వ్యవసాయాన్ని నీరుగారుస్తున్నారు
– అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశంలో వ్యవసాయాన్ని పాలకులు నీరుగార్చుతున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బు«ధవారం అఖిల భారత కిసాన్ సభ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో రైతుల్ని చైతన్య పరిచేందుకు రైతు పోరాటయాత్ర ప్రారంభించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతాంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే మన దేశంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతాంగం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. తమిళనాడులోని విదురా నుంచి ప్రారంభమైన యాత్ర ఢిల్లీ వరకు సాగుతుందన్నారు.
ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అ«ధికారంలోకి వచ్చాక గతంకంటే 26 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులకు అందించాల్సిన ఎక్స్‌గ్రేషియా సైతం అందించడం లేదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా ప్రతి ఏడాది 400 మండలాల్లో సాగునీటి సౌకర్యం లేక కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ ప్రాజెకు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్భాటంగా ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు.
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తనాలను మనమే తయారు చేసుకునే శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా వాటిని తయారు చేసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది కరువు మండలాల ప్రకటనతోనే సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం కరువు సహయక చర్యలు చేపట్టడం లో విఫలమైందన్నారు. వేరుశెనగ పంటకు రూ.20 వేల నష్టపరిహరాన్ని అందించాలన్నారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎలాంటి సహాయ, సహకారాలను అందించలేదన్నారు. అనంతరం రైతులతో అర్జీలను స్వీకరించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్దన్న నగేశ్, కదిరప్ప, రామాంజినేయులు తదితరులు పాల్గోన్నారు.