జల్‌గావ్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని తిరిగి అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇవ్వగలరా అని ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్ విసిరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ జల్‌గావ్‌లో మొట్టమొదటి ర్యాలీలో పాల్గొన్నారు. ‘జమ్మూకశ్మీర్ అంటే కేవలం చిన్న భూభాగం కాదు, దేశానికి అది మకుటం వంటిది. 40 ఏళ్లుగా అక్కడ నెలకొన్న పరిస్థితులను సాధారణ స్థాయికి తేవటానికి మాకు నాలుగు నెలలు కూడా పట్టలేదు.
ఎంతో కీలకమైన ఆర్టికల్ 370 రద్దును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. పొరుగు దేశం(పాకిస్తాన్) మాదిరిగా మాట్లాడుతున్నాయి. కశ్మీర్‌పై దేశమంతటా ఏకాభిప్రాయంతో ఉండగా ప్రతిపక్ష నేతలు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దమ్ముంటే ఆర్టికల్ 370, 35ఏలను తిరిగి అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి చూద్దాం’అంటూ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతలు కశ్మీర్‌పై మొసలి కన్నీరు కార్చడం మానాలన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే ప్రతిపక్షాలకు భవిష్యత్తే ఉండదన్నారు. ‘వేర్పాటు వాదం, ఉగ్రవాదం వేళ్లూనుకున్న కశ్మీర్ పూర్తిగా వెనుకబాటుకు గురయింది.
జమ్మూ, కశ్మీర్, లఢాఖ్‌ల్లో నివసించే వాల్మీకి వర్గం వారికి కనీస హక్కులు కూడా కరువయ్యాయి. అందుకే ఎవ్వరూ ఊహించలేని విధంగా కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నిర్ణయం తీసుకున్నాం. మా ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది’అని మోదీ అన్నారు. అలాగే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ తాము తెచ్చిన చట్టంపై కూడా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. చేతనైతే ట్రిపుల్ తలాక్ విధానాన్ని తిరిగి ఆచరణలోకి తెస్తామని ప్రకటించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఫడ్నవిస్ ప్రభుత్వం అన్ని వర్గాల విశ్వాసాన్ని చూరగొందని ప్రశంసించారు.
‘సముద్రంతో సంభాషణ’ ప్రధాని కవిత
మామల్లపురంలోని బీచ్‌లో శనివారం ఉదయం ఒంటరిగా నడక సాగించిన ప్రధాని మోదీ సముద్రంతో నా సంభాషణ పేరుతో కవిత రాశారు. ‘నా ఆలోచనలకు ప్రతిరూపమే ఈ సంభాషణలు. కవిత రూపంలో నా అనుభూతులను మీతో పంచుకుంటున్నాను’అంటూ ఆదివారం ఆయన తన కవితలను ట్విట్టర్‌లో ఉంచారు. ఆ పోస్ట్ నమిషాల్లోనే వైరల్ అయింది. ‘హే..సాగర్’అంటూ మొదలై ఎనిమిది పేరాలుగా సాగే ఆ కవితల్లో సముద్రానికి సూర్యుడితో అనుబంధం, అలలు, వాటి వేదనను మోదీ వర్ణించారు. బీచ్‌లో నడక సాగిస్తూ సముద్రంలో సంభాషించే క్రమంలో తనను తాను మరిచిపోయానన్నారు. కాగా, ‘ఎ జెర్నీ’పేరుతో ప్రధాని మోదీ ఇప్పటికే ఒక కవితా సంకలనం విడుదల చేశారు. మాతృమూర్తితో సంభాషణలతో కూడిన కవితలను ‘సాక్షీభవ’పేరుతో ప్రచురించారు. వివిధ అంశాలపై ఇప్పటి వరకు ఆయన 11కు పైగా పుస్తకాలు రాశారు.
ఇన్‌స్టాలోనూ మోదీనే టాప్
ప్రధాని మోదీ సోషల్ మీడియాలో దూసుకెళుతున్నారు. ఇన్‌స్ట్రాగామ్‌లో ఆయనను ఫాలో అవుతున్న వారి సంఖ్య 3 కోట్లు దాటింది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే అధికం. మోదీ ప్రపంచ స్థాయి నేత అనడానికి ఇదే సాక్ష్యం అంటూ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ప్రస్తుతం బరాక్ ఒబామాను 2.48 కోట్ల మంది, ట్రంప్‌ను 1.49 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్‌లో మోదీకి 5.07 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.44 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఆ వస్తువు అక్యుప్రెషర్ రోలర్!
మామల్లపురం బీచ్‌లో ప్లాగింగ్ సమయంలో ప్రధాని మోదీ చేతిలో ఉన్న వస్తువు ఏమిటనే దానిపై ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. కర్ర మాదిరిగా ఉన్న ఆ వస్తువు అక్యుప్రెషర్ రోలర్ అని ప్రధాని ప్రకటించారు. తరచుగా దానిని వాడు తుంటానని, అది చాలా ఉపయోగపడుతోందని ఆయన వివరించారు. నెటిజన్ల కోరిక మేరకు అక్యుప్రెషర్ రోలర్ ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో ఉంచారు. శనివారం వేకువజామున మామల్లపురం బీచ్‌లో ప్రధాని మోదీ చెత్తాచెదారం ఏరుతూ జాగింగ్ చేసిన విషయం తెలిసిందే.
‘370’ని మళ్లీ తేగలరా?
Published Mon, Oct 14 2019 3:06 AM | Last Updated on Mon, Oct 14 2019 5:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment