సప్తవర్ణాల భారత్ను ఆవిష్కరిస్తాం: నరేంద్ర మోడీ
జాతీయ కౌన్సిల్ వేదికపై మోడీ హామీ
మాకు 60 నెలలు ఇవ్వండి.. సేవకుడిలా పనిచేస్తా
సాక్షి, న్యూఢిల్లీ: మాటలు తూటాలవుతున్నాయి.. విమర్శలు పదునెక్కుతున్నాయి.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘ప్రధాని’ పోరు తారస్థాయికి చేరుతోంది. నిన్న ఏఐసీసీ సదస్సు వేదికగా కమలంపై హస్తం విరుచుకుపడితే.. నేడు జాతీయ కౌన్సిల్ వేదికగా కాంగ్రెస్‌పై బీజేపీ నిప్పులు చెరిగింది. ఆదివారమిక్కడ రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో నరేంద్రమోడీ గంటకుపైగా ప్రసంగించారు. యూపీఏ పాలన, కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలను కడిగిపారేశారు. సోనియా, రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ‘చాయ్‌వాలా..’ అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ఎగతాళి మాటలనే అస్త్రాలుగా మలచి తనదైన శైలిలో తిప్పికొట్టారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదన్న కాంగ్రెస్ వైఖరిని ఎద్దేవా చేశారు. రాహుల్‌ను రాజకీయ బలిపీఠంపై ఎక్కించేందుకు ఇష్టంలేకే సోనియాగాంధీ ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదన్నారు. 60 ఏళ్లుగా అధికారాన్ని ‘పాలకులకు’ కట్టబెట్టారని, ఇప్పుడు ‘సేవకులకు’ 60నెలలపాటు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రసంగంలో విమర్శలు, చెణుకులతోపాటు తమకు అధికారాన్ని ఇస్తే దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లడానికి అనుసరించబోయే మార్గాలు, లక్ష్యాలను తెలియజేశారు. తొలిసారిగా ప్రసంగంలో ‘బీసీ’ అనే మాటను తీసుకొచ్చారు.
స్వాతంత్య్రం తర్వాత ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు వేరని, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు వేరని చెప్పారు. ‘‘ఇవి అధికార మార్పు కోసం జరిగే ఎన్నికలు కాదు. కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరబోయే ఎన్నికలు’’ అంటూ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచారు. తాము అధికారంలోకి వస్తే సప్త వర్ణాల (దేశ సంస్కృతి, వ్యవసాయం, మహిళా శక్తి, సహజసంపద, యువశక్తి, ప్రజాస్వామ్యం, మేధో సంపత్తి) భారతాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇటీవల జరిగిన ఏఐసీసీ సదస్సును బీజేపీ జాతీయ కౌన్సిల్‌తో పోలుస్తూ.. ‘‘వారి సదస్సులో కాంగ్రెస్‌ను రక్షించే ప్రయత్నాలు చేశారు. కానీ బీజేపీ సమావేశాల్లో దేశాన్ని కాపాడేందుకు మథనం చేస్తున్నాం’’ అని చెప్పారు. ఏఐసీసీ సదస్సులో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారని ఎంతో ఆశతో వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.. మూడు సిలిండర్లు తీసుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. వివిధ అంశాలపై మోడీ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
ముందుగా ప్రధాని అభ్యర్థిని ప్రకటించండం మా సంప్రదాయం కాదు.. ఎన్నికల తర్వాత ఎంపీలంతా కలసి ప్రధానిని ఎన్నుకుంటారన్న కాంగ్రెస్ మాటలపై..
2004లో కాంగ్రెస్ ఎంపీలంతా సోనియాను ప్రధానిగా ఎన్నుకుంటే... ఆమె ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ను నామినేట్ చేశారు. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ సంప్రదాయం? దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పటేల్‌ను ప్రధానమంత్రిని చేయాలని దేశం యావత్ ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. కానీ పటేల్‌ను కాదని నెహ్రూని ప్రధానిగా చేసినప్పుడు ఏమైంది ఈ సంప్రదాయం..?
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు స్పష్టమైన ఆలోచనా విధానాలున్నాయన్న రాహుల్ వ్యాఖ్యలపై..
నిజమే... వారి భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఆలోచనలో పడింది. వారి ఆలోచనకు, మా ఆలోచనకు చాలా తేడాలున్నాయి. వారు అధికారాన్ని కాపాడుకోడానికి ఆలోచిస్తారు. మేం దేశాన్ని ఎలా కాపాడాలని ఆలోచిస్తున్నాం. పేదల గురించి మాట్లాడడాన్ని వారు ఆనందిస్తారు. మాకు వారి బాధల గురించి ఆలోచిస్తే నిద్రపట్టదు.
వాదాలపై..
బీజేపీది జాతీయవాదమైతే, కాంగ్రెస్‌ది వారసత్వవా దం. కాంగ్రెస్ దేశాన్ని విభజించి పాలిస్తుంది. బీజేపీ దేశాన్ని ఐక్యంగా ఉంచి సుపరిపాలన అందిస్తుంది.
మాకు అధికారమిస్తే ఇలా చేస్తాం..
బీజేపీకి అధికారాన్ని ఇస్తే సమాఖ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి కృషి చేస్తాం. రాష్ట్రాలకు పెద్దన్న తరహాలో వ్యవహరించబోం. ప్రధాని, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఒక టీంగా, కేంద్ర కేబినెట్, రాష్ట్ర కేబినెట్ ఒక టీంగా, కేంద్ర, రాష్ట్ర బ్యూరోక్రసీ ఒక బృందంగా కలిసి పనిచేసి దేశాన్ని సమస్యల నుంచి అభివృద్ధి దిశవైపు తీసుకెళ్తాం.
దేశంలో 100 పట్టణాలను ఎంపిక చేసి స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తాం.
ప్రతి రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేస్తాం.
మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కోసం ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి.
బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతాం. నదులను అనుసంధానిస్తాం. వంటగ్యాస్ కొరతను అధిగమించేందుకు గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం.
నిత్యావసర ధరలను కట్టడి చేసేందుకు, ద్రవ్యోల్బణానికి పగ్గాలు వేసేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేస్తాం.
వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు జాతీయ స్థాయిలో ‘రియల్ టైం డాటా బ్యాంక్’ ప్రవేశపెడతాం.
నల్లధనాన్ని వెనక్కితెచ్చేందుకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు. న్యాయపర సమస్యలను అదిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
ఈశాన్య రాష్ట్రాలను దేశాభివృద్ధిలో భాగం చేస్తాం.
ఐదు ‘టి’ల ఫార్ములా... (టాలెంట్) ప్రతిభ, (టూరిజం) పర్యాటకం, (టెక్నాలజీ) సాంకేతిక, (ట్రెడిషన్) సంప్రదాయం, (ట్రేడ్) వాణిజ్యం ద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం.