రైతులు, పోలీసుల వాగ్వాదం
మొబైల్, ఇంటర్నెట్ సేవలు బంద్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు.
బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది.
రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు.
డల్లేవాల్ ఆరోగ్యం విషమం
ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.
16న ట్రాక్టర్ ర్యాలీ
రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్‌లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్‌లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment