పలువురికి గాయాలు
శంభు నుంచి ఢిల్లీ వెళ్లేందుకు రైతుల ప్రయత్నాలు
బారికేడ్లతో అడ్డుకున్న వైనం
అంబాలాలో నిషేధాజ్ఞలు
చలో ఢిల్లీ రేపటికి వాయిదా
శంభు: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని శంభు వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి పలు డిమాండ్లతో రైతు సంఘాలు ఢిల్లీ చలో కార్యక్రమాన్ని ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా రైతులు, రైతు సంఘాల నేతలతో కూడిన 101 మందితో కూడిన రైతు జాతా సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు శంభులోని నిరసన దీక్షా శిబిరం నుంచి కాలినడకన బయలుదేరింది.
సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ సంఘ్ జెండాలను చేబూనిన రైతులు కొన్ని మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ముందుకు రావద్దని పోలీసులు వారిని పదేపదే కోరారు. అయినప్పటికీ, రైతులు పలు అంచెల బారికేడ్లను దాటుకుని, వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుగా ఏర్పాటు చేసిన ఇనుప మేకులను, ఇనుప ముళ్ల కంచెను తొలగించారు.
సిమెంట్ బారికేడ్లనూ దాటేందుకు యత్నించారు. ఇనుప కంచెను కొందరు ఘగ్గర్ నదిలోకి దొర్లించారు. దీంతో, పోలీసులు వారిపైకి పలు రౌండ్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. రైతులు టియర్ గ్యాస్ నుంచి రక్షణ కోసం తడి గన్నీ బ్యాగులతో కళ్లు, ముఖాన్ని కప్పేసుకున్నారు. బారికేడ్లపై నుంచి వస్తున్న వారిపైకి పోలీసులు లాఠీలు ఝళిపించారు. టియర్ గ్యాస్‌తో గాయపడిన కనీసం ఆరుగురు రైతులను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు.
రైతులు గాయపడిన నేపథ్యంలో జాతాను శుక్రవారానికి నిలిపి వేస్తున్నట్లు రైతు నేత సర్వాన్ సింగ్ చెప్పారు. తదుపరి కార్యాచరణపై చర్చించుకుని, నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, అంబాలా జిల్లాలో గురువారం నుంచే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడరాదని ప్రకటించారు. ముందు జాగ్రత్తగా శుక్రవారం జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంబాలా జిల్లాలోని 11 గ్రామాల పరిధిలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను ఆ మార్గంలో మోహరించారు.
Comments
Please login to add a commentAdd a comment