సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మోదీ, సీఎం కేసీఆర్ బయటకు వేర్వేరుగా ఉన్నట్లు కనిపించినా, అంతర్గతంగా ఇద్దరూ ఒక్కటే అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జునఖర్గే ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీకి బీ–టీమ్ అని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం కేసీఆర్, మోదీ ఎన్నో అబద్ధాలు చెబుతారని, రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తెలివిగా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ నాయకులంతా కృషి చేస్తున్నారని, కార్యకర్తలు సైతం శ్రమటోడ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. తుక్కుగూడలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విజయభేరి బహిరంగ సభలో ఖర్గే మాట్లాడారు. తెలంగాణకు స్వాతంత్య్రం ఇచ్చింది... ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
మేం మాట ఇస్తే చేసి చూపుతాం
కాంగ్రెస్ వాగ్దానం ఇస్తే.. దాన్ని తప్పక నెర వేరుస్తుందని, ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత చట్టం ఇలా ఎన్నింటినో పార్టీ తెచ్చిందని ఖర్గే చెప్పారు. ‘కొందరు ఏమీ చేయకుండానే వాళ్లే దేశానికి స్వాతంత్య్రం తెచ్చినట్టు ఎంతో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కానీ, ఈ దేశంలో పేదలు, ఆదివాసీలు, ఎస్సీలు, పేద రైతుల కోసం కాంగ్రెస్ ఎన్నో పనులు చేసింది. సోనియా వాగ్దానం మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి ఇచ్చారు.
ఓట్ల కోసం ప్రత్యేక తెలంగాణ ఇవ్వలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, బాధను అర్థం చేసుకుని సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ, ఈ రోజు మా కష్టం పదేళ్లు వృథాగా పోయింది. ఈ పదేళ్లలో మేం అనుకున్న రీతిలో ఇక్కడ అభివృద్ధి జరగలేదు’ అని అన్నారు. సోనియాగాంధీ చెప్పింది చేస్తారని, కేసీఆర్ చెప్పింది చేయరని పేర్కొన్నారు.
కేసీఆర్ అప్పులపాలు చేశారు
మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఈ పదేళ్లలో దివాలా తీసే స్థితికి తెచ్చారని ఖర్గే మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీలకు భూమి ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... బడ్జెట్ లేదంటూ చేతులెత్తేశారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఓవైపు మోదీ అమ్ముతూ తన స్నేహితులను ధనవంతులను చేస్తున్నారని దుయ్యబట్టారు.
మరోవైపు కేసీఆర్ తెలంగాణలోని ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి వాటిని విక్రయించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓట్ల కోసం అబద్ధాలతో మోసగించే మోదీ, కేసీఆర్ విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుందన్న విశ్వాసం కలుగుతోందని ఖర్గే చెప్పారు.
రైతు భరోసా ప్రకటించిన ఖర్గే
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.15 వేలు ఆర్థికసాయం ఇస్తామని ఖర్గే ప్రకటించారు. భూమిలేని రైతు కూలీలకు ప్రతి సంవత్సరం రూ.12,000 ఇచ్చి భరోసా ఇస్తామన్నారు. అదేవిధంగా వరికి కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ కూడా ఇస్తామని హామీ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment