నిజామాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చిన పసుపు
నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌లో అక్కడి వ్యాపారులు క్వింటాలు పసుపునకు అధిక ధర చెల్లిస్తుండగా, ఇక్కడి వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. సిండికేట్‌గా మారిన గుప్పెడు మంది వ్యాపారులు చెప్పిన ధరకే ఇతర వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మార్కెట్‌కు పసుపు తరలించిన రైతులు లబోదిబోమంటున్నారు.
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఈ–నామ్ విధానం.. దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం.. తద్వారా విస్తృతమైన మార్కెట్ ఏర్పడి రైతుల ఉత్పత్తులకు మంచి ధర.. ఈ–నామ్ క్రయవిక్రయాల విధానంపై ప్రభుత్వం చెబుతున్న మాటలివి... కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుప్పెడు మంది వ్యాపారులు నిర్ణయించిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ యార్డు లో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
నిజామాబాద్‌కు ప్రత్యామ్నాయమైన పసుపు మార్కెట్ సాంగ్లీ (మహారాష్ట్ర)లో వ్యాపారులు క్వింటాలుకు సగటున రూ.9,500 వరకు చెల్లిస్తే.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో మాత్రం కేవలం రూ.6,300లతో సరిపెడుతున్నారు. అంటే క్వింటాలుకు రూ.3,200 వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌యార్డుకు పసుపు తెచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను విక్రయిస్తే.. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ యార్డులో లైసెన్సులున్న ఖరీదుదారులు 423 మంది ఉండగా, వీరిలో 40 మంది మాత్రమే పసుపు కొనుగో లు చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది వ్యాపారులు నిర్ణయించిన ధర మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి.
నాణ్యత పేరుతో..
నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. సాంగ్లీ మార్కెట్‌కు రాజ్‌పురి రకం అని.. ఈ రకం పసుపులో కర్కుమిన్ శాతం అధికంగా ఉండటంతో అక్కడి వ్యాపారులు ఆ పసుపునకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ రకంతో పోల్చితే నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపు నాణ్యత తక్కువ ఉంటుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. పైగా అక్కడి మార్కెట్‌కు వచ్చే పసుపులో పాలిష్ ఎక్కువగా జరుగుతుందని, నిజామాబాద్ యార్డుకు వస్తున్న పసుపునకు ఆ నాణ్యత ఉండదని పేర్కొంటున్నారు. మరోపక్క వ్యాపారులు సిండికేట్ కావడానికి అవకాశమే లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.
ముంచెత్తిన పసుపు..
నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు ముంచెత్తింది. సోమవారం సుమారు 35వేల బస్తాల పసుపును మార్కెట్‌కు తీసుకువచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజు కావడంతో ఒక్కసారిగా పసుపు మార్కెట్‌కు తరలివచ్చింది. కాగా గతేడాదితో పోల్చితే నిజామాబాద్ యార్డుకు పసుపు పక్షం రోజుల ముందుగానే వస్తోంది. సాధారణంగా జనవరి చివరి వారంలో రైతులు పసుపును యార్డుకు తీసుకువస్తారు. కానీ ఈసారి జనవరి మొదటి వారం నుంచే తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 వేల క్వింటాళ్ల పసుపు యార్డుకు వచ్చింది. గతేడాది ఇదేరోజు నాటికి 40 వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్‌యార్డు రికార్డులు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment