
బిల్లులపై ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందే: సుప్రీంకోర్టు
రెండోసారి పంపితే నెలలోగా సమ్మతి తెలపాల్సిందే... లేదంటే న్యాయసమీక్షకు సిద్ధంగా ఉండాలి
అసాధారణ జాప్యం రాజ్యాంగ విరుద్ధమే... బిల్లులపై గవర్నర్‌కు వీటో అధికారం లేదు
తమిళనాడు గవర్నర్ రవి తీరు చట్టవిరుద్ధం... ఆయనకు పంపిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లే
అసాధారణ అధికారాలు ఉపయోగిస్తూ సర్వోన్నత ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు
గవర్నర్లు నిరోధకంగా ఉండొద్దంటూ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వానికి ఎట్టకేలకు విజయం లభించింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై గవర్నర్ ఆమోద ముద్ర వేయకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ముందుకు వచ్చిన బిల్లులపై నిర్దేశిత గడువులోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పింది.
గవర్నర్ ఆర్.ఎన్.రవి 10 బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించామన్న సాకుతో 10 బిల్లులను చాలాకాలం పెండింగ్‌లో కొనసాగించడం సమంజసం కాదని స్పష్టంచేసింది. బిల్లులను శాశ్వతంగా పెండింగ్‌లో పెట్టే అధికారం గవర్నర్‌కు లేదని తెలియజేసింది. తమిళనాడు గవర్నర్ నిర్ణయం చట్టవిరుద్ధం, నిర్హేతుకం, ఏకపక్షం అని విమర్శించింది.
ఆయన నిర్ణయాన్ని తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. ‘‘అసెంబ్లీలో ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ సమ్మతి కోసం పంపించగా ఆయన తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి పంపించారు. వాటిపై గవర్నర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రపతికి నివేదించామంటూ కాలయాపన చేస్తున్నారు. ఇలా చేయడం చట్టవిరుద్ధమే. అందుకే రెండోసారి పంపిన తేదీ నుంచే అవి గవర్నర్ సమ్మతి పొందినట్లు పరిగణిస్తున్నాం’’ అని ధర్మాసనం తీర్పు ప్రకటించింది.
విఫలమైతే జ్యుడీషియల్ రివ్యూ తప్పదు
రాజ్యాంగంలోని ఆర్టీకల్ 200 ప్రకారం.. బిల్లులను గవర్నర్ ఎప్పటిలోగా ఆమోదించాలన్నదానిపై ఎలాంటి కాలపరిమితి లేదు. ఫలానా సమయంలోగా నిర్ణయం తీసుకోవాలంటూ రాజ్యాంగం నిర్దేశించలేదు. కానీ, బిల్లులపై గవర్నర్ ఎటూ తేల్చకుండా సుదీర్ఘకాలం పెండింగ్‌లో పెడితే ప్రభుత్వ పరిపాలనకు అవరోధాలకు ఎదురవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. చట్టాలు చేసే శాసన వ్యవస్థకు అడ్డంకులు సృష్టించినట్లు అవుతుంది పేర్కొంది. అందుకే బిల్లులపై గవర్నర్లు ఎక్కువకాలం నాన్చకుండా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు గడువు నిర్దేశిస్తున్నట్లు తేల్చిచెప్పింది.
బిల్లుకు సమ్మతి తెలపడం లేదా రాష్ట్రపతికి నివేదించడం లేదా శాసనసభకు తిప్పిపంపడం మూడు నెలల్లో పూర్తి కావాలని వెల్లడించింది. గవర్నర్ వెనక్కి పంపిన బిల్లును అసెంబ్లీలో మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపిస్తే నెల రోజుల్లోగా కచ్చితంగా సమ్మతి తెలపాలని స్పష్టంచేసింది. ఈ టైమ్‌లైన్ పాటించే విషయంలో విఫలమైతే.. కోర్టుల జ్యుడీషియల్ రివ్యూకు గవర్నర్ సిద్ధపడాల్సి ఉంటుందని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీలో రెండోసారి ఆమోదం తర్వాత గవర్నర్‌కు పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 ద్వారా తమకు సంక్రమించిన అధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది.
తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్.రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎంకే సర్కారు మండిపడుతోంది. 12 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఆమోదించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ప్రభుత్వం 2023లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ, తన వద్ద 10 బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయని గవర్నర్ 2023 నవంబర్ 13న ప్రకటించారు. తర్వాత అసెంబ్లీ నవంబర్ 18న ప్రత్యేకంగా సమావేశమైంది. ఆ 10 బిల్లులను మళ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. తన వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్ నవంబర్ 28న రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు.
మిత్రుడిగా, మార్గదర్శిగా గవర్నర్ పనిచేయాలి
‘‘గవర్నర్లు చాలా వేగంగా పనిచేయాలని, చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం ఆశిస్తోంది. నిర్ణయాల్లో విపరీతమైన జాప్యం చేయడం ప్రజాస్వామ్య పరిపాలన స్ఫూర్తిని దెబ్బతీసినట్లే. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ వీటో చేయడం అనేది మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రం గవర్నర్ తన విచక్షణ మేరకు వ్యవహరించవచ్చు. బిల్లు ప్రజలకు హాని కలిగిస్తుందని భావించినప్పుడు, రాష్ట్రపతి సమ్మతి కచ్చితంగా అవసరమని అనుకున్నప్పుడు కొంతకాలం జాప్యం చేయొచ్చు. గవర్నర్ విచక్షణాధికారానికి సైతం ఆర్టికల్ 200 కొన్ని పరిమితులు విధిస్తోంది. బిల్లుపై నిర్ణయం తీసుకోకుండా ఉండడం సరైంది కాదు. గవర్నర్ స్పందించకపోతే బిల్లు కేవలం ఒక కాగితం ముక్కగా, మాంసం లేని అస్థిపంజరంగానే ఉండిపోతుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లును ఇష్టంవచ్చినట్లు తొక్కిపెడతామంటే కుదరదు.
అసెంబ్లీలో రెండోసారి ఆమోదం పొంది వచ్చిన బిల్లుకు (మొదటి దాని కంటే వైవిధ్యమైనది అయితే తప్ప) తప్పనిసరిగా సమ్మతి తెలపాల్సిందే. రాష్ట్రపతికి నివేదించకూడదు. అలాంటి బిల్లుపై గవర్నర్‌కు వీటో పవర్ ఉండదు. ప్రజల బాగు కోసం పని చేస్తామంటూ గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ప్రజలకు మంచి జరిగేలా చూడాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైన శాసనసభ్యులకు అడ్డంకులు సృష్టించకూడదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ స్ఫూర్తితో పని చేయాలి.
మంత్రివర్గం సూచనల మేరకు గవర్నర్ వ్యవహరించాలని ఆర్టీకల్ 200 చెబుతోంది. గవర్నర్ ఒక మిత్రుడిగా, మార్గదర్శిగా వ్యవహరించాలి. రాజకీయపరమైన ఉద్దేశాలతో పనిచేయొద్దు. గవర్నర్ ఉ్రత్పేరకంగా ఉండాలి తప్ప నిరోధకంగా ఉండొద్దు. గవర్నర్ సైతం న్యాయ సమీక్షకు అర్హుడేనన్న సంగతి మర్చిపోవద్దు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. గవర్నర్‌కు న్యాయస్థానం స్పష్టమైన గడువు నిర్దేశించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
చరిత్రాత్మకం: స్టాలిన్
చెన్నై: గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ చెప్పారు. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని హర్షం వ్యక్తంచేశారు. ఇది తమిళనాడుతోపాటు దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు దక్కిన గొప్ప విజయమని పేర్కొన్నారు. స్టాలిన్ మంగళవారం అసెంబ్లీలో మాట్లాడారు. సభలో బల్లలు చరిచి సుప్రీంకోర్టు తీర్పుపై సంబరాలు జరుపుకోవాలని అధికారపక్ష సభ్యులకు సూచించారు. తమిళనాడు ప్రజలకు, తమ న్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల్లో సమతూకాన్ని పునరుద్ధరించే విషయంలో ఈ తీర్పు ఒక కీలకమైన ముందడుగు అని ఉద్ఘాటించారు.
అసలైన సమాఖ్య భారత్‌లో ప్రవేశం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న తమిళనాడుకు విజయం దక్కిందన్నారు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, బీజేపీ మినహా ఇతర పారీ్టలన్నీ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. అధికార డీఎంకే నాయకులు మిఠాయిలు పంచుకొని, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తమ గవర్నర్ ఆర్.ఎన్.రవి యూనివర్సిటీలకు చాన్స్‌లర్‌గా ఉండే అధికారం కోల్పోయారని డీఎంకే నేత ఒకరు చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం హర్షం వ్యక్తంచేశారు.