‘ఆత్మనిర్భర్, అమృత్ కాల్.. బూటకపు పదాలు మాత్రమే!’ | Hyderabad: INC President Mallikarjun Kharge Full Speech At CWC Meeting | Sakshi
Sakshi News home page

‘ఆత్మనిర్భర్, అమృత్ కాల్.. బూటకపు పదాలు మాత్రమే!’

Published Sat, Sep 16 2023 5:06 PM | Last Updated on Sat, Sep 16 2023 5:30 PM

Hyderabad CWC Meeting INC President Kharge Full Speech - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: CWC సమావేశం ప్రారంభ ఉపన్యాసంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వ పద్దతులు లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుందని ఆరోపించారాయన. తాజ్‌ కృష్ణ హోటల్‌ వేదికగా శనివారం సాయంత్రం సీడబ్ల్యూసీ సమావేశం జరగ్గా కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ప్రారంభోపన్యాసంలో.. 

‘‘కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కీలక పాత్ర పోషిస్తోంది. కానీ, అధికారంలో ఉండి శాంతి స్థాపనలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. మణిపూర్‌లో ఇప్పటికీ జరుగుతున్న విషాదకర సంఘటనలను దేశం మొత్తం చూస్తోంది. మోదీ ప్రభుత్వ పద్దతులు  లౌకిక భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని మల్లికార్జున ఖర్గే తెలిపారు.

మన ఆర్థిక వ్యవస్థ నేడు తీవ్ర ప్రమాదంలో ఉంది. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగం ఉంది. జాతీయ భద్రత విషయంలో, చైనా ఆక్రమణల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదు అని అన్నారాయన. ఆత్మనిర్భర్ భారత్, 5 ట్రిలియన్ ఎకానమీ, న్యూ ఇండియా 2022,  అమృత్ కాల్ , 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. ఇలాంటి నినాదాల్నీ కేవలం తమ  వైఫల్యాల నుండి దేశాన్ని మరల్చడానికి కేంద్రంలోని బీజేపీ పుట్టించిన బూటకపు పదాలు మాత్రమేనని ఖర్గే అన్నారు.

భారత రాజ్యాంగాన్ని, దేశ ప్రజాస్వామ్యాన్ని,  అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది.  భారతదేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినందున, ప్రజల గొంతుకగా ఉండటం కాంగ్రెస్ బాధ్యత. ఈరోజు 27 భారత పార్టీలు ప్రాముఖ్యమైన ప్రాథమిక సమస్యలపై కలిసి ఉన్నాయి. కానీ,  ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ ప్రతీకార చర్యకు పూనుకుంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను అణచివేయడానికి  ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. త్వరలో జరగబోయే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అధికార పార్టీ ఉద్దేశాల గురించి ఆందోళన కలిగిస్తున్నాయన్నారు ఖర్గే. 

ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహంపై రేపు(ఆదివారం) అంతర్గత సమావేశంలో చర్చిద్దామని.. అలాగే సంస్థాగత సమస్యలపైనా  రేపటి  సమావేశంలో వివరంగా మాట్లాడతాను అని ఖర్గే సభ్యులను ఉద్దేశించి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement