సాక్షి, న్యూఢిల్లీ: పలు డిమాండ్ల సాధనతో మంగళవారం దేశ రాజధానిలో నిరసనకు సిద్ధమైన అన్నదాతల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధం అయ్యారు. ఉదయం నుంచే బారికేడ్లతో ఎక్కడికక్కడ సరిహద్దుల వద్ద నిలబడ్డారు. దీంతో అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు నెల రోజులపాటు ఢిల్లీలో సభలు, ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి లేదని, నగరంలోకి ట్రాక్టర్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీసులు తేల్చి చెప్పారు. ఢిల్లీలో నెల రోజులపాటు 144 సెక్షన్ అమలవుతుందని ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. నేటి నుంచి వచ్చే నెల 12వ తేదీ దాకా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, జనం గుంపులుగా గుమికూడవద్దని పేర్కొన్నారు.
రైతు సంఘాల ‘చలో ఢిల్లీకి అనుమతి లేదని స్పష్టం చేశారు. రోడ్లను దిగ్బంధించడం, ప్రయాణికుల రాకపోకలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిటీలో ట్రాక్టర్ల ర్యాలీలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నగర పరిధిలో అనుమానిత వస్తువులు, పేలుడు పదార్థాలు, బాణాసంచా, ఇతర అనుమతి లేని ఆయుధాలు, ప్రమాదకరమైన రసాయనాలు, పెట్రోల్, సోడా సీసాలు రవాణా చేయడంపైనా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.
#WATCH | Ambala, Haryana: Security heightened at the Shambhu border in view of the march declared by farmers towards Delhi today. pic.twitter.com/AwRAHprtgC
— ANI (@ANI) February 13, 2024
రెచ్చగొట్టే నినాదాలు, ప్రసంగాలు, సోషల్ మీడియాలో అనుచిత మెసేజ్‌లు పంపడంపైనా నిషేధం ఉందన్నారు. భూసేకరణలో తీసుకున్న భూములకు పరిహారం పెంచడం, పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ చట్టం తీసుకురావడంతోపాటుఇతర డిమాండ్ల సాధన కోసం రైతులు మంగళవారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ కార్యక్రమ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గత అనుభవాల దృష్ట్యా పోలీసులు ఆంక్షలు కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.
రోడ్లపై బారికేడ్లు.. కొయ్యముక్కలు
సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 13వ తేదీన పార్లమెంట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ప్రకటించాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, హరియాణా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 2 వేలకు పైగా ట్రాక్టర్లతో ఢిల్లీలో నిరసన చేపట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. నిరసనకారులను ∙అడ్డుకోవడానికి వివిధ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో రోడ్లపై మేకుల్లాంటి పదునైన కొయ్యముక్కలు బిగించారు.
#WATCH | Delhi: Security heightened at Delhi borders in view of the march declared by farmers towards the National Capital today.
— ANI (@ANI) February 13, 2024
(Visuals from Gazipur Border) pic.twitter.com/XeKWMWi1S9
రైతు సంఘాలతో మంత్రుల చర్చలు
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా సోమవారం చండీగఢ్‌లో రైతు సంఘాల నేతలతో రెండో దశ చర్చలు ప్రారంభించారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత జగజీత్ దలీవాల్, కిసాన్ మజ్దూర్ సంఘర్‡్ష కమిటీ ప్రధాన కార్యదర్శి శర్వన్ తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. రైతుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉందని, చలో డిల్లీ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు కోరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ 2020–2021 కాలంలో చేపట్టిన రైతుల ఉద్యమం సందర్భంగా వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకునేందుకు ఒప్పుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు
Comments
Please login to add a commentAdd a comment