవితలను ‘సాక్షీభవ’పేరుతో ప్రచురించారు. వివిధ అంశాలపై ఇప్పటి వరకు ఆయన 11కు పైగా పుస్తకాలు రాశారు. ఇన్‌స్టాలోనూ మోదీనే టాప్ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో దూసుకెళుతున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 3 కోట్లు దాటింది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే అధికం. మోదీ ప్రపంచ స్థాయి నేత అనడానికి ఇదే సాక్ష్యం అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ప్రస్తుతం బరాక్ ఒబామాను 2.48 కోట్ల మంది, ట్రంప్‌ను 1.49 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో మోదీకి 5.07 కోట్ల మంది, ఫేస్బుక్లో 4.44 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ వస్తువు అక్యుప్రెషర్ రోలర్! మామల్లపురం బీచ్‌లో ప్లాగింగ్ సమయంలో ప్రధాని మోదీ చేతిలో ఉన్న వస్తువు ఏమిటనే దానిపై ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కర్ర మాదిరిగా ఉన్న ఆ వస్తువు అక్యుప్రెషర్ రోలర్ అని ప్రధాని ప్రకటించారు. తరచుగా దానిని వాడు తుంటానని, అది చాలా ఉపయోగపడుతోందని ఆయన వివరించారు. నెటిజన్ల కోరిక మేరకు అక్యుప్రెషర్ రోలర్ ఫొటోలను ఆయన ట్విట్టర్లో ఉంచారు. శనివారం వేకువజామున మామల్లపురం బీచ్‌లో ప్రధాని మోదీ చెత్తాచెదారం ఏరుతూ జాగింగ్ చేసిన విషయం తెలిసిందే. -
2 లక్షల మంది రోహింగ్యాల ర్యాలీ
కుటుపలోంగ్: మయన్మార్ బలగాల దాడుల నుంచి తప్పించుకుని పారిపోయి రెండేళ్లయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని కుటుపలోంగ్ శరణార్థి శిబిరంలో ఉంటున్న దాదాపు 2 లక్షల మంది రోహింగ్యాలు అక్కడే ర్యాలీ చేపట్టారు. 2017 ఆగస్టులో మయన్మార్‌లోని రఖినే రాష్ట్రం నుంచి 7.4 లక్షల మంది రోహింగ్యాలు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందే మయన్మార్ నుంచి వచ్చిన మరో 2 లక్షల మంది రోహింగ్యాలు ఆగ్నేయ బంగ్లాదేశ్‌లోని శిబిరాల్లో ఉంటున్నారు. వారికి ఈ 7.4 లక్షల మంది కూడా జతకలిశారు. ఆదివారం జరిగిన ర్యాలీలో హత్యాకాండ దినం సందర్భంగా చిన్నారులు, మహిళలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘దేవుడు గొప్పవాడు. రోహింగ్యాలు వర్ధిల్లాలి’ అంటూ వారంతా నినాదాలు చేశారు. -
80% మోదీ మ్యాజిక్
ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల అధినేతల ర్యాలీలు, సభల నిర్వహణకు నియోజకవర్గాలను ఎంపిక చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఒక ప్రాంతంలో సభని నిర్వహిస్తే, దానికి జన సమీకరణే కాదు, ఆ తర్వాత ఓట్లు రాబట్టుకోగలగాలి. ఎన్నికల ర్యాలీల ఎంపికలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాలకు తిరుగేలేదు. ఉన్న కాస్త సమయంలోనే ఆయన పక్కాగా, ప్రణాళికా బద్ధంగా దేశవ్యాప్తంగా 142 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. వాటిలో ఏకంగా 114 స్థానాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. అంటే సక్సెస్ రేటు 80శాతంగా ఉంది. మోదీ తన ప్రచార సభల్లో మూడోవంతు ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ల్లో నిర్వహించి అనూహ్య విజయాలు సొంతం చేసుకున్నారు. గతేడాది జరిగిన మూడు హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ 27 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తే బీజేపీ 13 స్థానాల్లో మాత్రమే నెగ్గింది. అంటే గెలుపు రేటు 48శాతంగా ఉంది. ఏడాది తిరిగే సరికల్లా లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సక్సెస్ రేటు రెట్టింపైంది. హిందీ రాష్ట్రాలైన, మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహా ర్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ల్లో మోదీ 60 ర్యాలీలు నిర్వహిస్తే మొత్తంగా క్లీన్‌స్వీప్ చేసింది. యూపీలో 30 లోక్‌సభ నియోజకవర్గాల్లో మోదీ ర్యాలీల్లో పాల్గొంటే 23 సీట్లలో బీజేపీ నెగ్గింది. ఇక కేరళ, తమిళనాడుల్లో మోదీ అయిదు ర్యాలీల్లో పాల్గొంటే ఎన్డీయే కూటమి కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాహుల్‌పై మళ్లీ అదే ముద్ర! కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కొన్నాళ్ల కిందటి వరకు ఐరన్ లెగ్ ముద్ర ఉండేది. ఆయన ఎవరికి ప్రచారం చేస్తే వారు ఓడిపోతారన్న భావన అందరిలోనూ నెలకొంది. గతేడాది హిందీ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల విజయంతో రాహుల్ తనపై ఉన్న పప్పూ ముద్రను తొలగించుకున్నారని ఆయన అభిమానులు ఆనందించారు. కానీ ఇంతలోనే అది కాస్తా తారుమారైంది. రాహుల్ 115 నియోజకవర్గాల్లో పర్యటిస్తే యూపీఏ 96 సీట్లలో ఓడిపోయింది. ఆయన గెలుపు 17శాతం దగ్గరే నిలిచిపోయింది. తుస్సుమన్న బ్రహ్మాస్త్రం ఇక కాంగ్రెస్ పార్టీ తన అమ్ముల పొదిలోంచి ఎన్నికలకు మూడు నెలల ముందు తీసిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. సమయం తక్కువగా ఉన్నప్పటికీ 38 నియోజక వర్గాల్లో ప్రియాంక గాంధీ పర్యటించారు. 44 ర్యాలీల్లో పాల్గొన్నారు. 26 ర్యాలీలు యూపీలో నిర్వహిస్తే, మిగిలినవి మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్, హరియాణాల్లో పార్టీ అభ్యర్థులు నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. కానీ అన్న రాహుల్ పాటి సక్సెస్‌ను కూడా ఆమె సాధించలేకపోయారు. ప్రియాంక ప్రచారం చేసిన స్థానాల్లో రెండంటే రెండు అదీ అమ్మ, అన్న మాత్రమే గెలిచారు. రాయ్‌బరేలి, వయనాడ్‌ల్లో సోనియా, రాహుల్ మినహా మరెవరూ గెలవలేకపోయారు. వాస్తవానికి ప్రియాంక ప్రచారం పార్టీకి కొత్తగా ఒనగూర్చే ప్రయోజనం ఏమీ లేదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. -
బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’
లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మాటల యుద్దం నుంచి దాడుల వరకు... సాధారణంగా బిహార్ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈశ్వర్ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్ షా మండి పడ్డారు. తృణమూల్ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది. తృణమూల్ బలప్రయోగం పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి. వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ తీవ్ర పోరుకి కారణం... తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్ వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం. మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది. సత్తా చాటుకునేందుకే... తమ సత్తా చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ విగ్రహం విధ్వంసం బెంగాల్ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్ నేతలు తమ ఫేస్బుక్ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి. విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. హద్దులు దాటిన ప్రచార యుద్ధం యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు మే 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు. ఇద్దరూ ఇద్దరే... మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు. ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు. మోదీ ఇటీవల బెంగాల్లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్. అన్నారు. బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్ చీఫ్, సీఎం మమతా బెనర్జీ ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్ బీజేపీ నేతలు -
మోదీ అబద్ధాలకోరు
అలిపుర్దార్ (బెంగాల్): మోదీ అబద్ధాలకోరు. ఐదేళ్లుగా దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. శనివారం అలిపుర్దార్ జిల్లా బరోబిషాలో ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. సొంత భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి, దేశానికి ఎలా న్యాయం చేయగలరని మోదీని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలకమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ మరో కుట్ర అని, తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వారి ఆటలు సాగునివ్వబోదని ఆమె అన్నారు. అధికారుల బదిలీలపై ఈసీకి లేఖ: కోల్‌కతా, బిద్దన్నగర్ పోలీసు కమిషనర్లతో సహా నలుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై శనివారం ఈసీకి ఆమె లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వ ప్రేరణతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నామని అన్నారు. వారిని బదిలీ చేసేందుకు కారణాలు తెలపాలని, బదిలీ నిర్ణయాన్ని ఈసీ పునఃసమీక్షిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. బెంగాల్లో శాంతి భద్రతల సమస్య ఉందని ఇటీవల మోదీ ఆరోపణల నేపథ్యంలోనే∙ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు. -
పేదలకు కనీస ఆదాయ భద్రత
న్యూఢిల్లీ/పణజీ/రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయ భద్రత కల్పించి పేదరికాన్ని రూపుమాపుతామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రకటించారు. దీంతో ‘పేదరికాన్ని తొలగించండి’(గరీబీ హఠావో) అంటూ 1971 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఇచ్చిన నినాదాన్ని మళ్లీ రాహుల్ అందుకున్నట్లైంది. ప్రధాని మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సరిగ్గా 4రోజుల ముందు కాంగ్రెస్ నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రైతుల ర్యాలీలో సోమవారం రాహుల్ మాట్లాడారు. ‘చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రజలందరికీ కనీస ఆదాయ భద్రతను కాంగ్రెస్ కల్పించబోతోంది. దీంతో దేశంలో ఆకలి, పేదరికం అనేదే ఉండదు’ అని రాహుల్ అన్నారు. చెప్పింది చేస్తానని, పథకాన్ని దేశమంతటా అమలు చేస్తానన్నారు. ర్యాలీలో బీజేపీపై రాహుల్ పలు విమర్శలు చేశారు. 15 మంది బడా పారిశ్రామికవేత్తలు తీసుకున్న రూ.3.5కోట్ల రుణాలను కేంద్రం మాఫీ చేసిందనీ, రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండు భారత దేశాలను సృష్టించాలని ప్రయత్నిస్తోందనీ, వాటిలో ఒకటి రఫేల్ కుంభకోణం, అనీల్ అంబానీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ తదితరులు ఉండే దేశం కాగా, ఇంకొకటి పేద రైతులు ఉండే దేశమని రాహుల్ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు ఓటేసి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ర్యాలీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. కనీస ఆదాయ భద్రత హామీపై బీజేపీ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన వందలకొద్దీ అబద్ధపు హామీల్లో ఇదొకటనీ, వాటిని అమలు చేయడం ఆ పార్టీకి కుదరని పని అని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆ టేపులు నిజమైనవే రఫేల్ ఒప్పందానికి సంబంధించిన వ్యాఖ్య లున్న గోవా ఆడియో టేపులు నిజమైనవేనని రాహుల్ ఆరోపించారు. గోవా ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి మనోహరీ పరీకర్ వద్ద రఫేల్ ఒప్పందం గురించిన భారీ రహస్యాలు ఉన్నాయనీ, వాటి వల్లనే ప్రధాని నరేంద్ర మోదీపై అధికారం చెలాయించే అవకాశం పరీకర్‌కు దక్కిందని రాహుల్ అన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు పరీకర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన పదవిలో ఉన్నాడంటూ గోవా మంత్రి విశ్వజిత్ రాణే ఒక గుర్తు తెలియని వ్యక్తికి చెబుతున్న ఆడియో టేపులు ఈ నెల మొదట్లో బయటపడటం తెలిసిందే. రాహుల్ మాట్లాడుతూ ‘30 రోజులవుతున్నా వీటిపై విచారణేదీ లేదు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. మంత్రిపై ఏ చర్యలూ లేవు. ఈ ఆడియోటేపులు నిజమైనవేనని తెలుస్తోంది. రఫేల్ రహస్య పత్రాలు పరీకర్ దగ్గర ఉన్నాయి’ అని అన్నారు. రఫేల్ డీల్‌కు చెందిన ఆధారాలు తన పడకగదిలో ఉన్నాయంటూ పరీకర్ వ్యాఖ్యానించినట్లుగా గతంలో వచ్చిన వార్తలపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఆ ఆడియో టేపులు నకిలీవనీ, నిజాలను దాచి అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని పరీకర్ అప్పట్లో చెప్పారు. బీజేపీ నేత అనంతకుమార్ హెగ్డే కేంద్ర మంత్రి పదవిలో ఉండేందుకు అనర్హుడనీ, ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని రాహుల్ అన్నారు. అంతకుముందు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు దినేశ్ గుండూరావ్ భార్యను ఉద్దేశించి హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేశారు. గోవాలో రాహుల్, సోనియా రాహుల్ తన తల్లి, యూపీఏ చైర్పర్సన్ సోనియాతో కలిసి శని, ఆదివారాల్లో గోవాలో వ్యక్తిగతంగా పర్యటించారు. పార్టీ నేతలతో సమావేశాలు అక్కడ ఏర్పాటు చేయలేదు. ఆదివారం వారు ఓ బీచ్ రెస్టారెంట్‌కు వెళ్లారు. కాగా, గోవాలో మండోవి నదిపై తమ ప్రభుత్వం ఏర్పాటుచేసిన 5.1 కిలో మీటర్ల పొడవైన తాళ్ల వంతెనను రాహుల్ సందర్శించి, దేశాన్ని బీజేపీ ఎలా మారుస్తుందో చూడాలని రాహుల్‌ను ట్విట్టర్లో బీజేపీ కోరింది. మాజీ ప్రధాని వాజ్‌పేయి పేరు మీదుగా ఈ వంతెనకు అటల్ సేతు అని పేరు పెట్టారు. -
రాజధానిలో రైతు రణం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు. రైతుల కపాలాలతో ర్యాలీకి.. వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు. -
ప్రచార ర్యాలీలు.. ప్రజలకూ అగచాట్లు
సాక్షి, మహబూబాబాద్ /మహబూబాబాద్ : నామినేషన్లు వేసేందుకు సోమవారం చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ బలాలను ప్రదర్శించేందుకు భారీగా ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు వేశారు. దీంతో ప్రధాన రహదారులన్నీ జనంతో నిండగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. పోలీసులు సైతం చేతులెత్తేయడంతో గంటపాటు రాకపోకలు స్తంభించి సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రిట ర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మూడు రహదారులకు కొంత దూరం మేరకు భారీకేడ్లు, ఇతరత్రా స్టాండ్లు, ట్రాఫిక్ సంబంధించిన వాటితో ఆ దారులను మూసి వేశారు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అభ్యర్థులు వారిని బలపరిచిన వారు మాత్రమే కార్యాలయంలోకి అనుమతించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సోమవారం ఒకేసారి నామినేషన్ వేయడంతో ఆ ప్రాంతమంతా నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసింది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్, నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారథితో పాటు మరికొంత మందితో కలిసి ఉదయం 10.40 గంటలకు చేరుకుని 11 గంటలకు నామినేషన్ల స్వీకరించడం ప్రారంభం కాగానే నామినేషన్ వేసి వెళ్లారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ... జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్ నుంచి వేలాది మందితో మహాకూటమి తరుపున భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ర్యాలీలో అభ్యర్థి బలరాంనాయక్‌తో పాటు మహాకూటమి నాయకులు భరత్‌చందర్‌రెడ్డి, వేంనరేందర్‌రెడ్డి, బి. విజయసారథి, డాక్టర్ డోలి సత్యనారాయణ, బండి పుల్లయ్య, గుగులోత్ సుచిత్ర, జెడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, బి. అజయ్ తదితరులు ప్రచార వాహనంలో ర్యాలీతో పాటు వచ్చారు. మూడు కొట్ల నుంచి శ్రీనివాస థియేటర్ వరకు ఆ దారంతా వారితో కిక్కిరిసింది. దీంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. నామినేషన్ వేసిన అనంతరం బలరాంనాయక్ మాట్లాడుతూ మానుకోట కాంగ్రెస్‌కు కంచుకోట అని కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు. ట్రాఫిక్ సమస్య.. పోలీసులతో వాగ్వాదం కాంగ్రెస్ ర్యాలీతో ముత్యాలమ్మ గుడి వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దానిలో ఆర్టీసీ బస్సులతో పాటు పలు ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయాయి. దారులన్నీ మూసుకుపోయాయి. కాంగ్రెస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయం నుంచి వెళ్లే విధంగా అనుమతి ఇవ్వాలని లేకపోతే ట్రాఫిక్ క్లియర్ చేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ కాంగ్రెస్ కార్యకర్త ముందుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వేం నరేందర్‌రెడ్డి సమయం లేదని కార్యకర్తలు సమన్వయం పాటించాలని మాట్లాడడంతో సమస్య సర్ధుమనిగింది. కాంగ్రెస్ నాయకుడు రావుల రవిచందర్‌రెడ్డి ట్రాఫిక్ క్లియర్ చేసే బాధ్యత మీపై లేదా అని సీఐ రవికుమార్‌తో మాట్లాడారు.....దానికి వారు సిబ్బంది తక్కువగా ఉన్నారని సమాధానమిచ్చారు. దాంతో చేసేదేమీ లేక మహాకూటమి నాయకులు ఆ ర్యాలీలోనే మాట్లాడి ర్యాలీని ముగించుకోవాల్సి వచ్చింది. బీజేపీ భారీ ర్యాలీ... బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్‌నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ప్రచార రథంపైన అందరికీ అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. అనంతరం హుస్సేన్‌నాయక్ తన అనుచరులైన కిరణ్, చెలుపూరి వెంకన్న, యాప సీతయ్య, ముళ్లంగి ప్రతాప్, వెంకటలక్ష్మీతో కలిసి నామినేషన్ వేశారు. ఒకే సమయంలో రెండు ర్యాలీలతో... కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఒకే సమయంలో ర్యాలీగా రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కొంత ముందుగా బీజేపీ ర్యాలీ ఇందిరాగాంధీ సెంటర్‌కు చేరుకున్నా ఆ తరువాత ర్యాలీ నుంచి వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ కూడా తొర్రూరు రోడ్ నుంచి రావడంతో వేలాది మందితో రహదారులన్నీ కిక్కిరిశాయి. పాలకుర్తిలో కేసీఆర్ సభ ఉండడంతో సిబ్బంది ఎక్కువ అక్కడికి బందోబస్తుకు వెళ్లడంతో సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల సమస్య తలెత్తింది. ఏది ఏమైనా ర్యాలీతో మానుకోట హోరెత్తింది. ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. రిటర్నింగ్ ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట జన సందోహం బందోబస్తు ఏర్పాటు చేయడం విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. నామినేషన్ చివరిరోజు కావడంతో పాటు ర్యాలీలు ఉన్నాయని ముందే తెలిసినా ఏర్పాటు చేయడంలో విఫలం కావడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రిటర్నింగ్ ఎన్నికల అధికారి కార్యాలయం ఎదుట మూడు రహదారుల్లో భారీ కేడ్లు, ఇతరత్రా స్టాండ్లు, ట్రాఫిక్ వాటితో మూసి వేశారు. అభ్యర్థులతో కేవలం బలపరిచిన వాళ్లే రావాల్సి ఉండగా మిగిలిన కొంతమంది కూడా కార్యాలయం ఎదుట రావడంతో ఆ ప్రాంతం జనసందోహంగా మారింది. భారీ కేడ్లు ఏర్పాటు చేసిన దగ్గరనే రానివ్వకుండా కట్టడి చేస్తే బాగుండేదని పోలీసులు వారిని అడ్డుకుని ఆపడంలో విఫలం కావడం జరిగింది. డీఎస్పీ ఆంగోత్ నరేష్కుమార్ నేరుగా లాఠీతో జనాన్ని బయటకు పంపినప్పటికీ మళ్లీ ఇతరులు రావడంతో కట్టడి చేయడం కష్టమైంది. దానికి తోడు ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్ జాం కావడంతో కార్యకర్తలు కార్యాలయం వైపుకు చొచ్చుకుకెళ్లే ప్రయత్నం చేశారు. -
ప్రత్యేక హోదా బంద్‌కు మద్ధతుగా..
అమరావతి: ప్రత్యేక హోదా ఉద్యమం తారా స్థాయికి చేరుకుంది. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీల వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ రేపు(ఈ నెల 24) రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే. బంద్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లాలో పలు చోట్లు ధర్నాలు, రాస్తారోలు, ర్యాలీలు తీశాయి. వైఎస్సార్ జిల్లా కడప నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నేతల విన్నూత్న నిరసన చేపట్టారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ వైఖరికి నిరసనగా అర్థ నగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రత్యేక హోదా- ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ కడప నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం నగర అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు తలపెట్టిన బంద్ ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరుతూ నియెజకవర్గ సమన్వయకర్త జోగారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంటరీ అధ్యక్షులు పరీక్షీత్ రాజు హాజరయ్యారు. విశాఖపట్నం జిల్లా రాష్ట్ర బంద్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ ఉత్తర కన్వీనర్ కె.కె.రాజు ఆధ్వర్యంలో తాటిచెట్ల పాలెం నుంచి మద్దిలపాలెం పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ వైఖరిపై విసుగెత్తి ప్రజలు బంద్ విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గ కన్వీనర్ కేకే రాజు తెలిపారు. అనకాపల్లిలో ప్రత్యేక హోదా కోసం రేపు జరగబోయే బంద్ విజయవంతం కావాలంటూ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నేతలు దంతులూరి దిలీప్‌కుమార్, మందపాటి జానకిరామరాజు, గొర్లి సూరిబాబు,గొల్లవిల్లి శ్రీనివాసరావు, బీశెట్టి జగన్, బొడ్డేడ శివ, మురళీకృష్ణ రమణ అప్పారావు. అనంతపురం జిల్లా ఏపీ బంద్ విజయవంతం చేయాలని కోరుతూ మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగేపరశురాం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గంలో రేపటి బంద్ ను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా రేపటి బంద్‌కు మద్ధతుగా తిరుపతిలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో ఎస్వీయూ నుంచి నాలుగు కాళ్ల మంటపం వరకు 3000 మందితో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ చేసిన మోసానికి నిరసనగా రేపు జరిగే బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని వైఎస్సార్సీపీ నేత, ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కృష్ణా జిల్లా ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలంటూ జగ్గయ్యపేలో వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత విధానాలకు నిరసనగా ధర్నా చేపట్టారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌పాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్‌ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణదళం జోన్ కమాండెంట్ డీఎన్ఏ బాషా పేర్కొన్నారు. శనివారం ఏపీఎస్పీఎఫ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపు మేరకు ప్రజలలో సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌ఫాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ అనే నినాదంతో రాజమహేంద్రవరం శ్రీనివాస గార్డెన్స్‌లోని జోనల్ కార్యాలయం నుంచి ఆయన, వందమంది సిబ్బంది రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీని ప్రకాషనగర్ ఇన్స్పెక్టర్ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రోడ్డు కంరైలు బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరు, చంద్రగిరి, మద్దూరు మీదుగా నిడదవోలు చేరుకున్నారు. నిడదవోలు సబ్ఇన్స్పెక్టర్ కమాండెంట్ బాషా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఈ సైకిల్ ర్యాలీ నిడదవోలు నుంచి రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ సందర్భంగా కమాండెంట్ డీఎన్ఏ బాషా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీలు ఇటువంటివి మరిన్ని చేస్తామన్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ కె.సుధాకరరావు, ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు, సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, రామకృష్ణ, ధనుంజయరావు పాల్గొన్నారు. -
సచివాలయంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ
అమరావతి : సచివాలయంలో శుక్రవారం ఉద్యోగుల నిరసన ర్యాలీకి దిగారు. ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ మూడో బ్లాక్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. అన్యాయంగా ఏపీని విభజన చేశారని మండిపడ్డారు. విభజన హామీలకోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నారని, హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. -
కదంతొక్కిన కార్మిక లోకం
విశాఖపట్నం : కేంద్ర కార్మిక సంఘాల బంద్‌తో ప్రభుత్వ కార్యాలయాలు శుక్రవారం స్తంభించాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రవాణా వ్యవస్థపై బంద్ ప్రభావం పడింది. పారిశ్రామిక వాడలు బోసిపోయాయి. స్టీల్‌ప్లాంట్ ఉద్యోగ కార్మికులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 12 డిమాండ్లపై కార్మికలోకం గొంతెత్తింది. కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. హెచ్‌పీసీఎల్,బెల్,ఎన్టీపీసీ,డ్రెడ్జింగ్ కార్పొరేషన్,విశాఖ పోర్టు కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందస్తుగా కార్మిక నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బంద్ అన్ని చోట్ల విజయవంతంగా జరిగింది.