బడ్జెట్‌ సమగ్ర స్వరూపం | Telangana State Budget Full Structure | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ సమగ్ర స్వరూపం

Published Tue, Sep 10 2019 4:28 AM | Last Updated on Tue, Sep 10 2019 4:29 AM

Telangana State Budget Full Structure - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇతర రంగాల కేటాయింపుల్లో భారీకోత విధించగా, వ్యవసాయరంగానికి మాత్రం గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే సుమారు రూ.3,340 కోట్ల మేర పెంచారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పశుసంవర్థక, మత్స్య శాఖల నిధులు పెరిగాయి. అయితే, సహకార రంగం కేటాయింపుల్లో మాత్రం సుమారు 15 కోట్ల మేర తగ్గించారు. రూ.1.46 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా సుమారు 11.4 శాతం మేర ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగినట్లు కనిపిస్తున్నా.. ప్రధానంగా రైతు సంక్షేమ పథకాలకే సింహభాగం నిధులు కేటాయించినట్లు వెల్లడవుతోంది. వ్యవసాయం, మార్కెటింగ్‌ రంగాలకు రూ.15,196 కోట్లు, సహకార రంగానికి రూ.92.66 కోట్లు, పశు సంవర్థక, మత్స్య శాఖలకు రూ.1,431.96 కోట్లు కేటాయించారు. జాతీయ ఆహార భద్రత మిషన్, వ్యవసాయ పారిశ్రామికీకరణ, పంట కాలనీల అభివృద్ధి, భూసార, జల సంరక్షణ, సూక్ష్మసేద్యం వంటి పలు పద్దులకు పూర్తిగా కోత విధించారు.  

పథకాలకు ప్రాధాన్యత 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయం, దాని అనుబంధ శాఖలతో కూడిన ప్రాథమిక రంగంలో రాష్ట్రం స్థిరమైన పురోగతి సాధిస్తూ.. 2018–19 ఆర్థిక సంవత్సరంలో 8.1 వృద్ధిరేటును సాధించింది. ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతుబంధు, రైతుబీమా, పంట రుణాల మాఫీ, ఉచితవిద్యుత్‌ వంటి రైతుసంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రైతుబంధు పథకం కింద ఎకరాకు పెట్టుబడి ప్రోత్సాహకాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ గతంలోనే సీఎం ప్రకటన చేశారు. దీంతో ప్రస్తుత బడ్జెట్‌లో రైతుబంధు పథకం కోసం రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంతో, 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. రైతుబీమాను యథాతథంగా కొనసాగిస్తూ.. బీమా ప్రీమియం కింద రూ.1,137 కోట్లు ప్రతిపాదించగా, 57 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేశారు. రూ.6 వేల కోట్ల పంటరుణాల మాఫీ ద్వారా 48 లక్షల మంది రైతులకు రుణవిముక్తి లభిస్తుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పథకాన్ని కొనసాగిస్తుండటంతో 23.04 లక్షల పంపుసెట్లకు ప్రయోజనం చేకూరుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల విద్యుత్‌ బిల్లుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించారు. 

వైద్యానికి 3,705 కోట్లు 
గత ఏడాదితో పోలిస్తే పెంచిన మొత్తం 200 కోట్లు
ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వైద్య, ఆరోగ్యశాఖకు ఈ ఏడాది బడ్జెట్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో కేటాయింపులు చేసింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.200 కోట్లను అదనంగా వడ్డించింది. 2018–19లో రూ.3,522 కోట్లు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,705 కోట్లను ప్రతిపాదించింది. పేదలకు ఆపన్నహస్తం అందించే ఆరోగ్యశ్రీ పథకానికి కూడా నిధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనిచ్చింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.190 కోట్లను అధికంగా కేటాయించింది. 2018–19లో రూ.530 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.720 కోట్లను పొందుపరిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు భారీగా కత్తెర పెట్టింది. ఆయుష్మాన్‌ భారత్‌తో పాటు ఇతర కేంద్ర పథకాలకు గత బడ్జెట్‌తో పోలిస్తే ఏకంగా రూ.18 కోట్లను
కుదించింది. 

ముఖ్య కేటాయింపులు ఇలా.. 
ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖకు నిరుడు కంటే అధికంగా నిధులు ఇచ్చారు. గతేడాది రూ.460 కోట్లు కేటాయించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.529 కోట్లకు పెంచారు.  
వైద్యం, ప్రజారోగ్యానికి ఈ సారి రూ.340 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.ఐదు కోట్లు అధికం. 
వైద్య విద్య, శిక్షణ, పరిశోధనకు రూ.111 కోట్లను ఇచ్చారు.  
​​​​​​​- జాతీయ కుష్టు నివారణ పథకానికి రూ.2.32 కోట్లు, జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమానికి రూ.2.52 కోట్లు, అంటువ్యాధి నియంత్రణ కార్యక్రమానికి రూ.6.29 లక్షలను కేటాయించారు. 
​​​​​​​- కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులను కోత పెట్టింది. 2018–19తో పోలిస్తే రూ.450 కోట్లు తగ్గించింది. గత బడ్జెట్‌లో రూ.1,216 కోట్లు కేటాయించగా.. తాజా బడ్జెట్‌లో రూ.766 కోట్లను మాత్రమే చూపింది. ఇందులో నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)కు రూ.175.51 కోట్లు కేటాయించింది.  
​​​​​​​-  ఆయుర్వేద, యునాని, యోగ, సిద్ధ, హోమియోపతి విభాగాలకు రూ.19 కోట్లు ఇచ్చింది. గతేడాది పోలిస్తే రూ.18 లక్షలు మాత్రమే అధికంగా ఇచ్చింది. 
​​​​​​​-  ఔషధ నియంత్రణకు రూ.16.88 కోట్లను కేటాయించింది.  

డిస్కంలకు ధమాకా!
తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిధుల కేటాయింపులను పెంచింది. 2017–18లో రూ.3,728.25 కోట్లను వ్యవసాయ విద్యుత్‌ రాయితీలకు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో రూ.5,984 కోట్లకు పెంచింది. స్పిన్నింగ్‌ మిల్లులకు విద్యుత్‌ రాయితీలను రూ.35 కోట్ల నుంచి రూ.95 కోట్లకు పెంచింది. దీంతో మొత్తం విద్యుత్‌ రాయితీలు రూ.6,079 కోట్లకు పెరిగాయి. తెలంగాణ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థకు ఈసారి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. నిర్వహణ పద్దు కింద ఇంధన శాఖకు కేటాయింపులను రూ.622.86 కోట్ల నుంచి రూ.204.45 కోట్లకు తగ్గించింది. గతేడాది విద్యుత్‌ ప్రాజెక్టులకు రూ.598.24 కోట్ల రుణాలు కేటాయించగా, ఈసారి రూ.197.02 కోట్లకు తగ్గించింది.  

ప్రతివ్యక్తిపై అప్పు..58,202 
రాష్ట్ర అప్పులు 2.03 లక్షల కోట్లు.. జీఎస్‌డీపీలో 21% అప్పులే 
గ్యారంటీలు కూడా బాగానే..  
రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల రుణాలకు గ్యారంటీలను కూడా భారీగానే ఇస్తోంది. ఇప్పటివరకు రూ.77,314 కోట్లను వివిధ కార్పొరేషన్ల రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. ఇందులో సాగునీటి శాఖ కోసం రూ.32,130 కోట్లు, మిషన్‌ భగీరథకు రూ.23,014 కోట్లు, ఇతర పథకాలకు రూ.22,170 కోట్ల రుణాలకు గ్యారంటీలు ఇచ్చింది. మరోవైపు మూలధన వ్యయంలో తగ్గుదల కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.23,902 కోట్ల మూలధన వ్యయం జరగ్గా, అది 2018–19 సంవత్సరానికి రూ.33,369 కోట్ల మేర ఉందని అంచనా. సవరించిన అంచనాల్లో అది దాదాపు రూ.7 వేల కోట్లు తగ్గి రూ.26,888 కోట్లు మాత్రమే జరిగింది. ఈసారి బడ్జెట్‌ అంచనాల్లోనే రూ.17,274 కోట్లను మూలధన వ్యయం కింద ప్రతిపాదించగా, అందులో ఎంతమేరకు సంపద సృష్టి కోసం జరుగుతుందనేది ఆర్థిక సంవత్సరం ముగిశాక తేలనుంది.  

ఓపెన్‌ మార్కెట్‌ రుణాలే ఎక్కువ 
రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లోనే ఎక్కువగా రుణాలు తీసుకుంటోంది. ఇప్పటివరకు బహిరంగ మార్కెట్‌లో రూ.1.63 లక్షల కోట్లకుపైగా రుణాలు సమీకరించగా, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.9,457 కోట్లు, స్వయంప్రతిపత్తి సంస్థల నుంచి 12,391 కోట్లు, బాండ్ల రూపంలో రూ.18,813 కోట్లు సమీకరించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.1.29 కోట్ల అప్పు ఉంటే 2019–20 నాటికి అది 2 లక్షల కోట్లకు మించిపోవడం గమనార్హం. అంటే.. గత నాలుగేళ్లలో రూ.74 వేల కోట్ల అప్పులు పెరిగాయన్నమాట.  

బీసీలకు రిక్తహస్తం 
గత ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే తగ్గించిన మొత్తం రూ. 2,321 కోట్లు
వెనుకబడిన వర్గాలను తాజా బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు సగం కేటాయింపులకు కోత పడింది. 2018–19 సంవత్సరంలో రూ.5,690.04 కోట్లుగా (బడ్జెట్‌ అంచనా) కేటాయించారు. వార్షిక సంవత్సరం చివరినాటికి సవరించిన అంచనాగా రూ.5,311.44 కోట్లు ఖరారు చేశారు. 2019–20 సంవత్సరంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.4,528.01 కోట్లు కేటాయించారు. తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.2,990.04 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే బీసీలకు కేటాయింపులు 43.70 శాతం తగ్గడం గమనార్హం. 

ఫెడరేషన్లకు సున్నా..
బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 11 ఫెడరేషన్లు ఉన్నాయి. ఆయా సామాజిక వర్గాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాల నిమిత్తం రాయితీ రుణాలను ఈ ఫెడరేషన్లు మంజూరు చేస్తాయి. తెలంగాణ నాయిబ్రాహ్మణ ఫెడరేషన్, వాషర్‌మెన్, వడ్డెర, కృష్ణబలిజ, వాల్మీకిబోయ, భట్రాజు, మేదర, విశ్వబ్రాహ్మణ, కుమ్మరిశాలివాహన, సగర, కల్లుగీత ఫెడరేషన్లకు తాజా బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయించలేదు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్‌కు సైతం ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి వీటికి పెద్దగా నిధులివ్వలేదు. కులవృత్తులు, గ్రామీణ ఉపాధి పట్ల ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ప్రభుత్వం పలుమార్లు పేర్కొనడంతో రాయితీ పథకాలపై నిరుద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. తాజా బడ్జెట్‌ను పరిశీలిస్తే స్వయం ఉపాధి పథకాలు ఈ ఏడాది అటకెక్కినట్లే తెలుస్తోంది. 

ఎంబీసీ కార్పొరేషన్‌కు మొండిచెయ్యి
అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన ఎంబీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మొండిచెయ్యి చూపింది. 2017–18 సంవత్సరంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తొలి ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా... ఆ తర్వాత సంవత్సరం రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. గత ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన ఓటాన్‌ అకౌంట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించగా... ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ కార్పొరేషన్‌ ద్వారా ఈ ఏడాది రాయితీ పథకాలు అమలు కష్టమే. 

కల్యాణలక్ష్మికి రూ.1,540 కోట్లు
తాజా బడ్జెట్‌లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు నిధుల కేటాయింపుల్లో ఎలాంటి కోత పడలేదు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్‌లో కోత పడినప్పటికీ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమాలు కావడంతో వీటి ప్రాధాన్యతల్లో ఏమాత్రం తగ్గలేదు. నాలుగు సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న ఈ పథకాలకు 2018–19 వార్షిక సంవత్సరంలో రూ.1,450.46 కోట్లు కేటాయించారు. 2019–20 వార్షిక సంవత్సరంలో కూడా ఇదే మొత్తంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. షాదీ ముబారక్‌ పథకం కింద మాత్రం అదనంగా రూ.89.99 కోట్లు కేటాయించింది. లబ్ధిదారుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు కేటాయింపులు పెంచినట్లు తెలుస్తోంది. 

‘ఇంటి’కి ఇబ్బందులే...
డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణంలో మరింత జాప్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ప్రగతి పద్దుతో పోలిస్తే.. ఈసారి పగ్రతి పద్దులు పదింతలు తగ్గిపోయాయి. దీంతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 2018–19 బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.2,795.14 కేటాయించగా 2019–20లో కేవలం రూ.977.68 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏ శాఖకైనా ప్రగతి పద్దులు చాలా కీలకం. గతేడాది ప్రగతి పద్దు కింద రూ.2,143.14 కోట్లు కేటాయించగా, ఈసారి వాటిని రూ.280 కోట్లకు కుదించారు. వాస్తవానికి ప్రభుత్వం 2,72,763 ఇళ్లకు ఆమోదం తెలిపింది. 2017–2018లో ఈ ఇళ్లకు రూ.1,500 కోట్లు కేటాయించింది. 2018–19లో రూ.2,795.14 కేటాయించింది. కానీ, ఈసారి ఆర్థిక మాంద్యం కారణంగా రూ.977.68 కోట్లు మాత్రమే కేటాయించింది.  

పురపాలికలకు కట్‌కటే!
గత ఏడాదితో పోలిస్తే తగ్గించిన మొత్తం రూ.4,196 కోట్లు
పుర ఎన్నికలకు ముందు పురపాలక శాఖకు బడ్జెట్‌ కేటాయింపుల్లో భారీ కోత పడింది. 2018–19 బడ్జెట్‌లో పురపాలక శాఖకు ప్రగతి పద్దు కింద రూ.4,680.09 కోట్లను కేటాయించగా, 2019–20 వార్షిక బడ్జెట్‌లో రూ.1,791.94 కోట్లకు తగ్గించింది. నిర్వహణ పద్దును సైతం రూ.2,570.46 కోట్ల నుంచి రూ.1,262.21 కోట్లకు కుదించింది. గతేడాది వరంగల్‌ నగరానికి రూ.226.41 కోట్లు, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం నగరాలకు కలిపి మొత్తం రూ.301.88 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ సారి రిక్తహస్తం చూపించింది.  గత ఏడాది రూ. 7,250 కోట్లు కేటాయించగా..ఈ సారి రూ. 3054 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.755.20 కోట్ల నుంచి రూ.521.73 కోట్లకు తగ్గించింది.

14వ ఆర్థిక సంఘం కింద 2018–19లో ఎలాంటి కేటాయింపులు చేయకపోయినా, తాజాగా రూ.1,036.98 కోట్లు కేటాయించడం ఊరట కల్పించే అంశమని చెప్పవచ్చు. అయితే, సవరించిన అంచనాల కింద గతేడాది రూ.777.73 కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులను పురపాలికలకు ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రప్రభుత్వ అమృత్‌ పథకం కింద కేటాయింపులు రూ.403 కోట్ల నుంచి రూ.49.70 కోట్లకు తగ్గాయి. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం గతేడాది రూ.230.10 కోట్లు కేటాయించగా, ఈ సారి సున్నతో సరిపెట్టింది. మున్సిపల్‌ కార్పొరేషన్లకు వడ్డీ లేని రుణాలను రూ.141.64 కోట్ల నుంచి రూ.75.47 కోట్లకు తగ్గించింది. పురపాలికల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రుణ సహాయం కోసం టీయూఎఫ్‌ఐడీసీకి కేటాయింపులను రూ.200 కోట్ల నుంచి రూ.25.94 కోట్లకు తగ్గించింది. కొత్తగా మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 కోట్ల నుంచి రూ.5.51 కోట్లకు తగ్గించింది.

ఆలయాలకు నిధుల్లేవ్‌
రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలకు నిధుల కోత పడింది. యాదగిరిగుట్ట ఆలయాభివృద్ధి సంస్థకు గతేడాది రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, తాజాగా రూ.50 కోట్లకు తగ్గించింది. ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తికావడంతో కేటాయింపులు తగ్గించినట్లు తెలుస్తుంది. వేములవాడ ఆలయాల అభివృద్ధి సంస్థకు రూ.100 కోట్ల నుంచి రూ.5 లక్షలకు తగ్గించింది. ధర్మపురి, బాసర ఆలయాభివృద్ధి సంస్థలకు గతేడాది చెరో రూ.50 కోట్లను కేటాయించగా, ఈ సారి ఎలాంటి కేటాయింపులు చేయలేదు. భద్రాచలం ఆలయాభివృద్ధి సంస్థకు రూ.100 కోట్ల నుంచి సున్నాకు కేటాయింపులు తగ్గాయి. 

హైదరాబాద్‌ నగరానికి మొండిచేయి
ప్రగతి పద్దు కింద.. హైదరాబాద్‌ నగరంలో మూసీ నది పరీవాహక ప్రాంత అభివృద్ధికి గతేడాది రూ.377.35 కోట్లు, నగర రోడ్ల అభివృద్ధికి రూ.566.02 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు కేటాయించగా, ఈ సారి ఈ పనులకు ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఎంఎంటీఎస్‌కు గతేడాది రూ.50 కోట్లు కేటాయించగా, ఈ సారి కేటాయింపులేమీ లేవు. హైదరాబాద్‌ జలమండలికి రూ.670 కోట్ల నుంచి రూ.825 కోట్లకు రుణ సహాయాన్ని పెంచగా, హైదరాబాద్‌ మెట్రో రైలుకు రూ.200 కోట్ల నుంచి రూ.10 లక్షలకు రుణాన్ని కుదించింది. హెచ్‌ఎండీఏకు మూలధన రుణాన్ని రూ.250 కోట్ల నుంచి రూ.10 లక్షలకు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టుకు రూ.235 కోట్ల నుంచి రూ.10 లక్షలకు రుణాలను తగ్గించింది. 

వడ్డీ చెల్లింపులకు 14 వేల కోట్ల పైనే
గత ఏడాది కన్నా అధికంగా కేటాయించిన మొత్తం రూ.2,878కోట్లు
తాజా బడ్జెట్‌ అంచనాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదించిన మొత్తం బడ్జెట్‌లో 10 శాతం నిధులు అప్పులకు వడ్డీలు చెల్లించేందుకే సరిపోనుంది. ఈ మేరకు 2019–20 బడ్జెట్‌ అంచనాలకు సంబంధించిన రెవెన్యూ ఖాతా వ్యయపట్టికలో రూ.14,574.73 కోట్లు వడ్డీ చెల్లింపుల కిందే చూపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వనరుల నుంచి తీసుకున్న అప్పులకు ఈ వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో వడ్డీ చెల్లింపులకు రూ.12 వేల కోట్లకు పైగా ప్రతిపాదించగా, పూర్తిస్థాయి బడ్జెట్‌లో అది రూ.14,500 కోట్లు దాటిపోయింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి గాను అంచనాల బడ్జెట్‌లో రూ.11,691 కోట్లు అప్పులకు వడ్డీల కింద చూపెట్టగా, సవరించిన అంచనాల ప్రకారం అది మరో రూ.5 కోట్లు పెరిగింది. గతేడాదితో పోలిస్తే వడ్డీ చెల్లింపులు రూ.2,878 కోట్లు పెరగడం గమనార్హం. అదే 2017–18 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ చెల్లింపులు రూ.10,835 కోట్లు చూపెట్టారు. అంటే రెండళ్లలో దాదాపు రూ.4 వేల కోట్ల వడ్డీలు బడ్జెట్‌పై అదనపు భారంగా మారాయన్న మాట..  

అప్పుల కుప్ప..
ఇక ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున రుణాలు అవసరమవుతాయని బడ్జెట్‌ అంచనా లెక్కలు చెబుతున్నాయి. ఏ రూపంలో అయినా రూ.33 వేల కోట్ల మేర అప్పుల ద్వారా సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత రుణం రూ.33,444 కోట్లుగా రాబడుల వివరణలో ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఓపెన్‌మార్కెట్‌ రుణాల కింద రూ.31 వేల కోట్లు సేకరించాలని, కేంద్రం నుంచి రూ.800 కోట్లు, ఇతర రుణాలు రూ.1,000 కోట్లు సమీకరించాలని ప్రతిపాదించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.32,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల రూపంలో సమీకరించగా, వచ్చే ఏడాది ప్రతిపాదిత రుణం గతేడాది కన్నా రూ.1,044 కోట్లు అధికంగా కనిపిస్తోంది. ఇదే ఆర్థిక మాంద్య పరిస్థితులు కొనసాగితే వచ్చే ఏడాది అప్పుల కింద రూ.40 వేల కోట్ల వరకు సమీకరించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  

ప్రగతిలో పోలీస్టు
పోలీసుశాఖ ప్రగతిపద్దు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. 2018–19లో రూ.1,143 కోట్లుగా ఉన్న ప్రగతిపద్దు 2019–20లో కేవలం రూ.167 కోట్లకే పరిమితమైంది. రూ.4,297 కోట్ల మేరకు ఉన్న నిర్వహణ వ్యయాన్ని ఈసారి రూ.4,788 కోట్లకు పెంచారు. నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటంతో రూ.500 కోట్లు అదనంగా కేటాయించారు. కొత్త జిల్లాల్లో కమిషనరేట్లు, ఎస్పీల కార్యాల యాలు, కొత్త ఠాణాలు, క్వార్టర్లు తదితర నిర్మాణాలకు అరకొర నిధులే. కమిషనరేట్ల విషయానికి వస్తే.. హైదరాబాద్‌ ప్రగతిపద్దుకు కోత పడింది. ప్రగతి పద్దు గతేడాది రూ.476 కోట్లు ఉండగా ఈసారి కేవలం రూ.56 కోట్లకు పరిమితం చేశారు. రాచకొండలో సగానికిపై ప్రగతి నిధుల్లోనూ కోతపడింది. గతేడాది రూ.35.36 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.13.35 కోట్లకే పరిమితమైంది. సైబరాబాద్‌ కమిషనరేట్‌కు గతేడాది ప్రగతినిధులు రూ.35.36 కోట్లు ఇవ్వగా.. ఈసారి రూ.14.03 కోట్లకే పరిమితం చేశారు.

ఐటీ, పారిశ్రామిక రంగాలకు కోత 
గత ఏడాదితో పోలిస్తే తగ్గించిన మొత్తం 740 కోట్లు
ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో పారిశ్రామిక, ఐటీ రంగాల కేటాయింపుల్లో భారీ కోత విధించారు. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక రంగానికి ఏకంగా రూ.740.12 కోట్ల మేర కేటాయింపులు తగ్గిస్తూ ప్రతిపాదనలు సమర్పించారు. నిర్వహణ పద్దులో కోత విధించే పరిస్థితి లేకపోవడంతో.. ప్రగతి పద్దులో కేటాయింపులు పూర్తిగా తగ్గించారు. గతేడాది పారిశ్రామిక రంగానికి ప్రగతి పద్దు కింద రూ.904.19 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం రూ.172.28 కోట్లతో సరిపుచ్చారు. దీంతో పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్, ఇతర ప్రోత్సాహకాలపై భారీగా ప్రభావం పడింది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం రూ.210.78 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.21.55 కోట్లతో సరిపెట్టారు.

పారిశ్రామిక ప్రోత్సాహకాల్లో ఒకేసారి రూ.189.23 కోట్లు తగ్గించడం రాష్ట్రంలో పురోగతిపై ప్రభావం చూపనుంది. విద్యుత్‌ సబ్సిడీ కేటాయింపులు కూడా గతేడాదితో పోలిస్తే రూ.97.02 కోట్ల మేర కేటాయింపులు తగ్గించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలతో పాటు ఎస్‌ఎస్‌పీ, టీఎస్పీ పథకాల ద్వారా ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పేరుకు పోయాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రోత్సాహక బకాయిలు చెల్లింపు పూర్తయ్యే పరిస్థితి కనిపించట్లేదు. జహీరాబాద్‌ నిమ్జ్‌ భూ సేకరణ కోసం గతేడాది రూ.82.29 కోట్లు ప్రకటించగా, ప్రస్తుతం రూ.9.19 కోట్లతో సరిపెట్టారు. నేత కార్మికులకు గ్రాంటు, ఇసుక అన్వేషణ పరిహారం కోసం రివాల్వింగ్‌ ఫండ్, చెరుకు, వాణిజ్య ఎగుమతి తదితరాలకు నామమాత్ర కేటాయింపులతో సరిపెట్టారు. 

ఐటీ  మౌలిక సౌకర్యాల నిధుల్లోనూ..
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో కీలకంగా ఉన్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్‌ శాఖ కేటాయింపుల్లోనూ ప్రస్తుత బడ్జెట్‌లో కోత విధించారు. పారిశ్రామిక కేటాయింపుల తరహాలో నిర్వహణ పద్దు కింద కేటాయింపుల్లో రూ.30 లక్షలకు తగ్గిస్తూ, ప్రగతి పద్దులో రూ.181.15 కోట్లు కలుపుకొని మొత్తంగా రూ.181.45 కోట్లు తగ్గించారు. ఐటీ శాఖ పరిధిలోని అన్ని ఉప పద్దుల్లోనూ సహాయక గ్రాంట్లను తగ్గించారు. జవహార్‌ నాలెడ్జ్‌ కేంద్రాలకు గతేడాది రూ.8.22 కోట్లు కేటాయించగా, ప్రస్తుతం నయా పైసా విదల్చలేదు. ఐటీ రంగంలో మౌలిక సౌకర్యాల కల్పనకు గత బడ్జెట్‌లో రూ.78 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.10 లక్షలతో సరిపెట్టారు. పారిశ్రామిక, ఐటీ రంగాలకు చిరునామాగా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్‌ ప్రతిపాదనలు ఎంత మాత్రం ఆశాజనకంగా లేవని సంబంధిత వర్గాల ప్రతినిధులు వెల్లడించారు. 

నిరుద్యోగ భృతికి కోత
నిరుద్యోగ భృతికి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగులకు నెలవారీ భృతి ఇస్తామని ఇచ్చిన హామీ అమలుకు మరికొంత సమయం పట్టనుంది. 2019–20 ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌లో నిరుద్యోగుల భృతికి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు ఓటాన్‌ అకౌంట్‌లో నిరుద్యోగ భృతి కింద ప్రభుత్వం రూ.1,810 కోట్లు కేటాయించింది. ఈ పనులకు రూ.3,016 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అప్పటి లెక్కల ప్రకారం 5 లక్షల మంది నిరుద్యోగులకు భృతి అందించే వీలుంది. కానీ తాజా గణాంకాల ప్రకారం నిరుద్యోగులకు నిధులు కేటాయించకపోవడంతో వారు మరికొంత కాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

బియ్యం సబ్సిడీకి రూ.1432 కోట్లు
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే సబ్సిడీ బియ్యం కోసం ఈసారి బడ్జెట్‌లో రూ. 1432.40 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కేటాయింపులు రూ. 1,718.33 కోట్లు కాగా ఈసారి నిధుల్లో రూ. 285.93 కోట్ల కోత పడింది. రాష్ట్రంలో అర్హులైన పేదలకు రూపాయికే కిలో బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద మొత్తంగా 2.80 లక్షల మంది లబ్ధిదారులకు సబ్సిడీ బియ్యం అందిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement