20 ఏళ్లలో 3 లక్షల మంది రైతుల ఆత్మహత్య
♦ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవేదన
♦ వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయింది
♦ వ్యవసాయాభివృద్ధికి ‘గ్రో ఇన్ ఇండియా’ కోసం పిలుపు
సాక్షి, హైదరాబాద్: దేశంలో 1995 నుంచి ఇప్పటివరకు 3 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఉప రాష్ట్రపతి ఎం.హమీద్ అన్సారీ చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతు ఆత్మహత్యలే అందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అఖిల భారత కిసాన్ సభ మహాసభల్లో భాగంగా ‘వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయార్థిక వ్యవస్థ పురోభివృద్ధిలో ప్రభుత్వరంగ పెట్టుబడులు, రాయితీలు’ అనే అంశంపై శనివారం నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల వ్యవసాయ రంగం మెరుగుకు కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో కులపరమైన రిజర్వేషన్ల కోసం ఉద్యమాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆహారధాన్యాల ఉత్పత్తుల్లో చిన్నసన్నకారు రైతుల పాత్ర అధికమని, అయితే వారు ఆదాయాన్ని సముపార్జించుకోవడంలో ఇంకా వెనుకబడే ఉన్నారన్నారు. దేశంలో 64 శాతం మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి పట్టణాల వైపు వెళ్తుండగా, మిగిలిన వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. 2014-15లో వ్యవసాయాదాయం 1.1 శాతమే పెరిగిందన్నారు. ఎరువుల సబ్సిడీ దుర్వినియోగం అవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయ పరిశోధన, అభివృద్ధి, నీటిపారుదల కోసం వ్యవసాయరంగానికి పెద్దఎత్తున నిధులు కేటాయించాల్సిన అవసరముందని, నీటిపారుదల రంగానికే రూ. 3 లక్షల కోట్లు కేటాయించాల్సిన అవసరముందని చెప్పారు. కానీ జలవనరుల శాఖ మాత్రం 2015-16లో రూ. 4,232 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు.
సాగుకు ముందే గిట్టుబాటు ధర
వ్యవసాయ ధరల విధానం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని అన్సారీ అన్నారు. సాగుకు ముందే గిట్టుబాటు ధర ప్రకటించాలని సూచించారు. నీటిపారుదల, విద్యుత్, ఎరువుల ధరలపైనా హేతుబద్ధ విధానం ఉండాలని, ఆ ప్రకారమే ఇన్‌ఫుట్స్ అందించాలన్నారు. భూముల లీజు వ్యవహారంలో చిన్న సన్నకారు రైతులకు అనుకూలంగా సరళీకరణ పద్ధతులు పాటించాలన్నారు. పేదల కోసం వ్యవసాయ, ఆహార సబ్సిడీలను హేతుబద్ధీకరించాలని, అందుకోసం నేరుగా నగదు బదిలీ పథకమే ఆచరణీయమైన పద్ధతిగా పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు పెద్దఎత్తున సబ్సిడీలు కొనసాగిస్తున్నాయన్నారు. ఆ దేశాలు 2013లో వ్యవసాయ సబ్సిడీల కోసం 258 బిలియన్ డాలర్లు ఖర్చు చేశాయన్నారు. చిన్న సన్నకారు రైతులకు పంట రుణాలు ఎక్కువగా పంపిణీ అయ్యేలా చూడాలన్నారు. అందుకోసం గ్రామీణ బ్యాంకు బ్రాంచీలను బలోపేతం చేయాలని చెప్పారు. దేశంలో 80 కోట్ల మంది గ్రామాల్లో నివసిస్తుండగా, అందులో పావు వంతు మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారన్నారు. మేకిన్ ఇండియా తరహాలో సామాజిక ఆర్థిక నిర్మాణానికి వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు ‘గ్రో ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకురావాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. అందుకోసం రాజకీయ తపన, విస్తృత రాజ కీయ ఏకాభిప్రాయం అవసరమన్నారు. సామాజిక అంతరాలు, విభజనలున్నంత కాలం ఎన్ని నిధులు కేటాయించినా ప్రయోజనం ఉండదన్నారు. కులం, ఇతరత్రా అడ్డంకులను ఎదుర్కోవాలన్నారు. సదస్సులో జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి అతుల్‌కుమార్ అంజాన్, అధ్యక్షులు ప్రమోద్ పాండా, దేవేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.
ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం
సాక్షి, హైదరాబాద్: ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 2 రోజుల పర్యటనలో భాగంగా శని వారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఈటల రాజేందర్, శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, మహేందర్ రెడ్డి, చందూలాల్, లక్ష్మారెడ్డి, ఎంపీలు కేశవరావు, వి.హనుమంత రావు, మల్లారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేం దర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి నగరానికి వచ్చిన సందర్భంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీకి సీఎం కేసీఆర్ రాత్రి విందు ఇచ్చారు.