కోరుట్ల: ఈ ఏడాది మే నెల 3వ తేదీ.. నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో పసుపు పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్న మనోవ్యథతో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండికి చెందిన రైతు దాసరి చిన్న గంగారాం పసుపు కుప్ప వద్దే ప్రాణాలు విడిచాడు. పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం దక్కడంలేదని పసుపునకు గిట్టుబాటు ధర ఇప్పించాలని అపుడు రైతులు ఆందోళన చేసినా ఫలితం దక్కలేదు. పసుపు సాగుకు చేసిన అప్పుల బాధ భరించలేని రైతులు చాలామంది అయిన కాడికి అమ్ముకున్నారు. ఐదునెలల కాలం గడిచింది. పసుపు ధర రెట్టింపు అయింది. కానీ, ఫలితం మాత్రం దళారులకు దక్కింది.
నిల్వ చేసుకోలేక.. : ఉత్తర తెలంగాణలోని జగిత్యాల జిల్లా జగిత్యాల, మెట్‌పల్లి డివిజన్లలో సుమారు 12 వేల హెక్టార్లు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌లో 9 వేల హెక్టార్లు, నిజామాబాద్ డివిజన్ పరిధిలో 11 వేల హెక్టార్లు, నిర్మల్ జిల్లాల్లో 4 వేల హెక్టార్లలో రైతులు పసుపు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏటా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పసుపు పంట చేతికి వస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు పసుపును రైతులు మార్కెట్‌కు తరలిస్తారు. ఎక్కువ ధర వస్తుందన్న ఆశతో జగిత్యాల, నిర్మల్ ప్రాంతాల్లో పసుపు సాగుచేసిన రైతులతోపాటు నిజామాబాద్ జిల్లా రైతులు నిజామాబాద్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో పసుపు అమ్మకానికి తరలిస్తారు. ఈ ఏడాది మార్చిలో క్వింటాల్ పసుపు ధర రూ.5,500 వరకు పలికి కాస్త మెరుగ్గానే ఉంది.
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పసుపు ధర రూ.3,500కు పడిపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆందోళన చెందారు. పండించిన పసుపు పాడైపోకుండా కాపాడుకోలేక.. నిల్వ చేయడానికి వసతులు లేక.. ధర వచ్చిన కాడికి దళారులకు అమ్ముకున్నారు. ఫలితంగా ఆశించిన ధర రైతులకు దక్కకుండా పోయింది. దళారులు మాత్రం తాము పండించిన పసుపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేసుకుని అదను చూసి అమ్ముకుంటున్నారు.
ధర పైపైకి..: ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు క్షీణించిన పసుపు ధర ఆ తరువాత కాలంలో మెరుగుపడింది. జూలైలో మళ్లీ క్వింటాల్‌కు రూ.5 వేల పైన పలికింది. జూలై చివరలో నిజామాబాద్ మార్కెట్‌లో క్వింటాలు పసుపు ధర రూ. 6వేలకు చేరింది. రెండు నెలల వ్యవధిలోనే రైతులు అమ్మిన ధరకు రెట్టింపుకు చేరింది. ప్రస్తుతం మార్కెట్ లో పసుపు అందుబాటులో లేని సమయం కావడంతో నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు క్వింటాల్ ధర రూ.7,500 నుంచి రూ.8 వేలు పలుకుతోంది.
లాభం.. దళారులకే..: రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో పసుపును నిల్వ చేసుకున్న దళారులు ప్రస్తుతం మంచి ధర రావడంతో నిజామాబాద్ మార్కెట్‌కు పసుపును తరలించి అమ్ముతున్నారు. కేవలం రెండునెలల వ్యవధిలో పంట సాగుచేసిన రైతుకు వచ్చిన ధరకు రెట్టింపు లాభం దళారులకు దక్కుతోంది.
రైతులకు కన్నీరు.. దళారులకు పన్నీరు!
Published Mon, Oct 23 2017 1:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment