సాక్షి, హైదరాబాద్: దేశం ముందున్న మౌలిక సమస్యల విషయంలో ‘ఇండియా’ కూటమిలోని 27 పార్టీలు ఏకతాటిపై ఉన్నాయని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇప్పటివరకు నిర్వహించిన మూడు సమావేశాలూ విజయవంతం కావడంతో ప్రజావ్యతిరేక బీజేపీ ప్రభుత్వంపై పోరులో కూటమి దూసుకుపోతోందన్నారు. ఈ పరిణామాలతో కలత చెందిన బీజేపీ ప్రభుత్వం విపక్ష పార్టీలపై ప్రతీకార చర్యలకు దిగిందని మండిపడ్డారు.
పార్లమెంట్‌లో విపక్షాల గొంతునొక్కడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయన్నారు. శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. సీడబ్ల్యూసీకి కొత్తగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్నో అంతర్గత సవాళ్లతో దేశం దిక్కుతోచని స్థితిలో చిక్కుకుందని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మణిపూర్ అల్లర్లు, పెరుగుతున్న సామాజిక అసమానతలు, దిగజారుతున్న రైతులు, కార్మికుల పరిస్థితులు వంటి మౌలిక సమస్యల పరిష్కారంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. లౌకిక, ప్రగతిశీల, ఆధునిక భారత దేశ ప్రతిష్టను ఈ ఘటనలు మంటగలిపేస్తున్నాయన్నారు.
దృష్టి మళ్లించడమే పని
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కేంద్రం ఆత్మనిర్భర్ భారత్, 5 ట్రిలియన్ ఎకానమీ, న్యూ ఇండియా 2022, అమ్రిత్‌కాల్, మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వంటి ఊకదంపుడు హామీలు ఇస్తోందని ఖర్గే ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రమాదంలో ఉందని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య, పేదల బతుకులు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ధనిక, పేద వర్గాల మధ్య ఆర్థిక అసమానతలు పతాక స్థాయిలో పెరిగిపోయాయని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశం నిర్మించుకున్న ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను తమ మిత్రులైన పెట్టుబడిదారులకు మోదీ ప్రభుత్వం అప్పనంగా ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో చైనా ఆక్రమణల పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహించడంతో దేశ భద్రత పెనుప్రమాదంలో పడిందన్నారు.
అంతర్గత చర్చలపై గోప్యత పాటించాలి
దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని ఖర్గే పునరుద్ఘాటించారు. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తోందని, సామాన్యుల ఆందోళనలు, సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పోరాడుతోందని స్పష్టం చేశారు.
దేశ ప్రజల గొంతు వినిపించడం ప్రధాన ప్రతిక్షంగా తమ బాధ్యత అన్నారు. పార్టీ జరిపే అంతర్గత చర్చల విషయంలో గోప్యతను పాటించాలని, బయటికి పొక్కకుండా జాగ్రత్తలు వహించాలని నేతలకు సూచించారు. త్వరలో జరగనున్న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఆదివారం జరిగే సమావేశంలో విస్తృతంగా మాట్లాడతానంటూ ఖర్గే తన ప్రసంగాన్ని ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment