రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను దృష్టిలో ఉంచుకుని దాదాపు రెండు వారాల పాటు ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, తిక్రీ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేశారు. అయితే ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో అధికారులు వాటిని పాక్షికంగా తెరిచే ప్రక్రియను ప్రారంభించారు.
వాహనాల రాకపోకలకు వీలుగా సింఘు సరిహద్దు రహదారి ‘సర్వీస్ లేన్’, తిక్రీ సరిహద్దు రహదారికి చెందిన ఒక లేన్ తెరుస్తున్నామని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ నిర్ణయంతో ఢిల్లీ నుండి హరియాణాకు వెళ్లే ప్రయాణికులకు గొప్ప ఉపశమనం లభించింది. పంటలకు కనీస మద్దతు ధర హామీతో పాటు వ్యవసాయ రుణాల మాఫీ తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలంటూ రైతులు ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ను ప్రారంభించారు. దీంతో ఈ రెండు సరిహద్దు మార్గాలను ఫిబ్రవరి 13న మూసివేశారు.
ఈ నెలాఖరు వరకు తమ పాదయాత్రను నిలిపివేస్తామని నిరసన తెలుపుతున్న రైతులు ప్రకటించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆ పోలీసు అధికారి తెలిపారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని, అవసరమైతే సరిహద్దులను మళ్లీ మూసివేస్తామని ఆయన అన్నారు. కాగా కుండ్లీ సరిహద్దు రహదారిలో సర్వీస్ లేన్ తెరిచారు. దీంతో ఢిల్లీ వెళ్లే వాహనదారులకు ఉపశమనం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment