
మంగళవారం సీడబ్ల్యూసీ భేటీలో రాహుల్, ఖర్గే, సోనియా
భావి కార్యాచరణపై సీడబ్ల్యూసీ చర్చ
నేడు ఏఐసీసీ కీలక భేటీ
అహ్మదాబాద్: పార్టీలో భారీ సంస్థాగత మార్పులను లక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మేధోమథనానికి సిద్ధమైంది. నేడు జరగబోయే ఏఐసీసీ సమావేశానికి సన్నాహక సమావేశంగా విస్తృతస్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీని పార్టీ మంగళవారం అహ్మదాబాద్‌లో నిర్వహించింది. ఈ ఏడాది అక్టోబర్ 31న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ‘ జెండాపట్టుకుని స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపించిన మన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్’ పేరిట సీడబ్ల్యూసీ ఒక తీర్మానాన్ని చేసి ఆమోదించింది.
తీర్మానం, సీడబ్ల్యూసీ భేటీ వివరాలను తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అత్యధిక అధికారాలు కట్టబెట్టడం, పార్టీ పదవుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ వర్గాల వారికి 50 శాతానికి మించి ప్రాధాన్యత కల్పించడం వంటి నిర్ణయాలను అమలుచేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ పదవుల్లో 50 శాతానికి పైగా పదవులను మహిళలు, యువతకు కట్టబెట్టాలని పార్టీ యోచిస్తోంది. నేడు అహ్మదాబాద్‌లో సబర్మతీ నదీ తీరంలో సబర్మతీ ఆశ్రమం, కోచ్‌రబ్ ఆశ్రమాల మధ్యలోని ప్రాంతంలో ఏఐసీసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ‘‘ న్యాయపథ్: సంకల్ప్, సమర్పణ్, సంఘర్‡్ష’ ఇతివృత్తంతో సమావేశాన్ని చేపట్టనున్నారు.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఖర్గే ధ్వజం
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ మెమోరియల్ భవంతిలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంబోపన్యాసం చేస్తూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ సర్దార్ పటేల్ వారసత్వ ఘనతను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. ఆయన మన మనసుల్లో ఉన్నారు. మన ఆలోచనల్లో ఉన్నారు. మనం ఆయన ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే పటేల్, నెహ్రూ వంటి జాతీయనేతలపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ పక్కా ప్రణాళికతో కుట్ర పన్నుతున్నాయి. నెహ్రూ, పటేల్‌కు మధ్య బేధాభిప్రాయాలు ఉండేవని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
నిజానికి వీళ్లద్దరూ మంచి మిత్రులు. వీళ్లు ఒకే నాణేనికి రెండు పార్శా్వలు. పటేల్, నెహ్రూ రోజూ మాట్లాడుకునేవారు. అన్ని అంశాల్లో పటేల్ నుంచి నెహ్రూ సలహాలు, సూచనలు తీసుకునేవారు. నేరుగా మాట్లాడాలనుకున్న ప్రతిసారీ పటేల్ ఇంటికే నెహ్రూ వెళ్లేవారు. పటేల్ సౌకర్యార్థం కొన్ని సార్లు సీడబ్ల్యూసీ భేటీలను పటేల్ వాళ్ల ఇంట్లోనే జరిపారు. పటేల్‌ను భారత ఐక్యతా పితామహుడిగా నెహ్రూ శ్లాఘించారు. ఇవన్నీ చరిత్ర రికార్డుల్లో ఉన్నాయి’’ అని ఖర్గే గుర్తుచేశారు.
ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు
‘‘ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి పటేల్ గొప్ప ఆదర్శాలకు పొంతనేలేదు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ను పటేల్ నిషేధించారు. అలాంటి సంస్థ ఇప్పుడు పటేల్ తమ వ్యక్తి అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. పటేల్‌కు కాంగ్రెస్ సముచిత గౌరవం ఇవ్వలేదని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వీసమెత్తయినా వాస్తవం లేదు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి, గత 140 ఏళ్లుగా దేశం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్‌ను అంతమొందించాలని కుట్రచేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.