turmeric price
-
రికార్డు స్థాయిలో పసుపు ధర
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రికార్డుస్థాయి ధర లభిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. క్వింటా పసుపు గరిష్టంగా కడప మార్కెట్ యార్డులో రూ.13,712 పలకగా, దుగ్గిరాల పసుపు యార్డులో రూ.13,600 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నెల తిరక్కుండానే పెరిగిన ధర రాష్ట్రంలో 2022–23 సీజన్లో 83,540 ఎకరాల్లో పసుపు సాగవగా.. 3.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2023–24 సీజన్లో వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల 78 వేల ఎకరాల్లో సాగైంది. హెక్టార్‌కు సగటున 11 టన్నుల దిగుబడి వచ్చింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. మరోవైపు ధర తగ్గినప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. గతేడాది జూన్, జూలైల్లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలకడంతో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.36 కోట్లు వెచ్చించి 5,020 టన్నుల పసుపును మద్దతుధరకు సేకరించింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్లలో క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,750 పలికింది. ఆ తర్వాత ఏ దశలోను మార్కెట్లో ధర తగ్గలేదు. ప్రస్తుతం ఎమ్మెస్పీ కంటే రెట్టింపు ధర పలుకుతుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కడప మార్కెట్లో కనిష్టంగా రూ.11,555, గరిష్టంగా రూ.13,712 పలికింది. దుగ్గిరాల మార్కెట్ యార్డులో కనిష్టంగా రూ.12,300, గరిష్టంగా రూ.13,600 పలికింది. బాబు హయాంలో క్వింటా రూ.6,358 మించని ధర టీడీపీ హయాంలో అసలు మద్దతు ధర ప్రస్తావనే లేదు. మార్కెట్లో వ్యాపారులు చెప్పిందే «ధర.. చెల్లించిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. ఆ ఐదేళ్లలో సగటున క్వింటాకు రూ.6,358 మించి ధర లభించిన పరిస్థితి లేదు. ఆ ఐదేళ్లలో గరిష్ట ధరలు 2014–15లో రూ.5,335, 2015–16లో రూ.7 వేలు, 2016–17లో రూ.5,755, 2017–18లో రూ.7,200, 2018–19లో రూ.6,500 ఉన్నాయి. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో ఒకటి రెండు సీజన్లలో అదీ ఒకటిరెండు నెలలు మాత్రమే అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి మార్కెట్‌కు రావడంతో ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్ని సీజన్లలో ప్రభుత్వ చర్యల ఫలితంగా ఎమ్మెస్పీకి మించే ధరలు పలికాయి. రెండేళ్ల పాటు గరిష్టంగా క్వింటా రూ.10 వేలకు పైనే పలికింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, ఈ ప్రభుత్వం 2019–20 నుంచి ఇప్పటివరకు రూ.449 కోట్ల విలువైన 57,973 టన్నుల పసుపును సేకరించింది. ప్రభుత్వ జోక్యం వల్లే.. ఐదేళ్లుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. మార్కెట్లో ధరలు తగ్గిన ప్రతిసారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తోంది. ప్రతి రైతుకు ప్రతి పంటకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుతం పసుపు క్వింటా ధర గరిష్టంగా రూ.14 వేలకు చేరుకోగా, మిగిలిన పంట ఉత్పత్తులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో రికార్డుస్థాయి ధరలు లభిస్తున్నాయి. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి ఈ రైతు పేరు ఆవుల వెంకటచినసుబ్బయ్య. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం బుచ్చంపల్లి గ్రామానికి చెందిన ఈయనకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవలే 70 క్వింటాళ్ల పసుపును మార్కెట్ యార్డులో విక్రయించారు. క్వింటా గరిష్టంగా రూ.12,700కు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం క్వింటా నాణ్యతను బట్టి రూ.14 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిధర ఎప్పుడూ చూడలేదని వెంకటచినసుబ్బయ్య సాక్షి వద్ద తన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జోక్యం వల్ల ఒక్క పసుపే కాదు.. దాదాపు ఇతర పంట ఉత్పత్తులకు మార్కెట్లో రికార్డు స్థాయిలోనే ధరలు పలుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. -
పసుపు ధర పైపైకి
సాక్షి, అమరావతి: మూడేళ్ల తర్వాత పసుపు ధర పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 వరకు పలుకుతున్న పసుపు మరో నెలలో రూ.10 వేల మార్క్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. పసుపు సాగులోనే కాదు.. ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో 70–75 శాతం మనదేశంలోనే జరుగుతుంది. పసుపు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్కువగా సాగవుతుంది. మన రాష్ట్రంలో 30,518 హెక్టార్లలో సాలెం, దుగ్గిరాల, మైదుకూరు రకాల పసుపు సాగవుతుండగా దుగ్గిరాల, నంద్యాల, కడప మార్కెట్ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఖరీఫ్‌లో ఏటా జూన్–జూలైలో పంట వేస్తారు. మరుసటి ఏడాది మార్చి నాలుగో వారం నుంచి పంట మార్కెట్లోకి వస్తుంది. రాష్ట్రంలో పండే పసుపులో 50 శాతం రాష్ట్ర పరిధిలోను, 20 శాతం పొరుగు రాష్ట్రాల్లోను వినియోగమవుతుండగా, 30 శాతం వరకు ముంబై, కోల్‌కతాల మీదుగా బంగ్లాదేశ్, సౌదీ, దుబాయ్ వంటి దేశాలకు ఎగుమతవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కూడా మన మార్కెట్లకు వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు. గతేడాది మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు తొలిసారిగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వమే ఎమ్మెస్పీ ప్రకటించింది. దానికంటే మార్కెట్లో ధర తక్కువగా ఉండడంతో మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు పథకం (మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్) ద్వారా పెద్ద ఎత్తున సేకరించి పసుపు రైతుకు అండగా నిలిచింది. 2019–20లో 26,878 మంది రైతుల నుంచి క్వింటాల్ కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున రూ.342.75 కోట్ల విలువైన 50,035 మెట్రిక్ టన్నుల పసుపును మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసింది. ఇలా సేకరించిన పసుపులో ఇప్పటివరకు 17,678 మెట్రిక్ టన్నులను క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.4,991 చొప్పున వేలంలో విక్రయించింది. మరో 32,357 మెట్రిక్ టన్నుల పసుపును వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో ఆ మేరకు మార్క్‌ఫెడ్‌కు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలరోజుల్లో రూ.3 వేలు పెరుగుదల 2019–20 సీజన్లో 3.8 లక్షల టన్నుల దిగుబడి రాగా, గతేడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల 2020–21లో 3,66,218 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మూడేళ్లుగా మార్కెట్లో క్వింటాల్ రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్యలో ఉన్న ధర ఈ ఏడాది ఊహించని రీతిలో పెరుగుతోంది. మన రాష్ట్రంలో ఇప్పటికే రూ.7,,500 నుంచి రూ.7,900 వరకు పలుకుతోంది. పంట పూర్తిగా మార్కెట్ కొచ్చే సమయానికి ఈ ధర రూ.10 వేల మార్క్‌ను దాటే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినియోగం పెరగడంతో మార్కెట్లో పసుపునకు డిమాండ్ ఏర్పడింది. రేటు పెరుగుతోంది మూడేళ్ల తర్వాత పసుపునకు మంచిరేటొస్తోంది. ఇప్పటికే క్వింటాల్ రూ.7,900 దాటింది. ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఫ్యూచర్ ట్రేడింగ్స్ కంపెనీ వాళ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ధర పెరుగుదల రైతులకే కాదు.. వ్యాపారులకు కూడా మంచిది. – శ్రీనివాస్, పసుపు వ్యాపారి, దుగ్గిరాల ధర మరింత పెరిగే అవకాశం గడిచిన మూడేళ్లుగా మార్కెట్లో ధర లేదు. అందుకే మార్క్‌ఫెడ్ మార్కెట్లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్ ఎమ్మెస్పీ రూ.6,850గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువగా ఏ ఒక్కరూ అమ్ముకోవద్దు. ధర మరింత పెరిగే అవకాశం ఉంది. – పీఎస్ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్ -
క్వింటాల్‌కు రూ. 10 వేలు: రైతుల సంబరం!
సాక్షి, జగిత్యాల: పసుపు పంట క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతుండటంతో రైతులు సంబరపడి పోతున్నారు. వర్షాలు, చీడ పురుగుల కారణంగా పసుపు దిగుబడి సగానికి తగ్గినప్పటికీ ధర ఆశాజనకంగా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మార్కెట్ యార్డుకు రోజుకు సుమారు 200 క్వింటాళ్ల పసుపు వస్తోంది. సోమవారం మెట్పల్లి మార్కెట్లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.8,800 ధర పలికింది. మరోవైపు నిజామాబాద్ మార్కెట్ యార్డుకు నిత్యం 25 వేల క్వింటాళ్ల వరకు పసుపు వస్తుండగా సోమవారం అత్యధికంగా 50 వేల క్వింటాళ్లకు పైగా పంటను రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చారు. క్వింటాల్ పసుపునకు అత్యధికంగా రూ.10,555 ధర పలకడం విశేషం. రానున్న రోజుల్లో ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గతం కంటే రెట్టింపయ్యింది ఈసారి పసుపు ధర గతం కంటే రెట్టింపు పలుకుతోంది. రైతులు మార్కెట్లో అమ్ముకునేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ప్రస్తుతం రూ.10 వేలకు చేరువైంది. ధర మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాం. -
రూ.9వేల మార్కు దాటిన పసుపు ధర!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో క్వింటాలు పసుపు ధర రూ.9 వేల మార్కు దాటింది. వేల్పూర్ మండలం పడిగెల్ గ్రామానికి చెందిన సామ శ్రీనివాస్ అనే రైతు సోమవారం తీసుకొచ్చిన 18 క్వింటాళ్ల పసుపుపంటకు ఈ సీజన్లో అత్యధికంగా రూ.9389 ధర పలికింది. అలాగే 135 క్వింటాళ్లకు రూ.8500 పైచిలుకు, 481 క్వింటాళ్లకు రూ.8వేలకుపైగా ధర వచ్చిందని మార్కెటింగ్‌శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం మార్కెట్‌కు 19,282 క్వింటాళ్ల పసుపు వచ్చింది. గత పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ.2 వేల వరకు ధర పెరిగింది. రానున్న రోజుల్లో పసుపు ధర మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రోజురోజుకూ పచ్చ బంగారం ధర పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బండరాళ్లు మోది భర్తను చంపిన భార్య -
పసుపు ధర పైపైకి..
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): సీజన్ కాని వేళలో పసుపు పంటకు ధర పెరుగుతోంది. పసుపు పంటను నిలువ ఉంచుకున్న వ్యాపారులు, స్టాకిస్టులకు ప్రయోజనం కలిగేలా ధర పెరుగుతూ పోతుంది. పసుపు పంటకు ఇప్పుడు ధర పెరగడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. వారం రో జుల కింద పసుపు పంటకు క్వింటాలుకు రూ. 5,500 ఉన్న ధర ఇప్పుడు రూ. 6,100కు చేరింది. వారం రోజుల వ్యవధిలో ఏకంగా రూ. 600ల ధర పెరగడం విశేషం. కరోనా ప్రభావంతో నిజామాబాద్‌లోని వ్యవ సాయ మార్కెట్లో కొద్దిరోజులు వ్యాపార లావా దేవీలు స్తంభించిపోయాయి. ఇటీవలే పరిస్థితి మెరుగు అవుతుండగా పసుపు పంటకు కొంత ధర పెరిగింది. పసుపు పంటకు సీజన్లో క్వింటాలుకు రూ. 5 వేలకు మించి ధర లభించలేదు. మహారాష్ట్ర నుంచి పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు దిగుమతి కావడం, ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు ఆశించిన విధంగా ఎగుమతులు లేకపోవడంతో గడిచిన సీజన్లో రైతులు పెద్ద మొత్తంలో నష్టపోయారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లోనూ పసుపు పంటకు ధర లభించకపోవడం రైతులను కుంగదీసింది. గతంలో కూడా అన్‌సీజన్‌లో పసుపు ధర పెరగడాన్ని గమనించిన కొందరు రైతులు కోల్డ్‌స్టోరేజీలలో పసుపును నిలువ ఉంచారు. కరోనా లాక్డౌన్ కారణంగా మార్కెట్ మూతబడడంతో రైతులు తక్కువ ధరకే విక్రయించుకుని నష్టపోయారు. కాగా ఇప్పుడు ఉన్న స్థితిలో పసుపు పంటకు ధర పెరగగా ఇదే ధర కొనసాగుతుందా లేదా అని రైతులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ధర ఇలాగే ఉంటే రానున్న సీజన్లో పసుపు సాగు చేసిన వారికి కొంతైనా ఊరట లభించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గకుండా చర్యలు తీసుకోవాలి పసుపు పంటకు మార్కెట్లో ఎప్పుడైనా డిమాండ్ ఒకేలా ఉంది. కానీ వ్యాపారులే ధరను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని పసుపు పంటకు ధర క్షీణించకుండా చర్యలు తీసుకోవాలి. ధర నియంత్రణపై దృష్టి సారించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – బూత్‌పురం మహిపాల్, రైతు, మోర్తాడ్ -
ధర దగా
నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను మోసం చేస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో అక్కడి వ్యాపారులు క్వింటాలు పసుపునకు అధిక ధర చెల్లిస్తుండగా, ఇక్కడి వ్యాపారులు నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. సిండికేట్‌గా మారిన గుప్పెడు మంది వ్యాపారులు చెప్పిన ధరకే ఇతర వ్యాపారులు పసుపు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో మార్కెట్‌కు పసుపు తరలించిన రైతులు లబోదిబోమంటున్నారు. సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఈ–నామ్ విధానం.. దేశంలో ఎక్కడి నుంచైనా వ్యాపారులు రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అవకాశం.. తద్వారా విస్తృతమైన మార్కెట్ ఏర్పడి రైతుల ఉత్పత్తులకు మంచి ధర.. ఈ–నామ్ క్రయవిక్రయాల విధానంపై ప్రభుత్వం చెబుతున్న మాటలివి... కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గుప్పెడు మంది వ్యాపారులు నిర్ణయించిందే ధర.. నిజామాబాద్ మార్కెట్ యార్డు లో సిండికేట్‌గా మారిన వ్యాపారులు పసుపు రైతులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజామాబాద్‌కు ప్రత్యామ్నాయమైన పసుపు మార్కెట్ సాంగ్లీ (మహారాష్ట్ర)లో వ్యాపారులు క్వింటాలుకు సగటున రూ.9,500 వరకు చెల్లిస్తే.. నిజామాబాద్ మార్కెట్‌యార్డులో మాత్రం కేవలం రూ.6,300లతో సరిపెడుతున్నారు. అంటే క్వింటాలుకు రూ.3,200 వరకు కోత విధించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌యార్డుకు పసుపు తెచ్చిన రైతులు లబోదిబోమంటున్నారు. రూ.వేలల్లో పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటను విక్రయిస్తే.. కనీసం పెట్టుబడులు కూడా వెళ్లడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ యార్డులో లైసెన్సులున్న ఖరీదుదారులు 423 మంది ఉండగా, వీరిలో 40 మంది మాత్రమే పసుపు కొనుగో లు చేస్తున్నారు. వీరిలో అతికొద్ది మంది వ్యాపారులు నిర్ణయించిన ధర మేరకే కొనుగోళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. నాణ్యత పేరుతో.. నాణ్యత పేరుతో వ్యాపారులు ధరలో కోత పెడుతున్నారు. సాంగ్లీ మార్కెట్‌కు రాజ్‌పురి రకం అని.. ఈ రకం పసుపులో కర్కుమిన్ శాతం అధికంగా ఉండటంతో అక్కడి వ్యాపారులు ఆ పసుపునకు ఎక్కువ ధర చెల్లిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. ఈ రకంతో పోల్చితే నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు వస్తున్న పసుపు నాణ్యత తక్కువ ఉంటుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు. పైగా అక్కడి మార్కెట్‌కు వచ్చే పసుపులో పాలిష్ ఎక్కువగా జరుగుతుందని, నిజామాబాద్ యార్డుకు వస్తున్న పసుపునకు ఆ నాణ్యత ఉండదని పేర్కొంటున్నారు. మరోపక్క వ్యాపారులు సిండికేట్ కావడానికి అవకాశమే లేదని మార్కెటింగ్‌శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ముంచెత్తిన పసుపు.. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు ముంచెత్తింది. సోమవారం సుమారు 35వేల బస్తాల పసుపును మార్కెట్‌కు తీసుకువచ్చారు. శని, ఆదివారాలు సెలవు రోజు కావడంతో ఒక్కసారిగా పసుపు మార్కెట్‌కు తరలివచ్చింది. కాగా గతేడాదితో పోల్చితే నిజామాబాద్ యార్డుకు పసుపు పక్షం రోజుల ముందుగానే వస్తోంది. సాధారణంగా జనవరి చివరి వారంలో రైతులు పసుపును యార్డుకు తీసుకువస్తారు. కానీ ఈసారి జనవరి మొదటి వారం నుంచే తరలిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 50 వేల క్వింటాళ్ల పసుపు యార్డుకు వచ్చింది. గతేడాది ఇదేరోజు నాటికి 40 వేల క్వింటాళ్లు వచ్చినట్లు మార్కెట్‌యార్డు రికార్డులు చెబుతున్నాయి. -
‘పచ్చ బంగారం’ ధర పలికేనా..!
బాల్కొండ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రైతులకు సిరులు కురిపించి న పసుపుపంట ధర ప్రస్తుతం నేలచూపులు చూస్తోంది. రాజన్న హయాంలో క్వింటాలు ధర రూ.17వేలు పలుకగా, నేడు గరిష్టంగా రూ.8 వేలు పలుకుతోంది. మరోవైపు జిల్లాలో పసుపుబోర్డు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక పసుపు బోర్డు ఏర్పాటైతే మద్దతు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంటకు ఆశించిన ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 33వేల ఎకరాల్లో రైతులు పసుపు పంటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పసుపు తవ్వకాలు జోరందుకున్నా యి. రైతులు పసుపును మార్కెట్‌కు తరలిస్తు న్నారు. కాగా క్వింటాలుకు గరిష్టంగా రూ.8 వేలు, కనిష్టంగా రూ.6 వేల ధర పలుకుతోంది. దీంతో రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పసుపు పంట సాగుకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర పెట్టుబడి పెట్టి సాగు చేసే పంట కావడంతో రైతులకు మార్కెట్ ధర గిట్టుబాటు కావడం లేదు. కనీసం క్వింటాలుకు రూ. 10 వేల కంటే ఎక్కువ ఉంటేనే పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. రాజన్న హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 2007, 2008లో క్వింటాలు పసుపు ధర గరిష్టంగా రూ.17 వేలు, కనిష్టంగా రూ.12 వేలు పలికింది. మార్క్‌ఫెడ్ ద్వారా పసుపు పంటను కొనుగోలు చేయడంతో రైతులకు మంచి ధర లభించింది. ధరలు నిలకడగా ఉండటంతో రైతులకు మంచి లాభాలు వచ్చాయి. రాజన్న వ్యవసాయాన్ని పండగ చేశారు. పసుపుపంట సాగు చేస్తున్నప్పటి నుంచి అంత ధర దక్కలేదని రైతులు అంటున్నారు. అలాంటి ధరను ఎప్పుడు చూస్తామా.. అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పసుపు పంట సీజన్ వచ్చిన ప్రతిసారి రాజశేఖర్‌రెడ్డి పాలనలో వచ్చిన ధరను గుర్తు చేసుకుంటున్నారు. పాలకుల నిర్లక్ష్యంతో.. వైఎస్ మరణం తరువాత పాలకుల నిర్లక్ష్యం పసుపు రైతుల పాలిట శాపంగా మారింది. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉండగా పసుపు పంటకు క్వింటాలుకు రూ.4 వేల మద్దతు ధర ప్రకటిస్తే సరిపోతుందని కేంద్రానికి లేఖ రాశా రు. దీంతో పసుపు రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు రైతులను గురించి పాలకులు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా మద్దతు ధర కోసం, పసుపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు కోసం పోరాటాలు చేస్తున్నా.. ఇప్పటికీ మోక్షం కలుగలేదు. పసుçపు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పడంతో రైతుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. ప్రత్యేక రాష్ట్రంలోనైనా మోక్షం లభిస్తుందని రైతులు నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి నిరాశే మిగులుతోంది. పాలకులు స్పందించి పసుపు పంటకు కనీన మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
రైతులకు కన్నీరు.. దళారులకు పన్నీరు!
కోరుట్ల: ఈ ఏడాది మే నెల 3వ తేదీ.. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో పసుపు పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న మనోవ్యథతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండికి చెందిన రైతు దాసరి చిన్న గంగారాం పసుపు కుప్ప వద్దే ప్రాణాలు విడిచాడు. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం దక్కడంలేదని పసుపునకు గిట్టుబాటు ధర ఇప్పించాలని అపుడు రైతులు ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. పసుపు సాగుకు చేసిన అప్పుల బాధ భరించలేని రైతులు చాలామంది అయిన కాడికి అమ్ముకున్నారు. ఐదునెలల కాలం గడిచింది. పసుపు ధర రెట్టింపు అయింది. కానీ, ఫలితం మాత్రం దళారులకు దక్కింది. నిల్వ చేసుకోలేక.. : ఉత్తర తెలంగాణలోని జగిత్యాల జిల్లా జగిత్యాల, మెట్పల్లి డివిజన్లలో సుమారు 12 వేల హెక్టార్లు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్లో 9 వేల హెక్టార్లు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 11 వేల హెక్టార్లు, నిర్మల్ జిల్లాల్లో 4 వేల హెక్టార్లలో రైతులు పసుపు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పసుపు పంట చేతికి వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు పసుపును రైతులు మార్కెట్‌కు తరలిస్తారు. ఎక్కువ ధర వస్తుందన్న ఆశతో జగిత్యాల, నిర్మల్ ప్రాంతాల్లో పసుపు సాగుచేసిన రైతులతోపాటు నిజామాబాద్ జిల్లా రైతులు నిజామాబాద్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో పసుపు అమ్మకానికి తరలిస్తారు. ఈ ఏడాది మార్చిలో క్వింటాల్ పసుపు ధర రూ.5,500 వరకు పలికి కాస్త మెరుగ్గానే ఉంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పసుపు ధర రూ.3,500కు పడిపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందారు. పండించిన పసుపు పాడైపోకుండా కాపాడుకోలేక.. నిల్వ చేయడానికి వసతులు లేక.. ధర వచ్చిన కాడికి దళారులకు అమ్ముకున్నారు. ఫలితంగా ఆశించిన ధర రైతులకు దక్కకుండా పోయింది. దళారులు మాత్రం తాము పండించిన పసుపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకుని అదను చూసి అమ్ముకుంటున్నారు. ధర పైపైకి..: ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు క్షీణించిన పసుపు ధర ఆ తరువాత కాలంలో మెరుగుపడింది. జూలైలో మళ్లీ క్వింటాల్‌కు రూ.5 వేల పైన పలికింది. జూలై చివరలో నిజామాబాద్ మార్కెట్లో క్వింటాలు పసుపు ధర రూ. 6వేలకు చేరింది. రెండు నెలల వ్యవధిలోనే రైతులు అమ్మిన ధరకు రెట్టింపుకు చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో పసుపు అందుబాటులో లేని సమయం కావడంతో నిజామాబాద్ మార్కెట్లో పసుపు క్వింటాల్ ధర రూ.7,500 నుంచి రూ.8 వేలు పలుకుతోంది. లాభం.. దళారులకే..: రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో పసుపును నిల్వ చేసుకున్న దళారులు ప్రస్తుతం మంచి ధర రావడంతో నిజామాబాద్ మార్కెట్‌కు పసుపును తరలించి అమ్ముతున్నారు. కేవలం రెండునెలల వ్యవధిలో పంట సాగుచేసిన రైతుకు వచ్చిన ధరకు రెట్టింపు లాభం దళారులకు దక్కుతోంది. -
పసుపు రైతులకు కష్టకాలమే..
మొదటిసారిగా రూ.4వేల ధర ప్రకటించిన ప్రభుత్వం పెట్టుబడి పెరగడంతో నష్టపోతున్న రైతులు వరంగల్ సిటీ, న్యూస్‌లైన్,జిల్లాలో పసుపు సాగు చేసిన రైతులకు ఈ ఏడాది కష్టకాలమే ఎదురవుతోంది. ఇప్పటికే సాగు కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేసిన రైతులు కనీస ధర లభించకపోవడంతో ఆవేద న చెందుతున్నారు. రెండు నెలల క్రితం నుంచి మార్కెట్లకు పసుపు వస్తుండగా... ప్రభుత్వం ఎన్నడూలేని విధంగా పసుపు క్వింటాల్‌కు రూ.4 వేలుగా ఎంఎస్పీ ధర నిర్ణయించింది. అయితే, కనీసం రూ.5వేల ధర నిర్ణయిస్తే లా భం జరిగేదని రైతులు చెబుతున్నారు. గతంలో రూ.10వేలు రెండేళ్ల క్రితం పసుపు క్వింటాల్‌కు రూ.10వేల వరకు ధర పలికింది. దీంతో రైతులు పసుపు సాగుపై ఆసక్తి పెంచుకోగా.. గత ఏడాది మా త్రం రూ.4వేల నుంచి రూ.5వేల వరకే ధర లభించింది. ఆ సంవత్సరం వరంగల్ మార్కెట్‌కు 50,845 క్వింటాళ్ల పసుపు వచ్చింది. దీంతో ఈసారి ఎలా ఉంటుందోనని రైతులు బెంగ పడుతున్నట్లుగానే ప్రభుత్వం రూ.4వేల ధర నిర్ణయించడంతో.. వ్యాపారులు కూడా కొ ద్దిగా అటూఇటు ఇదే ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇచ్చేది కూడా ఇంతేనని దబాయిస్తుండడం చేసేదేం లేక రైతులు పసుపు అమ్ముకుని నిరాశగా వెనుతిరుగుతున్నారు. మరికొందరు మాత్రం ధర పెరుగుతుందన్న ఆశతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేసముద్రంలోనూ అదే తీరు.. కేసముద్రం : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో రెండు రోజులుగా పసుపు అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ సీజన్ అడపాదడపా పసుపు వస్తుండగా.. బుధవారం నాలుగు వేల బస్తాలు అమ్మకానికి వచ్చాయి. గత ఏడాది క్వింటాల్ పసుపు రూ.3200 నుంచి రూ. 4వేల వరకు ధర లభించగా, రైతులు నష్టపోయారు. ఈసారి అకాల వర్షాలతో పసుపు దిగుబడి తగ్గిపోయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్ లో బుధవారం కాడి రకం క్వింటాల్‌కు రూ.5725-రూ.4631, గోల రకానికి రూ.5800-రూ.4600 ధర లభించింది. ఇలా కనీసం గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో రైతులు ఆవేదన చెందుతుండగా.. కాం టాలు సరిగ్గా సాగక రాశుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఈసారి ఎంతగానో ఆశపడ్డాను గత సంవత్సరం పసుపు ధర భాగా తగ్గడంతో ఈ ఏడాది మంచి ధర లభిస్తుందని ఆశపడి సాగు చేశాను. కానీ ధర ఏ మాత్రం పెరగకపోవడంతో తల పట్టుకోవాల్సిన పరిస్థితి. నేను చేసిన అప్పులు మిగిలేలా ఉన్నాయి. - అనుముల సంజీవ, మొండ్రాయి ఇక పసుపు సాగుచేయను ఎంతో కష్టపడి ఎక్కువ పెట్టుబడితో పసుపు సాగు చేస్తే అందులో సగం కూడా ధర రావడం లేదు. ఇక నుంచి పసు పు సాగు చేయొద్దని నిర్ణయించుకున్నా. ఐదేళ్లుగా పసుపు సాగు చేస్తున్న నాకు ఎప్పుడూ ఓ ఇబ్బంది ఎదురవుతోంది. - గుగులోతు బిక్షపతి, దీక్షకుంట్ల