ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత | Compensation for Land, Jobs for Family Members, Farmers Are Protesting | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీలో ఉద్రిక్తత

Published Fri, Feb 9 2024 5:57 AM | Last Updated on Fri, Feb 9 2024 5:57 AM

Compensation for Land, Jobs for Family Members, Farmers Are Protesting - Sakshi

నోయిడా: వేలాది మంది రైతుల ర్యాలీ, నిరసన హోరుతో ఢిల్లీ శివార్లు గురువారం దద్దరిల్లాయి. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్‌ నోయిడా ప్రాంతాలకు చెందిన రైతులు ఢిల్లీలో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. పార్లమెంట్‌ దిశగా దూసుకెళ్తుండగా పోలీసులు ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల కోసం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని రైతులు చాలా ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.

భూములు తీసుకొని అభివృద్ధి చేసిన ప్లాట్లలో పది శాతం రెసిడెన్షయల్‌ ప్లాట్లు తమకు ఇవ్వాలని లేదా వాటికి సమానమైన పరిహారం చెల్లించాలని 2019 నుంచి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో పోరాటం ఉధృతం చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా, అఖిల భారతీయ కిసాన్‌ సభ ఆధ్వర్యంలో గురువారం పార్లమెంట్‌ వరకు ర్యాలీ తలపెట్టారు.

దాదాపు 100 గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. వీరిలో వృద్ధులు, మహిళలు సైతం ఉన్నారు. గురువారం మధ్యాహ్నం మహామాయ ఫ్లైఓవర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరారు. చిల్లా సరిహద్దు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. నిరసకారులను అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్రిక్తత నెలకొంది. దీంతో నోయిడా–గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ రహదారితోపాటు పలు మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement