CM YS Jagan Comments On Artificial Intelligence Technology In School Education - Sakshi
Sakshi News home page

CM Jagan On AI Technology: ప్రపంచాన్ని గెలిచేలా.. పాఠాలను మారుద్దాం

Published Fri, Jul 14 2023 4:38 AM | Last Updated on Fri, Jul 14 2023 10:45 AM

CM YS Jagan On Artificial Intelligence Technology In School Education - Sakshi

మన విద్యా వ్యవస్థలో వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ), ఏఆర్‌ (అగ్‌మెంటెడ్‌ రియాలిటీ), ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీల సాంకేతికతను పెంచాలి. లో లెవల్‌ మెషిన్‌ లెర్నింగ్, మెటా­వర్స్‌తో మిళితం చేయాలి. మన విద్యార్థులు ఏఐలో నిష్ణాతులుగా మారి, ఆ తర్వాత క్రియేటర్లుగా రాణించేలా ఇక్కడి నుంచే తొలి అడుగు వేయాలి. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేస్తాం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ విద్యా వ్యవస్థలో సాంకేతికతను ముందుకు తీసుకెళదాం. అత్యుత్తమ ప్రతిభావంతుల ద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్‌ చేద్దాం.   
► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ను ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ బోధన, నేర్చుకునే సామర్థ్యం పెంచడంతో పాటు.. వారిని ఏఐ క్రియేటర్లుగా తీర్చిదిద్దేలా పాఠ్య ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్సిటీల వీసీలకు పిలుపునిచ్చారు. పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కరిక్యులమ్‌లో ఏఐ ఒక భాగం కావాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు విద్యా విధానాన్ని ఏఐ మార్చబోతోందని, ఈ రూపంలో ప్రపంచం నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు.

బోధన, నైపుణ్యాభివృద్ధిలో తొలిసారిగా ఎమ­ర్జింగ్‌ టెక్నాలజీ అనుసంధానం చేసేలా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యా శాఖ అధికారులు, విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రాక్టికల్‌ అప్లికబులిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ను తీసుకురావడంతో పాటు మరిన్ని వర్టికల్స్‌ చదువుకునే అవకాశం ఇవ్వాలన్నారు.

సాంకేతిక వైద్య విధానాలు అందుబాటులోకి రావడంతో వైద్య విద్య పాఠ్య ప్రణాళిక, బోధనలో రోబోటిక్స్, ఏఐల ప్రాధాన్యం పెంచాలని చెప్పారు. నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ఏపీ విద్యార్థులను గ్లోబల్‌ లీడర్లుగా తయారు చేయడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు సీఎం జగన్‌ మాటల్లోనే..  
 
ఏఐలో మనమే లీడర్లుగా ఉండాలి 
► ప్రపంచ స్థాయిలో మన విద్యార్థులను అనేక రంగాల్లో లీడర్లుగా చూడాలనుకుంటున్నాం. అందుకు తగ్గట్టుగా మనం చదువులు అందిస్తున్నామో లేదో ఆలోచించాలి. ఇప్పుడు ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ విప్లవం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో మనం వెనుకబడితే కేవలం అనుసరించే వాళ్లుగానే మిగిలిపోతాం. ఏఐ అభివృద్ధి చెందేకొద్దీ.. దానిని వినియోగించుకుని, సామర్థ్యాన్ని పెంచుకునే వర్గం ఒకటైతే.. ఏఐని క్రియేట్‌ చేసే వర్గం మరొకటి తయారవుతుంది.  

► టెక్నాలజీ పరంగా తొలి రివల్యూషన్‌ 1784లో స్టీమ్‌తో నడిచే రైలు ఇంజన్‌ ద్వారా చూశాం. ఆ తర్వాత 100 ఏళ్లకు విద్యుత్, 1960–70ల్లో కంప్యూటర్లు, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రూపంలో మరో రెండు విప్లవాలు అత్యంత మార్పును తీసుకొచ్చాయి. ఈ మూడింటిలోనూ మనం వెనుకబడ్డాం. ఏదీ క్రియేట్‌ చేసే పరిస్థితుల్లో లేం. అందుకే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో మనం క్రియేటర్లుగా మారాలి. ఈ రంగంలో మనమే లీడర్లుగా ఉండాలి. అందుకోసం ఆ దిశగా అడుగులు వేగంగా వేయాలి. 
 
ఫ్యాకల్టీల్లో ఆప్షన్లు పెంచాలి 
► జర్మనీ వంటి దేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఉంది. పాశ్చాత్య ప్రపంచం అంతా జనాభా అసమతుల్యత (డెమొగ్రఫిక్‌ ఇన్‌బ్యాలెన్స్‌)ను ఎదుర్కొంటోంది. కానీ, భారతదేశంలోనైనా.. ఆంధ్రప్రదేశ్‌లో చూసినా సుమారు 70 శాతం మంది పనిచేసే వయస్కులు ఉన్నారు. వీరికి సరైన విజ్ఞానం, నైపుణ్యం అందించేందకు విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాలి. 

► ఇప్పటి వరకు మన విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులను మాత్రమే నిర్దేశిస్తున్నాం. అదే పాశ్చాత్య దేశాల కరిక్యులమ్‌లో ఒక ఫ్యాకల్టీలో చాలా వర్టికల్స్‌ కనిపిస్తాయి. అక్కడ బీకాంలోనే అసెట్‌ మేనేజ్‌మెంట్, ఫైనాన్సియల్‌ మార్కెట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్, సెక్యూరిటీ అనాలసిస్‌ ఇలా ఎన్నో ఉంటాయి. ఇవి మన దగ్గర లేవు.  

► మన వాళ్లు మంచి డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లాల్సిందే. ఏపీలో చదువుకునే విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్‌ చదువుకునే అవకాశాలు ఇవ్వాలి. తాజాగా డిగ్రీలకు సంబంధించి క్రెడిట్స్‌ ఇస్తున్నాం. ఇకపై వాటి స్థాయిని పెంచుతూ ప్రతి ఫ్యాకల్టీలో ఎక్కువ ఆప్షన్లలో బోధన సాగించాలి. ఇప్పటికే ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసి, ఉద్యోగాల కల్పన దిశగా అడుగులేశాం. విద్యార్థుల ఉన్నతికి ఇలాంటి ఎన్నో మార్పులు అవసరం.  

► సెక్యూరిటీ అనాలసిస్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వంటి వర్టికల్‌ కోర్సులకు బోధన సామర్థ్యం మన దగ్గర అందుబాటులో లేకపోతే.. వర్చువల్‌ రియాలిటీని.. ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీతో అనుసంధానించి వర్చువల్‌ క్లాస్‌ టీచర్‌ ద్వారా పాఠాలు చెప్పిద్దాం. 
 
మెడికల్‌ కోర్సుల్లో సాంకేతిక విజ్ఞానం పెంపు 
► వైద్య విద్య కోర్సుల్లోని బోధన పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి. భవిష్యత్తులో ఐదేళ్ల మెడికల్‌ కోర్సులో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచాలి. శరీర భాగాలను కోసి ఆపరేషన్‌ చేసే రోజులు మారిపోయాయి. కంప్యూటర్ల ద్వారా ఏఐను వాడకుని చిన్న చిన్న రంధ్రాలతో ఆపరేషన్‌ చేస్తున్నారు. అందుకే వైద్య విద్యలో రోబోటిక్స్, ఏఐలను భాగస్వామ్యం చేయాలి. 

► హర్యానాలోని ఒక మెడికల్‌ కాలేజీలో ఇలాంటి కోర్సులనే ప్రవేశపెట్టారు. కేవలం మెడిసిన్‌లో చికిత్సకు సంబంధించిన విజ్ఞానం ఇవ్వడమే కాదు, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడంపై కూడా పాఠ్య ప్రణాళికలో జోడించాలి. 
 
త్వరలో ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ 
► ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) ఏర్పాటుతో వ్యవసాయం చేసే తీరులో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే గ్రామ స్థాయిలోనే రైతును చేయి పట్టుకుని సాగు చేయించే వ్యవస్థను తీసుకొచ్చాం.  

► ఇంతటితో ఆగిపోకుండా.. ప్రతి ఎకరాలో భూసార పరీక్షలు చేసి పంట సాగయ్యేలా చర్యలు చేట్టాలి. శాటిలైట్‌ ఇమేజ్‌ ద్వారా భూమిలోని కాంపోజిషన్‌ను తెలుసుకోవచ్చు. డ్రోన్ల ద్వారా భూమిలోని మినరల్‌ డిపాజిట్లను ఇంకా దగ్గరగా తెలుసుకునే అవకాశం వస్తోంది. ఆ రిపోర్టుల ద్వారా వ్యవసాయంలో ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకురావచ్చు. అప్పుడు పంటలకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలో సులభంగా తెలుస్తుంది. ఇటువంటి టెక్నాలజీని మన విద్యార్థులకు నేర్పించాలి. 
 
హైలెవల్‌ అకడమిక్‌ బోర్డు 
► ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, ఎంఐటీ, కేంబ్రిడ్జ్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లోని పాఠ్యపుస్తకాలు, బోధనా పద్ధతులు, ప్రశ్నపత్రాల సరళి మన కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అక్కడ టెక్ట్ బుక్స్‌ విద్యార్థులకు ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. తద్వారా ప్రాక్టికల్‌ అప్లికబిలిటీని పరీక్షిస్తారు. అందుకే మనదగ్గర కూడా ప్రశ్నపత్రాల రూపకల్పన, బోధనా పద్ధతులు పూర్తిగా మారాలి. ఒక్కో యూనివర్సిటీ ఒక్కో రకంగా కరిక్యులమ్‌ తయారు చేయడం కాకుండా అందరూ అనుసరించేలా ఒక నిర్దిష్టమైన కరిక్యులమ్‌ రూపొందించాలి. 

► అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్య స్థాయిలో వేర్వేరుగా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మనం విజన్‌ కోసం ఒక హైలెవల్‌ అకడమిక్‌ బోర్డు అవసరం. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులతో ఈ బోర్డును ఏర్పాటు చేద్దాం. తద్వారా పాశ్చాత్య దేశాల విద్యా విధానంలోని అంశాలతో మన కరిక్యులమ్‌ను రీడిజైన్‌ చేద్దాం. పాఠ్యప్రణాళికను, బోధనను, ప్రశ్నపత్రాల తీరును మారుద్దాం.  
 
పాఠశాల స్థాయి నుంచే మార్పులు 
► విద్యా వ్యవస్థలో పాఠశాల స్థాయి నుంచే సమూల మార్పులు రావాలి. ఇప్పటికే మనం ఆ దిశగా చర్యలు చేపట్టాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు, బైలింగ్వల్‌ పాఠ్య పుస్తకాలు, ఆరో తరగతి నుంచి డిజిటల్‌ బోధనను తీసుకొచ్చాం. డిసెంబర్‌ నాటికి 63 వేల క్లాస్‌ రూమ్స్‌ను ఐఎఫ్‌పీ ఫ్యానెల్స్‌తో డిజిటలైజ్‌ చేస్తున్నాం. ఇప్పటికే 31 వేల తరగతి గదుల్లో ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం. 

► బైజూస్‌ కంటెంట్‌ను ఇంటిగ్రేట్‌ చేశాం. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇచ్చాం. దీనికి తదుపరిగా మరిన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమర్జింగ్‌ టెక్నాలజీల్లో చాలా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అవసరమైతే ఇంటర్నెట్‌లోని కంటెంట్‌ ద్వారా టెక్నాలజీ వాడకంపై శిక్షణ ఇస్తే మనకూ తగినంత ఫ్యాకల్టీ సిద్ధమవుతారు.  

► విద్యా రంగంలో ఇప్పుడు జరుగుతున్న మార్పులను గమనిస్తే.. మనం ఒక స్థాయిలో ఉంటే.. లక్ష్యం ఇంకో స్థాయిలో ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలంటే వైస్‌ చాన్సలర్లు కూడా ఆలోచించాలి. దీనిపై మరిన్ని సమాలోచనలకు నాలుగైదు యూనివర్సిటీలతో వర్కింగ్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్‌తో పాటు ఇతర ఫ్యాకల్టీలు కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసుకుని అత్యుత్తమ పాఠ్య ప్రణాళిక, అత్యుత్తమ బోధనా పద్ధతులను ఖరారు చేయాలి. 

► ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటీ కృష్ణబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కళాశాల విద్యా శాఖ కమిషనర్‌ పోలా భాస్కర్, ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి, ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి,  విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లు పాల్గొన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement