సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్‌డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘భారత్ బచావో ర్యాలీ’ని చేపట్టనుంది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీఎస్టీ అమలులో వైఫల్యాలు, ఎన్‌డీయే సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని వార్‌రూమ్‌లో ఏఐసీసీ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ నెల 5 నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలపైనా చర్చించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టని రాష్ట్రాల్లో ఆందోళనలను 25 తేదీలోగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 30న ఢిల్లీలో ‘భారత్ బచావో ర్యాలీ’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్‌చార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‡రెడ్డి, సంపత్‌కుమార్, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 1200 మందిని తరలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment