సామాన్యుడికి మోదం..అవినీతిపరులకు ఖేదం!
Published Sat, Dec 28 2013 12:54 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడినే పార్టీ పేరుగా మార్చుకున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ అనూహ్య విజయంతో ఢిల్లీ గ ద్దెపైకి ఎక్కేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 12 గంటలకు కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమ్‌ఆద్మీపార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై సామాన్యుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుండగా.. అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులు కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే తమకు మేలు జరుగుతుందని ఢిల్లీలోని జుగ్గీ జోపిడీలు, అనధికారిక కాలనీల్లోని లక్షలాదిమంది నిరుపేదలు ఎదురుచూస్తున్నారు. వందల్లోంచి వేలల్లోకి చేరిన విద్యుత్, నీటి బిల్లులు చెల్లించలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న మధ్యతరగతివారు సైతం ఆప్ ఇచ్చిన హామీల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. వ్యవస్థలో మార్పు తెస్తామంటూ ప్రతి పనిలోనూ వినూత్నతను ప్రదర్శించడంతో ఎగువ మధ్య తరగతి, ఉన్నత చదువు ఉన్న వర్గాల వారికి చేరువైన ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఏం చేయబోతుందోనన్న ఆసక్తిని కనబరుస్తోంది.
అందరి దృష్టీ కేజ్రీవాల్‌పైనే:
అవినీతి వ్యతిరేక ఉద్యమంలో గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులను తట్టుకుని స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. విద్యుత్ చార్జీల్లో 50 శాతం వరకు తగ్గుదల, ప్రతి ఇంటికీ 700 లీటర్ల ఉచిత మంచినీరు ప్రధాన హామీలతో ఎన్నికల్లో పోటీచేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు వాటిని ఎలా అమలు చేయబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. సామాన్యుడి గొంతుకనంటూ దేశరాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన కేజ్రీవాల్ వేసే ప్రతి అడుగుపైనా అటు రాజకీయ వర్గాలు, ఇటు మీడియా, సామాన్యులతో సహా దేశవ్యాప్తంగా ప్రజలు దృష్టి సారించారు. తన ప్రమాణ స్వీకారానికి వీఐపీలు ఎవరూ లేరని, ఢిల్లీవాసులంతా ఈ కార్యక్రమానికి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానం పంపారు. తనతో సహా, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సైతం ఢిల్లీ మెట్రోరైలులో రావాలని మరోమారు ఆసక్తి పెంచారాయన. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం అనంతరం చేయబోయే కీలక ఉపన్యాసంలో ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అవినీతిపరుల గుండెల్లో గుబులు:
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో జనంలో గుర్తింపు పొందిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి పదవిలోకి రానుండడంతో అవినీతిపరులైన ప్రభుత్వ ఉద్యోగుల్లో గుబులుకు కారణమవుతోంది.
ఎప్పుడు ఎటునుంచి తమపై దృష్టి పడుతుందోనన్న మీమాంసలో వారున్నారు. ఇటీవల ఢిల్లీలోని స్థానిక చానళ్లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లోనూ వారంతా ‘పరేషాన్’గా కనిపించారు. జల్‌బోర్డు అధికారులతో ఓ టీవీ చానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో కొందరు అధికారులు మాట్లాడుతూ..గత ప్రభుత్వ పెద్దలే తమతో అక్రమాలు చేయించారంటూ షీలాదీక్షిత్ సర్కార్‌పై నిందలు వేశారు. మరికొందరు లెక్కల్లో బొక్కలు బయటపడకుండా ఫైల్స్ చించివేస్తూ కనిపించారు
Advertisement
Advertisement