అప్పుతోనే ‘సాగు’తుంది! | Telangana Govt Reduced allocation of funds to irrigation sector | Sakshi
Sakshi News home page

అప్పుతోనే ‘సాగు’తుంది!

Published Tue, Sep 10 2019 3:41 AM | Last Updated on Tue, Sep 10 2019 4:04 AM

Telangana Govt Reduced allocation of funds to irrigation sector - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి తగ్గిన నిధుల కేటాయింపుల నేపథ్యంలో రాష్ట్ర సాగునీటి రంగానికి భారీ కోత పడింది. గతంలో ప్రవేశపెట్టిన మూడు పూర్తిస్థాయి బడ్జెట్‌లలో రూ.25 వేల కోట్లకు పైగా బడ్జెట్‌ కేటాయింపులు చేసిన ప్రభుత్వం ఈసారి రూ.8,476.17 కోట్లకే పరిమితం చేసింది. ఇందులో మేజర్‌ ఇరిగేషన్‌కు రూ.7,794.3 కోట్లు కేటాయించగా, మైనర్‌ ఇరిగేషన్‌కు రూ.642.3 కోట్లు కేటాయించింది. సీతారామ ఎత్తిపోతల, కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు అధిక కేటాయింపులు చేశారు. కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు రుణాల ద్వారా సేకరించిన నిధులనే ఖర్చు చేయనుండగా, సీతారామ, వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టుల తెలంగాణ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ ద్వారా తీసుకునే రుణాలతో నెట్టుకు రానున్నారు. మొత్తంగా రూ.12,400 కోట్ల రుణాలతో ప్రాజెక్టుల పనులను వేగిరం చేసే అవకాశం ఉంది. 2016–17 ఆర్థిక సంవత్సరం నుంచి వరుసగా మూడేళ్ల పాటు రూ.25 వేల కోట్లకు తగ్గకుండా నిధులు కేటాయించింది.

ఈ ఏడాది ఓట్‌ ఆన్‌ అకౌంట్‌లో 6 నెలలకే రూ.10 వేల కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. అయితే ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్‌లో మాత్రం సాగునీటికి కేటాయింపులు తగ్గాయి. ఈ బడ్జెట్‌లో అధికంగా సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.1,324.02 కోట్లు కేటాయించగా, కాళేశ్వరం రూ.1,080.18 కోట్లు, పాలమూరు–రంగారెడ్డికి రూ.500 కోట్ల మేర కేటాయింపులు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి కేంద్ర పథకాల నుంచి నిధులు వచ్చే అవకాశాల నేపథ్యంలో దీనికి రూ.545 కోట్లు కేటాయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర నిధులు కేటాయిస్తే ప్రాజెక్టులు పూర్తవుతాయని అధికారులు ప్రతిపాదనలు పంపగా, రూ.78 కోట్ల మేర మాత్రమే కేటాయింపులు చేశారు. ఇందులో కల్వకుర్తికి రూ.4 కోట్లు, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌కు చెరో రూ.25 కోట్ల మేర కేటాయింపులతో సరిపెట్టారు. మిషన్‌ కాకతీయ కింద చెరువుల పనులు పూర్తవడం, తూముల నిర్మాణంతో గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం మాత్రమే చేపడుతుండటంతో మైనర్‌ ఇరిగేషన్‌ బడ్జెట్‌కు కోత పడింది. గతంలో ప్రతిసారి రూ.2 వేల కోట్లకు పైగా కేటాయిస్తూ వస్తుండగా, ఈసారి రూ.643 కోట్లకు పరిమితం చేశారు. 

రుణాలతోనే గట్టెక్కేది..
2018–19 వార్షిక బడ్జెట్‌లో సాగునీటికి రూ.25 వేల కోట్ల కేటాయింపులు చేయగా, దీన్ని ప్రస్తుతం రూ.19,985 కోట్లకు సవరించారు. ఇది కాళేశ్వరం రుణాల ద్వారా మరో రూ.15 వేల కోట్లు, దేవాదుల, సీతారామలకు సంబంధించిన కార్పొరేషన్‌ల ద్వారా మరో రూ.3 వేల కోట్ల మేర ఖర్చు చేశారు. రుణాలతో కలిపి ఖర్చు చేసిన మొత్తాలను చూస్తే ఈ ఏడాది రూ.35 వేల కోట్లకు పైగా ఖర్చు జరిగింది. అయితే రాష్ట్ర బడ్జెట్‌లో నుంచి కేటాయింపులు చేసిన పాలమూరు–రంగారెడ్డికి రూ.3 వేల కోట్లు కేటాయించగా, దాన్ని రూ.2,179 కోట్లకు సవరించారు. తుపాకులగూడేనికి రూ.700 కోట్లు కేటాయించగా, దాన్ని రూ.518 కోట్లకు సవరించారు. ఇక ఈ ఏడాది బడ్జెట్‌ను పూర్తిగా కుదించారు. రూ.8,476 కోట్లకు కుదించడంతో పూర్తిగా రుణాల ద్వారానే భారీ ప్రాజెక్టులకు నిధుల ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం మొదటి దశ పనుల పూర్తికి కార్పొరేషన్‌ ద్వారా రూ.45 వేల కోట్ల రుణాలు సేకరించగా, ఇందులో ఇప్పటికే రూ.38 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది.

మిగతా రుణాలను ఖర్చు చేసి మల్లన్నసాగర్, గంధమల, బస్వాపూర్‌ పనులను పూర్తి చేయనున్నారు. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వీటన్నింటినీ కలిపి ఇప్పటికే కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.17 వేల కోట్ల రుణాలు తీసుకునే నిర్ణయం జరగ్గా, ఇప్పటికే రుణాల ద్వారా సేకరించిన మొత్తంలో రూ.6 వేల కోట్ల మేర ఖర్చు జరిగింది. మిగతా రుణాలను వినియోగించుకుంటూ మొత్తం పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. వీటితో పాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కాళేశ్వరం కార్పొరేషన్‌ ద్వారానే రూ.10 వేల కోట్లు రుణం తీసుకుంటున్నారు. దీంట్లోంచే ఈ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. మొత్తంగా అన్ని ప్రధాన ప్రాజెక్టులకు కలిపి రుణాల ద్వారానే రూ.12,400 కోట్లకు పైగా ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement