ఆర్థిక మాంద్యం కారణంగా ఆదాయాలు తగ్గినప్పటికీ పరిస్థితిలో తప్పక మార్పు వస్తుందనే ఆశాభావం నాకుంది. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరిగితే అందుకు తగ్గట్టు అంచనాలు సవరించుకునే వెసులుబాటు కూడా మనకు ఉంది.
– కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఏటేటా తగ్గిపోతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, యూనివర్సిటీలు, సాంకేతిక విద్యాసంస్థలకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు క్రమంగా పడిపోతున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే విద్యారంగానికి కేటాయింపులు 4.13 శాతం మేర తగ్గిపోయాయి. ఆ ప్రభావం విద్యారంగంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపైనా పడుతోందన్న విమర్శలున్నాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో 10.88 శాతం కాగా, ఇపుడు అది 6.75 శాతానికి పడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది.
2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి రాష్ట్ర బడ్జెట్ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగక పోగా తగ్గింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ.10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్‌లో 10.88 శాతం) కేటాయించింది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,15,689 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.11,216 కోట్లు (9.69 శాతం) కేటాయించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ రూ.1,30,415 కోట్లకు పెరగగా, విద్యాశాఖ బడ్జెట్ మాత్రం రూ.10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర బడ్జెట్ 1,49,453 కోట్లకు పెరిగింది. అందులో విద్యాశాఖకు నిధులు పెరిగాయి. విద్యాశాఖ బడ్జెట్ రూ.12,278 కోట్లకు పెరిగినా రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితమైంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ.13,278 కోట్లు కేటాయించింది. ఈసారి ఆర్థిక మాంద్యం ప్రభావం మరింతగా తగ్గించి రూ.9,899.82 కోట్లకు పరిమితం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment