economic downturn
-
ఉద్యోగులకు షాకిస్తున్న కంపెనీలు.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చే ఫిట్నెస్ క్లాసుల్ని రద్దు చేసింది. ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ కాఫీలను సగానికి పైగా తగ్గించింది. ఇలా ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాలతో ఆయా కంపెనీలు కాస్ట్ కటింగ్‌కు పదును పెడుతున్నాయి. ఈ కాస్ట్ కటింగ్ ఒక్క గూగుల్, గోల్డ్ మన్ సాచ్చ్ మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సంస్థలు సైతం ప్రొత్సహాకాల్ని తగ్గించే పనిలో పడ్డాయి. తాజాగా గ్రేప్‌వైన్ అనే స్టార్టప్ సంస్థ ఉద్యోగులకు అందించే సౌకర్యాల్ని సగానికి పైగా తగ్గిస్తూ ట్వీట్ చేసింది. దీంతో సిబ్బంది సంస్థ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Cost cutting measures by companies thread is incredibly funny A few top replies: - Handwash in washrooms diluted with water - Oreos in cafeteria replaced with Parle G - Plastic water bottles were given as year end gift - Employees had to pay Rs 2500 fine for lost Dell Mouse pic.twitter.com/xDARBMC7pI — Grapevine - Corporate Chat India (@anonCorpChatInd) April 14, 2023 మార్కెటింగ్ కంపెనీ మోఎంగేజ్ భోజన సమయంలో వడ్డించే ప్లేట్ల సంఖ్య, బీర్ బాటిళ్లపై పెట్టే ఖర్చును ఆదా చేసేందుకు బెంగళూరులో జరిగే సంస్థ ఈవెంట్‌కు హాజరుకావద్దని తన ఉద్యోగులను కోరుతున్నట్లు ఓ యూజర్ కంపెనీల్లో కాస్ట్ కటింగ్స్‌పై చర్చించారు. దీంతో మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం కాస్ట్ కటింగ్ గురించి తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిలో అమెజాన్ ఇండియాలో పనిచేసే ఓ ఉద్యోగి మాట్లాడుతూ..డబ్బుల్ని పొదుపు చేసేందుకు ఉద్యోగులందరికీ అందించే పర్సనల్ డస్ట్బిన్లను తొలగించి వాటి స్థానంలో అందరూ వినియోగించేందుకు ఒక పెద్ద డస్ట్ బిన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ సంస్థ దీపావళి రోజున ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదంటూ పూణేకి చెందిన ఓ ఫిట్నెస్ స్టార్టప్ లో పనిచేసే ఓ ఉద్యోగి మొరపెట్టుకున్నాడు. స్వీట్ బాక్స్ కాదు కదా.. తమ కంపెనీలు దీపావళి బహుమతులు లేదా బోనస్‌లు ఇవ్వడం మానేశాయంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకేసి తమ సంస్థ దీపావళి లేదా ఇతర పండుగల సెలబ్రేషన్ల కోసం మా వద్ద నుంచే డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. తాను 7.5 ఏళ్ల క్రితం ఆర్గనైజేషన్‌లో చేరినప్పుడు కంపెనీ ఓ మౌస్ ఇచ్చింది. ఆ మౌస్ పోగొట్టానని రూ.2,500 చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. మరో ఉద్యోగి మాట్లాడుతూ తమ సంస్థ హ్యాండ్‌వాష్ కోసం ట్యాప్ వినియోగించవద్దని, మగ్ నీటితో చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. మరో సంస్థ ఓరియో బిస్కెట్ స్థానంలో బ్రిటానియా 50-50 మస్కా చస్కాతో భర్తీ చేసింది అని ఒక ఉద్యోగి చెప్పగా.. మా ఆఫీస్‌లో టిష్యూ పేపర్లు లేవు. చేతి రూమాలు ఉపయోగించుకోవాలని చెప్పినట్లు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. -
వెంటాడిన కరోనా!
కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో స్టాక్ మార్కెట్ నష్టాలు కూడా పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా కేసులు వెయ్యికి పైగా మించడం, మరణాలు 31కు చేరడంతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) పేర్కొనడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,375 పాయింట్లు పతనమై 28,440 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 379 పాయింట్లు నష్టపోయి 8,281 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, వాహన, లోహ, రియల్టీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫిచ్ సొల్యూషన్స్, ఇండియా రేటింగ్స్ సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ అంచనాలను తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం, ముడి చమురు ధరలు 18 ఏళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. రోజంతా నష్టాలే...: ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. సెన్సెక్స్ 580 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్ల నష్టాలతో ఆరంభమయ్యాయి. గంట తర్వాత నష్టాలు తగ్గినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత మళ్లీ పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,525 పాయింట్లు, నిఫ్టీ 416 పాయింట్ల మేర నష్టపోయాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. రూ. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడంతో రూ.3 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3 లక్షల కోట్ల మేర తగ్గి రూ.109.74 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్స్ షేర్లు ఢమాల్... కరోనా వైరస్ కల్లోలంతో బ్యాంక్, ఆర్థిక సంస్థల రుణ వృద్ధి గణనీయంగా పడిపోయే అవకాశాలున్నాయన్న ఆందోళనతో బ్యాంక్, ఆర్థిక సంస్థల షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీల నష్టంలో ఒక్క ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ల నష్టాల వాటాయే దాదాపు 75%. బజాజ్ ఫైనాన్స్ 12 శాతం నష్టంతో రూ.2,242 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆల్‌టైమ్ హైకు అబాట్ ఇండియా అమెరికాకు చెందిన అబాట్ ల్యాబొరేటరీస్ అందుబాటులోకి తెచ్చిన 5 నిమిషాల కరోనా నిర్ధారణ పరీక్షకు ఆమోదం లభించింది. దీంతో అబాట్ ఇండియా 19% లాభంతో రూ.16,869ను వద్ద ఆల్‌టైమ్ హైను తాకింది. చివరకు 9% లాభంతో రూ.15,400 వద్ద ముగిసింది. మరిన్ని విశేషాలు.... ► సెన్సెక్స్ 30 షేర్లలో 6 షేర్లు–టెక్ మహీంద్రా, నెస్లే, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ యూని లివర్, టైటాన్, ఇండస్ఇండ్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 24 షేర్లు నష్టాల్లో ముగిశాయి. ► దాదాపు 400కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, టీమ్‌లీజ్ సర్వీసెస్, లక్ష్మీ మిల్స్, శ్రీరామ్ సిటీ యూనియన్, హావెల్స్ ఇండియా,సన్ టీవీ, ఫ్యూచర్ రిటైల్, టీవీఎస్ మోటార్, వేదాంత, ఐఓసీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 300కు పైగా షేర్లు లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, ఇండియాబుల్స్ వెంచర్స్, ఐడీఎఫ్సీ, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. నష్టాలకు కారణాలు... ఆగని కరోనా కల్లోలం.... దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్నా, కరోనా కేసులు 1,100కు, మరణాలు 31కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 7 లక్షలకు పైగా, మరణాలు 34,000కు పైగా చేరాయి. దేశీయంగా, అంతర్జాతీయంంగా కేసులు మరింత పెరుగుతాయనే ఆందోళన నెలకొన్నది. ఐఎమ్ఎఫ్ మాంద్యం హెచ్చరిక కరోనా వైరస్ కల్లోలంతో ఇప్పటికే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) వెల్లడించింది. 2009 నాటి అర్థిక మాంద్యం కంటే ప్రస్తుత మాంద్యం మరింత అధ్వానంగా ఉంటుందని ఐఎమ్ఎఫ్ హెచ్చరించడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. జీడీపీ అంచనాల తగ్గింపు.... వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 4.6%గానే ఉంటుందని ఫిచ్ పేర్కొంది. ఇండియా రేటింగ్స్ 5.5% నుంచి 3.6%కి తగ్గించింది. ప్రపంచ మార్కెట్లు పతనం. ప్రపంచ మార్కెట్ల నష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో లాక్డౌన్ మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో గత శుక్రవారం అమెరికా స్టాక్ సూచీలు 3–4 శాతం మేర నష్టపోగా, సోమవారం ఆసియా మార్కెట్లు 2 శాతం మేర పతనమయ్యాయి. యూరప్ మార్కెట్లు 3 శాతం మేర నష్టాలతో ఆరంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆరు నెలల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. 18 ఏళ్ల కనిష్టానికి చమురు ధరల పతనం పలు దేశాల్లో లాక్‌డౌన్‌తో చమురు వినియోగం బాగా పడిపోయింది. దీంతో బ్యారెల్ ముడి చమురు ధర సోమవారం ఇంట్రాడేలో 9 శాతానికి పైగా పతనమై 18 ఏళ్ల కనిష్టానికి (20 డాలర్ల దిగువకు) చేరాయి. జనవరి గరిష్ట స్థాయి నుంచి చూస్తే, చమురు ధరలు 68 శాతం మేర తగ్గాయి. రూపాయి 70పైసలు డౌన్.... డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 70 పైసలు క్షీణించింది. రోజంతా 75.10–75.63 రేంజ్లో ట్రేడైన రూపాయి చివరకు 70 పైసల నష్టంతో 75.59 వద్ద ముగిసింది. ప్యాకేజీల ప్రభావం పరిమితమే ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వాల ప్యాకేజీల ప్రభావం అంచనాలకనుగుణంగా పరిమితంగానే ఉంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ఉండగలదోనన్న భయాందోళనలు చెలరేగుతున్నాయి. ప్రపంచం మాంద్యంలోకి జారిపోయిందని ఇప్పటికే ఐఎమ్ఎఫ్ ప్రకటించింది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ కరోనా వైరస్‌కు సంబంధించి సానుకూల వార్తలు రానంత వరకూ మార్కెట్ కోలుకోవడం కష్టమే. నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పడిపోవడం నెగిటివ్ సిగ్నల్. 8,200 పాయింట్ల కిందకు క్షీణిస్తే, అది మరింత పతనానికి సూచిక. 8,000 పాయింట్లు, లేదా 7,800 పాయింట్లకు కూడా నిఫ్టీ పడిపోవచ్చు. –శ్రీకాంత్ చౌహాన్, కోటక్ సెక్యూరిటీస్ -
స్టాక్స్‌లో నష్టపోకూడదంటే..?
సంపద కూడబెట్టుకునేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అందులో ఈక్విటీలది అగ్ర తాంబూలం. మార్కెట్ పతనాలే మంచి పెట్టుబడి అవకాశాలను తెచ్చిపెడతాయి. గతంలో భారీ పతనాలు ఎన్నో వచ్చి వెళ్లాయి. ఈక్విటీ మార్కెట్లు పడి లేచిన బంతి మాదిరిగా ఆ పతనాల నుంచి నూతన శిఖరాలకు చేరడాన్ని చూశాం. ప్రపంచ ఆర్థిక మాంద్యం 2008లో మన ఈక్విటీ మార్కెట్లను 50 శాతానికి పైగా పడవేయగా, ఆ తర్వాత కాలంలో మార్కెట్లు ఎప్పటికప్పుడు కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. ఇప్పుడు కరోనా వైరస్ మార్కెట్‌ను ముంచేస్తోంది. షేర్లు పేక మేడల్లా కూలిపోతున్నాయి. ఇప్పటికే సూచీలు 30 శాతానికి పైగా నష్టపోయాయి. ‘అందరూ ఎగబడి కొంటుంటే ఆ సమయంలో జాగ్రత్త పడాలి.. అందరు భయంతో అమ్మకాలు సాగిస్తుంటే అప్పుడు ఆశతో కొనుగోలు చేయాలన్నది’ వారెన్ బఫెట్ నమ్మే సూత్రం. ఇప్పుడు దీన్ని అనుసరించే సమయం ఆసన్నమైంది. అయితే, ఈక్విటీల్లో రాబడులు తెచ్చుకోవాలంటే కరెక్షన్లో షేర్లను తక్కువ ధరల వద్ద కొనుగోలు చేయడం ఒక్కటే కాదు.. ఆ షేర్లు నాణ్యమైన కంపెనీలవి అయి ఉండాలి. భవిష్యత్తు ఉన్నవి కావాలి. అంటే చేసే పెట్టుబడుల్లో తప్పటడుగులకు చోటు లేకుండా చూసుకోవాలి. ఈక్విటీ రాబడులకు తగిన విషయ పరిజ్ఞానం, అధ్యయనం అవసరం. కేవలం కొన్ని తప్పులు పెట్టుబడి మొత్తాన్ని హరించేస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే వారిలో చాలా మంది కనీసం ప్రాథమిక సూత్రాలను కూడా పాటించకుండా సాగిపోతుంటారు. తమ రిస్క్ స్థాయిలను తెలుసుకోకుండా రాబడుల కాంక్షతో దూకుడుగా వెళ్లి చేతులు కాల్చుకుంటుంటారు. కానీ, ఏదైనా కోల్పోవడం అంత సులభం కాదు రాబట్టుకోవడం. ఇదే సూత్రం ఈక్విటీలకూ వర్తిస్తుంది. ఈక్విటీల పట్ల సరైన అవగాహన లేకుండా, భారీ నష్టాలను మూటగట్టుకుంటే.. ఆ తర్వాత పెట్టుబడులపై ఈ ప్రభావం కచ్చితంగా పడుతుంది. అందుకే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడుకుంటూ, దీర్ఘకాలంలో రాబడులు పోగేసుకోవాలంటే కొన్ని తప్పులకూ దూరంగా ఉండాలి. ఆ వివరాలను డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఏవీపీ అమిత్ గ్రోవర్ వెల్లడించారు. సమయం ఎంచకూడదు ఈక్విటీ పెట్టుబడులకు సమయం నిర్దేశించుకోవడం సరైనది కాదు. ఇటాలియన్ ఆర్థికవేత్త పారెటో పరిశోధన 80–20 సూత్రాన్ని సూచిస్తోంది. ఉదాహరణకు కంపెనీల ఉత్పత్తుల్లో 20 శాతం ఉత్పత్తుల నుంచి 80 శాతం ఆదాయం వస్తుంటుంది. అలాగే, ఓ కంపెనీ లాభాలకు 20 శాతం ఉద్యోగుల పాత్రే ఎక్కువగా ఉంటుంది. అలాగే, 20 శాతం ప్రయత్నాలు మన విజయాల్లో 80 శాతం పాత్ర పోషిస్తాయి. పారెటో రూపొందించిన సూత్రం ఈక్విటీలకు కూడా అమలవుతుంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రాబడుల్లో 80 శాతం కేవలం 20 శాతం సమయంలోనే వస్తుంటాయి. కానీ, ఈ 20 శాతం సమయం ఎప్పుడన్నది ఊహించడం అసాధ్యం. ఎంతో ఓపికగా, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసా గించేలా ఉండాలి. అప్పుడే ఆ 20 శాతం సమయంలోకి అడుగుపెట్టి మంచి రాబడులు పొందే అవకాశం లభిస్తుంది. కొంత కాలం పాటు పెట్టుబడులను కొనసాగించి, రాబడుల సమయం వచ్చే వరకు వేచి చూడలేక నిరాశతో వెనక్కి తీసేసుకుంటే.. ఆ విలువైన రాబడుల అవకాశాన్ని కోల్పోయినట్టే. వైవిధ్యం లేకపోవడం క్రికెట్లో ప్రతీ బాల్‌కు ఆరు పరుగులు (సిక్సర్) నమోదు చేయడం సాధ్యం కాదన్న విషయం బ్యాట్స్‌మెన్‌కు తప్పకుండా తెలిసి ఉంటుంది. ఆరు పరుగులు, నాలుగు, రెండు పరుగులు, ఒక పరుగు ఇలా అన్నీ సమకూర్చుకుంటేనే సెంచరీ మార్కు సాధ్యపడుతుంది. పెట్టుబడి కూడా అంతే. గత 40 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రను తిరగేస్తే 100 రెట్లు పెరిగిన కంపెనీలు ఎన్నో కనిపిస్తాయి. తమ తమ రంగాల్లో దిగ్గజాలుగా అవతరించినవీ ఉన్నాయి. మరోవైపు దివాలా తీసిన కంపెనీలూ కనిపిస్తాయి. కానీ, ఇన్వెస్టర్లకు ఇలా ఎన్నో రెట్లు లాభాలను ఇచ్చిన మల్టీబ్యాగర్ కథనాలే ఆసక్తి కలిగిస్తాయి. వైఫల్య కథనాలను పట్టించుకోకుండా.. మల్టీబ్యాగర్ ఆకాంక్షతో కేవలం కొన్ని స్టాక్స్‌లోనే తమ పెట్టుబడులు అన్నింటినీ కుమ్మరించేస్తుంటారు. కానీ, ఇది ఎంతో రిస్క్‌తో కూడిన వ్యాపారం. తమ పెట్టుబడులు, కాల వ్యవధికి అనుగుణంగా తగినంత వైవిధ్యంతో కూడిన స్టాక్ పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అధిక రాబడులు పొందడంతోపాటు ఒక్కో స్టాక్ వారీ రిస్క్ కూడా తక్కువ అవుతుంది. తగినంత అధ్యయనం లేకుండా.. ఓ విదేశీ పర్యటనకు వెళ్లాలనుకుంటే ఎన్నో నెలల పాటు అధ్యయనం చేస్తుంటారు. ఏ ఏ ప్రాంతాలను చుట్టి రావాలి, అక్కడ ఉండే వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఖర్చులు ఇలా అన్నింటిపైనా అవగాహన కోసం ఎంతో మందిని విచారిస్తాం. ఏదైనా వస్తువును కొనుగోలు చేయాలన్నా ఇదే స్థాయిలో సమయాన్ని వెచ్చిస్తుంటారు. కానీ, భవిష్యత్తు కోసం ఉద్దేశించి పెట్టుబడులు పెట్టే ముందు తగినంత అధ్యయనం లేకపోతే ఎలా..? కంపెనీ వాటాలను కొనుగోలు చేస్తున్నారంటే.. ఆయా కంపెనీల వ్యాపారం, యాజమాన్యం, ఆర్థిక పరిస్థితులు, ఆ కంపెనీ పనిచేసే రంగం, దేశ ఆర్థిక పరిస్థితి ఇలా ఎన్నో అంశాలను అర్థం చేసుకోవాలి. అదృష్టం కలిసివస్తే స్టాక్స్ ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లకు తమ సామర్థ్యంపై నమ్మకం మరింత బలపడుతుంది. నిజానికి బుల్ మార్కెట్లో అన్ని స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. దాంతో తమ నైపుణ్యాలు, అదృష్టం మధ్య వ్యత్యాసం వారికి అర్థం కాదు. కానీ, ఆటుపోట్లు బయటపడినప్పుడే అసలు విషయం బయటపడుతుందని విఖ్యాత స్టాక్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పే మాట ఇక్కడ గమనార్హం. భరించలేనంత రిస్క్ ఈక్విటీ మార్కెట్లు ఎక్కువగా ఆటుపోట్లతో కూడి ఉంటాయి. స్వల్పకాలంలోనే స్టాక్స్‌లో లేదా సూచీల్లో 10–20% నష్టాలు కనిపిస్తుంటాయి. అంతేకాదు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం వచ్చిన 2008, హర్షద్ మెహతా స్కామ్ వెలుగుచూసిన 1990ల్లో అయితే స్టాక్ మార్కెట్లు 50 శాతానికి పైగా నష్టపోయాయి. సాధారణ మార్కెట్ పరిస్థితులను అనుసరించి ఎక్కువ మంది పోర్ట్‌ఫోలియో నిర్మాణం చేసుకుంటుంటారు. కానీ, మార్కెట్ పతనాల్లో పెట్టుబడి హరించుకుపోకుండా ఉండాలంటే రిస్క్ నిర్వహణ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే విధంగా జవానులు ఎలా తర్ఫీదు అయితే పొందుతారో.. ఇన్వెస్టర్లు సైతం అత్యంత ప్రతికూల పరిస్థితులనూ నెగ్గుకొచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాబడుల కోసం పరుగు రాబడుల కోసం పరుగెత్తడం కాకుండా, పెట్టుబడులకు సంబంధించి నిర్దేశిత ప్రక్రియను పాటించడం ఎంతో అవసరం. ఎలుకకు ఏదో ఒక ఆహారాన్ని వేసి బంధించినట్టుగానే.. మనల్ని బుట్టలో వేయాలంటే అందుకు ఆకర్షణీయమైన హామీలు గుప్పిస్తే సరి. స్కామర్లు భారీ రాబడులను ఎరగా చూపుతుంటారు. వీటికి ఆకర్షితులైన వారు ఎలుకల మాదిరే వాటిల్లో చిక్కుకుంటారు. రాబడులు అన్నవి కంటికి కనిపించేవి. కానీ, రిస్క్ కనిపించని రూపంలో ఉంటుంది. గత నాలుగు ఐపీవోలు లిస్టింగ్‌లో 10 శాతం పైనే రాబడులు ఇచ్చాయనుకుంటే.. ఐదో ఐపీవో కూడా లిస్టింగ్‌లో ఇదే విధమైన రాబడులు ఇస్తుందని భావించడం సురక్షితమేనా..? ఇన్వెస్టింగ్ విధానాన్ని అర్థం చేసుకోవడం వల్ల స్టాక్ పెరుగుదల, పతనాల్లో నిశ్చింతగా ఉండే బలాన్నిస్తుంది. తద్వారా దీర్ఘకాలం పాటు సౌకర్యంగా వాటిల్లో కొనసాగగలరు. స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్మెంట్ 40 ఏళ్లలో సెన్సెక్స్ (1979–2019) ప్రయాణాన్నే పరిశీలిస్తే.. మీరు ఏడాది కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే 33 శాతం కేసుల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఐదేళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 8 శాతమే. అదే 10 ఏళ్ల కాలం కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశాలు 3 శాతమే. 15 ఏళ్ల కాల వ్యవధి కోసం ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం సున్నా. 40 ఏళ్ల కాలంలో సెన్సెక్స్ పనితీరు ఆధారంగా అంచనాలు ఇవి. అమెజాన్ చైర్మన్, సీఈవో జెఫ్ బెజోస్ ఒకసారి వారెన్ బఫెట్‌ను.. ‘మీ పెట్టుబడుల సిద్ధాంతం చాలా సులభంగా ఉంటుంది. కానీ, ప్రతి ఒక్కరూ దీన్ని ఎందుకు అనుసరించరు?’ అని ప్రశ్నించారు. ‘‘ఎందుకంటే ఎవరూ కూడా నిదానంగా ధనవంతులు కావాలని కోరుకోరు’’ అంటూ బఫెట్ బదులిచ్చారు. అంటే చాలా వేగంగా రాబడులు పోగేసుకోవాలనే ఆకాంక్షే తప్పటడుగులకు దారితీస్తుందని గ్రహించాలి. విలువకు విలువ ఇవ్వకపోవడం.. ధర అన్నది చెల్లించేది.. కానీ, విలువ అన్నది మీరు పొందేది. మార్కెట్లు అన్నవి ఉత్సాహం, నిరాశావాదం మధ్య చలిస్తుంటాయి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కంటే.. వదంతులు, ఊహాజనితాల ఆధారంగానే ఎక్కువగా చలించడం ఉంటుంది. దీంతో తాము కొనుగోలు చేస్తున్న వాటి విలువను పరిశీలించకుండా, ఈ విధమైన కథనాలపై ఆధారపడి అడుగులు వేయవద్దు. భవిష్యత్తు రాబడులు అన్నవి మీ కొనుగోలు ధరపైనే ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి. కనుక మీరు ఓ స్టాక్‌లోకి ప్రవేశించే ధర చాలా అధిక స్థాయిలో ఉంటే భవిష్యత్తు రాబడులు తక్కువగా ఉండడం లేదా ప్రతికూలంగా ఉండడం జరగొచ్చు. కనుక అసలు విలువను గుర్తించడం నేర్చుకోవాలి. తగిన అవగాహన లేకుండా... ఇన్వెస్టింగ్ అనేది ప్రత్యేకమైన ఉద్యోగమే. ఫైనాన్స్, అకౌంటింగ్, వ్యాల్యూషన్లు వీటన్నింటిని అర్థం చేసుకోగలిగి ఉండాలి. యాజమాన్యం గురించి తెలుసుకోవాలి. ఆ కంపెనీ పనిచేస్తున్న విభాగం/రంగం గురించి తగినంత అవగాహన ఉండాలి. మార్కెట్ ఆటుపోట్లను అధిగమించే ప్రశాంతత అవసరం. ఎంతో అనుభవం, సమయం, శక్తి పెట్టుబడులకు అవసరం. అందుకే దీన్ని పార్ట్ టైమ్ కాకుండా పూర్తికాలపు ఉద్యోగంగా పేర్కొంటారు. కనుక అంత సమయం వెచ్చించలేని వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను నిపుణులు నిర్వహిస్తుంటారు. పైగా పెట్టుబడుల్లో తగినంత వైవిధ్యం కూడా ఉంటుంది. దీంతో తక్కువ ఖర్చుకే తగినంత వైవిధ్యాన్ని ఫండ్స్ ద్వారా పొందొచ్చు. -
ఏదేమైనా వారికి సాయం మరువం : హరీష్
సాక్షి, సిద్దిపేట : ఆర్థికమాంద్యంతో ప్రభుత్వం వద్ద డబ్బులు లేకున్నా పేదవారికి సాయం చేయడంలో వెనకడుగు వేయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు అన్నారు. అవసరమనుకుంటే మిగతా కార్యక్రమాలు వాయిదా వేసైనా గరీబోళ్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. దుబ్బాక మండలం పెద్ద చీకోడ్ గ్రామంలో 2వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే రామలింగారెడ్డి, జడ్పీ చైర్మన్ రోజాశర్మ పాల్గొన్నారు. గోదావరి నీటితో చెరువు కుంటలు నింపుకొని.. రెండు పంటలు పండించే విధంగా చూస్తామని ఈ సందర్భంగా హరీష్ అన్నారు. ‘మంచినీరు కావాలని కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓట్లు వేసి వేసి చేతులు నొప్పి పెట్టినయ్. తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు నూకలు చెల్లినయ్. ఈ మున్సిపల్ ఎన్నికల్లో దుబ్బాకలో ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్, బీజేపీ గెలవదు. చీకోడ్ గ్రామాన్ని దోమలు, ఈగలు లేని పల్లెగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది. రాబోయే రోజుల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం. క్యాన్సర్ బారిన పడొద్దంటే ప్లాస్టిక్ నిషేధించాలి. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుంది. చదువులో మాత్రం వెనుకుంది. చీకోడ్ గ్రామంలో 100% అక్షరాస్యత సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మూణ్ణెళ్లకోసారి చీకోడ్ సందర్శించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా’అన్నారు. -
మాంద్యం మింగేసింది
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత.. ఇంటర్ ఫలితాల్లో లోపాలపై తీవ్ర వివాదం... న్యాయ చిక్కులతో బెడిసికొట్టిన కొత్త సచివాలయం, శాసనసభ భవన సముదాయాల నిర్మాణం, ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ సమ్మె... దిశ హత్యాచారం, నలుగురు నిందితుల ఎన్కౌంటర్.. వెరసి ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం కొన్ని ఒడిదుడుకులకు, సంచలనాలకు వేదికైంది. అదే సమయంలో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం కావడం ప్రభుత్వ అతిపెద్ద విజయంగా, తీపిగుర్తుగా మిగిలింది. 2019 సంవత్సరం మరో మూడు రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది రాష్ట్రంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, రాష్ట్రానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులపై కథనం. ఆర్థిక మాంద్యం దెబ్బ ఆర్థిక మాంద్యం ప్రభావం రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పడింది. ఫిబ్రవరిలో రూ. 1,82,087 కోట్ల భారీ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆర్థిక మాంద్యం దెబ్బకు పూర్తిస్థాయి బడ్జెట్‌ను సెప్టెంబర్‌లో రూ. 1,46,492.30 కోట్లకు తగ్గించుకుంది. అయినా ఇప్పటికే అమల్లో ఉన్న రైతుబంధు వంటి ప్రతిష్టాత్మక పథకాలకు తీవ్ర నిధుల కొరత ఏర్పడింది. పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల బిల్లులు పేరుకుపోయాయి. గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన కొత్త హామీల అమలు కూడా ఆర్థిక మాంద్యం వల్ల ప్రశ్నార్థకమైంది. రైతులకు రూ. లక్షలోపు రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు వంటి హామీల అమలు కోసం రాష్ట్ర ప్రజలు ఏడాదంతా నిరీక్షించాల్సి వచ్చింది. రైతుబంధు ఆర్థిక సాయం, ఆసరా పెన్షన్ల పెంపు హామీలను అమల్లోకి తెచ్చినా సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. గత ఖరీఫ్‌లో 45 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద రూ. 5,460 కోట్లు చెల్లించగా 8 లక్షల మందికి రూ. 1,500 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఇక రబీకి సంబంధించి చెల్లింపులు ఇంకా ప్రారంభం కాలేదు. నిధుల కొరత వల్ల కొత్తగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సవరించిన అంచనాల్లో రూ. 10 వేల కోట్లను భూముల అమ్మకం ద్వారా సమీకరించుకోవాలని నిర్ణయించినా కోకాపేట భూముల అమ్మకంపై హైకోర్టు స్టే విధించడంతో అది నెరవేరట్లేదు. ఇంటర్ ఫలితాల్లో ‘ఫెయిల్’ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటనలో దొర్లిన తప్పులు ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రిజల్ట్స్ ప్రాసెసింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ చేసిన తప్పిదాల కారణంగా పాసైన విద్యార్థులు సైతం ఫెయిలైనట్లు ఫలితాలొచ్చాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదనే విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితాలపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం, సుప్రీంకోర్టు స్పందించడం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసింది. ‘కాళేశ్వరం’ జాతికి అంకితం.. రాష్ట్రంలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ జూన్ 21న ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి ఆయకట్టుకు నీరు అందించేలా యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు.. అక్టోబర్ 5 నుంచి 52 రోజులపాటు సాగిన ఆర్టీసీ సమ్మె యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది. సమ్మె విరమణకు కార్మిక సంఘాల జేఏసీ, డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభు త్వం నిరాకరించడంతో 50 వేల మంది కార్మికులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఐదుగురు కార్మికుల బలవన్మరణాలతో కలిసి మొత్తం 38 మంది కార్మికులు సమ్మె కాలంలో మరణించారు. చివరకు కార్మిక జేఏసీ సమ్మె విరమించడం, కార్మికులను ప్రభుత్వం బేషరతుగా విధుల్లో చేర్చుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సమ్మె విరమించిన కార్మికులపై సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించడం ఊరట కలిగించింది. ఆర్టీసీ పరిరక్షణ కోసం కిలోమీటర్‌కు 20 పైసల చొప్పున చార్జీల పెంపును ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సచివాలయం లేని రాష్ట్రం కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం కోసం ప్రభుత్వం చారిత్రక ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చేసి అక్కడే రూ. 400 కోట్లతో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలనితీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చి రూ. 100 కోట్లతో కొత్త సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. ప్రభుత్వం హుటాహుటిన సచివాలయ భవనాలను ఖాళీ చేయించడంతో పాలనపరంగా కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. సచివాలయ శాఖల్లో కొన్నింటిని సమీపంలోని బీఆర్కేఆర్ భవన్‌కు తరలించగా మిగిలిన శాఖలను వేర్వేరు చోట్లలో ఉన్న ప్రభుత్వ భవనాలకు చేర్చారు. చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందంగా సచివాలయ శాఖల పరిస్థితి తయారైంది. -
రియల్టీ రంగానికి 2019లో నిరాశే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది దేశీయ రియల్టీ రంగం ఆశించినంత వృద్ధిని సాధించలేదు. వినియోగ వ్యయం తగ్గడం, పెట్టుబడులు క్షీణించ డం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వం టి రకరకాల కారణాలతో దేశీయ రియల్టీ రంగం లో వృద్ధి అవకాశాలను నీరుగార్చాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో గతేడాది నాలుగు త్రైమాసికాలు కలిపి 2,48,300 గృహాలు అమ్ముడుపోగా.. 2019లో కేవలం 4 శాతం వృద్ధితో 2,58,410 యూనిట్లకు చేరాయి. ఇందులోనూ అందుబాటు గృహాల విక్రయాలే ఎక్కువగా ఉన్నాయి. అఫడబు ల్ హౌసింగ్లకు పలు పన్ను రాయితీలను కల్పించ డమే ఇందుకు కారణం. తొలిసారి గృహ కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల పన్ను రాయితీని అందిస్తుంది. ఇది 2020 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకూ అందుబాటులో ఉంటుంది. రెడీ టు మూవ్ గృహాలకే డిమాండ్.. రియల్ ఎస్టేట్ రంగం పనితీరు దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) ఆరేళ్ల క్రితం నాటికి క్షీణించి 4.5 శాతానికి చేరింది. ముంబై, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గృహాల విక్రయాల్లో డిమాండ్ కనిపించింది.. కానీ, మూడో త్రైమాసికం నాటికి మళ్లీ తిరోగమన బాట పట్టిందని చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. కొనుగోలుదారులు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు లేదా 6 నెలల్లో నిర్మాణం పూర్తయ్యే గృహాల కొనుగోళ్ల మీదే ఆసక్తి చూపిస్తున్నారు. లిస్టెడ్, బ్రాండెడ్ నిర్మాణ సంస్థలు మాత్రం గృహ విక్రయాల్లో కాసింత ఉపశమనంలో ఉన్నాయి. ఈ ఏడాది గృహ విభాగానికి కలిసొచ్చిన అంశం ఏంటంటే.. దేశవ్యాప్తంగా మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు రూ.25 వేల కోట్ల ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)ను ఏర్పాటు చేయడమే. -
అన్ని శాఖలకు నిధులు తగ్గించాలి..
సాక్షి, హైదరాబాద్ : దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం లేదని పార్లమెంటు లోపల, బయట కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ గొప్పలు చెబుతున్నా వాస్తవాలు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారు. రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటా గణనీయంగా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాపై వాస్తవాలు వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం లేఖ రాశారు. కేంద్ర నిధులు రాని పక్షంలో రాష్ట్రం ఎదుర్కొనే ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పన్నుల వాటాలో రూ. 924 కోట్ల మేర కోత.. ‘2019–20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు పన్నుల వాటా రూపంలో రూ. 19,719 కోట్లు ఇస్తామని బడ్జెట్లో కేంద్రం పేర్కొంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ. 18,560 కోట్లతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గడిచిన 8 నెలల్లో రాష్ట్రానికి అందిన కేంద్ర పన్నుల వాటా రూ. 10,304 కోట్లు మాత్రమే. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే ఎనిమిది నెలల కాలానికి రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ. 10,528 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది నికరంగా ఇప్పటివరకు రూ. 224 కోట్ల మేర రాబడి తగ్గింది. కేంద్ర బడ్జెట్లో సూచించిన లెక్కల ప్రకారం వాస్తవానికి 6.2 శాతం అధికంగా రావడం పక్కనపెడితే ఈ ఏడాది 2.13 శాతం తగ్గింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కంటే రూ. 700 కోట్లు అధికంగా రావాల్సి ఉండగా రూ. 224 కోట్ల మేర కోత పడటంతో రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్ర పన్నుల వాటా మొత్తంగా రూ. 924 కోట్ల మేర తగ్గింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర పన్నుల వాటా 8.3 శాతం తగ్గిన విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాటాలో రాబడి 15 శాతం మేర తగ్గితే రూ. 2,957 కోట్ల మేర కోత పడుతుంది. అదే జరిగితే రాష్ట్రంలో అనేక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతాయి’అని సీఎం వ్యాఖ్యానించారు. అన్ని శాఖలకు నిధులు తగ్గించండి... ‘అన్న వస్త్రం కోసం వెళ్తే ఉన్న వస్త్రం పోయిన రీతిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా ఉంది. కేంద్ర పన్నుల వాటా రాబడి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని శాఖలకు సమాంతరంగా నిధులు తగ్గించాలి’అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఖర్చుల తగ్గింపును ఏదో ఒక శాఖకు వర్తింపజేయకుండా అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానం వల్లే ఇలాంటి సంకట స్థితి ఏర్పడిందని సమావేశంలో సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారకుండా స్వీయ నియంత్రణ పాటించడం తప్ప మరో గత్యంతరం లేదని, అన్ని శాఖలను అప్రమత్తం చేసి ఖర్చుల్లో కోత, ఆర్థిక నియంత్రణను కఠినంగా అమలు చేయాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు సైతం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇతర ఆర్థిక అంశాలపై ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రులు, అధికారులకు సమగ్ర నోట్ అందించాలని ఆర్థిక శాఖ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. కేంద్రం తన వాటా నిధులు ఇవ్వకుంటే ఎదురయ్యే ఇబ్బందులను ఐదారు రోజుల్లో ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లే యోచనలోఉన్నట్లు సీఎం వెల్లడించారు. కేంద్ర పన్నుల వాటాను విడుదల చేయండి... కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను విడుదల చేయాలని, లేనిపక్షంలో వాస్తవాలను విడుదల వెల్లడించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ శనివారం లేఖ రాశారు. ‘2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలో అంతర్భాగంగా ఉండే ఐజీఎస్టీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ. 2,812 కోట్లకు కూడా కేంద్రం ఎగనామం పెట్టింది. తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఐజీఎస్టీ నిధులను కేంద్రం ఎగ్గొంటిందనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. జీఎస్టీ ద్వారా 14 శాతం కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టాన్ని పూడుస్తామని జీఎస్టీ చట్టం అమలు సందర్భంగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు హామీ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 14 శాతం మేర జీఎస్టీ నిధులు సమకూరడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,719 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి’అని సీఎం కేసీఆర్ లేఖలో కోరారు. -
భారత్‌లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
30న కాంగ్రెస్ ‘భారత్ బచావో’ ర్యాలీ
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు ముగిశాక తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని ఎన్డీయే అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా ఈ నెల 30న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ‘భారత్ బచావో ర్యాలీ’ని చేపట్టనుంది. దేశంలో ఆర్థిక మందగమనం, నిరుద్యోగం, జీఎస్టీ అమలులో వైఫల్యాలు, ఎన్డీయే సర్కారు ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని వార్‌రూమ్‌లో ఏఐసీసీ కీలక సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలపైనా చర్చించారు. ఆందోళనలకు శ్రీకారం చుట్టని రాష్ట్రాల్లో ఆందోళనలను 25 తేదీలోగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలిచ్చింది. ఈ నెల 30న ఢిల్లీలో ‘భారత్ బచావో ర్యాలీ’ చేపట్టాలని నిర్ణయించింది. ఈ ర్యాలీకి దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10 మంది చొప్పున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి రాష్ట్ర ఇన్చార్జ్ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్, అసెంబ్లీలో కాంగ్రెస్‌పక్ష నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‡రెడ్డి, సంపత్‌కుమార్, ఏపీ నుంచి ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి 1200 మందిని తరలించేలా ఏర్పాట్లు చేయనున్నట్టు ఉత్తమ్ తెలిపారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని కుంతియా ఒక ప్రశ్నకు బదులిచ్చారు. -
‘మౌలిక’రంగం తిరోగమనంలోనే...
న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులకు ఎనిమిది మౌలిక పారిశ్రామిక రంగాల గ్రూప్ సెప్టెంబర్ ఫలితాలు ప్రతిబింబించాయి. సమీక్షా నెల్లో ఈ గ్రూప్‌లో అసలు వృద్ధిలేకపోగా – 5.2 శాతం క్షీణత నమోదయ్యింది. అంటే 2018 సెప్టెంబర్ ఉత్పత్తితో పోల్చితే 2019 సెప్టెంబర్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యిందన్నమాట. గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం... ఎరువుల ఉత్పత్తి తప్ప అన్నీ మైనస్‌లోనే... ► బొగ్గు (–20.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–5.4 శాతం), సహజ వాయువు (–4.9 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–6.7 శాతం), సిమెంట్ (–2.1 శాతం), స్టీల్ (–0.3 శాతం) విద్యుత్ (–3.7 శాతం) క్షీణతను నమోదుచేసుకున్నాయి. అయితే ఒక్క ఎరువుల రంగం మాత్రం 5.4 శాతం ఉత్పత్తి వృద్ధిని నమోదుచేసుకుంది. ► 2018 సెప్టెంబర్‌లో ఈ 8 పరిశ్రమల వృద్ధిరేటు 4.3%. ► కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే– ఈ కాలంలో వృద్ధి కూడా కేవలం 1.3 శాతంగా నమోదయ్యింది. 2018 ఇదే కాలంలో ఈ రేటు 5.5 శాతంగా ఉంది. ► పారిశ్రామిక రంగంలో తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ పేర్కొంది. ► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ఎనిమిది పారిశ్రామిక రంగాల వాటా దాదాపు 40 శాతం. -
చైనాలో తయారీకి శాంసంగ్ గుడ్‌బై
సియోల్: పెరుగుతున్న వ్యయాలు, ఆర్థిక మందగమనం, తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా చైనా నుంచి దిగ్గజ కంపెనీలు ఒక్కొక్కటిగా వైదొలుగుతున్నాయి. తాజాగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కూడా చైనాలో తమ మొబైల్ ఫోన్స్ తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేశీయంగా పోటీ తీవ్రంగా పెరిగిపోతుండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాదే ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ ఇటీవల జూన్‌లో మరో ప్లాంటులో ఉత్పత్తి ఆపివేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవలే బీజింగ్‌లోని స్మార్ట్‌ఫోన్స్ ప్లాంటును మూసివేసిన మరో పోటీ సంస్థ సోనీ.. థాయ్‌ల్యాండ్‌లో మాత్రమే తయారీ కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో శాంసంగ్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. అటు చైనాలో తయారీ నిలిపివేస్తున్న శాంసంగ్.. ఇటు భారత్, వియత్నాం దేశాల్లో తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతోంది. దీంతో ఈ దేశాల మార్కెట్లు శాంసంగ్‌కు మరింత కీలకంగా మారుతున్నాయి. 1 శాతానికి పడిపోయిన వాటా.. చైనాలో దేశీ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్‌కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ఫోన్లు కావాలనుకునే చైనీయులు.. దేశీ స్మార్ట్ఫోన్లను, కాస్త ఖరీదైనవి కోరుకునే వారు యాపిల్ లేదా హువావే వంటి సంస్థల మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2013లో చైనాలో దాదాపు 15 శాతంగా నమోదైన శాంసంగ్ మార్కెట్ వాటా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక చైనా మార్కెట్లో శాంసంగ్ పుంజుకునే అవకాశాలు కూడా కనిపించడం లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, చైనాలో తయారీ నిలిపివేసినప్పటికీ.. మొబైల్స్ అమ్మకాలు య«థాప్రకారం కొనసాగుతాయని శాంసంగ్ పేర్కొంది. ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు, పరికరాలను అంతర్జాతీయంగా ఇతర సైట్లకు తరలిస్తున్నట్లు వివరించింది. కంపెనీ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 2017 నాటి గణాంకాల ప్రకారం.. చైనాలో శాంసంగ్ ఉద్యోగులు సుమారు 6,000 మంది ఉండగా, 6.3 కోట్ల యూనిట్లు ఉత్పత్తి చేసింది. ఆ ఏడాది అంతర్జాతీయంగా శాంసంగ్ 39.4 కోట్ల హ్యాండ్‌సెట్స్‌ను తయారు చేసింది. -
ఆరేళ్లలో విద్యకు 4.13 శాతం తగ్గిన బడ్జెట్
ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు ఉంది. – కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు ఏటేటా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.13 శాతం మేర తగ్గిపోయాయి. ఆ ప్రభావం విద్యారంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైనా పడుతోందన్న విమర్శలున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం కాగా, ఇపుడు అది 6.75 శాతానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగక పోగా తగ్గింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ.10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్లో 10.88 శాతం) కేటాయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,15,689 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.11,216 కోట్లు (9.69 శాతం) కేటాయించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,30,415 కోట్లకు పెరగగా, విద్యాశాఖ బడ్జెట్ మాత్రం రూ.10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. అందులో విద్యాశాఖకు నిధులు పెరిగాయి. విద్యాశాఖ బడ్జెట్ రూ.12,278 కోట్లకు పెరిగినా రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితమైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.13,278 కోట్లు కేటాయించింది. ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావం మరింతగా తగ్గించి రూ.9,899.82 కోట్లకు పరిమితం చేసింది. -
‘ఆతిథ్యం’ ఇస్తే.. అవకాశాలెన్నో..
గతంలో ఆర్థికమాంద్యం ప్రభావంతో ఐటీ సహా ఎన్నో కీలక రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. కాని ఆతిథ్య రంగంలో పనిచేసే వారిపై మాత్రం ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదురుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో పర్యాటక రంగం మరింత ఊపందుకుంది. వింతలు, విశేషాలకు నిలయమైన భారతావనిని సందర్శించడానికి విదేశీ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పర్యాటక కేంద్రంగా పేరు పొందిన మన హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువే. దాంతో ఇటీవల కాలంలో భాగ్యనగరంలోని యువతకు ఆతిథ్య రంగం భారీ అవకాశాలతో ఆహ్వాన ం పలుకుతోంది. నగరంలోని పలు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ, టూరిజం మేనేజ్మెంట్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు పూర్తిచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సులువుగా సొంతం చేసుకోవచ్చు. సిటీలో హాస్పిటాలిటీ కోర్సులు, కెరీర్ స్కోప్‌పై ఫోకస్.. నగరం ప్రముఖ పర్యాటక కేంద్రం. ముత్యాలను రాసులుగా పోసి అమ్మిన భాగ్యనగరం ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఏనాడో గుర్తింపు పొందింది. కేవలం సంద ర్శనీయ ప్రాంతంగానే కాకుండా విభిన్న అవసరాలు, అవకాశాలకు నెలవుగా మారింది. మెడికల్ టూరిజం, లీజర్ టూరిజం, టెంపుల్ టూరిజం తదితర భిన్న రంగాల్లో తన ప్రాధాన్యతను చాటుకుంటోంది. ప్రయాణికులకు వీలుగా అంతర్జాతీయ విమానాశ్రయం నగరంలో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి అన్ని ప్రధాన దేశాలకు రాకపోకలు సాగించే సౌకర్యం ఉంది. గతంలో నిర్వహించిన ప్రపంచ మిలటరీ గేమ్స్ నుంచి ఇటీవల జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వరకూ జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలకు నగరమే వేదిక. గతేడాది 2.5 లక్షల మంది నగరాన్ని సందర్శించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే స్టార్ హోటల్స్, బడ్జెట్ హోటల్స్ నగరంలో 1000 వరకూ ఉంటాయి. పర్యాటకుల తాకిడితో రాబోయే రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు యువతకు ఉద్యోగాలు లభించడం ఖాయం. ఉద్యోగాలు కోకొల్లలు హోటల్‌కు వచ్చే అతిథులను ఆహ్వానించడం నుంచి సకల సదుపాయాలు, సౌకర్యాలు అందజేసేందుకు పలు విభాగాలు పనిచేస్తుంటాయి. ఆయా విభాగాలకు అనుగుణంగా కోర్సులు పూర్తిచేస్తే లాబీ మేనేజర్ నుంచి వైస్ ప్రెసిడెంట్ వరకూ ఎదిగే వీలున్న రంగం హాస్పిటాలిటీ అంటున్నారు నిపుణులు. హోటల్స్‌లో ఫ్రంట్ ఆఫీస్, రూం బుకింగ్, గెస్ట్ ఎంటర్టైన్మెంట్, లాబీ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అకామిడేషన్ అండ్ బిల్లింగ్, హౌస్‌కీపింగ్, గెస్ట్ సప్లయిర్స్ వంటి విభాగాలు ఉంటాయి. ఫుడ్ అండ్ బేవరేజ్ విభాగంలో ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడం, ఫుడ్ సర్వీసింగ్, మేనేజర్, కిచెన్ సర్వీసెస్(చెఫ్స్, హెడ్ చెఫ్స్) విభాగాలు.. ఇవికాకుండా సెక్యూరిటీ, హెచ్.ఆర్. విభాగం, స్టోర్స్ డిపార్ట్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ, జిమ్, స్పా నిపుణులు.. ఇలా హాస్పిటాలిటీలో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కోర్సులనందిస్తున్న విద్యా సంస్థలు... హైదరాబాద్‌లో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ (ఐహెచ్ఎంసీటీ), డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (వైఎస్ఆర్ నిథమ్), డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం-మాదాపూర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లు హోటల్‌మేనేజ్‌మెంట్, టూరిజం మేనేజ్మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కాకుండా దేశంలో వందల సంఖ్యలో విద్యాసంస్థలు హోటల్ మేనేజ్మెంట్లో వివిధ స్పెషలైజేషన్లలో కోర్సులను అందిస్తున్నాయి. కోర్సులు.. అర్హతలు ఆయా విద్యా సంస్థలు అందించే హాస్పిటాలిటీ కోర్సుల్లో పదో తరగతి నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకు చేరొచ్చు. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. ఇంటర్మీడియెట్ అర్హతతో మూడేళ్ల వ్యవధి ఉన్న బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (బీహెచ్ఎం), ఏడాది వ్యవధి ఉన్న డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సును, పదో తరగతి అర్హతతో ఆరు నెలల వ్యవధి ఉన్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ ఫుడ్ అండ్ బేవరెజ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, అకామిడేషన్ ఆపరేషన్స్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.braou.ac.in డాక్టర్ వైఎస్ఆర్ నిథమ్.. మూడేళ్ల బీఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్).. నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ), రెండేళ్ల ఎంబీఏ (హాస్పిటాలిటీ), ఎంబీఏ (టూరిజం అండ్ హాస్పిటాలిటీ)లతోపాటు వివిధ స్వల్పకాలిక శిక్షణా కోర్సులను ఆఫర్ చేస్తోంది. బీఎస్సీ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏలో చేరడానికి నిర్దేశిత మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కోర్సును బట్టి ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: www.nithm.ac.in నగరంలోనే కొలువుదీరిన మరో సంస్థ.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్. ఈ సంస్థ.. రెండేళ్ల ఎంఎస్సీ(హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), మూడేళ్ల బీఎస్సీ( హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), ఏడాదిన్నర వ్యవధి ఉన్న పీజీ డిప్లొమా ఇన్ అకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్స్, ఫుడ్ అండ్ బేవరెజ్ సర్వీస్, ఫుడ్ ప్రొడక్షన్లో స్వల్పకాలిక శిక్షణ కోర్సులు నిర్వహిస్తోంది. వెబ్సైట్: www.ihmhyd.org ఇవేకాకుండా సిటీలో ఇగ్నో, సెట్విన్ లాంటివి కూడా హాస్పిటాలిటీలో వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సాధారణంగా సర్టిఫికెట్ కోర్సులకు పదో తరగతి/ఇంటర్మీడియెట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులకు ఇంటర్మీడియెట్, పీజీ కోర్సులకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఇన్స్టిట్యూట్ను బట్టి వయోపరిమితి నిబంధనలు కూడా ఉంటాయి. వేతనాలు.. ఏడాదిలో రెట్టింపు హౌస్‌కీపింగ్ విభాగంలో ప్రారంభంలోనే నెలకు రూ.12,000; చెఫ్స్‌కు రూ.30 వేల వరకూ ఇస్తున్నారు. నిపుణులైన వారికి ఏడాది తర్వాత రెట్టింపు వేతనం చేతికి అందుతుంది. అతిథులు మెచ్చేలా సేవలు అందించే వారికి ఈ రంగంలో వేతనాలకు ఢోకా లేదు. మిగిలిన విభాగాల్లో కూడా ప్రారంభ వేతనం రూ.15,000 నుంచి ఉంటుంది. పనితీరు, అనుభవం ఆధారంగా మరింత ఆదాయం సంపాదించొచ్చు. సాధారణంగా నగరానికి టూరిస్టుల రాక అక్టోబరు నుంచి జనవరి వరకూ ఉంటుంది. ఆ సమయంలో చేతినిండా పనితోపాటు వేతనాలు కూడా 10-15 శాతం పెరుగుతాయి. మిగిలిన ఆఫ్ సీజన్లో ఫుడ్ ఫెస్టివల్స్, ఈవెంట్స్ ఉంటాయి. కాబట్టి 365 రోజులూ తీరిక లేకుండా ఉంటామంటున్నారు ఫైవ్‌స్టార్ హోటల్లో మేనేజర్‌గా పని చేస్తున్న యూ.రమేశ్. హోటల్ మేనేజ్మెంట్.. ఎవర్గ్రీన్ ‘‘పర్యాటకంగా హైదరాబాద్ పురోగతి సాధిస్తున్న నగరం. ఇక్కడకు వచ్చే అతిథుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. వీరికి అవసరమైన వసతి సౌకర్యాలకు హోటల్స్ ఆధారం. పర్యాటకుల సంఖ్య పెరిగేకొద్దీ ఈ రంగం విస్తరిస్తుంది. అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ చాలా బాగుంది. ఉపాధి అవకాశాలు భారీగా లభించనున్నాయి. కేవలం హోటల్ రంగమే కాకుండా.. కార్పొరేట్ సంస్థలు హౌస్‌కీపింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో హాస్పిటాలిటీ పూర్తిచేసిన వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. మెడికల్ టూరిజం హబ్‌గా సిటీ ఖ్యాతి గడిస్తోంది. దీంతో భ విష్యత్తులో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాదు. వేతనాలు కూడా భారీగానే అందుకోవచ్చు. ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషలు నేర్చుకోవాలి. గ్లోబలైజేషన్‌తో ఇంగ్లిష్ తప్పనిసరి. కష్టపడేతత్వమే కాకుండా, నేర్పు, ఓర్పు, ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం ఉన్న యువతీ, యువకులకు ఇది అద్భుతమైన కెరీర్. ప్రారంభ వేతనం రూ.15 వేలు ఉంటుంది’’ - ఎస్.సుధాకుమార్, ప్రిన్సిపల్, స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ (వైఎస్ఆర్ నిథమ్). -
ఉద్యోగాన్వేషణకు... ఆగ్నేయాసియా
టాప్ స్టోరీ: ఫారిన్ ఎడ్యుకేషన్ అన్నా..విదేశాల్లో ఉద్యోగం అన్నా మన యువతలో ఎనలేని ఆసక్తి. డిగ్రీ పట్టా చేతికి అందగానే విద్య, ఉద్యోగం అంటూ విదేశాల వైపు చూసేవారెందరో ఉన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి నెలకొన్న సమయంలో కూడా.. అవకాశాల కల్పనలో ఆ దేశాలకు దీటుగా నిలిచాయి ఆసియాన్ దేశాలు. స్వేచ్ఛా వ్యాపారం, ప్రపంచీకరణ ఫలితంగా ఆసియాన్ దేశాల స్వరూపమే మారిపోయింది. పెరుగుతున్న వాణిజ్యం, ఊపందుకున్న వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరం ఏర్పడింది. అవకాశాలు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగట్టే భాగ్యనగర యువత.. తమ కెరీర్‌కు గమ్యంగా ఆగ్నేయాసియా దేశాలను ఎంచుకుంటున్నారు. ఆయా దేశాల్లో వాలిపోతున్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసియాన్ దేశాలకు వెళ్లేవారు తమ కెరీర్‌ను విజయవంతం చేసుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు, సూచనలు.. అసోసియేషన్ ఆఫ్ సౌత్ఈస్ట్ ఏషియన్ నేషన్స్‌కు సంక్షిప్త రూపం..ఆసియాన్ (అఉఊ). సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాంలను ఆసియాన్ దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ ఆగ్నేయాసియా దేశాల్లో కెరీర్‌ను ప్రారంభించాలంటే.. డిగ్రీలు, ప్రతిభను మాత్రమే నమ్ముకుంటే సరిపోదు. ఎందుకంటే మనతో పోల్చితే పూర్తి భిన్నమైన వాతావరణం, వివిధ దేశాల ప్రజలతో గ్లోబల్ విలేజ్‌ను తలపించే నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే అక్కడి సమాజం వంటి అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. అక్కడి పరిస్థితులపై క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పలు కీలక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. హైరింగ్ ట్రెండ్: సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, ఫిలిఫ్పైన్స్, వియత్నాం వంటి ఆసియాన్ దేశాల్లో గ్లోబలై జేషన్ ఫలితంగా అక్కడి వ్యాపార ముఖచిత్రమే మారిపో యింది. ప్రపంచంలో ఎనిమిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆసియాన్ అవతరించింది. ఈ దేశాల జీడీపీ వృద్ధి 2.3 ట్రిలియన్ యూఎస్ డాలర్లకు చేరుకుంది. అదే క్రమంలో వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయి. డిమాండ్ వీటికే: ఆగ్నేయాసియా దేశాల్లో టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సర్వీస్ సెక్టార్ వంటి రంగాల్లో జోరుగా హైరింగ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఉదాహరణకు సింగపూర్‌ను తీసుకుంటే.. అక్కడి మ్యాన్‌పవర్ మినిస్ట్రీ అంచనా మేరకు పది ఉద్యోగాల్లో ఆరు విదేశీయులకే దక్కాయి. మలేషియాలో ఫైనాన్స్, టెక్నాలజీ రంగాలు ముందంజలో ఉంటున్నాయి. కారణాలు: ప్రపంచంలో అధిక శాతం కంపెనీలు ఆగ్నేయాసియా బాట పట్టాయి. దీనికి కారణం అక్కడి ప్రభుత్వాలు కల్పిస్తున్న ఆకర్షణీయమైన రాయితీలే. ఈ క్రమంలో చాలా కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసు కుంటున్నాయి. ఫలితంగా సంబంధిత వ్యవహారాల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. రెట్టింపు సిబ్బంది కావాలి: పర్యాటక, హోటళ్ల రంగాల్లో ఆగ్నేయాసియా దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద హోటల్ వ్యవస్థ ఉంది. అక్కడి ప్రముఖ హోటళ్లు త్వరలో 47 కొత్త హోటళ్లను ప్రారంభించాలని ప్రణాళికలను రూపొందిస్తున్నాయి. అంటే ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది కంటే రెట్టింపు సిబ్బంది కావల్సి ఉంటుంది. సంస్కృతికి పెద్ద పీట: ఆగ్నేయాసియా దేశాలకు ఉపాధి కోసం వెళ్లే విద్యార్థులు మొట్టమొదటగా అవగాహన పెంచుకోవాల్సిన కీలక అంశం.. ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలు. ఎందుకంటే అక్కడి ప్రజలు వాటికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి ప్రయాణానికి ముందే అక్కడి సంస్కృతి సంప్రదాయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. వాటిని గౌరవించడం నేర్చుకోవాలి. దాంతో కంపెనీలో పని చేసే సహచరులతో స్నేహసంబంధాలు ఏర్పడతాయి. వివిధ మాధ్యమాలు, ఇంటర్నెట్, పుస్తకాల ద్వారా ఆయా దేశాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. వీలైతే అక్కడ స్థిరపడిన భారతీయుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పదజాలం: మరో కీలకాంశం.. భాష. ఆయా దేశాల్లో స్థానికంగా మాట్లాడే భాషపై అవగాహన కలిగి ఉండటం. అక్కడి ప్రజలు తమ సంభాషణలో భాగంగా తరుచుగా ఉపయోగించే కొన్ని పదాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు మలేషియాలో ప్రజలు ఏ విషయాలకు నేరుగా కాదు లేదా నో (ూౌ) అని చెప్పరు. అటువంటి సందర్భం ఎదురైతే సున్నితంగా ‘ఐ విల్ ట్రై (ఐ ఠీజీ ్టటడ )’ అంటారు. కాబట్టి అలాంటి పదాలపై అవగాహన పెంచుకోవాలి. సమయ పాలన: ఆగ్నేయాసియా ప్రజలు అత్యంత ప్రాముఖ్యాన్నిచ్చే అంశాల్లో సమయ పాలన ఒకటి. దీన్నిబట్టి ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. ప్రజలు సంబంధ బాంధవ్యాలకు కూడా ఎక్కువ విలువనిస్తారు. ఒకరితో ఒకరు స్నేహం పెంచుకోవడానికి తరుచుగా కలుసుకోవడం కీలకమని భావిస్తుంటారు. ఇతరులతో వ్యవహారాలను నిర్వహిం చేటప్పుడు ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఆహార అలవాట్లు: మరో అంశం.. ఆహార అలవాట్లు. పూర్తిగా మన దేశానికి భిన్నమైన వంటకాలు అక్కడ కనిపిస్తాయి. ఆయా దేశాల్లో ఎక్కువగా ఉపయోగించే ఆహారం, సంబంధిత అలవాట్లను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది. అక్కడ ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా చాప్ స్టిక్స్ వినియోగిస్తారు. కాబట్టి వాటి వినియోగంపై అవగాహన పెంచుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కార్యాలయాల్లో.. కార్యాలయాల్లో హుందాగా ప్రవర్తించాలి. సందర్భానుసారంగా హావభావాల ప్రకటన ఉండాలి. చొరవగా కలివిడిగా అందరితో మంచి సంబంధాలను కలిగి ఉండడం కెరీర్లో రాణించడానికి దోహదం చేస్తుంది. అక్కడికి చేరుకున్నాక ఫ్రెండ్స్, కుటుంబ, సహచరుల, సంబంధిత అసోసియేషన్ల ఫోన్ నెంబర్లు, చిరునామా, ఈ-మెయిల్ తదితర వివరాలను దగ్గర ఉంచుకోవాలి. మీ చదువు, నైపుణ్యం, పరిజ్ఞానానికి అనువైన ఉద్యోగాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కోసారి మనం ప్రాముఖ్యం ఇవ్వని చిన్న ఉద్యోగం కూడా లభించవచ్చు. అటువంటి వాటిని తిరస్కరించకుండా అనుభవం పెంచుకునే దిశగా వాటిని ఉపయోగించుకోవాలి. కమ్యూనికేషన్ కీలకం: భావ ప్రసరణలో కీలకం కమ్యూనికేషన్. ఇద్దరు వ్యక్తులు లేదా సమూహాల మధ్య జరిగే వ్యవహారాలను ప్రభావవంతంగా నిర్వహించేందుకు కమ్యూనికేషన్ దోహద పడుతుంది. ఈ విషయంలో మన దేశానికి, అక్కడి దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గమనించాలి. మరీ చిన్నగా లేదా బిగ్గరగా, అరుస్తూ మాట్లాడడాన్ని కూడా సింగపూర్ వాసులు హర్షించరు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ సంభాషించడం అలవాటు చేసుకోవాలి. మిగతా దేశాల ప్రజలు మాట్లాడే తీరుపైనా అవగాహన పెంచుకోవాలి. ఇంటర్వ్యూలో వ్యక్తిగతం మన దేశంతో పోల్చితే ఇంటర్వ్యూ చేసే విధానం కూడా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల్లోని చాలా మంది రిక్రూటర్లు ఇంటర్వ్యూలో భాగంగా వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఎక్కడ నివసిస్తున్నారు? ఎంత అద్దె చెల్లిస్తున్నారు? ఎక్కడ చదువుకున్నారు? ఎంత వరకు చదువుకున్నారు? వంటి వ్యక్తిగత అంశాలను లోతుగా తెలుసుకునే ప్రశ్నలను వేస్తుంటారు. ఇలాంటి ప్రశ్నలకు, ఉద్యోగానికి సంబంధం ఉండకపోవచ్చు, అయితే, కొత్త వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి, స్నేహాన్ని పెంచుకోవడానికి, సుహృద్భావ వాతావరణం సృష్టించడానికి, చక్కటి సంబంధాలను నెలకొల్పే క్రమంలో మాత్రమే వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తుంటారు. అవకాశాలు వీరికే: ఆసియాన్ దేశాల్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలను అందుకోవాలంటే ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మార్కెటింగ్, హెచ్ఆర్, ఆపరేషన్స్, హోటల్ మేనేజ్మెంట్, కామర్స్, జర్నలిజం, డిజిటల్ మీడియా, ఫైనాన్స్ విభాగాల్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వేతనాలు అధికమే: హోదా, అనుభవాన్ని బట్టి వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌లలో భారత్‌లో లభించే వేతనాల కంటే 25 నుంచి 30 శాతం అధికంగా వేతనాలను చెల్లిస్తున్నారు. సమాచారం ఎలా? జాబ్ పోర్టల్స్, వివిధ సంస్థలు నిర్వహించే కెరీర్-నెట్ వర్కింగ్ ఈవెంట్ల ద్వారా ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవచ్చు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లను కూడా ఇందుకు వినియోగించుకోవచ్చు. గుర్తుంచుకోండి సమయ పాలన, వృత్తిపరమైన అంశాల్లో నిబద్ధతతో వ్యవహరించాలి. కంపెనీల నియమాలు/ ఉద్యోగ ఒప్పందాన్ని అతిక్రమించరాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. నేరుగా సంప్రదింపులు (డెరైక్ట్ కమ్యూనికేషన్) ప్రశంసనీయం కాదు. విభిన్న అవకాశాలకు.. ఆగ్నేయాసియా దేశాలు ఆగ్నేయాసియా దేశాలు చేపడుతున్న ఆర్థిక సంస్కరణలు, పరిశ్రమల విస్తరణ వంటి చర్యల కారణంగా ఇప్పుడు ఆ దేశాలు విదేశీ ఉద్యోగార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. ప్రధానంగా సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో హాస్పిటాలిటీ, టూరిజం, హెల్త్‌కేర్, బీపీఓ విభాగాల్లో పలు ఉద్యోగాలు ఉన్నాయి. ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో టీచింగ్ విభాగంలో మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లాలనుకునే ఔత్సాహికులు సరైన ప్రణాళికతో వ్యవహరించాలి. తాము చేరదలచుకున్న సంస్థ, రంగాలకు సంబంధించి ఆయా దేశాల్లో ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తుపై సంపూర్ణ అవగాహనతో ఉండాలి. ఇలా అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. - ఎం. సింధు, క్లయింట్ రిలేషన్ మేనేజర్, మాన్స్టర్ ఇండియా డాట్ కామ్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్ ద్వారా అవగాహన ఇటీవలి కాలంలో ఆగ్నేయాసియా దేశాలు ఉద్యోగాల రీత్యా మన అభ్యర్థులకు చక్కటి గమ్యాలుగా నిలుస్తున్నాయి. అభ్యర్థులు ఆన్లైన్ జాబ్ సెర్చ్ ఇంజిన్స్, కన్సల్టెన్సీల ద్వారా ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను అన్వేషించొచ్చు. తమ అర్హతలకు తగిన ఉద్యోగాలపై అవగాహన పొంది దరఖాస్తు చేసుకోవచ్చు. పారిశ్రామిక సంస్థల్లో క్షేత్ర స్థాయిలో పని చేసేందుకు డిప్లొమా నుంచి.. మిడిల్ లెవల్ మేనేజ్మెంట్ పోస్ట్‌ల కోసం మాస్టర్స్ డిగ్రీ వరకు ప్రతి ఒక్కరికీ అనువైన ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. ఆయా అవకాశాలపై కన్సల్టెన్సీలను సంప్రదించే ముందు సదరు కన్సల్టెన్సీ విశ్వసనీయత గురించి తెలుసుకున్నాకే ముందుకు సాగాలి. - టి.ఎస్. విశ్వనాథ్, విసు గ్లోబల్ కన్సల్టింగ్స్