అలిపుర్దార్ (బెంగాల్): మోదీ అబద్ధాలకోరు. ఐదేళ్లుగా దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఆయన నిలబెట్టుకోలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. శనివారం అలిపుర్దార్ జిల్లా బరోబిషాలో ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. సొంత భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి, దేశానికి ఎలా న్యాయం చేయగలరని మోదీని ఉద్దేశించి అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడే ప్రభుత్వంలో తృణమూల్ కాంగ్రెస్ కీలకమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు బీజేపీ ప్రభుత్వ మరో కుట్ర అని, తృణమూల్ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో వారి ఆటలు సాగునివ్వబోదని ఆమె అన్నారు.
అధికారుల బదిలీలపై ఈసీకి లేఖ: కోల్‌కతా, బిద్దన్నగర్ పోలీసు కమిషనర్లతో సహా నలుగురు ఐపీఎస్ అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేయడంపై శనివారం ఈసీకి ఆమె లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వ ప్రేరణతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నామని అన్నారు. వారిని బదిలీ చేసేందుకు కారణాలు తెలపాలని, బదిలీ నిర్ణయాన్ని ఈసీ పునఃసమీక్షిస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. బెంగాల్‌లో శాంతి భద్రతల సమస్య ఉందని ఇటీవల మోదీ ఆరోపణల నేపథ్యంలోనే∙ఈసీ బదిలీల నిర్ణయం తీసుకుందని మమతా బెనర్జీ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment