ఈ ఏడాది కనీస మద్దతు ధర క్వింటా రూ.6,850
ఎమ్మెస్పీ కంటే రెట్టింపు
ప్రస్తుతం మార్కెట్‌లో గరిష్ట ధర క్వింటా రూ.13,712
గత జూన్, జూలైల్లో రూ.5,300 నుంచి రూ.6,250 పలికిన ధర
5,020 టన్నులు కొని రైతులకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం
ఇప్పుడు వ్యాపారుల మధ్య పోటీ.. అంతర్జాతీయంగా పెరిగిన డిమాండ్
ఫలితంగా మార్కెట్‌లో రెట్టింపైన ధర
ఈసారి రూ.15 వేలు దాటే అవకాశం ఉందని అంచనా
సాక్షి, అమరావతి: ప్రభుత్వ చర్యలు ఫలించాయి. పసుపు ధర అమాంతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో రికార్డుస్థాయి ధర లభిస్తుండడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. క్వింటా పసుపు గరిష్టంగా కడప మార్కెట్ యార్డులో రూ.13,712 పలకగా, దుగ్గిరాల పసుపు యార్డులో రూ.13,600 పలికింది. ఈ స్థాయి ధర చరిత్రలో ఎన్నడూ లభించలేదని రైతులు చెబుతున్నారు. క్వింటా రూ.15 వేలు దాటే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
నెల తిరక్కుండానే పెరిగిన ధర
రాష్ట్రంలో 2022–23 సీజన్‌లో 83,540 ఎకరాల్లో పసుపు సాగవగా.. 3.68 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 2023–24 సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల ప్రభావం వల్ల 78 వేల ఎకరాల్లో సాగైంది. హెక్టార్‌కు సగటున 11 టన్నుల దిగుబడి వచ్చింది. కేంద్రం మద్దతు ధరలు ప్రకటించే పంటల జాబితాలో లేని పసుపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6,850 మద్దతు ధర ప్రకటించింది. మరోవైపు ధర తగ్గినప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకుని రైతులకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది.
గతేడాది జూన్, జూలైల్లో క్వింటా రూ.5,300 నుంచి రూ.6,250 మధ్య పలకడంతో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని రూ.36 కోట్లు వెచ్చించి 5,020 టన్నుల పసుపును మద్దతుధరకు సేకరించింది. ఫలితంగా ఆగస్టు, సెప్టెంబర్‌లలో క్వింటా రూ.8 వేల నుంచి రూ.11,750 పలికింది. ఆ తర్వాత ఏ దశలోను మార్కెట్‌లో ధర తగ్గలేదు.
ప్రస్తుతం ఎమ్మెస్పీ కంటే రెట్టింపు ధర పలుకుతుండడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కడప మార్కెట్‌లో కనిష్టంగా రూ.11,555, గరిష్టంగా రూ.13,712 పలికింది. దుగ్గిరాల మార్కెట్ యార్డులో కనిష్టంగా రూ.12,300, గరిష్టంగా రూ.13,600 పలికింది.
బాబు హయాంలో క్వింటా రూ.6,358 మించని ధర
టీడీపీ హయాంలో అసలు మద్దతు ధర ప్రస్తావనే లేదు. మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే «ధర.. చెల్లించిందే సొమ్ము అన్నట్టుగా ఉండేది. ఆ ఐదేళ్లలో సగటున క్వింటాకు రూ.6,358 మించి ధర లభించిన పరిస్థితి లేదు. ఆ ఐదేళ్లలో గరిష్ట ధరలు 2014–15లో రూ.5,335, 2015–16లో రూ.7 వేలు, 2016–17లో రూ.5,755, 2017–18లో రూ.7,200, 2018–19లో రూ.6,500 ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఐదేళ్లలో ఒకటి రెండు సీజన్లలో అదీ ఒకటిరెండు నెలలు మాత్రమే అంతర్జాతీయ పరిస్థితులకు తోడు దేశీయంగా పసుపు పంట ఒకేసారి మార్కెట్‌కు రావడంతో ధరలో కాస్త తగ్గుదల కనిపించింది. మిగిలిన అన్ని సీజన్లలో ప్రభుత్వ చర్యల ఫలితంగా ఎమ్మెస్పీకి మించే ధరలు పలికాయి.
రెండేళ్ల పాటు గరిష్టంగా క్వింటా రూ.10 వేలకు పైనే పలికింది. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.305 కోట్ల విలువైన 48,540 టన్నుల పసుపును సేకరిస్తే, ఈ ప్రభుత్వం 2019–20 నుంచి ఇప్పటివరకు రూ.449 కోట్ల విలువైన 57,973 టన్నుల పసుపును సేకరించింది.
ప్రభుత్వ జోక్యం వల్లే..
ఐదేళ్లుగా కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంట ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా మద్దతు ధరలను ప్రకటిస్తోంది. మార్కెట్‌లో ధరలు తగ్గిన ప్రతిసారి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రభుత్వం ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తోంది. ప్రతి రైతుకు ప్రతి పంటకు మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుతం పసుపు క్వింటా ధర గరిష్టంగా రూ.14 వేలకు చేరుకోగా, మిగిలిన పంట ఉత్పత్తులకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్‌లో రికార్డుస్థాయి ధరలు లభిస్తున్నాయి. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖమంత్రి
ఈ రైతు పేరు ఆవుల వెంకటచినసుబ్బయ్య. వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండలం బుచ్చంపల్లి గ్రామానికి చెందిన ఈయనకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పసుపుతో పాటు ఇతర పంటలు సాగు చేస్తుంటారు. ఇటీవలే 70 క్వింటాళ్ల పసుపును మార్కెట్ యార్డులో విక్రయించారు.
క్వింటా గరిష్టంగా రూ.12,700కు పైగా అమ్ముడుపోయింది. ప్రస్తుతం క్వింటా నాణ్యతను బట్టి రూ.14 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిధర ఎప్పుడూ చూడలేదని వెంకటచినసుబ్బయ్య సాక్షి వద్ద తన ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జోక్యం వల్ల ఒక్క పసుపే కాదు.. దాదాపు ఇతర పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో రికార్డు స్థాయిలోనే ధరలు పలుకుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment