సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటుకోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరో రోజులపాటు చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను ముగించారు.
అవినీతి వ్యతిరేక పోరాటయోధుడిగా పేరొందిన 80 ఏళ్ల హజారే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో గత ఆరు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహించారు. సీఎం ఫడ్నవిస్ స్వయంగా రాంలీలా మైదానానికి వచ్చి.. ఆయనతో దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వేదికపై సీఎం ఫడ్నవిస్ మాట్లాడుతుండగా.. జనంలోంచి ఓ వ్యక్తి ఆయన లక్ష్యంగా చెప్పు విసిరారు. అది ఫడ్నవిస్‌కు దూరంగా పడింది. లోక్‌పాల్, లోకాయుక్త ఏర్పాటుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు పెంచాలని హజారే డిమాండ్ చేశారు. ఆరు నెలల్లోగా అంటే ఆగస్టులోగా తన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, లేకపోతే సెప్టెంబర్‌లో మళ్లీ ఆందోళనకు ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment