‘జమీన్ హంచా హక్ ఆచీ.. నహీ కునాచా బాపాచి (ఈ భూమి మా హక్కు.. ఎవడబ్బ సొత్తు కాదు)’, ‘బీజేపీ, మోదీ.. కిసాన్ విరోధి’.. అంటూ ఏడు రోజులపాటు మహారాష్ట్ర మారుమోగిపోయింది. అలుపెరగకుండా దాదాపు 50 వేల మంది రైతులు.. అందులో 50 శాతం మహిళా రైతులు 180 కిలోమీటర్లు నడిచి రైతు వాణిని ఎలుగెత్తి చాటారు. నాసిక్ నుంచి ముంబై వరకు సాగిన ఈ ‘కిసాన్ లాంగ్ మార్చ్’యావత్ దేశాన్నే కాదు ప్రపంచ మీడియానూ ఆకర్షించింది. భవిష్యత్ ప్రజా పోరాటాలకు దిక్సూచిగా నిలిచింది.
వేలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి రైతు పాదయాత్రను విజయవంతం చేయడంలో ఓ కేరళ యువకుడు కీలకపాత్ర పోషించారు. ఖమ్మం జిల్లా అల్లుడైన ఈ మలయాళీ యువ కెరటం పేరు విజూ కృష్ణన్. రైతుల సమస్యల అంశంపై జేఎన్‌యూ నుంచి డాక్టరేట్ పొందిన విజూ.. ఆలిండియా కిసాన్ సభ జాయింట్ సెక్రెటరీగా ఉన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న సీపీఎం 22వ జాతీయ మహాసభల ప్రతినిధిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘కిసాన్ లాంగ్ మార్చ్’పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే..
చేయి చేయి కలిపి..
మార్చి 6న నాసిక్‌లోని సీబీఎస్ చౌక్ నుంచి పాదయాత్ర మొదలైంది. ప్రారంభంలో 25 వేల మంది వరకు పాల్గొన్నారు. ముంబై చేరే సరికి ఆ సంఖ్య 50 వేలు దాటింది. 65–70 ఏళ్ల మహిళలు కూడా నడిచారు. ‘వద్దమ్మా.. వాహనాల్లో రండి’అని చెప్పినా వినకుండా నడిచారు. ‘మా అప్పు తీరిపోతే నా భర్త ఆత్మహత్య చేసుకోడు. నా కొడుకు ఆత్మహత్య చేసుకోడు. రోజూ పడే కష్టం కన్నా ఈ ఏడు రోజుల కష్టం పెద్దదేమీ కాదు’అని వాళ్లు చెప్పినప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు రాలాయి.
మార్గమధ్యలో ప్రతి గ్రామం నుంచి రైతులు ఉద్యమంలో తోడు కలిశారు. రోజూ ఉదయం 7 గంటలకు పాదయాత్ర ప్రారంభమయ్యేది. రెండు గంటలపాటు నడిచిన తర్వాత ఓ అరగంట విశ్రాంతి తీసుకుని మళ్లీ నడక ప్రారంభించే వాళ్లం. మధ్యాహ్నం వరకు నడిచి భోజనం చేసే వాళ్లం. తర్వాత మధ్యాహ్నం 3:30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి 7 గంటల వరకు నడిచే వాళ్లం. ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ వండుకుని తినే వాళ్లం.
ప్రతి గ్రామంలో మాకు బియ్యం, పప్పు ఇచ్చేవాళ్లు. వంట సామాన్లు ఇచ్చేవారు. దుప్పట్లు లేవు.. ఫ్యాన్లు లేవు. చెట్ల కింద, రోడ్డు పక్కన పేపర్లు వేసుకుని పడుకునే వాళ్లం. ఎన్నో కష్టాలు. అయినా ఆ ఏడు రోజుల్లో ఎక్కడా ఉత్సాహం తగ్గలేదు. చివరి రోజు మూడు గంటలు అదనంగా నడిచాం. ఎందుకంటే తెల్లారితే అక్కడ పదో తరగతి పరీక్షలు. విద్యార్థులు ఇబ్బంది పడతారని ఆ మూడు గంటలు నడిచి గమ్యానికి చేరుకున్నాం. ముంబై ఆజాద్ మైదానం వరకు వెళ్లగానే పోలీసులు అడ్డుకున్నారు.
రక్తమోడిన మహిళల పాదాలు..
తొలి రెండు రోజుల ఉద్యమం మీడియా దృష్టిని ఆకర్షించలేదు. స్థానిక పత్రికలు, మీడియా కొంత కవర్ చేసినా దేశం దృష్టికి వెళ్లలేదు. మూడో రోజు ఓ కొండపై మహిళలు నడుస్తున్న 40 సెకండ్ల వీడియో సామాజిక మాధ్యమాల్లోకి పంపాం.
అంతే.. అది వైరల్ అయింది. దీనికి తోడు ముంబైకి చెందిన స్థానిక జర్నలిస్టు అల్కాదుప్కర్.. వాచిపోయి రక్తమోడుతున్న మహిళల పాదాలను ఫోటోలు తీసి ప్రచురించారు. దీంతో విషయం జాతీయ మీడియా వరకు వెళ్లింది. మహారాష్ట్ర పీఠం కదిలొచ్చింది. రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి లిఖిత పూర్వక హామీ ఇచ్చి ఆరునెలల గడువు అడిగింది.
25 వేల ఆకలి చావులు
మహారాష్ట్రలో రైతులు, ఆదివాసీల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఐదేళ్లలో 25 వేల మంది చిన్నారుల ఆకలి చావులే ఇందుకు నిదర్శనం. ఇది భరతజాతి సిగ్గుపడాల్సిన అంశం. కేరళ రాష్ట్రంలో ఒక్క గిరిజన బిడ్డ ఇలా చనిపోయినా అసెంబ్లీని నడవనివ్వరు. ఇక్కడ ఇదేం పరిస్థితి అనిపించింది. 2015–16లో 4,271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, భూమి హక్కులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. బుల్లెట్ ట్రైన్, ఎక్స్‌ప్రెస్ వే అంటూ రైతుల భూములను లాక్కుంటున్నారు. ఇవే లాంగ్‌మార్చ్‌కు దారితీశాయి.
ఎన్నో కన్నీటి గాథలు
కిసాన్ లాంగ్ మార్చ్.. సాధారణ పోరాటం కాదు. దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం, రైతాంగంలోని నిçస్పృహ, ఆకలి చావులు, భూ సమస్య, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, రైతు రుణమాఫీ, ఆదివాసీ హక్కుల ఉల్లంఘన.. ఇవన్నీ కలగలిపి కదం తొక్కిన ఉద్యమ స్ఫూర్తి అది. ఈ స్ఫూర్తి వెనుక ఎన్నో కన్నీటి గాథలున్నాయి. కిసాన్ మార్చ్ సమష్టి ఉద్యమ కాంక్ష. పాలకపక్షాలపై రైతన్న కన్నెర్రకు నిలువెత్తు నిదర్శనం.
రైతు సమస్యల పరిష్కారానికి ఆరునెలల సమయం అడిగిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఉద్యమానికి డబ్బులెవరు సమకూర్చారనే దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆరా తీస్తోంది. ఎన్ని జెండాలున్నాయి, ఒక్కో జెండాకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని టోపీలకు ఎంత ఖర్చయింది.. అని లెక్కలు కడుతోంది. కిసాన్ మార్చ్ ఒక లెక్క కాదు!! భవిష్యత్ ప్రజా ఉద్యమాలకు గీటురాయి.. మార్గదర్శి.. దిక్సూచి’
- (మేకల కల్యాణ్ చక్రవర్తి )
Comments
Please login to add a commentAdd a comment