Support price for farmers
-
రైతులపైకి టియర్‌గ్యాస్
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. పంటలకు మద్దతు ధరతో సహా పలు డిమాండ్లతో రైతు సంఘాలకు చెందిన 101 మంది రైతులు మధ్యాహ్నం మరోసారి శాంతియుతంగా చేపట్టిన ‘చలో ఢిల్లీ’ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు వారు ప్రయత్నించడం గత పది రోజుల్లో ఇది మూడోసారి. రైతులను అడ్డుకునేందుకు పోలీసులను భారీగా మోహరించారు. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. అంబాలా డిప్యూటీ కమిషనర్ రైతులతో సుమారు 40 నిమిషాలసేపు చర్చలు జరిపారు. రైతుల ఆందోళనలకు సంబంధించి 18న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించేవరకు సంయమనం పాటించాలని కోరారు. అయినా రైతులు ముందుకు సాగేందుకే నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దాంతో 17 మంది రైతులు గాయాలపాలైనట్లు సమాచారం. రైతులు తమ సొంత వాహనాల్లోనే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శంభు చుట్టుపక్కల 12 గ్రామాల్లో ఈనెల 17 వరకు మొబైల్, ఇంటర్నెట్‌సేవలు నిలిపివేసింది. హరియాణాకు చెందిన రెజ్లర్, కాంగ్రెస్ నేత భజరంగ్ పునియా శంభు సరిహద్దు చేరుకుని రైతులకు మద్దతు తెలిపారు. డల్లేవాల్ ఆరోగ్యం విషమం ఖన్నౌరీలో 19 రోజులుగా నిరశన దీక్ష సాగిస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్ ఆరోగ్యం విషమంగా మారిందని రైతు నేతలు చెబుతున్నారు. ఆయనకు చికిత్స అందించాలని కేంద్రాన్ని, పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. కానీ చికిత్స తీసుకునేందుకు డల్లేవాల్ నిరాకరిస్తున్నారు. ‘రైతుల కోసం దీక్ష చేస్తున్నా. వారి నడుమే చివరి శ్వాస తీసుకుంటాను’’ అని ఆయన స్పష్టం చేశారు. దాంతో ఆయన బెడ్‌ను శుక్రవారం ఆందోళన వేదిక వద్దకే మార్చారు.16న ట్రాక్టర్ ర్యాలీ రైతులపై పోలీసుల బలప్రయోగాన్ని రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంథేర్ తీవ్రంగా ఖండించారు. ‘’మార్చ్‌లో భాగంగా ఢిల్లీకి వెళ్లే 101 మంది రైతుల కారణంగా శాంతి భద్రతలకు భంగమెలా కలుగుతుంది? పార్లమెంట్లో రాజ్యాంగం గురించి చర్చిస్తున్నారు. రైతుల ఆందోళనలను అణచివేయాలని ఏ రాజ్యాంగం చెప్పింది?’’ అని మీడియాతో ఆయన అన్నారు. పార్లమెంట్లో రైతుల సమస్యలపై చర్చనే జరగలేదని ఆక్షేపించారు. ‘‘మా కార్యాచరణలో భాగంగా సోమవారం పంజాబ్ మినహా మిగతా చోట్ల ట్రాక్టర్ మార్చ్ ఉంటుంది. 18న మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల దాకా పంజాబ్‌లో రైల్ రోకో చేపడతాం’’ అని ప్రకటించారు. -
Farmers Protest: ఫిబ్రవరి 16న భారత్ బంద్
నోయిడా: రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర సంబంధ చట్టం అమలుసహా రైతాంగ కీలక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త బంద్ పాటించాలని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ పిలుపునిచ్చారు. మంగళవారం ముజఫర్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)సహా దేశంలోని అన్ని రైతు సంఘాలు ఆ రోజు భారత్ బంద్‌లో పాల్గొంటాయి. ఆ రోజు రైతులు తమ పొలం పనులకు వెళ్లకండి. ఒక్క రోజు పనులకు సమ్మె పాటించండి. పొలాల్లో అమావాస్య రోజున రైతులు పనులకు వెళ్లరు. అలాగే ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్యే. వర్తకసంఘాలు, రవాణా సంస్థలు ఆరోజు వ్యాపార కార్యకలాపాలు నిలిపేయాలని కోరుకుంటున్నా. దుకాణాలను మూసేయండి. రైతులు, కార్మికులకు మద్దతుగా నిలబడండి’’ అని తికాయత్ విజ్ఞప్తిచేశారు. -
వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేల్ వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు మద్ధత్తు ధరలు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ హామీకి అనుగుణంగా.. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో 2023-24 ఏడాదికి వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మద్ధత్తు ధరలకు సంబంధించిన గోడపత్రికను రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇక రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించదేమోనన్న బెంగ లేని విధంగా ఈ మద్ధత్తు ధరలను ప్రకటించామని తెలిపారు. వరి, పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, రాగులు, మొక్కజొన్న, కందులు, పెసలు, మినుములు, వేరుశెనగ, కొబ్బరి, పత్తి, బత్తాయి, అరటి, సోయాబీన్స్, ప్రొద్దుతిరుగుడు వంటి 22 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు క్వింటాల్ ధరను ప్రకటించారు. రైతుల్లో మద్ధత్తు ధరలపై పూర్తి అవగాహన కలిగించేందుకు రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ ధరల గోడపత్రికను ప్రదర్శిస్తారని తెలిపారు. రైతుకు మధ్య దళారుల బెడద, రవాణా ఖర్చు లేకుండా రైతు భరోసా కేంద్రాల్లోనే సీయం యాప్(Continuous Monitoring of Agriculture Prices and Procurement)ద్వారా కొనుగోలు చేయవచ్చన్నారు. మద్దత్తు ధరలపై వివరణ ఇలా.. రాష్ట్రంలోని రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించాలని తొలిసారిగా 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి నిరంతరం మానిటర్ చేస్తూ రైతులకు మద్ధత్తు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. అందుకే ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కొనుగోలు కేంద్రంగా ప్రకటించామని తెలిపారు. ధాన్యాన్ని కల్లం దగ్గరే కొనుగోలు చేయడంతో పాటు కొనుగోలు చేసిన 15 రోజుల్లోనే చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో చిన్నసన్నకారు రైతులకు ప్రాధాన్యతను ఇస్తున్నామని వివరించారు. మార్కెట్లో ఆన్లైన్ యాప్ ద్వారా అభివృద్ధి చెందడం.. మార్కెట్లో పోటీ తత్వం పెరగాలని తద్వారా రైతన్నకు మెరుగైన ధర రావాలని అందుకోసం అవసరమైతే ప్రభుత్వమే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి పోటీని పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. మద్ధత్తు ధరలకు పంటలు అమ్ముకోవాలంటే రైతులు తప్పని సరిగా ఈ-క్రాపులో వారి పంటల వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి విజ్ణప్తి చేశారు. అలా నమోదు చేసుకున్న తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకుల వద్ధ సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనీస గిట్టుబాటు ధర దక్కని పరిస్థితిలో వెంటనే కొనుగోలు చేస్తామని తెలిపారు. అదే విధంగా రైతులు రైతు భరోసా కేంద్రాలకు తీసుకువచ్చే పంటలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని మంత్రి రైతులకు మనవి చేశారు. రైతులు వారి పంటలను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాక గూగల్ ప్లేస్టోర్ నుంచి CM APP-Farmer Payment Status App ను డౌన్ లోడ్ చేసుకుని తమ చెల్లింపు స్థితిగతులను ఎప్పటికప్పుడు తెల్సుకోగలరని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆశాఖ కమీషనర్, మార్క్ ఫెడ్ ఎండి రాహల్ పాండే, ఆశాఖ ఆర్జెడి శ్రీనివాసరావు తదితర అధికారుల పాల్గొన్నారు. -
10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. 50 లక్షల టన్నుల సేకరణ లక్ష్యంలో ఇప్పటికే 20.64 శాతం పూర్తయింది. బుధవారం నాటికి రూ.2,007.46 కోట్ల విలువైన 10,32,039 టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తద్వారా 1,36,745 మంది రైతులు మద్దతు ధర పొందారు. 10 జిల్లాల్లోని 8,557 ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వరద కారణంగా పంట దెబ్బతినగా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కోతలు ఆలస్యమయ్యాయి. ఈ జిల్లాల్లో స్వల్పంగా 1.35 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. పారదర్శకంగా చెల్లింపులు రైతులకు చెల్లింపులు పక్కదారి పట్టకుండా, జాప్యాన్ని నివారించడానికి పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా ఆధార్ నంబరు ప్రకారం నగదును జమచేస్తోంది. తొలిసారిగా ఫామ్–గేట్ (పొలాల వద్ద ధాన్యం కొనుగోలు) విధానం ద్వారా రైతులపై ఒక్క రూపాయి రవాణా ఖర్చు పడకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోతాల్లో నింపి నేరుగా మిల్లులకు తరలిస్తోంది. సడలింపునకు కేంద్రానికి వినతి రాష్ట్ర వ్యాప్తంగా 7,38,369 టన్నుల ధాన్యం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,31,946 టన్నులు, గుంటూరులో 1,53,472, పశ్చిమగోదావరిలో 78,848, చిత్తూరు జిల్లాలో 61,633 టన్నుల ధాన్యం దెబ్బతిని రంగుమారింది. మొలకలొచ్చాయి. వైఎస్సార్ కడప జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం పూర్తిగా దెబ్బతింది. ఈ క్రమంలో రైతులు తమ పంట విలువను నష్టపోకుండా కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు నిబంధనల్లో సడలింపులు కోరుతూ కేంద్రానికి నివేదిక పంపించింది. దెబ్బతిన్న, రంగుమారిన, విరిగిన ధాన్యం కొనుగోలులో 5 శాతం ప్రమాణాలు పాటిస్తుండగా దాన్ని కర్నూలు జిల్లాలో 8 శాతం, వైఎస్సార్ కడపలో 15 శాతం, ప్రకాశంలో 30 శాతం, మిగిలిన జిల్లాల్లో 10 శాతానికి పెంచాలని కోరింది. ఏ ఒక్క రైతుకు నష్టం రానివ్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పౌరసరఫరాలశాఖ ద్వారా లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాం. ఈ క్రమంలోనే దెబ్బతిన్న ధాన్యం వివరాలను కేంద్రానికి పంపించి, కొనుగోలు ప్రమాణాల్లో జిల్లాల వారీగా సడలింపులు కోరాం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతుకు కూడా నష్టం రానివ్వం. ఇప్పటికే 20 శాతానికిపైగా కొనుగోళ్లు పూర్తిచేశాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
మద్దతు ధరకు ఢోకా లేదు
సాక్షి, న్యూఢిల్లీ: మద్దతు ధర ప్రధాన అంశంగా వ్యవసాయ బిల్లుల రద్దు డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల ఆందోళనను పరిష్కరించేందుకు కేంద్రం స్పష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైతులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఈనెల 9న జరగనున్న ఆరో విడత చర్చల్లో మరింత స్పష్టతతో రైతులకు భరోసా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రైతుల ప్రతినిధి బృందం, కేంద్ర మంత్రుల మధ్య విజ్ఞాన్ భవన్లో శనివారం జరిగిన ఐదో విడత చర్చలు అసంపూర్తిగా ముగిసిన విషయం తెలిసిందే. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం మళ్లీ డిసెంబర్ 9న సమావేశం కానుంది. 12 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)ను క్రమంగా తొలగించేందుకు ఈ చట్టాలు ఊతమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఈ చట్టాలు చేసిన అనంతరం కూడా పలు పంటలకు మద్దతు ధర ప్రకటించినట్టు వివరిస్తోంది. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నడూ లేనంతగా మద్దతు ధరలు పెంచుతూ, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ముందుకు వెళుతున్నామని వాదిస్తోంది. గతంలోనూ చట్టరూపం లేదు.. ‘వ్యవసాయ వ్యయాలు మరియు ధరల కమిషన్’ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా మొత్తం 22 వ్యవసాయ పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను(ఎమ్మెస్పీ) నిర్ణయిస్తుంది. పంటలకు ఎమ్మెస్పీని సిఫారసు చేస్తున్నప్పుడు సీఏసీపీ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఉత్పత్తి వ్యయంపై ఎమ్మెస్పీ ఒకటిన్నర రెట్లు అధికంగా ఉండాలని 2018–19 బడ్జెట్లోనే ప్రకటించామని, దీని ప్రకారమే అన్ని ఖరీఫ్, రబీ, ఇతర వాణిజ్య పంటల కనీస మద్దతు ధరలను పెంచినట్టు కేంద్రం వాదిస్తోంది. 2018–19, 2019–20 సంవత్సరాల్లో దేశపు సగటు ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మార్జిన్ తిరిగి వచ్చేలా ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొంది. ఇదే సూత్రానికి అనుగుణంగా 2020–21 మార్కెటింగ్ సీజన్ కోసం అన్ని ఖరీఫ్ పంటలకు, రబీ పంటలకు మద్దతు ధర ప్రకటించామని తెలిపింది. మద్దతు ధరకు చట్టరూపం గతంలోనూ లేదని, ఇప్పుడు కూడా అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దీనికి కొనసాగింపుగా ఐదో విడత చర్చల అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మరోసారి స్పష్టత ఇచ్చారు. ‘ఎమ్మెస్పీ కొనసాగుతుందని మేం చెప్పాం. ఎమ్మెస్పీపై భయాలు, సందేహాలు పూర్తిగా నిరాధారమైనవి. అయితే రైతుల మనస్సులో ఏమైనా సందేహాలు ఉంటే, వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఏపీఎంసీ చట్టం రాష్ట్రాలకు చెందినది. రాష్ట్రానికి చెందిన మండీలను ఏ విధంగానైనా ప్రభావితం చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ దిశగా ఏపీఎంసీ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో ఎవరికైనా అనుమానాలు ఉంటే, వాటినీ నివృత్తి చేస్తాం. ఈ 9వ తేదీన జరగనున్న చర్చల్లో అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నాం’ అని తోమర్ తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్న 39 అంశాల్లోని 8 అంశాల్లో సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. వెనక్కి తగ్గని రైతు సంఘాలు.. మద్ధతు ధరపై భరోసా ఇస్తే సరిపోదని, అది చేతల్లో కూడా ఉండాలని, చట్టబద్ధత తప్పని సరిగా కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెస్పీకి చట్టరూపం అవసరం లేదని, అది కార్యనిర్వాహక నిర్ణయమని ప్రభుత్వం చెబుతుండగా.. ఉపాధి హామీ, ఆహార భద్రత వంటివి కూడా చట్టరూపం దాల్చకముందు కార్యనిర్వాహక నిర్ణయంగానే ఉండేవని రైతు సంఘాలు గుర్తుచేస్తున్నాయి. 9వ తేదీన జరిగే చర్చల్లో ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఆ తదుపరి నిర్ణయం తీసుకుంటామని రైతు సంఘాలు చెబుతున్నాయి. ముందు ఈ మూడు చట్టాలు రద్దు చేస్తేనే కేంద్రం చెప్పేది ఏదైనా వింటామని స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం సవరణలు తెస్తామని చెబుతున్నప్పటికీ ఈ మూడు చట్టాల మౌలిక స్వరూపం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నది తమ ఆందోళన అని వివరిస్తున్నాయి. అందుకే రేపు 8వ తేదీన జరిగే భారత్ బంద్ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని రైతు సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్.. ఓ లాలీపాప్ కంపెనీ
ఘాజీపూర్/వారణాసి: రుణమాఫీ విషయంలో దేశంలోని రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భిన్నంగా ఆ పార్టీ రైతులకు లాలీపాప్స్(చిరు తాయిలాలు) అందించి చేతులు దులుపుకుంటోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని ప్రధాని లాలీపాప్ కంపెనీగా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా శనివారం ఘాజీపూర్, వారణాసిలో రూ.98 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అనర్హులకే రుణమాఫీ చేశారు ‘కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఓ 800 మంది రైతుల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా ఈ లాలీపాప్ కంపెనీ(కాంగ్రెస్) మర్చిపోయింది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 22 పంటల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెట్టుబడి వ్యయానికి ఒకటిన్నర రెట్లు పెంచింది. అంతేకాదు పూర్వాంచల్ ప్రాంతాన్ని మెడికల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన రాజు సుహేల్దేవ్ స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. వారణాసిలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ సౌత్ ఏసియా రీజినల్ సెంటర్(ఐఎస్ఏఆర్సీ) క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ, దీన్ని జాతికి అంకితం చేశారు. దక్షిణాసియాలో వరి పంటపై పరిశోధనలకు, శాస్త్రవేత్తల శిక్షణకు ఐఎస్ఏఆర్సీ హబ్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని మోదీ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోరంగా ఓడాక, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రుణమాఫీ చేశాక ఇప్పుడు మోదీకి రైతులు గుర్తుకు వస్తున్నారని కాంగ్రెస్ ఎద్దేవాచేసింది. -
రైతుకు దన్ను.. మోదీ ముందు 3 మార్గాలు
న్యూఢిల్లీ: పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత డబ్బు జమ చేయడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే పంటలను విక్రయించి నష్టపోయిన రైతుకు పరిహారం అందజేయడం, రుణ మాఫీ పథకం అమలు చేయడం ఇందులో ఉన్నాయి. ‘స్థూలంగా ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది..అవి రుణమాఫీ, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు, నేరుగా రైతులకే డబ్బు బదిలీ ఇందులో ఉన్నాయి’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ప్రాంత ఓటర్లే కారణం. కానీ, పంటల ధరల నిర్ణయంలో మార్కెట్లదే పైచేయి కావడం, ప్రభుత్వ జోక్యం తగ్గడంతో రైతులు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో 26 కోట్లకు పైగా ఉన్న రైతులు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రైతులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఎన్నికల లోపే రైతులందరికీ నేరుగా, సులువుగా డబ్బును అందించే ఈ మూడు మార్గాల్లో దేనిని అమలు చేసినా ఖజానాపై భారీగానే భారం పడనుంది. ఆ మూడూ ఇవే.. మొదటిది..సత్వరం అమలు చేయటానికి వీలైనదీ, ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్న ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు బంధు’ మాదిరి పథకం. దీని కింద సొంత భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.1,700 నుంచి రూ.2,000 చొప్పున ప్రభుత్వం జమ చేయడం. ఈ పథకం అమలుకు సుమారు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువకే తమ పంటలను విక్రయించుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం రెండో ప్రత్యామ్నాయం. దీనిని అమలు చేస్తే రూ.50వేల కోట్లతోనే సరిపోతుంది. ఇక మూడోది.. అత్యంత ఖరీదైంది..ప్రభుత్వ వర్గాల్లో అంతగా సానుకూలత లేని రైతు రుణమాఫీ. దేశ వ్యాప్తంగా రూ.లక్షలోపు ఉన్న రైతురుణాలకు మాఫీ వర్తింప జేస్తే దేశ ఖజానాపై కనీసం రూ.3 లక్షల కోట్ల భారం పడుతుందని అధికార వర్గాల అంచనా. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తన ఎజెండాగా ప్రకటించుకుంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ! న్యూఢిల్లీ: సకాలంలో చెల్లించే రైతుల పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.15వేల కోట్ల మేర ఉన్న వడ్డీ భారాన్ని భరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆహార ధాన్యాల పంటలకు పూర్తిగాను, ఉద్యాన పంటలకు కొంత మేర రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులకు రూ.3 లక్షల వరకు 7 శాతం వడ్డీపై బ్యాంకులు స్వల్ప కాలిక రుణాలిస్తున్నాయి. కానీ, సకాలంలో తిరిగి చెల్లించే రైతుల నుంచి మాత్రం 4శాతం వడ్డీనే తీసుకుంటున్నాయి. సాధారణంగా 9 శాతం వడ్డీని రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులందరికీ ఈ మాఫీ వర్తింప జేస్తే కేంద్రం రూ.30వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.11.69 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ప్రకటించనుంది’ అని తెలిపారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్∙అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. -
రాజధానిలో రైతు రణం
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పాలకులకు తమ గళం బలంగా వినిపించేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా అన్నదాతలు ఢిల్లీకి చేరుకున్నారు. రుణ విముక్తి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీల మద్దతుతో వీరు చేపట్టిన రెండు రోజుల ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు గురువారం చేరుకున్నారు. వీరంతా నేడు పార్లమెంట్ వైపుగా ర్యాలీగా సాగనున్నారు. రైతుల కపాలాలతో ర్యాలీకి.. వామపక్ష పార్టీలు, సంఘాలతో ఏర్పాటైన ఆల్ ఇండియా కిసాన్ సంఘర్‡్ష కోఆర్డినేషన్ కమిటీ(ఏఐకేసీసీ) బ్యానర్ కింద వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి వచ్చారు. వీరిలో నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్ లింకింగ్ అగ్రికల్చరిస్ట్స్ అసోసియేషన్‌కు చెందిన 1,200 మంది రైతుల బృందముంది. వీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలను తెచ్చారు. రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సమావేశంలో ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాధ్ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా 600 జిల్లాల్లో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ఫసల్ బీమా యోజన పెద్ద కంపెనీలకు వరంగా మారింది’అని అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడని ఏపీ నుంచి వచ్చిన రైతు ప్రతినిధి వీరారెడ్డి, రైతు స్వరాజ్య వేదిక ప్రతినిధి కొండల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు యోగేంద్ర యాదవ్, మేథాపాట్కర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మకాం వేసిన రైతులు..వారు ధరించిన ఎర్ర టోపీలు, ఎర్ర జెండాలతో రామ్‌లీలా మైదాన్ ఎరుపు రంగును సంతరించుకుంది. ‘అయోధ్య వద్దు, రుణ మాఫీ కావాలి’ అంటూ వారు చేస్తున్న నినాదాలతో ప్రాంగణం మారుమోగింది. బంగ్లా సాహిబ్, శీశ్‌గంజ్ సాహిబ్, రాకాబ్‌గంజ్, బాప్ సాహిబ్, మంజు కా తిలా గురుద్వారాల నిర్వాహకులు రైతులకు బస కల్పించేందుకు ముందుకువచ్చారు. అంబేడ్కర్ స్టేడియంలో బస చేసిన సుమారు 6,500 మంది రైతులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ ఆభా దేవ్ తెలిపారు. -
తెల్లబోతున్న బంగారం..!
జమ్మికుంట(హుజూరాబాద్): తెల్లబంగారం తెల్లబోతోంది. మొన్నటివరకు మద్దతును మించి ధర పలికిన పత్తి.. వారం వ్యవధిలోనే రూ.600 తగ్గింది. ఒకదశలో రూ.6వేలకు పెరుగుతుందని ఆశించిన రైతులకు తాజాగా పడిపోతున్న ధరలు అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా మద్దతు కంటే ధర దిగువకు పడిపోయాయి. మంగళవారం క్వింటాల్‌కు రూ.5,350 పలికింది. మరోవైపు పత్తి కొనుగోలుకు సీసీఐ రంగంలోకి దిగడంతో రైతులు ఆశలు పెంచుకుంటున్నారు. పత్తి ధర పతనం ఇలా.. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పడిపోతోంది. ఫలితంగా ఇక్కడి పత్తికీ ధర తగ్గుతోంది. తాజాగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ రా ష్ట్రాల్లో పత్తి అమ్మకాలు జోరందుకోవడంతో పత్తి ధరలపై ప్రభావం చూపుతోందని ఎగుమతిదారులు వెల్లడిస్తున్నారు. నార్త్ ఇండియాలోని హర్యానా, పంజాబ్, రాజాస్థాన్‌లో గతంలో క్యాండి ధర రూ.47,500 వరకు పలకగా.. ప్రస్తుతం ఆ ధర రూ.44 వేలకు పడిపోయింది. అదే విధంగా సౌత్ ఇండియాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో క్యాండీ ధర గతంలో 47,500 వరకు పలకగా.. సోమవారం రూ.44, 300కు దిగజారింది. పత్తి గింజలు సైతం క్వింటాల్‌కు గతంలో రూ.2,350 నుంచి 2,500 వరకు పలకగా.. సోమవారం ఏకంగా రూ.2,100 నుంచి 2,070కు దిగింది. దీంతో జమ్మికుంట పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి వారం క్వింటాల్ పత్తి ధర రూ.5800 పలకగా.. సోమవారం రూ.5,350కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొంటున్న వ్యాపార సంక్షోభంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనంకానున్నాయని వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. కాటన్ వ్యాపారులకు భారీ నష్టం..? జమ్మికుంట పత్తిమార్కెట్లో రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులకు పడిపొతున్న పత్తి, గింజల ధరలు భారీనష్టాన్ని మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కాటన్ మిల్లర్ దాదాపు 20 రోజుల వ్యవధిలో రూ.10 లక్షల నుంచి రూ.30లక్షల వరకు నష్టపోయినట్లు సమాచారం. పత్తికి డిమాండ్ లేకున్నా.. మిల్లుల నిర్వహణ కోసం పోటీ పడి మరీ పత్తిని కొనుగోలు చేసిన వ్యాపారులు పడిపోయిన ధరలతో గందరగోళంలో పడినట్లు తెలిసింది. చేసేదేమీ లేక ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోళ్లు చేపట్టినట్లు సమాచారం. కొందరు కాటన్ మిల్లర్లు తమ వ్యాపారాలను పక్కన పెట్టినట్లు తెలిసింది. దీంతో ఇక సీసీఐ కొనుగోలు జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. జమ్మికుంటలో పడిపోయిన పత్తి ధర జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో మంగళవారం క్వింటాల్ పత్తికి రూ.5,350 పలికింది. మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంయి 1165 క్విం టాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్‌కు రూ.5350 చెల్లించారు. కనిష్టంగా రూ.5,300 చెల్లించారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ఉండగా.. వ్యాపారులు రూ.100 తగ్గించి కొనుగోలు చేశారు. డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు ధర తక్కువైనా వ్యాపారులకే విక్రయించారు. రెండుమూడు రోజులు అలస్యమైనా సరే అనుకున్నవారు సీసీఐకి విక్రయించారు. రంగంలోకి సీసీఐ మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు ధర తక్కువగా చెల్లిస్తుండడం.. సీసీఐ రంగంలోకి దిగడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. సీసీఐ ఇన్చార్జి తిరుమల్‌రావు సైతం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు ముందుకు వచ్చి పలువురు రైతుల వద్ద సోమవారం 60 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయించారు. మంగళవారం మరో 120 క్వింటాళ్లు కొన్నారు. సీసీఐకే అమ్ముకున్న..పసుల రాజయ్య, భీంపల్లి, కమాలాపూర్ మాది కమాలాపూర్ మండలం భీంపెల్లి. నాకున్న ఐదెకరాల్లో పంటలు సాగు చేశా. నాలుగెకరాల్లో ప త్తి పెట్టిన. మొదట పత్తి ఏరితే 24క్వింటాళ్లు చేతికి వచ్చింది. జమ్మికుంట మార్కెట్‌కు నాలుగున్నర క్వింటాళ్లు తీసుకొచ్చిన. క్వింటాల్‌కు ప్రవేట్ వ్యా పారులు రూ.5350 ధర చెల్లిస్తామన్నారు. నేను సీసీఐకి మద్దతు ధరతో రూ.5450తో అమ్ముకున్న. పాసుబుక్కు తప్పనిసరి తిరుమల్‌రావు, సీసీఐ సెంటర్ ఇన్చార్జి సీసీఐకి విక్రయించాలనుకునే రైతులు తమవెంట ఆధార్‌కార్డు, పట్టదారు పాస్‌పుస్తకం, బ్యాంక్ ఖాతా బుక్కు తెచ్చుకోవాలి. తేమశాతం 12లోపు ఉన్న ఉత్పత్తులను తప్పకుండా కొంటాం. పత్తి మార్కెట్‌తోపాటు పట్టణంలోని మూడు కాటన్ మిల్లుల్లో మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. పట్టణంలోని ఆరు మిల్లుల్లో అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. -
పత్తి ధర ఢమాల్
ఆదిలాబాద్‌టౌన్: పత్తి ధర రోజురోజుకు పడిపోతోంది. క్వింటాలు ధర రూ.6వేలకు పైగా పెరుగుతుం దని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. తెల్లబంగారంగా భావించే ధర ఢమాల్ అవుతోంది. పత్తి కొనుగోళ్లు ప్రారంభం రోజు క్వింటా లు పత్తి రూ.5800కి కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు మంగళవారం కనీసం ప్ర భుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 కంటే తక్కువతో కొనుగోలు చేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం పది రోజుల నుంచి రోజురోజుకు ధర తగ్గుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర తక్కువగా ఉందని, పత్తి గింజల ధర కూడా పడిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ ధర కంటే ఎక్కువగా చెల్లించలేమని కరాఖండిగా చెబుతున్నారు. దీంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, వేరే దారిలేక రైతులు వారు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. మద్దతు ధర కంటే తక్కువ.. మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువగా ప్రైవేట్ వ్యాపారులు ధర నిర్ణయించడంతో మార్కెటింగ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ ద్వారా కొనుగోలుకు సిద్ధమయ్యారు. సీసీఐ సవాలక్ష నిబంధనలు విధించడంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వ్యాపారులకే పంటను విక్రయించుకుంటున్నారు. సీసీఐలో పంట విక్రయించినా రైతులకు కూడా వారం పది రోజుల వరకు డబ్బులు చెల్లించకపోవడం, తదితర కారణాలతో రైతులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతులు ధరలో కొంత తేడా వచ్చినా ప్రైవేట్ వ్యాపారులకు అమ్మి అప్పటికప్పుడు డబ్బులను తీసుకెళ్తున్నారు. ఈ నెల 20న క్వింటాలు పత్తి ధర రూ.5600 ఉండగా, ఆ తర్వాత రూ.5550, రూ.5490, మంగళవారం రూ.5440 ధర నిర్ణయించారు. మద్దతు ధర కంటే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.10 కంటే తక్కువగానే కొనుగోలు చేశారు. ఆశ నిరాశే.. ఆదిలాబాద్ జిల్లాలో చాలామంది రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి పంట సాగు చేస్తారు. మొదట్లో పత్తి ధర రూ.5800 వరకు ఉండడంతో క్వింటాలుకు రూ.6వేలకు పైగా ధర వస్తుందని ఆశ పడ్డారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర తగ్గిందని ప్రైవేట్ వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బేల్ ధర రూ.43వేలకు పడిపోవడంతో పత్తి ధర తగ్గుతూ వస్తుందని, పత్తి గింజలు క్వింటాలుకు రూ.2వేల వరకు పడిపోయిందని చెబుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వ్యాపారులు ధరను పెంచేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. మంగళవారం సిద్దిపేటలో క్వింటాలుకు రూ.5250, వరంగల్‌లో రూ.5,300, ఖమ్మంలో రూ.5,450, జమ్మికుంటలో రూ.5,350తో కొనుగోలు జరిగాయని మార్కెటింగ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 40 శాతం తగ్గిన దిగుబడి.. మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది రైతుల పరిస్థితి. ప్రతియేడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. గతేడాది అనావృష్టితో పంటలు నష్టపోగా, ఈ యేడాది అతివృష్టి కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడింది. గతం కంటే ఈసారి 40 శాతం దిగుబడి పడిపోయింది. ఎకరానికి రెండు మూడు క్వింటాళ్ల కంటే ఎక్కువ పత్తి దిగుబడి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 10,65,378 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరగగా, జిల్లా వ్యాప్తంగా ఈయేడాది ఇప్పటివరకు 4,07,372 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. ఆదిలాబాద్ మార్కెట్లో 3,55,144 క్వింటాళ్లు, బోథ్‌లో 28వేల క్వింటాళ్లు, ఇచ్చోడలో 11వేల క్వింటాళ్లు, జైనథ్‌లో 9వేల క్వింటాళ్ల కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటివరకు సీసీఐ జిల్లాలో బోణీ చేయలేదు. గతేడాది 6,672 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది. రైతులు ఆందోళన చెందవద్దు పత్తి ధర తగ్గుతుందని రైతులు ఆందోళన చెందవద్దు. మార్కెట్లో మద్దతు ధర కంటే తక్కువ ఉంటే సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సీసీఐని రంగంలోకి దించాం. తక్కువ ధరకు పంటను విక్రయించి నష్టపోవద్దు. – శ్రీనివాస్, మార్కెటింగ్ ఏడీ, ఆదిలాబాద్ -
మూడోరోజూ రైతుల ఆందోళన
న్యూఢిల్లీ / భోపాల్ / చండీగఢ్ /జైపూర్: కేంద్రం రుణమాఫీతో పాటు పంటకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ రైతులు చేపట్టిన 10 రోజుల దేశవ్యాప్త ఆందోళన ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా రైతులు పట్టణాలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరాను నిలిపివేయడంతో పాటు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాలు, కూరగాయల సరఫరా నిలిచిపోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో వాటి ధరలు 25–30% పెరిగాయి. ఆందోళనలో భాగంగా హరియాణా, పంజాబ్ల్లోరైతులు పాలు, కూరగాయల్ని రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం రైతులు, వ్యాపారుల మధ్య ఘర్షణ చెలరేగింది. రాజస్తాన్‌లో అతిపెద్ద మార్కెట్అయిన ముహానా మండీకి కూరగాయల్ని తీసుకెళ్తున్న 150 ట్రక్కుల్ని రైతులు అడ్డుకున్నారు. ఆందోళన చివరిరోజైన జూన్ 10న రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపిచ్చాయి. మధ్యప్రదేశ్‌లో రైతులపై పోలీస్కాల్పులకు నిరసనగా జూన్ 8న నిర్వహించే కార్యక్రమంలో బీజేపీ నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా పాల్గొననున్నారు. -
అప్పులే మిగిలాయ్!
శాంతినగర్ (అలంపూర్) : కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టి కారణంగా పంటలు నష్టపోయిన రైతులు సుబాబుల్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. మూడేళ్లక్రితం మార్కెట్లో ధరలు బాగా ఉండటం, ఆర్డీఎస్ కెనాల్‌కు పూర్తిస్థాయిలో సాగునీరందకపోవడం, ఆయకట్టు పొలాలు బీళ్లుగా మారుతున్న తరుణంలో రైతులకు సుబాబుల్ సాగే దిక్కయింది. అయితే ప్రస్తుతం ధరలు పడిపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని వడ్డేపల్లి, రాజోలి, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో 15వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వడ్డేపల్లి మండలంలో గతేడాది హరితహారంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలను అధికారులు ఉచితంగా రైతులకు అందజేశారు. ఈ ఏడాది మరో నాలుగు లక్షల మొక్కలు కావాలని రైతులు కోరుతున్నారు. మూడేళ్లపాటు మొక్కలు పెంచడానికి పెట్టుబడి కోసం దళారులను ఆశ్రయిస్తున్నారు. వారి వద్ద అధిక వడ్డీకి డబ్బలు తెచ్చుకుని పంట సాగు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మూడేళ్లలో కోతకు వచ్చేసరికి పెట్టుబడి కంటే వడ్డీ అధిక మవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారుల భోజ్యం రైతులు పండించిన సుబాబుల్‌ను ము ఖ్యంగా పేపర్ తయారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. పేపర్ తయారీ కేంద్రాలు ఐ టీసీ భద్రాచలం, కర్ణాటకలోని డోంగోల్లో మాత్రమే ఉన్నాయి. దగ్గర్లో మిల్లులు లేకపోవడం, నేరుగా రైతులతో సుబాబు ల్ కొనుగోలు చేయకపోవడం, స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో దళారుల రాజ్యం కొనసాగుతోంది. వారు ఎంత చెబితే అంత ధరకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. సుబాబుల్ మార్కెట్‌ను దళారులే శాసిస్తున్నారు. కం పెనీకి రైతులకు ఎలాంటి సంబంధం లేకపోవడం వారిపాలిట వరంగా మారింది. రెండేళ్ల క్రితం రూ.3,800 నుంచి రూ. నా లుగు వేల వరకు టన్ను కొనుగోలు చేశా రు. ఈ ఏడాది రూ.2,500కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నా రు. మూడేళ్లపాటు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి రూ.50 వేల నష్టం వస్తోందని చెబుతున్నారు. ఎకరా కు 30 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఆరు లక్షల టన్నుల దిగుబడిలో టన్నుకు రూ.1,500 చొప్పున మొ త్తం రూ.90 కోట్ల వరకు జిల్లా రైతులు నష్టపోతున్నట్లు సమాచారం. కనీసం రూ.నాలుగు వేలకు టన్ను కొనుగోలు చేస్తేనే గిట్టుబాటు అవుతుందన్నారు. మొక్కలే ఉచితంగా ఇస్తాం ఈజీఎస్ ద్వారా సుబాబుల్ మొక్కలు మాత్రమే ఉచితంగా ఇస్తాం. వడ్డేపల్లి మండలంలోనే రెండేళ్లలో నాలుగు లక్షల మొక్కలు ఉచితంగా ఇచ్చాం. ఈ ఏడాది ఎక్కువ మొక్కలు కావాలని రైతులు కోరడంతో నాలుగు లక్షల వరకు ఉచితంగా ఇచ్చేందుకు నర్సరీల్లో పెంచుతున్నాం. సుబాబుల్‌కు రాయితీలు, పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. – ఐ.ప్రకాష్, జిల్లా అటవీశాఖ అధికారి, గద్వాల ప్రభుత్వమే కొనుగోలు చేయాలి మూడేళ్లపాటు కష్టపడి పండించిన పంటను దళారులకు అమ్మిన తరువాత డబ్బులకోసం మూడు నెలలపాటు వేచి ఉండాల్సిన పరిస్తితులు ఉన్నాయి. అసలే గిట్టుబాటు ధరలేక ఓవైపు రైతులు అల్లాడుతుంటే అమ్మిన తరువాత డబ్బులకోసం ఎదురుచూడాల్సిన దుస్తితులు దాపురించాయి. సుబాబుల పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలుచేసి రైతులను ఆదుకోవాలి. – సత్యప్రసాద్‌రెడ్డి, రైతు, కొంకల, వడ్డేపల్లి మండలం మూడేళ్లపాటు పెట్టుబడికి ఇవ్వాలి సుబాబుల్ పంట కోతకు రావాలంటే మూడేళ్లు పడుతుంది. అప్పటివరకు పెట్టుబడి పెడుతూనే ఉండాలి. బయట వడ్డీకి డబ్బులు తీసుకుని సాగు చేస్తే మూడేళ్లలో అంతకు అంత రెట్పింపవుతుంది. పంట వల్ల వచ్చే లాభం వడ్డీకే సరిపోతుంది. ఉద్యానవన శాఖ ద్వారా పండ్లతోటలకు ఇచ్చే రాయితీలు మాకు కల్పించాలి. – ఎస్.వెంకటనారాయణరావు, రైతు, శాంతినగర్ యార్డు ఏర్పాటు చేయాలి కిలో విత్తనం రూ.150 ప్రకారం ఐటీసీ పేపర్‌మిల్లు భద్రాచలం నుంచి తెచ్చుకుని 40ఎకరాల్లో పంట సాగు చేశాను. విత్తనాలు ఇవ్వడమేగాని కొనుగోలు చేసేందుకు వారు ముందుకు రావడంలేదు. ఈ ఏడాది టన్నుకు మార్కెట్లో రూ.2,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దళారులు ఎంత చెబితే అంత ధరకు అమ్మాల్సి వస్తోంది. జిల్లాలో నేషనల్ హైవేకు దగ్గర్లో ఎక్కడైనా యార్డు ఏర్పాటుచేసి నేరుగా ఐటీసీ కంపెనీ ద్వారా కొనుగోలు చేయించాలి. – వి.జోగేంద్రప్రసాద్, రైతు, శాంతినగర్ -
సాగునీటి సమస్యపై వైఎస్ జగన్‌ను కలిసిన రైతులు
-
రైతుల ఆందోళనలు పట్టని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్ యాక్ట్ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
ధర దగా
నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అక్కడి వ్యాపారులు క్వింటాలు పసుపునకు అధిక ధర చెల్లిస్తుండగా, ఇక్కడి వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. సిండికేట్‌గా మారిన గుప్పెడు మంది వ్యాపారులు చెప్పిన ధరకే ఇతర వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మార్కెట్‌కు పసుపు తరలించిన రైతులు లబోదిబోమంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఈ–నామ్ విధానం.. దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం.. తద్వారా విస్తృతమైన మార్కెట్ ఏర్పడి రైతుల ఉత్పత్తులకు మంచి ధర.. ఈ–నామ్ క్రయవిక్రయాల విధానంపై ప్రభుత్వం చెబుతున్న మాటలివి... కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుప్పెడు మంది వ్యాపారులు నిర్ణయించిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ యార్డు లో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజామాబాద్‌కు ప్రత్యామ్నాయమైన పసుపు మార్కెట్ సాంగ్లీ (మహారాష్ట్ర)లో వ్యాపారులు క్వింటాలుకు సగటున రూ.9,500 వరకు చెల్లిస్తే.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో మాత్రం కేవలం రూ.6,300లతో సరిపెడుతున్నారు. అంటే క్వింటాలుకు రూ.3,200 వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌యార్డుకు పసుపు తెచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను విక్రయిస్తే.. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ యార్డులో లైసెన్సులున్న ఖరీదుదారులు 423 మంది ఉండగా, వీరిలో 40 మంది మాత్రమే పసుపు కొనుగో లు చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది వ్యాపారులు నిర్ణయించిన ధర మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నాణ్యత పేరుతో.. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. సాంగ్లీ మార్కెట్‌కు రాజ్‌పురి రకం అని.. ఈ రకం పసుపులో కర్కుమిన్ శాతం అధికంగా ఉండటంతో అక్కడి వ్యాపారులు ఆ పసుపునకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ రకంతో పోల్చితే నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపు నాణ్యత తక్కువ ఉంటుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. పైగా అక్కడి మార్కెట్‌కు వచ్చే పసుపులో పాలిష్ ఎక్కువగా జరుగుతుందని, నిజామాబాద్ యార్డుకు వస్తున్న పసుపునకు ఆ నాణ్యత ఉండదని పేర్కొంటున్నారు. మరోపక్క వ్యాపారులు సిండికేట్ కావడానికి అవకాశమే లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ముంచెత్తిన పసుపు.. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు ముంచెత్తింది. సోమవారం సుమారు 35వేల బస్తాల పసుపును మార్కెట్‌కు తీసుకువచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజు కావడంతో ఒక్కసారిగా పసుపు మార్కెట్‌కు తరలివచ్చింది. కాగా గతేడాదితో పోల్చితే నిజామాబాద్ యార్డుకు పసుపు పక్షం రోజుల ముందుగానే వస్తోంది. సాధారణంగా జనవరి చివరి వారంలో రైతులు పసుపును యార్డుకు తీసుకువస్తారు. కానీ ఈసారి జనవరి మొదటి వారం నుంచే తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 వేల క్వింటాళ్ల పసుపు యార్డుకు వచ్చింది. గతేడాది ఇదేరోజు నాటికి 40 వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్‌యార్డు రికార్డులు చెబుతున్నాయి. -
కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలి
మిరుదొడ్డి, న్యూస్‌లైన్ : దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మండలానికో స్పెషల్ అధికారిని నియమించాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి తొలిసారిగా మంగళవారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పథకాల అమలుకోసం స్పెషల్ అధికారులను నియమించినట్లుగానే కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించడానికి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుకు మద్దతు ధర కల్పించేలా ప్రోత్సాహించాలని కోరారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక ముందే రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధికారులను కోరారు. నియోజకవర్గంలోని సాగు విస్తీర్ణతను బట్టి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.కార్యక్రమంలో ఆయన వెంట పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల బాల్‌రెడ్డి, అందె సర్పంచ్ బుర్ర లింగంగౌడ్, గంగాధర్ గౌడ్, నంట బాపురెడ్డి, ఏవీ రవీందర్ తదితరులు ఉన్నారు.