కిచ్చ: ‘‘అందరి మేలు కోసం పని చేయని ప్రధాని ఆ పదవిలో ఉండేందుకు అనర్హుడు. అలా చూస్తే మోదీ ప్రధానే కాదు’’ అని కాంగ్రెస్ నేత రాహల్ గాంధీ అన్నారు. కరోనా కష్ట కాలంలో, వణికించే చలిలో రైతులను మోదీ ఏడాదికి పైగా నిర్దయగా నడిరోడ్డుపై వదిలేశారని దుయ్యబట్టారు. ‘‘మన దేశాన్నిప్పుడు ప్రధానికి బదులు ఒక రాజు పాలిస్తున్నాడు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా జనం నోరెత్తొద్దని భావిస్తున్నాడు’’ అంటూ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో శనివారం కిసాన్ స్వాభిమాన్ ర్యాలీలో ఆయన మాట్లాడారు. యూపీఏ హయాంలో రైతులకు 10 రోజుల్లో పంట రుణాలు మంజూరయ్యేవన్నారు.
అది వారికిచ్చిన ఉచితవరం కాదని, రైతులు 24 గంటలూ దేశం కోసమే శ్రమిస్తారని అన్నారు. రాష్ట్రంలో రైతులు, యువత, పేదలతో కలిసి పని చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే కాంగ్రెస్ ఉద్దేశమన్నారు. ‘‘మన ముందు రెండు భారత్‌లున్నాయి. ఒకటి ధనిక పారిశ్రామికవేత్తలు, ఫైవ్ స్టార్ హోటళ్లు, మెర్సిడెజ్ కార్లది. ఇంకోటి పేదలు, నిరుద్యోగులది. దేశం జనాభాలో 40 శాతం మంది దగ్గరున్నంత సంపద కేవలం 100 మంది చేతుల్లో పోగుపడింది. ఆదాయపరంగా ఇంతటి అసమానతలు మరెక్కడా లేవు. మనకు కావాల్సింది అందరికీ సమానావకాశాలుండే ఒకే ఇండియా. అసమానతలు పోయినప్పుడే అది సాధ్యం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment