సిద్దిపేటలో ఉద్రిక్తత
భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పోటాపోటీ కార్యక్రమాల నిర్వహణతో సిద్దిపేటలో మంగళవారం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. మరోవైపు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధనకు సమావేశం నిర్వహించారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొనగా, 500 మంది పోలీసులను మోహరింపజేశారు.
కాంగ్రెస్ భారీ ర్యాలీ
ముందుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హైదరాబాద్ నుంచి కార్ల ర్యాలీతో సిద్దిపేటకు చేరుకున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా పొన్నాల జంక్షన్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ పాత బస్టాండ్ వరకు సాగింది. హరీశ్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. పొన్నాల వై జంక్షన్ నుంచి పాత బస్టాండ్ వరకు పోలీసులు ర్యాలీకి అనుమతినిచ్చారు.
బీఆర్‌ఎస్ సమావేశ నేపథ్యంలో హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయం ఎదుట నుంచి కాకుండా బైపాస్ (సుడా రోడ్) నుంచి ఎన్సాన్‌పల్లి జంక్షన్ మీదుగా విక్టరీ చౌరస్తా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీని పంపించారు. ఎమ్మెల్యే రోహిత్ కారు క్యాంప్ ఆఫీస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా వెంటనే మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు వచ్చి సుడా రోడ్డుకు మళ్లించారు.
ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకోగా స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ రైతు రుణమాఫీ 200 శాతం చేశామని, హరీశ్ రాజీనామా చేయాల్సిందేనన్నారు.
బీఆర్‌ఎస్ సమావేశం
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్ కార్యాలయంలో సంపూర్ణ రైతు రుణమాఫీ సాధన కార్యాచరణ సమా వేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌లు దేవిప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌లతోపాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పంచాయితీ కాదని, రైతులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment