viju krishnan
-
భవిష్యత్ ఉద్యమాలకు దిక్సూచి
‘జమీన్ హంచా హక్ ఆచీ.. నహీ కునాచా బాపాచి (ఈ భూమి మా హక్కు.. ఎవడబ్బ సొత్తు కాదు)’, ‘బీజేపీ, మోదీ.. కిసాన్ విరోధి’.. అంటూ ఏడు రోజులపాటు మహారాష్ట్ర మారుమోగిపోయింది. అలుపెరగకుండా దాదాపు 50 వేల మంది రైతులు.. అందులో 50 శాతం మహిళా రైతులు 180 కిలోమీటర్లు నడిచి రైతు వాణిని ఎలుగెత్తి చాటారు. నాసిక్ నుంచి ముంబై వరకు సాగిన ఈ ‘కిసాన్ లాంగ్ మార్చ్’యావత్ దేశాన్నే కాదు ప్రపంచ మీడియానూ ఆకర్షించింది. భవిష్యత్ ప్రజా పోరాటాలకు దిక్సూచిగా నిలిచింది. వేలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి రైతు పాదయాత్రను విజయవంతం చేయడంలో ఓ కేరళ యువకుడు కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లా అల్లుడైన ఈ మలయాళీ యువ కెరటం పేరు విజూ కృష్ణన్. రైతుల సమస్యల అంశంపై జేఎన్‌యూ నుంచి డాక్టరేట్ పొందిన విజూ.. ఆలిండియా కిసాన్ సభ జాయింట్ సెక్రెటరీగా ఉన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కిసాన్ లాంగ్ మార్చ్’పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. చేయి చేయి కలిపి.. మార్చి 6న నాసిక్‌లోని సీబీఎస్ చౌక్ నుంచి పాదయాత్ర మొదలైంది. ప్రారంభంలో 25 వేల మంది వరకు పాల్గొన్నారు. ముంబై చేరే సరికి ఆ సంఖ్య 50 వేలు దాటింది. 65–70 ఏళ్ల మహిళలు కూడా నడిచారు. ‘వద్దమ్మా.. వాహనాల్లో రండి’అని చెప్పినా వినకుండా నడిచారు. ‘మా అప్పు తీరిపోతే నా భర్త ఆత్మహత్య చేసుకోడు. నా కొడుకు ఆత్మహత్య చేసుకోడు. రోజూ పడే కష్టం కన్నా ఈ ఏడు రోజుల కష్టం పెద్దదేమీ కాదు’అని వాళ్లు చెప్పినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు రాలాయి. మార్గమధ్యలో ప్రతి గ్రామం నుంచి రైతులు ఉద్యమంలో తోడు కలిశారు. రోజూ ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభమయ్యేది. రెండు గంటలపాటు నడిచిన తర్వాత ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక ప్రారంభించే వాళ్లం. మధ్యాహ్నం వరకు నడిచి భోజనం చేసే వాళ్లం. తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి 7 గంటల వరకు నడిచే వాళ్లం. ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ వండుకుని తినే వాళ్లం. ప్రతి గ్రామంలో మాకు బియ్యం, పప్పు ఇచ్చేవాళ్లు. వంట సామాన్లు ఇచ్చేవారు. దుప్పట్లు లేవు.. ఫ్యాన్లు లేవు. చెట్ల కింద, రోడ్డు పక్కన పేపర్లు వేసుకుని పడుకునే వాళ్లం. ఎన్నో కష్టాలు. అయినా ఆ ఏడు రోజుల్లో ఎక్కడా ఉత్సాహం తగ్గలేదు. చివరి రోజు మూడు గంటలు అదనంగా నడిచాం. ఎందుకంటే తెల్లారితే అక్కడ పదో తరగతి పరీక్షలు. విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆ మూడు గంటలు నడిచి గమ్యానికి చేరుకున్నాం. ముంబై ఆజాద్ మైదానం వరకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు. రక్తమోడిన మహిళల పాదాలు.. తొలి రెండు రోజుల ఉద్యమం మీడియా దృష్టిని ఆకర్షించలేదు. స్థానిక పత్రికలు, మీడియా కొంత కవర్ చేసినా దేశం దృష్టికి వెళ్లలేదు. మూడో రోజు ఓ కొండపై మహిళలు నడుస్తున్న 40 సెకండ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లోకి పంపాం. అంతే.. అది వైరల్ అయింది. దీనికి తోడు ముంబైకి చెందిన స్థానిక జర్నలిస్టు అల్కాదుప్కర్.. వాచిపోయి రక్తమోడుతున్న మహిళల పాదాలను ఫోటోలు తీసి ప్రచురించారు. దీంతో విషయం జాతీయ మీడియా వరకు వెళ్లింది. మహారాష్ట్ర పీఠం కదిలొచ్చింది. రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చి ఆరునెలల గడువు అడిగింది. 25 వేల ఆకలి చావులు మహారాష్ట్రలో రైతులు, ఆదివాసీల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఐదేళ్లలో 25 వేల మంది చిన్నారుల ఆకలి చావులే ఇందుకు నిదర్శనం. ఇది భరతజాతి సిగ్గుపడాల్సిన అంశం. కేరళ రాష్ట్రంలో ఒక్క గిరిజన బిడ్డ ఇలా చనిపోయినా అసెంబ్లీని నడవనివ్వరు. ఇక్కడ ఇదేం పరిస్థితి అనిపించింది. 2015–16లో 4,271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, భూమి హక్కులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. బుల్లెట్ ట్రైన్, ఎక్స్‌ప్రెస్ వే అంటూ రైతుల భూములను లాక్కుంటున్నారు. ఇవే లాంగ్‌మార్చ్‌కు దారితీశాయి. ఎన్నో కన్నీటి గాథలు కిసాన్ లాంగ్ మార్చ్.. సాధారణ పోరాటం కాదు. దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం, రైతాంగంలోని నిçస్పృహ, ఆకలి చావులు, భూ సమస్య, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, రైతు రుణమాఫీ, ఆదివాసీ హక్కుల ఉల్లంఘన.. ఇవన్నీ కలగలిపి కదం తొక్కిన ఉద్యమ స్ఫూర్తి అది. ఈ స్ఫూర్తి వెనుక ఎన్నో కన్నీటి గాథలున్నాయి. కిసాన్ మార్చ్ సమష్టి ఉద్యమ కాంక్ష. పాలకపక్షాలపై రైతన్న కన్నెర్రకు నిలువెత్తు నిదర్శనం. రైతు సమస్యల పరిష్కారానికి ఆరునెలల సమయం అడిగిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఉద్యమానికి డబ్బులెవరు సమకూర్చారనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరా తీస్తోంది. ఎన్ని జెండాలున్నాయి, ఒక్కో జెండాకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని టోపీలకు ఎంత ఖర్చయింది.. అని లెక్కలు కడుతోంది. కిసాన్ మార్చ్ ఒక లెక్క కాదు!! భవిష్యత్ ప్రజా ఉద్యమాలకు గీటురాయి.. మార్గదర్శి.. దిక్సూచి’ - (మేకల కల్యాణ్ చక్రవర్తి ) -
వ్యవసాయాన్ని నీరుగారుస్తున్నారు
– అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశంలో వ్యవసాయాన్ని పాలకులు నీరుగార్చుతున్నారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజుకృష్ణన్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బు«ధవారం అఖిల భారత కిసాన్ సభ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జాతీయ స్థాయిలో రైతుల్ని చైతన్య పరిచేందుకు రైతు పోరాటయాత్ర ప్రారంభించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా రైతాంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుంటే మన దేశంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా రైతాంగం అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. తమిళనాడులోని విదురా నుంచి ప్రారంభమైన యాత్ర ఢిల్లీ వరకు సాగుతుందన్నారు. ఈ నెల 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ అ«ధికారంలోకి వచ్చాక గతంకంటే 26 శాతం రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులకు అందించాల్సిన ఎక్స్‌గ్రేషియా సైతం అందించడం లేదన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 2.10 కోట్ల ఎకరాల సాగుభూమి ఉండగా ప్రతి ఏడాది 400 మండలాల్లో సాగునీటి సౌకర్యం లేక కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. రాయలసీమ ప్రాంతంలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ ప్రాజెకు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్భాటంగా ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని గత కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు అటకెక్కించాయన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగబోయిన రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో విత్తనాలను మనమే తయారు చేసుకునే శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా వాటిని తయారు చేసుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఏడాది కరువు మండలాల ప్రకటనతోనే సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం కరువు సహయక చర్యలు చేపట్టడం లో విఫలమైందన్నారు. వేరుశెనగ పంటకు రూ.20 వేల నష్టపరిహరాన్ని అందించాలన్నారు. జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు ఎలాంటి సహాయ, సహకారాలను అందించలేదన్నారు. అనంతరం రైతులతో అర్జీలను స్వీకరించారు. నగరంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పెద్దన్న నగేశ్, కదిరప్ప, రామాంజినేయులు తదితరులు పాల్గోన్నారు. -
‘రైతులను దగా చేస్తున్న ప్రభుత్వాలు’
చిలమత్తూరు : రుణమాఫీ తదితర ప్రలోభాలతో రైతులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు విజుకృష్ణన్, మల్లారెడ్డి విమర్శించారు. మంగళవారం సాయంత్రం కొడికొండ చెక్‌పోస్టులో అఖిల భారత కిసాన్ సభ జాతా చేరుకుంది. నాయకులు మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు సమాధానాలు ఇస్తూ రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చంద్రశేఖర్‌రెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్, వినోద్, లక్ష్మీనారాయణ, వినోద్, వెంకట్రామిరెడ్డి, రామచంద్ర, నరసింహులు, నారాయణస్వామి, రాజప్ప, వెంకటేష్ తదితరులు పొల్గాన్నారు. -
ఆత్మహత్యలు మాని పోరుకు రండి
భీమవరం : రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు మాని పోరుబాట పట్టాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రథమ మహాసభలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ జరిపి బహిరంగ సభ నిర్వహించారు. సభలో విజు కృష్ణన్ మాట్లాడుతూ రెండు దశాబ్దాల్లో దేశంలో 3.20 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పాలకులు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచిరోజులు వస్తాయని నమ్మబలికి అధికారం సాధించిన మోదీ పాలనలో రైతుల ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు వరాల జల్లులు కురిపించిన బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక రైతులు ప్రేమ వ్యవహారాలు, వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనడం దుర్మార్గమన్నారు. పంటలకు గిట్టుబాటు ధర దక్కక, ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోయి.. ప్రకృతి వైపరీత్యాలతో కుదేలవుతున్న కౌలు రైతులు, రైతులకు ప్రభుత్వాల నుంచి సాయం అందక అప్పుల ఊబిలో కూరుకుపోయిఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పిన పాలకులు ఇప్పుడు దాని ప్రస్తావనే తేవడం లేదన్నారు. కమిటీ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు 50 శాతం అదనంగా కలిపి రైతులకు ధర ఇవ్వాలని కృష్ణన్ డిమాండ్ చేశారు. ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగబోయిన రంగారావు మాట్లాడుతూ అనేక వాగ్దానాలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ఏరుదాటి తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీ వల్ల సన్న, చిన్నకారు, పేద, కౌలు రైతులకు ఒరిగిందేమి లేదన్నారు. రూ.7,640 కోట్లను ప్రభుత్వం రుణమాఫీ కోసం కేటాయిస్తే.. రైతులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీ రూ.18 వేల కోట్లు ఉందని ఆయన చెప్పారు. దీనిని బట్టి రైతులకు రుణమాఫీ ఎంతవరకు ఉపయోగపడిందో అర్థమవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, సుబ్బారావు మాట్లాడుతూ రాజధాని భూసేకరణ పేరుతో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా వేలాది ఎకరాల భూముల్ని లాక్కుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. సభలో ఏపీ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.జమలయ్య, ఏఐకేఎస్ జాతీయ నాయకులు హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు.