సాక్షి, అమరావతి: విద్యారంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన బోధనా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యా వ్యవస్థ అవసరాలు, విద్యార్థుల ప్రయోజనాలను నెరవేర్చడం లక్ష్యంగా అధ్యయనం కొనసాగాలని దిశా నిర్దేశం చేశారు. ఉపాధ్యాయుల సామర్థ్యాలు, సమర్థతను మరింత పెంచడం, బోధన ప్రమాణాలను పెంపొందించడంపై ఆలోచన చేయాలన్నారు. ‘ఉన్నత విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగంపై కార్యాచరణ రూపొందించాలి.
ఏఐలో మరిన్ని అంశాలను నేర్చుకునేందుకు వీలుగా అంతర్జాతీయ విద్యారంగంలో ప్రసిద్ధ సంస్థలను భాగస్వాములుగా చేయాలి. ఐబీ, ఐజీసీఎస్‌ఈ సిలబస్‌తో వివిధ కోర్సులను తొలుత పైలట్ పద్ధతిలో ప్రవేశపెట్టి విస్తృత అధ్యయనం తరువాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలి’ అని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ సోమవారం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఏఐ టెక్నాలజీ వినియోగం, పాఠశాలలు, ఇంటర్ విద్యలో ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ), ఐజీసీఎస్‌ఈ (క్రేంబ్రిడ్జి) సిలబస్ అమలుపై పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
జాబ్ ఓరియెంటెండ్ విద్యా విధానం
అందుబాటులో ఉన్న ఏఐని బోధన, సబ్జెక్టు పరిజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించుకోవాలి. ఈ టెక్నాలజీని నేర్చుకోడం ఒక్కటే కాకుండా ఏఐలో క్రియేటర్లుగా మారడం ఎలా అన్నది ప్రధాన అంశంగా విద్యార్థులను తీర్చిదిద్దాలి. కొత్త తరహా సబ్జెక్టులను నేర్చుకునేందుకూ ఏఐని వినియోగించుకోవాలి. అధ్యాపకుల కొరత, కంటెంట్ల కొరతను నివారించేందుకు ఏఐ ఉపయోగపడుతుంది. దీనిపై ప్రధానంగా అధికారులు దృష్టి పెట్టాలి.
విద్యార్ధులు తాము నేర్చుకున్న థియరీ నిజ జీవితంలో ఏ మేరకు ప్రాక్టికల్‌గా ఉపయోగపడుతుందో వివరిస్తూ ప్రశ్నాపత్రాలు రూపొందించాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ విద్యావిధానంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించాలి. ఉన్నత విద్యలో ఏ కోర్సు నేర్చుకున్నా అది విద్యార్థికి మంచి ఉద్యోగం, ఉపాధి కల్పించేలా ఉండాలి. అందుకు అనుగుణంగా కోర్సులు రూపొందించాలి.
మన సర్టిఫికెట్లకు అత్యుత్తమ విలువ ఉండేలా..
ప్రపంచస్థాయి బోధనే లక్ష్యంగా మన విద్యా రంగం అడుగులు వేయాలి. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్ విద్యలో ఐబీ, ఐజీసీఎస్‌ఈ సిలబస్ అమలు దిశగా ప్రణాళిక రూపొందించాలి. ముందుగా తొలుత విస్తృతంగా అధ్యయనం, కసరత్తు జరగాలి. విద్యార్థుల ప్రయోజనాలను నెరవేర్చేలా, మన విద్యావ్యవస్థ అవసరాలను తీర్చేలా ఇది ఉండాలి.
పాఠశాల విద్యలో కూడా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన విద్యా విధానాలు అందుబాటులోకి రావాలి. దీనిపైనా అధ్యయనం తప్పనిసరి. మన విద్యార్థులు పదో తరగతి సర్టిఫికెట్ తీసుకున్నా, ఇంటర్ సర్టిఫికెట్ తీసుకున్నా వాటికి ప్రపంచంలో ఎక్కడైనా సరే అత్యుత్తమ విలువ ఉండాలన్నదే మన లక్ష్యం. శాస్త్ర సాంకేతిక, ఆర్థిక, వ్యాపార, ఇతర రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయాలి.
నాయకులు మార్పును స్వాగతించాలి..
గత సర్కారు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను, విద్యార్థులను గాలికొదిలేశారు. మనం వచ్చాక అనేక మార్పులు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని సమర్థంగా అమలు చేసి విజయవంతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడం మన బాధ్యత. ఉన్నత ఆలోచనలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించేలా చర్యలు చేపట్టాలి. నాయకులుగా ఉన్న వ్యక్తులు మార్పులను స్వాగతిస్తూ పేద విద్యార్థులకు మంచి జీవితాన్ని అందించాలి. సులభంగా నేర్చుకునే విధానాలతోపాటు విద్యార్థుల్లో ఆసక్తి, సృజనాత్మకత పెంచేందుకు నిరంతరం కృషి చేయాలి.
వర్సిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు
ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కోర్సు చివరిలో ‘ఏఐ’ ప్రాథమిక అంశాలను బోధించేలా కార్యాచరణ రూపొందించినట్లు సమావేశంలో అధికారులు వివరించారు. ఏఐపై పరిశోధన కోసం యూనివర్సిటీల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బోధన, పరిశోధన, అసెస్‌మెంట్‌లో ఏఐ టూల్స్ వినియోగంతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐని ఒక కోర్సుగా ప్రమోట్ చేస్తామన్నారు. ఏఐ ప్రాథమిక అంశాలపై అవగాహన పెంపొందించేలా సమగ్ర ఫౌండేషన్ కోర్సును బైలింగ్యువల్, డిజిటల్ కంటెంట్ రూపంలో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
ప్రపంచస్థాయి సంస్థలతో మమేకమై ఏఆర్, వీఆర్ కంటెంట్, డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశోధనలో బోధనా పద్ధతులు, క్లాస్‌రూం మేనేజ్‌మెంట్, వ్యక్తిగతంగా నేర్చుకునే విధానాల కోసం ఏఐని వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఏఐ, అప్లికేషన్ల వినియోగంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.
కంప్యూటర్ విజన్ జోన్, ఇమేజ్ ప్రాసెసింగ్ జోన్, మెటావర్స్ లెర్నింగ్ జోన్లను యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉన్నత విద్యలో మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల్లో (మూక్) విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా విభాగంలో మొత్తం 1,17,012 మంది మూక్ కోర్సులు అభ్యసించినట్లు తెలిపారు. విద్యార్థులు 1.5 లక్షల కోర్సులను నేర్చుకోవడం ద్వారా 5.09 లక్షల క్రెడిట్స్ సాధించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment