సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి షాక్‌ | Big Setback For Tamil Nadu Governor Governor Rn Ravi In Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టులో తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి షాక్‌

Published Tue, Apr 8 2025 12:02 PM | Last Updated on Tue, Apr 8 2025 1:19 PM

Big Setback For Tamil Nadu Governor Governor Rn Ravi In Supreme Court

ఢిల్లీ: సుప్రీం కోర్టులో  తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వానికి ఊరట దక్కింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవికుమార్‌ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తమిళనాడు ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వం పదిబిల్లులను ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లులను గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ  పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

విచారణ సందర్భంగా గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. గవర్నర్‌ చట్టవిరుద్ధంగా వ్యవహించారనే అభిప్రాయం వ్యక్తం చేసింది. వెంటనే ప్రభుత్వం ప్రతిపాదించిన పది బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని స్పష్టం చేసింది.    

గవర్నర్ పది బిల్లులను రిజర్వ్ చేయడం అనేది చట్ట విరుద్ధం. అందువల్ల, ఆ చర్యను రద్దు చేస్తున్నాం. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న పది బిల్లులకు క్లియరెన్స్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ బిల్లులు గవర్నర్‌కు సమర్పించిన తేదీ నుండి ఆమోదించబడినట్లుగా పరిగణించబడతాయి’ అని స్పష్టం చేసింది. 

సుప్రీం తీర్పుపై సీఎం డీఎంకే స్టాలిన్‌ హర్షం
సుప్రీం కోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని’ అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు. దేశంలోని అన్నీ రాష్ట్రాలకు గర్వ కారణం’ అని అన్నారు.  

2021లో తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్‌ రవి
సీబీఐలో పనిచేసిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎన్. రవి 2021లో తమిళనాడు గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వంతో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు.

బీజేపీ అధికార ప్రతినిధి అంటూ విమర్శలు
ఇదే అంశంపై డీఎంకే ప్రభుత్వం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చింది. గవర్నర్‌ ఆర్‌ రవి  బీజేపీ అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని మండి పడిందది. కావాలనే రాష్ట్ర శాస‌న‌స‌భ బిల్లులకు  ఆమోదం తెలపకపోవడం , నియామకాలపై అనుమతి నిరాకరించారని ధ్వజమెత్తింది. అయితే, గవర్నర్ రవి మాత్రం తనకు రాజ్యాంగం అందించిన అధికారాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానంటూ సర్థించుకున్నారు.  

అసెంబ్లీ నుంచి గవర్నర్‌ వాకౌట్‌ 
గవర్నర్ తన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లోనూ వివాదాలు కొనసాగుతున్నాయి. గత ఏడాది, గవర్నర్ ప్రారంభపు ఉపన్యాసం సందర్భంగా జాతీయ గీతం పాడకపోవడంపై  గవర్నర్‌ టీఎన్‌ రవి నిరసనగా సభనుంచి వెళ్లిపోయారు. తమిళనాడు అసెంబ్లీలో సాంప్రదాయం ప్రకారం ప్రసంగం ప్రారంభంలో 'తమిళ్ తాయ్ వళ్తు' అనే రాష్ట్ర గీతం పాడడం, ముగింపులో జాతీయ గీతం పాడటం జరుగుతుంది. కానీ గవర్నర్ రవి మాత్రం ప్రారంభంలోను, ముగింపులోను జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని అభిప్రాయపడ్డారు.

గవర్నర్‌ వర్సెస్‌ రాష్ట్ర ప్రభుత్వంగా 
2023లో, గవర్నర్ అసెంబ్లీకి రాసిన సంప్రదాయ ప్రసంగాన్ని చదవడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆ ప్రసంగంలో ఉన్న విషయాలు నిజానికి భిన్నంగా ఉన్నాయన్నారు. అంతకంటే ముందు ఏడాది, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, పేరియార్, సి.ఎన్. అన్నాదురై పేర్లు, ‘ద్రవిడ మోడల్’ అనే పదబంధం, రాష్ట్రంలోని చట్టం, శాంతి పరిపాలన గురించి మాట్లాడకుండా వదిలేశారు. ఇలా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో గవర్నర్‌ విషయంలో తాము చేస్తున్న పోరాటానికి ఫలితంగా దక్కిందని ఆ రాష్ట్ర అధికార పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement