
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడి కేసులో ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గత ఏప్రిల్ 22న పహల్గామ్ పరిధిలోని బైసాన్ లోయలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హతమార్చారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలచివేసింది.
ఈ ఘటనపై దర్యాప్తు సంస్థల విచారణలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కార్యకర్తను తాజాగా జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆపరేషన్ మహాదేవ్ సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదుల ఆయుధాలు, ఇతర సామగ్రిని విశ్లేషించిన దరిమిలా ఇతని అరెస్టు జరిగింది. ఉగ్రవాదుల కదలికను సులభతరం చేయడంలో ఇతను కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని కుల్గాం జిల్లాకు చెందిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాగా పోలీసులు గుర్తించారు. అతను టీచర్‌గా పనిచేస్తున్నాడని అధికారిక వర్గాలు తెలిపాయి. అతని సహచరులను గుర్తించేందుకు, సంబందిత నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసేందుకు తదుపరి దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.