
న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే, రూ. 25 కోట్లకు పైగా విలువైన ప్రైవేట్, ప్రభుత్వ కాంట్రాక్టులలో అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీ) రిజర్వేషన్లు కల్పిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. పట్నాలో జరిగిన అతి పిచ్రా న్యాయ సంకల్ప్ సింపోజియంలో రాహుల్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తామని హామీనిచ్చారు.
నేటికీ ఈ దేశంలో అత్యంత వెనుకబడిన తరగతులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలవారు ఉన్నారు. వారిలోని అర్హులైనవారికి అన్నింటా భాగస్వామ్యం లభించడం లేదు. దేశం అంతటా ఇలానే ఉంది. తాము కుల గణన నిర్వహించి, ఈ దేశంలో దళితులు, అత్యంత వెనుకబడిన తరగతుల నిజమైన జనాభాను చూపించాలనుకుంటున్నామని రాహుల్ పేర్కొన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విమర్శలు గుప్పిస్తూ, జేడీయూ ప్రభుత్వం ఈబీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. న్యాయ సంకల్ప్ సింపోజియంలో పది అంశాల తీర్మానాన్ని రాహుల్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు దీనిని అమలు చేస్తామని తెలిపారు. ‘ఎక్స్’లో కాంగ్రెస్ పోస్ట్ లోని వివరాల ప్రకారం పది అంశాలు..
VIDEO: “A ten-point resolution was passed at the 'Ati Pichra Nyay Sankalp' symposium today, to be implemented when the INDIA bloc comes to power in Bihar,” said Congress leader and Lok Sabha LoP Rahul Gandhi (@RahulGandhi).
(Full video available on PTI Videos -… pic.twitter.com/HQgqtsST1x— Press Trust of India (@PTI_News) September 24, 2025
1. అత్యంత వెనుకబడిన తరగతులపై దురాగతాల నివారణ చట్టానికి ఆమోదం.
2. పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల్లో ఈబీసీలకు రిజర్వేషన్లను 20శాతం నుండి 30శాతానికి పెంచడం.
3. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయడానికి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌ను సవరించడం.
4. నియామకాలలో సముచితమైనది కాదు (ఎన్‌ఎఫ్‌ఎస్) నిబంధన చెల్లదని ప్రకటించడం.
5. ఈబీసీ జాబితా రూపకల్పనలో సమతుల్యానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం.
6. భూమిలేని కుటుంబాలకు భూమిని కేటాయించడం.
7. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఈబీసీల గుర్తింపునకు ప్రత్యేక చర్యలు.
8. విద్యా హక్కు చట్టం (2010) కింద ప్రైవేట్ పాఠశాలల్లో రిజర్వ్ చేసిన సీట్లలో సగం ఈబీసీ, ఓబీసీ, దళిత, గిరిజన వర్గాల పిల్లలకు కేటాయింపు.
9 రూ.25 కోట్ల వరకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ఈబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించడం.
10. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(5) కింద అన్ని ప్రైవేట్ విద్యా సంస్థలలో రిజర్వేషన్లను వర్తింపజేయడం.
బీహార్ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రముఖ పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు కొనసాగుతున్నాయి.