చదివింపులు 'అరకొర' | Education budget was decreasing every year | Sakshi
Sakshi News home page

చదివింపులు 'అరకొర'

Published Sat, Feb 23 2019 4:34 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Education budget was decreasing every year - Sakshi

పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్యకు రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గుతున్నాయి. గత రెండేళ్లలో నిధుల కేటాయింపులు ఎక్కువే అనిపించినా, పెరుగుతున్న రాష్ట్ర బడ్జెట్‌ను బట్టి చూస్తే విద్యా శాఖ వాటా తగ్గిపోతోంది. ఈ ప్రభావం అభివృద్ధి కార్యక్రమాలపై పడుతోందన్న విమర్శలున్నాయి. ఈసారైతే రాష్ట్ర బడ్జెట్‌లో వాటా కాదు నిధుల పరంగా చూసినా విద్యాశాఖకు బడ్జెట్‌ కేటాయింపులు తగ్గాయి. 2014–15 ఆర్థిక సంవత్సరంలో విద్యాశాఖకు కేటాయించిన మొత్తం.. రాష్ట్ర బడ్జెట్‌లో 10.88 శాతం కాగా, ఇప్పుడు 6.71 శాతానికి పడిపోయింది. పాఠశాల విద్యకు ఎక్కువ మొత్తంలో బడ్జెట్‌ తగ్గింది. విద్యాశాఖ అధికారులు దాదాపు రూ.15 కోట్లకు పైగా బడ్జెట్‌ కావాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం రూ.12,220.78 కోట్లే కేటాయించింది. ఇవి విద్యాశాఖకు ఏ మూలకూ సరిపోవని పలు ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఏ విభాగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారన్న స్పష్టత లేదని చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖకు కేటాయించిన బడ్జెట్‌ వేతనాల చెల్లింపులు, నిర్వహణ ఖర్చులకే సరిపోతాయని అంటున్నారు.
– సాక్షి, హైదరాబాద్‌ 

క్రమంగా తగ్గిపోతున్న విద్యాశాఖ వాటా..
రాష్ట్రం ఏర్పడిన తరువాత బడ్జెట్‌లో విద్యారంగం వాటా పరిస్థితిని పరిశీలిస్తే క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొదటి రెండు ఆర్థిక సంవత్సరాల్లో విద్యాశాఖకు రాష్ట్ర బడ్జెట్‌లో వాటా తగ్గినా నిధులపరంగా కొంత బాగానే ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం వచ్చే సరికి రాష్ట్ర బడ్జెట్‌ పెరిగినా, విద్యాశాఖ వాటా పెరగకపోగా తగ్గిపోయింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,00,637 కోట్లు కాగా, విద్యాశాఖకు రూ. 10,963 కోట్లు (రాష్ట్ర బడ్జెట్‌లో 10.88%) కేటాయించింది. 2015–16లో రాష్ట్ర బడ్జెట్‌ 1,15,689కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 11,216 కోట్లు (9.69%) కేటాయించింది. 2016– 17లో రాష్ట్ర బడ్జెట్‌ రూ. 1,30,415 కోట్లు కాగా, విద్యాశాఖకు మాత్రం రూ. 10,738 కోట్లకు తగ్గిపోయింది. 2017–18లోనూ రాష్ట్ర బడ్జెట్‌ 1,49,453 కోట్లకు పెరిగింది. ఇందులో విద్యా శాఖ బడ్జెట్‌ రూ. 12,278 కోట్లకు పెరిగినా మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా చూస్తే 8.49 శాతానికే పరిమితం అయింది. అంతకుముందు సంవత్స రంతో పోల్చితే 2018–19లో విద్యా శాఖ బడ్జెట్‌ రూ. 500 కోట్లకు పైగా పెరిగి రూ. 13,278 కోట్లకు చేరుకుంది. వాటా పరంగా చూస్తే 7.61 శాతమే. ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు చూస్తే వాటానే కాదు.. నిధుల పరంగా చూసినా గతేడాది కంటే విద్యాశాఖకు కేటాయింపులు తగ్గిపోయాయి. 2018–19లో రాష్ట్ర బడ్జెట్‌ 1,74,453 కోట్లు కాగా విద్యాశాఖకు రూ. 13,278 కోట్లు కేటాయించిన ప్రభు త్వం.. ఈసారి రూ. 1,058 కోట్లు తగ్గించి రూ. 12,220.78 కోట్లకు పరిమితం చేసింది. రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చితే ఈసారి విద్యాశాఖ వాటా 6.71 శాతానికి పడిపోయింది.

ఉన్నత, సాంకేతిక విద్యలోనూ తగ్గిన కేటాయింపులు
ఉన్నత విద్య, సాంకేతిక విద్యాశాఖలకు కేటాయించిన బడ్జెట్‌ గతేడాది కంటే ఈసారి రూ. 250 కోట్ల వరకు తగ్గిపోయింది. గత ఏడాది ఉన్నత విద్యకు రూ. 2,205.57 కోట్లు కేటా యించిన ప్రభుత్వం ఈసారి రూ. 1,916.85 కోట్లు కేటాయిం చింది. సాంకేతిక విద్యకు 2018–19లో రూ. 422.32 కోట్లు కేటాయించగా. ఈసారి దానిని రూ. 394.93 కోట్లకు పరిమితం చేసింది. ఉన్నత విద్యలో యూనివర్సిటీలకు కేటాయింపుల అంశంపై వివరాలు ఇవ్వకపోవడంతో తమకు ఎంత వచ్చిందన్నది తెలియని పరిస్థితి నెలకొంది.

రూ. 13 వేల కోట్లు కావాలన్నా.. 
పాఠశాల విద్యా శాఖకు, వివిధ పథకాల నిర్వహణకు రూ. 13 వేల కోట్లు కావాలని పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ ప్రభుత్వం రూ. 9,909 కోట్లు మాత్రమే కేటాయించింది. కనీసం గతేడాది సవరించిన బడ్జెట్‌ ప్రకారం కూడా కేటాయింపులు జరపలేదు. 2016–17లో పాఠశాల విద్యకు రూ. 8,224.63 కోట్లు కేటాయించగా, 2017–18లో రూ. 10,215.30 కోట్లు కేటాయించి దానిని రూ. 10,197.22 కోట్లకు సవరించింది. 2018–19లో రూ. 10,830.30 కోట్లు కేటాయించగా, ఇప్పుడు రూ.9,909 కోట్లకు తగ్గింది. దీంతో పాఠశాల విద్యాశాఖకు కేటాయింపుల్లోనే భారీగా కోత పడింది. ఈ కోత నిర్వహణ వ్యయంలో పడిందా? పథకాల్లో తగ్గిందా? అన్నది తేలాల్సి ఉంది.
ఈ బడ్జెట్‌ ఏ మూలకూ సరిపోదు
విద్యాశాఖకు ఈ బడ్జెట్‌ ఏ మూలకూ సరిపోదు. వేతనాలు, నిర్వహణ ఖర్చులకే ఇది సరిపోతుంది. గతంలో చేసిన చేసిన కేటాయింపులకంటే తగ్గించడం దారుణం. పెరిగిన రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా దీనిని పెంచా ల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ, ఇంగ్లిషు మీడియం విద్యా బోధనకు నిధులు లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం పునరాలోచంచి బడ్జెట్‌ను పెంచాలి.
– చావ రవి, యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి

దక్షిణాది రాష్ట్రాల్లోనే అతి తక్కువ కేటాయింపులు ఇవీ
విద్యాశాఖకు కేటాయించిన ఈ బడ్జెట్‌ దక్షిణాది రాష్ట్రాల్లోనే తక్కువ. ఈ రాష్ట్రంలోనూ విద్యకు ఇంత తక్కువ కేటాయింపులు లేవు. కాలేజీలు, విశ్వ విద్యాలయాల్లో ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పనకు ఈ బడ్జెట్‌ సరిపోదు. ఇంత తక్కువ నిధులతో ప్రభుత్వ విద్యా సంస్థలు మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది.
– నారాయణ, తల్లిదండ్రుల సంఘం

మరిన్ని నిధులను కేటాయించాలి..
పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు, నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులను విద్యాశాఖకు కేటాయించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎక్కువ నిధులను కేటాయించాలి. ఆ దిశగా సీఎం ఆలోచనలు చేయాలి.
– గౌరు సతీష్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం

పశుసంవర్ధక, మత్స్యశాఖకు 1,204 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.1,204.97 కోట్లు కేటాయించింది. ఇందులో పశుసంవర్థక శాఖకు రూ.650 కోట్ల నిధులు ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు, గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర పథకాల అమలు, సిబ్బంది వేతనాలకు కలిపి రూ.200 కోట్లు ప్రతిపాదించింది. విజయ డెయిరీకి పాలు పోస్తున్న పాడి రైతులకు లీటరు పాలపై రూ.4 ప్రోత్సాహకం చెల్లిస్తున్నారు. మరో 4 ప్రైవేట్‌ డెయిరీలకు పాలు, 2.13 లక్షల మంది రైతులకు ప్రోత్సాహకం ఇస్తున్నారు. మత్స్యశాఖకు రూ.320 కోట్లు ప్రతిపాదించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చేప పిల్లల పంపిణీ, రొయ్యల పెంపకానికి నిధులు ప్రతిపాదించారు.

సంక్షేమానికి తగ్గిన కేటాయింపులు 
గతేడాది కంటే రూ.170.58 కోట్లు తక్కువ
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగ సంక్షేమానికి ప్రాధాన్యత దక్కలేదు. 2019–20 వార్షిక సంవత్సరానికి ఈ శాఖకు రూ.1,628.24 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే తాజా కేటాయింపుల్లో రూ.170.58 కోట్లు తగ్గింది. 2018–19 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ.1,798.82 కోట్లు, 2017–18లో రూ.1,731.50 కోట్లు చొప్పున ప్రభుత్వం కేటాయిం చింది. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టనప్పటికీ గతేడాది నుంచి అమల్లోకి వచ్చి న స్త్రీ శక్తి కేంద్రాలు, సఖి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకోలేదు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement