Turmeric Price Today in AP: మూడేళ్ల తర్వాత రైతన్నకు గిట్టుబాటు ధర - Sakshi
Sakshi News home page

పసుపు ధర పైపైకి

Published Wed, Mar 10 2021 5:16 AM | Last Updated on Wed, Mar 10 2021 1:30 PM

Turmeric Prices Rises In AP - Sakshi

సాక్షి, అమరావతి: మూడేళ్ల తర్వాత పసుపు ధర పైపైకి ఎగబాకుతోంది. ఇప్పటికే క్వింటాల్‌ రూ.7,900 వరకు పలుకుతున్న పసుపు మరో నెలలో రూ.10 వేల మార్క్‌ను అందుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో రైతులు సంతోషిస్తున్నారు. పసుపు సాగులోనే కాదు.. ఉత్పత్తిలో కూడా ప్రపంచంలో 70–75 శాతం మనదేశంలోనే జరుగుతుంది. పసుపు మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో ఎక్కువగా సాగవుతుంది. మన రాష్ట్రంలో 30,518 హెక్టార్లలో సాలెం, దుగ్గిరాల, మైదుకూరు రకాల పసుపు సాగవుతుండగా దుగ్గిరాల, నంద్యాల, కడప మార్కెట్ల ద్వారా అమ్మకాలు జరుగుతాయి. ఖరీఫ్‌లో ఏటా జూన్‌–జూలైలో పంట వేస్తారు. మరుసటి ఏడాది మార్చి నాలుగో వారం నుంచి పంట మార్కెట్‌లోకి వస్తుంది. రాష్ట్రంలో పండే పసుపులో 50 శాతం రాష్ట్ర పరిధిలోను, 20 శాతం పొరుగు రాష్ట్రాల్లోను వినియోగమవుతుండగా, 30 శాతం వరకు ముంబై, కోల్‌కతాల మీదుగా బంగ్లాదేశ్, సౌదీ, దుబాయ్‌ వంటి దేశాలకు ఎగుమతవుతుంది. ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు కూడా మన మార్కెట్లకు వచ్చి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుంటారు.

గతేడాది మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు
కేంద్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు తొలిసారిగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వమే ఎమ్మెస్పీ ప్రకటించింది. దానికంటే మార్కెట్‌లో ధర తక్కువగా ఉండడంతో మార్కెట్‌లో జోక్యం చేసుకుని కొనుగోలు పథకం (మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌) ద్వారా పెద్ద ఎత్తున సేకరించి పసుపు రైతుకు అండగా నిలిచింది. 2019–20లో 26,878 మంది రైతుల నుంచి క్వింటాల్‌ కనీస మద్దతు ధర రూ.6,850 చొప్పున రూ.342.75 కోట్ల విలువైన 50,035 మెట్రిక్‌ టన్నుల పసుపును మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసింది. ఇలా సేకరించిన పసుపులో ఇప్పటివరకు 17,678 మెట్రిక్‌ టన్నులను క్వింటాల్‌ రూ.4,500 నుంచి రూ.4,991 చొప్పున వేలంలో విక్రయించింది. మరో 32,357 మెట్రిక్‌ టన్నుల పసుపును వేలం వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రేటు భారీగా పెరగడంతో ఆ మేరకు మార్క్‌ఫెడ్‌కు అదనపు ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నెలరోజుల్లో రూ.3 వేలు పెరుగుదల
2019–20 సీజన్‌లో 3.8 లక్షల టన్నుల దిగుబడి రాగా, గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన వర్షాల ప్రభావం వల్ల 2020–21లో 3,66,218 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వచ్చింది. మూడేళ్లుగా మార్కెట్‌లో క్వింటాల్‌ రూ.4,500 నుంచి రూ.5 వేల మధ్యలో ఉన్న ధర ఈ ఏడాది ఊహించని రీతిలో పెరుగుతోంది. మన రాష్ట్రంలో ఇప్పటికే రూ.7,,500 నుంచి రూ.7,900 వరకు పలుకుతోంది. పంట పూర్తిగా మార్కెట్‌ కొచ్చే సమయానికి ఈ ధర రూ.10 వేల మార్క్‌ను దాటే అవకాశాలు లేకపోలేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో వినియోగం పెరగడంతో మార్కెట్‌లో పసుపునకు డిమాండ్‌ ఏర్పడింది.

రేటు పెరుగుతోంది
మూడేళ్ల తర్వాత పసుపునకు మంచిరేటొస్తోంది. ఇప్పటికే క్వింటాల్‌ రూ.7,900 దాటింది. ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఫ్యూచర్‌ ట్రేడింగ్స్‌ కంపెనీ వాళ్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ధర పెరుగుదల రైతులకే కాదు.. వ్యాపారులకు కూడా మంచిది.
– శ్రీనివాస్, పసుపు వ్యాపారి, దుగ్గిరాల

ధర మరింత పెరిగే అవకాశం
గడిచిన మూడేళ్లుగా మార్కెట్‌లో ధర లేదు. అందుకే మార్క్‌ఫెడ్‌ మార్కెట్‌లో జోక్యం చేసుకుని కొనుగోలు చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌ ఎమ్మెస్పీ రూ.6,850గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువగా ఏ ఒక్కరూ అమ్ముకోవద్దు. ధర మరింత పెరిగే అవకాశం ఉంది.
– పీఎస్‌ ప్రద్యుమ్న, ఎండీ, మార్క్‌ఫెడ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement