Budget allocations
-
ఏపీలో విద్యారంగం నీరుగారిపోతోంది!
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఐదు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ. 2 లక్షల 94 వేల 427 కోట్ల బడ్జెట్లో విద్యా రంగానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. విద్యార్థుల సంక్షేమానికి ఇవి ఏమాత్రమూ సరిపోవు. గత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక నిధులు కేటాయించి విద్యారంగ సంక్షేమానికి పెద్దపీట వేసిన సంగతి ఈ సందర్భంగా గమనార్హం.పాఠశాల విద్యకు చంద్రబాబు సర్కారు 2024–25 బడ్జెట్లో రూ. 29 వేల 909 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్లో ఇది కేవలం 9.84 శాతం మాత్రమే. ఈ కేటాయింపు పాఠశాల విద్యను ఎలా బలోపేతం చేస్తుంది? ‘నాడు–నేడు’ పథకం గురించి బడ్జెట్లో ఊసె త్తలేదు. గత జగన్ ప్రభుత్వం పాఠశాల భవనాల నిర్మాణం, మరమ్మత్తుల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో తీర్చిదిద్దింది. 8వ తరగతి విద్యార్థులకు ఉచిత బైజూస్ కంటెంట్ ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఆరో తరగతీ, ఆపై చదువు తున్న విద్యార్థులకు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేసింది. 45 వేల స్మార్ట్ టీవీలను ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. పాఠ్య, నోట్ పుస్తకాలు; బ్యాగులు, బూట్లు, యూనిఫారాలు వంటి వాటిని పాఠశాలల ప్రారంభం రోజునే పూర్తి స్థాయిలో జగన్ ప్రభుత్వం అందించింది. ‘విద్యా కానుక’, ‘జగనన్న గోరుముద్ద’ వంటి పథకాలకు వేలకోట్లు ఖర్చు చేసింది.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌లను జగన్ పటిష్టంగా అమలు చేశారు. గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 73 వేల కోట్లు విద్యారంగానికి కేటాయించి ఖర్చు చేశారు. గొల్లప్రోలు జెడ్పీ పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్‌లను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించి ప్రైవేట్ పాఠశాలల కంటే ఇవే బాగున్నాయని వ్యాఖ్యనించారు. జగన్ అమలు చేసిన విప్లవాత్మక సంస్కరణలకు పవన్ వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయి.‘తల్లికి వందనం’ (జగన్ హయాంలో ‘అమ్మఒడి’) పథకానికి చంద్రబాబు సర్కారు బడ్జెట్లో కేవలం రూ. 5,387.03 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్లందరికీ 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిన బాబు వాస్తవంగా 84 లక్షల మంది విద్యార్థులకు రూ. 12 వేల 600 కోట్లు ఇవ్వాలి. కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి చంద్రబాబు సర్కారు తల్లుల్ని తీవ్రంగా దగా చేసింది. ఇంగ్లీష్ మీడియం సీబీఎస్ఈ, ఐబీ బోధనను చంద్రబాబు సర్కారు రద్దు చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ చదువుల్ని కూటమి నేతలు దూరం చేస్తున్నారు.చదవండి: ‘ఏపీ’ కోసం ప్రత్యేకమైన ‘ప్లానింగ్’ ఎందుకు జరుగుతున్నది?ఉన్నత విద్యకి బడ్జెట్లో రూ. 2,326.68 కోట్లు కేటాయించారు. బోధనా ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు గత ఆరు నెలల నుండి రూ. 3,500 కోట్లు రావాలి. ఒక్క పైసా కూడా చంద్ర బాబు సర్కారు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో బోధనా ఫీజులు, ఉపకార వేతనాల కోసం రూ. 2,542.95 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 75 శాతం. ప్రతీ ఏటా 12 లక్షల మంది విద్యార్థులకి రూ. 2,800 కోట్లు అవసరం. హాస్టల్ మెస్ చార్జీలకు రూ. 1,100 కోట్లు అవసరం.ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పోస్టు గత 5 నెలల నుండి ఖాళీగా ఉంది. జగన్ హయాంలో వున్న వైస్ ఛాన్స్లర్లను బలవంతంగా రాజీనామాలు చేయించింది చంద్రబాబు సర్కారు. 18 విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల్ని ఇంకా భర్తీ చేయలేదు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని చంద్రబాబు మోసగిస్తున్నారు. విద్యార్థి లోకం ఉద్యమించాల్సిన అవసరం ఉంది.– ఎ. రవిచంద్రవైఎస్సార్ ఎస్‌యూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
తెలంగాణ రైల్వేకు రికార్డు స్థాయిలో కేటాయింపులు: కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: తెలంగాణ రైల్వేకు రికార్డుస్థాయిలో రూ. 5,336కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం అని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు.తెలంగాణలో ప్రస్తుతం రూ. 32,946కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వేస్టేషన్లు ఆధునికీకరించామని అన్నారు. తెలంగాణలోనూ 100శాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని వెల్లడించారు. గడిచిన 10ఏళ్లలో 437ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందన్నారు. దేశంలో రూ.1.9లక్షల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60శాతం తగ్గాయనిఅశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు. -
బడ్జెట్ 2024-25: ఏ రంగానికి ఎన్ని కోట్లు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ 2024-25లో వివిధ రంగాలకు మొత్తం రూ.48,20,512 కోట్లు కేటాయించారు. వికసిత భారత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో ఏ రంగానికి ఎంత కేటాయించిందని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.రక్షణ రంగం (డిఫెన్స్): రూ.4.56 లక్షల కోట్లు.గ్రామీణాభివృద్ధి (రూరల్ డెవలప్మెంట్): రూ.2,65,808 కోట్లు.వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ.1,51,851 కోట్లు.హోం వ్యవహారాలు: రూ.1,50,983 కోట్లు.విద్య: రూ.1,25,638 కోట్లు.ఐటీ, టెలికాం: రూ.1,16,342 కోట్లు.ఆరోగ్యం: రూ.89,287 కోట్లు.ఎనర్జీ: రూ.68,769 కోట్లు.సాంఘిక సంక్షేమం: రూ.56,501 కోట్లు.వాణిజ్యం, పరిశ్రమల రంగం: రూ. 47,559 కోట్లు -
సామాజిక రంగ వ్యయంలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: సామాజిక రంగ వ్యయంలో ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ రెండో స్థానంలో ఉందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గణాంకాలు (కాగ్) పేర్కొన్నాయి. బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలైన ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు వివిధ రాష్ట్రాల వ్యయాలను కాగ్ వెల్లడించింది. సామాజిక రంగ వ్యయం అంటే విద్య, వైద్య, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, పౌష్టికాహారం, పారిశుధ్యం, మంచినీటి సరఫరాపై చేసిన వ్యయంగా పరిగణిస్తారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలతో పాటు సంక్షేమం పథకాలపై ఇతర రాష్ట్రాలు కన్నా అత్యధికంగా వ్యయం చేసినట్లు కాగ్ పేర్కొంది. బడ్జెట్ కేటాయింపులు జరిగిన తొలి ఆరు నెలల్లోనే ఈ రంగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 55.71 శాతం వ్యయం చేసినట్లు స్పష్టంచేసింది. ఈ వ్యయాన్ని మానవ వనరుల అభివృద్ధితో పాటు ప్రజలకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాల కల్పనగా పేర్కొంటారు. ఇక కాగ్‌తో పాటు ఆర్బీఐ కూడా సామాజిక రంగ వ్యయాన్ని కొలమానంగా విశ్లేషిస్తాయి. ఈ రంగంపై మరే ఇతర రాష్ట్రం ఇంత పెద్దఎత్తున వ్యయం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత సామాజిక రంగ కేటాయింపుల్లో గుజరాత్ 42.83 శాతంతో రెండో స్థానంలో ఉందని కాగ్ తెలిపింది. మరోవైపు.. ఆస్తుల కల్పనకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో.. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ఆరు నెలల్లో 53.37 శాతం నిధులు వ్యయం చేయగా.. తెలంగాణ తన బడ్జెట్ కేటాయింపుల్లో 60.86 శాతం ఖర్చుపెట్టి మొదటి స్థానంలో నిలిచింది. -
పిల్లల భోజనంపైనా ఏడుపేనా?
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది పేదింటి పిల్లలకు చదువు, పుస్తకాల నుంచి మధ్యాహ్నం పౌష్టికాహార భోజనం వరకు అన్ని వసతులు కల్పించడం కూడా రామోజీరావుకు తప్పుగానే కనిపిస్తోంది. పిల్లలు సంతృప్తిగా తినేలా రుచికరమైన ఆహారం అందిస్తుంటే ఆ అన్నంలో మట్టి కొట్టాలని చూస్తున్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పేరుతో నిధులు నొక్కేసి, ఎనిమిదితొమ్మిది నెలలకు కూడా బిల్లులు చెల్లించకపోయినా, నాసిరకం ఆహారం అందించినా ఈనాడు పత్రిక పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో రోజుకో మెనూ, పిల్లల ఆరోగ్యం కోసం రాగిజావ, చిక్కీ అందిస్తున్నా, వాటికి అవసరమైన నిధులను ముందే విడుదల చేస్తున్నా.. ఈనాడుకు కంటగింపుగా మారింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ‘మాటల్లోనే మధ్యాహ్న భోజనం’ అంటూ ఆధారాలు లేకుండా అడ్డగోలు రాతలు రాసింది. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ‘జగనన్న గోరుముద్ద’ పథకాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 44,392 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 37,63,698 మంది విద్యార్థుల పౌష్టికాహారం కోసం రూ. 1,689 కోట్లు కేటాయించారు. ఏజెన్సీలకు, వంటవారికి, సహాయకులకు ఏ నెలకు ఆ నెల చెల్లింపులు జరుగుతున్నాయి. అయినా అబద్ధపు రాతలకు ఈనాడు తెగబడింది. అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా చంద్రబాబు హయాంలో 2019కి ముందు వారంలో ఎక్కువ రోజులు అన్నం, పప్పు లేదా నీళ్ల సాంబారుతోనే పిల్లలకు మధ్యాహ్న భోజనం సరిపెట్టేవారు. అది తినలేక పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డా మెనూ మార్చిన పరిస్థితే లేదు. కానీ 2020లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిగతంగా గోరుముద్ద మెనూ రూపొందించి, పిల్లలకు పోషకాహారం అందించాలని ఆదేశించారు. పర్యవేక్షణకు ప్రత్యేక విభాగాన్నే పెట్టారు. విద్యార్థులందరికీ ఫోర్టిఫైడ్ సార్టెక్స్ బియ్యంతో అన్నం, వారంలో ఐదు రోజులు గుడ్డు, మూడురోజులు చిక్కీ అందిస్తున్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలను అధిగమించేందుకు రాగిజావను సైతం మెనూలో చేర్చి ఏరోజు ఏ వంటకం అందించాలో మెనూ ప్రకారం బడిలో పిల్లలకు పక్కాగా పెడుతున్నారు. స్కూళ్లల్లో పిల్లలకు రుచికరమైన పౌష్టికాహారం అందుతోంది. దీంతో విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగింది. గోరుముద్దకు బడ్జెట్లో భారీగా కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు ఏనాడు సకాలంలో డబ్బులు చెల్లించ లేదు. 2014–2018 వరకు బడుల్లో అసలు వంటపాత్రల సరఫరా లేదు. అసలు ఈ పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయింపే అరకొరగా ఉండేవి. 2014–2018 మధ్య పిల్లల భోజనానికి చేసిన సగటు వ్యయం కేవలం రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకూ బడ్జెట్ కేటాయింపులు రూ. 7,244 కోట్లకు పైగా ఉన్నాయంటే పేద పిల్లల ఆహారం విషయంలో ప్రభుత్వం ఎంత ఉన్నతంగా ఆలోచిస్తోందో అర్థమవుతుంది. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసినా రామోజీకి మాత్రం తెలియనట్లు నటించడం విచారకరం. ఈ ఏడాది అన్ని పాఠశాలల్లో 37,63,698 మంది విద్యార్థులకు గ్లాసులు అందించారు. వంట పాత్రలు కొనుగోలు పూర్తి చేశారు. వీటిని సెపె్టంబర్ నెలాఖరులోగా అన్ని స్కూళ్లకు అందించనున్నారు. 2023–24లో బడ్జెట్లో రూ. 1,689 కోట్లు గోరుముద్ద కోసం ప్రభుత్వం కేటాయించింది. వంట ఖర్చు, అదనపు మెనూ, ఆహార ధాన్యాలు, రవాణాతో సహా మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వంట ఖర్చు పెంపు గత ప్రభుత్వంలో 2014–18 మధ్య విద్యార్థుల వంట ఖర్చు రూ. 3.59 నుంచి రూ. 6.51 మధ్య మాత్రమే కేటాయించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ ఖర్చును రూ. 8.57 పెంచి చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న కేంద్రీకృత కిచెన్ ఏజెన్సీలకు వంట ఖర్చు కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం చెల్లిస్తోంది. వంట చేసే కుక్/హెల్పర్స్ గౌరవ వేతనాన్ని సైతం క్రమం తప్పకుండా ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే జమచేస్తోంది. ఈ చెల్లింపులు జూన్ నెల వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం మెనూ ఇలా.. ♦ సోమవారం: వేడి పొంగల్, ఉడికించిన గుడ్డు లేదా వెజిటబుల్ పులావ్, గుడ్డు కూర, చిక్కీ ♦ మంగళవారం: చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ ♦ బుధవారం: వెజిటబుల్ అన్నం, ఆలూకుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ గురువారం: సాంబార్‌బాత్/నిమ్మకాయ పులిహోర, టమాటా పచ్చడి, ఉడికించిన గుడ్డు, రాగిజావ ♦ శుక్రవారం: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ ♦ శనివారం: ఆకుకూరతో చేసిన అన్నం, పప్పుచారు, స్వీట్ పొంగల్, రాగిజావ -
AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్‌ఎస్) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది. వైఎస్సార్ ఆసరా.. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైఎస్సార్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ► దీని కోసం బడ్జెట్లో రూ.6,700 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ( ఫైల్ ఫోటో ) వైఎస్సార్ చేయూత ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది. ఉజ్జావల, స్వధార్ గృహ పథకం మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల', 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట -
AP Budget: వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: వార్షిక బడ్జెట్లో ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమానికి వైఎస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఆరోగ్య సంరక్షణను ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాబోయే రోజులలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుంది. ఈవిషయంలో నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రాథమిక స్థాయి నుంచి అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ స్థాయికి మార్చడంతో పాటు సౌకర్యాల భౌతిక స్థాయిని పెంచడం మాత్రమే కాకుండా, అవసరమైన పరికరాలు, శిక్షణ పొందిన మానవ వనరులను సమకూర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద 108 సేవలు, 104 సేవలు, కుటుంబ సంక్షేమం వంటి ప్రాధాన్యతా కార్యక్రమాలను బలోపేతం చేయడంతో పాటు, ముఖ్యమైన పథకాల కింద బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. వ్యాధులు రాకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా, ఆరోగ్య సంరక్షణ సేవలను పౌరుల ఇంటి వద్దకు కుటుంబ వైద్యుల కార్యక్రమం ద్వారా తీసుకువెళ్తోంది ప్రభుత్వం. అనారోగ్య సమయాలలో రోలుగు ప్రయాణించిల్సిన అవసరం లేకుండా, తదపరి సంరక్షణపై మెరుగైన పర్యవేక్షణ ఉందని ఈ కార్యక్రమం నిర్ధారిస్తుంది. సాధారణ ఓపీ, అంటు వ్యాధుల నిర్వహణ, ప్రసవానికి ముందు తర్వాత సంరక్షణకు, మంచాన ఉన్న రోగులకు ఇంటి వద్దకు వెళ్లి వైద్యులు సేవలు అందిస్తారు. ఈ వైద్యులు 104-ఎంఎంయూ వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి డాక్టర్ వెఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను(విలేజ్ హెల్త్ క్లినిక్) సందర్శిస్తారు. ఈ ఆరోగ్య కేంద్రాలలో రోగులకు 14 రకాల లేబొరేటరీ పరీక్షలు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం కింద 54 లక్షల మందికిపై ప్రజలు తమ ఇంటి వద్ద వైద్య సేవలను పొందారు. దాదాపు 1.41 కోట్ల కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాధి గుర్తింపు, చికిత్స, నివారణ విధానాలకు 2,446 నుంచి 3,255కు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచింది. మన రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలలో కూడా 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పొందో విధంగా ఈ పథకాన్ని విస్తరిచండం జరిగింది. డాక్టర్ వైఎస్సార్ ఆఱోగ్య ఆసరా కింద శస్త్రచికిత్స తర్వాత జీవనోపాధి నిమిత్తం సీఎం జగన్ ప్రభుత్వం నెలకు రూ.5,000 అందిస్తోంది జగనన్న గోరుముద్ద.. పిల్లలకు రుచికరమైన, బలవర్ధకమైన, నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించే విధంగా ప్రభుత్వం రోజువారీ వంటకాల జాబితా మెరుగుపరచడం ద్వారా 2020 నుంచి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. విద్యార్థులకు మెరుగైన భోజనం అందించాడనికి ప్రభుత్వం రూ.1,000 కోట్లు అధికంగా ఖర్చు చేస్తోంది. ► మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.15,882 కోట్లు కేటాయించింది. -
టైర్–2, 3 నగరాలకు ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: ‘దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలకు రూ. 10 వేల కోట్లు కేటాయింపు’.. బుధవారం కేంద్రం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ఇది. దేశంలోని నగరాలను మహా నగరాలు, మెట్రో నగరాలు, మెగా సిటీలు, చిన్న సిటీలు అంటూ రకరకాలుగా పిలుస్తుంటాం. వీటిలో ఈ టైర్ 1, 2, 3.. ఇలా విభజన ఏమిటి?.. ఇదీ ఇప్పుడు జరుగుతున్న ఆసక్తికర చర్చ. అదేమిటో మనమూ ఓసారి చూద్దాం.. దేశంలో మహా నగరాలు, నగరాలు, పట్టణాలు చాలా ఉన్నాయి. వీటిలో ఏవి టైర్ 1, ఏవి టైర్ 2, టైర్ 3? వీటిని ఎలా విభజన చేస్తారన్న విషయంపై ఇప్పుడు అందరికీ ఆసక్తి నెలకొంది. ఈ ‘టైర్’ విధానం మొదట రియల్ ఎస్టేట్ రంగంలో 2007లో మొదలైంది. పది లక్షలు మించిన జనాభా ఉన్న నగరాలను టైర్ 1 గా, 5 లక్షల నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న సిటీలను టైర్ 2 సిటీలుగా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న వాటిని టైర్ 3 గా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ సైతం 5 వేల నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలు, నగరాలను ఆరు విభాగాలు (టైర్)గా ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో టైర్ 1 విభాగంలో 8 నగరాలు ఉన్నాయి. టైర్ 2 విభాగంలో 104 నగరాలు చేరాయి. మిగిలినవి టైర్ 3 కేటగిరీలో ఉన్నాయి. టైర్ 2, 3 నగరాల అభివృద్ధిపై దృష్టి కరోనా సమయంలో అనుసరించిన వర్క్ ఫ్రం హోం విధానంలోని ప్రయోజనాలను పరిశ్రమలు గ్రహించాయి. టైర్ 1 సిటీలుకంటే తమ పెట్టుబడులకు టైర్ 2 సిటీలు మేలని, వీటిలో జీవన వ్యయం తక్కువగా ఉండడంతోపాటు వర్క్–లైఫ్ మధ్య సమతుల్యత మెరుగ్గా ఉన్నట్టు గుర్తించాయి. పైగా, అనువైన ధరల్లో అద్దె ఇళ్లు లభ్యమవడం, ఖర్చులు కూడా బడ్జెట్లో ఉండటంతో ఈ సిటీలపై ఆసక్తి చూపుతున్నాయి. దాంతో టైర్ 2 సిటీల్లో మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. రాష్ట్రంలోని టైర్ 2 సిటీలైన విశాఖపట్నం, నెల్లూరులో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతర్జాతీయ పరిశ్రమలు సైతం తమ వ్యాపారాలకు కేంద్రంగా ఎంచుకున్నాయి. టైర్ 2, 3 నగరాల్లో ప్రాధాన్యత రంగాలను ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్లతో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉండే ఈ ఫండ్‌ను పట్టణ మౌలిక సదుపాయాల కోసం స్థానిక పట్టణ సంస్థలు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రకారం రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, గ్రేడ్ 2 మున్సిపాలిటీలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. టైర్ 1 నగరాలివీ.. అధిక జనాభా, ఆధునిక వసతులతో ఉన్నవి టైర్ 1 (జెడ్ కేటగిరీ) విభాగంలోకి వస్తాయి. వీటిని మెట్రోపాలిటన్ నగరాలుగా పిలుస్తారు. భారతదేశంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, అహ్మదాబాద్, పూణే టైర్ 1 విభాగంలో ఉన్నాయి. ఈ నగరాల్లో అధిక జనసాంధ్రతతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయాలు, పరిశ్రమలు, టాప్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, విద్య, పరిశోధన సంస్థలు ఉంటాయి. ఈ నగరాల్లో జీవన వ్యయమూ అధికంగా ఉంటుంది. వీటిని బాగా అభివృద్ధి చెందిన నగరాలుగా చెప్పవచ్చు. టైర్ 2 సిటీలు భారతదేశంలో 104 నగరాలు టైర్ 2 విభాగంలో ఉన్నాయి. ఇవి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలు. అయితే, టైర్ 1, టైర్ 2 నగరాల మధ్య పెద్దగా తేడా లేదని అర్బన్ ప్లానర్లు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఈ నగరాల్లో జీవన శైలి, అభివృద్ధి వేగంగా జరుగుతుందని, జీవన వ్యయం మాత్రం టైర్ 1 సిటీలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని అంచనా. పెట్టుబడులకు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు ఈ నగరాలు అనువైనవిగా ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు టైర్ 2 సిటీలుగా ఉన్నాయి. టైర్ 3 నగరాలు అంటే.. టైర్ 2 ఉన్నవి తప్ప మిగిలిన నగరాలు, పట్టణాలను టైర్ 3 విభాగంలో చేర్చారు. ఒకవిధంగా చెప్పాలంటే గ్రేడ్ 2, 3 మున్సిపాలిటీలు వీటి పరిధిలోకి వస్తాయి. ఈ పట్టణాల్లో వసతులను మెరుగుపచడం ద్వారా పెట్టుబడులు ఆకర్షించవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. -
హామీల అమలుకు ఇదే ఆఖరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘మీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇదే మీకు ఆఖరి అవకాశం. ఇప్పటికైనా బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి, హామీలన్నింటినీ రానున్న పదినెలల కాలంలో నెరవేర్చాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగే హక్కు లేదు’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపుపై శుక్రవారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకు అనేక హామీలిచ్చారని కానీ నాలుగు బడ్జెట్లు పూర్తయినా ఆ హామీలను నెరవేర్చలేదని వెల్లడించారు. రైతులు, నిరుద్యోగ యువత, బీసీ, దళిత, మైనార్టీ వర్గాలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, దళితబంధు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల సాయం వంటి పలు అంశాలను రేవంత్ తన లేఖలో ప్రస్తావించారు. -
కోతలు.. కొత్త పథకాలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో వ్యవసాయ రంగంపై శీత కన్ను వేసింది. గతంలో కంటే గణనీయ స్థాయిలో నిధులకు కోత పెట్టింది. ప్రధాన పథకాలన్నింటికీ కేటాయింపులను తగ్గించి వేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెట్టింది. మత్స్య రంగానికి మాత్రం కాస్త నిధులు ఇచ్చింది. భారీగా తగ్గిన కేటాయింపులు 202223 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి రూ. 1,51,521 కోట్లను కేటాయించగా.. తాజా బడ్జెట్లో 5% తక్కువగా రూ. 1,44,214 కోట్లకు మాత్రమే ప్రతిపాదించారు.మొత్తంగా బడ్జెట్లో నిధుల కేటాయింపు శాతాన్ని చూస్తే.. వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాది 3.84% ఇవ్వగా, ఈసారి 3.20 శాతానికి తగ్గి పోయింది. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్, కృషి వికాస్ యోజన పథకాలకు కేటాయింపులు భారీగా తగ్గిపోయాయి. ఇక పంటలకు గిట్టుబాటు ధర లభించేందుకు తోడ్పడేలా అమల్లోకి తెచ్చిన ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్’కు, పంటలకు మద్దతు ధర లభించేందుకు తెచ్చిన ‘పీఎం–ఆశ’ పథకాలను కేంద్రం పక్కన పెట్టేసింది. వ్యవసాయానికి రుణ సాయం.. దేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు, తక్కువ వడ్డీతో మరిన్ని రుణాలు అందేలా చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. గత ఏడాది (రూ.18 లక్షల కోట్లు) కన్నా 11 శాతం అధికంగా ఈసారి రూ.20 లక్షల కోట్ల మేర పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. బ్యాంకులు పంట రుణాలకు 9 శాతం వడ్డీ వసూలు చేస్తాయని.. కేంద్రం అందులో 2 శాతాన్ని భరిస్తుండటంతో రైతులకు ఏడు శాతం వడ్డీకే రుణాలు అందుతున్నాయని చెప్పారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేందుకు ఎలాంటి తనఖా లేకుండా ఇచ్చే రుణాలను రూ.1.6 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ► ఎక్కువ పొడవు పింజ ఉండే పత్తి ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరిస్తామని నిర్మల తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ విధానం)తో విత్తనాల నుంచి మార్కెటింగ్ వరకు వ్యాల్యూ చైన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్య రంగానికి ఊపు కోసం.. ► దేశంలో చేపల ఉత్పత్తి, రవాణాను మెరుగుపర్చేందుకు ‘ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రూ.6,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలో రొయ్యల దాణా దిగుమతిపై కస్టమ్స్ పన్నును తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం.. ► దేశంలో సహజ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు చేపడుతున్నట్టు నిర్మల ప్రకటించారు. ఇందుకోసం వచ్చే మూడేళ్లపాటు దేశవ్యాప్తంగా కోటి మంది రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. పంటలకు అవసరమైన సూక్ష్మ పోషకాలు (ఎరువులు), పురుగు మందులను పంపిణీ చేసేందుకు 10వేల ‘బయో–ఇన్పుట్ రీసోర్స్ సెంటర్’లతో నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ► పశు, వ్యవసాయ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేందుకు ‘గోబర్ధన్ (గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో–ఆగ్రో రీసోర్సెస్ ధన్)’ పథకం కింద రూ.10 వేల కోట్లతో కొత్తగా 500 ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సహజవాయువును విక్రయించే అన్ని సంస్థలు తప్పనిసరిగా 5శాతం బయో కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను అందులో చేర్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూమిని కాపాడేందుకు ‘పీఎం–ప్రణామ్’! ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగం, పురుగు మందుల వాడకాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ‘ప్రధాన మంత్రి ప్రోగ్రామ్ ఫర్ రీస్టోరేషన్, అవేర్నెస్, నరిష్మెంట్ అండ్ అమెలియరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్ (పీఎం–ప్రణామ్)’ పథకాన్ని చేపడుతున్నట్టు నిర్మల తెలిపారు. ఈ దిశగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ► ఉద్యాన పంటల కోసం.. తెగుళ్లు సోకని, నాణ్యమైన మొక్కలను అందుబాటులో ఉంచేందుకు రూ.2,200 కోట్లతో ‘ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ► గ్రామీణ ప్రాంతాల్లో యువ పారిశ్రామికవేత్తలు ‘అగ్రి స్టార్టప్స్’ను నెలకొల్పేలా ప్రోత్సహించేందుకు ‘అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ (ఏఏఎఫ్)’ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ► వ్యవసాయ రంగంలో రైతు ఆధారిత, సమ్మిళిత పరిష్కారాల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ► ‘మిష్తి’ పథకం కింద దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో మడ అడవులను పెంచనున్నట్టు తెలిపారు. ‘శ్రీ అన్న’తో తృణధాన్యాల హబ్‌గా.. దేశాన్ని తృణధాన్యాల హబ్‌గా మార్చేందుకు ‘శ్రీ అన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్’ను దీనికి వేదికగా ఎంచుకున్నట్టు తెలిపారు. ఇది తృణధాన్యాల ఉత్పత్తి, పరిశోధన, సాంకేతిక అంశాల్లో అత్యుత్తమ విధానాలను అంతర్జాతీయ స్థాయిలో పంచుకునేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుందని వివరించారు. తృణధాన్యాల వినియోగంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని.. ఎందరో చిన్న రైతులు వీటిని పండించి ప్రజల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఐఐఎంఆర్ ఏంటి? దేశంలో తృణధాన్యాల దిగుబడి పెంచడం, కొత్త వంగడాల రూపకల్పన కోసం హైదరాబాద్‌లో ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (ఐఐఎంఆర్)’ను ఏర్పాటు చేశారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) పరిధిలో ఇది పనిచేస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగులు, సామలు వంటి తృణధాన్యాల పంటలపై ఇక్కడ పరిశోధనలు చేస్తారు. ఐఐఎంఆర్ దేశ విదేశాలకు చెందిన తృణధాన్యాల సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. పల్లెకు నిధులు కట్! గ్రామీణాభివృద్ధికి తగ్గిన కేటాయింపులు ఉపాధి హామీపై చిన్నచూపు ఇళ్లు, తాగునీటికి మాత్రం ఊరట.. మౌలిక రంగాన్ని పరుగులు పెట్టిస్తామంటూ భారీగా పెట్టుబడి నిధులను కేటాయించిన మోదీ సర్కారు.. గ్రామీణాభివృద్ధి విషయంలో ఈసారి కాస్త చిన్నచూపు చూసింది. ప్రధానమైన కేంద్ర ప్రాయోజిత పథకాలకు (ఫ్లాగ్షిప్) నిధుల కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23)లో గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులు (సవరించిన అంచనా) రూ. 1,81,121 కోట్లు కాగా, 2023–24 బడ్జెట్లో కేటాయింపులను 13 శాతం మేర తగ్గించి రూ.1,57,545 కోట్లకు పరిమితం చేసింది. ప్రధానంగా ఉపాధి హామీ పథకంలో భారీగా కోత పెట్టడం గమనార్హం. ఉపాధి ‘హామీ’కి కోత... గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఏ) కేటాయింపుల్లో భారీగా కోత పడింది. 2022–23లో కేటాయింపుల సవరించిన అంచనా రూ.89,400 కోట్లతో పోలిస్తే 32 శాతం మేర తగ్గించేశారు. కాగా, 2022 జూలై–నవంబర్ కాలంలో ఈ స్కీమ్ కింద పనులు చేసేందుకు ముందుకొచ్చిన కార్మికుల సంఖ్య కోవిడ్ ముందస్తు స్థాయిలకు చేరినట్లు తాజా ఆర్థిక సర్వే పేర్కొనడం గమనార్హం. గ్రామీణ రోడ్లు.. జోరు తగ్గింది (పీఎంజీఎస్‌వై) గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మరింత మెరు గుపరిచేందుకు రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు వెచ్చి స్తోంది. అయితే, తాజా బడ్జెట్లో ఈ ఫ్లాగ్షిప్ స్కీమ్‌కు కేటాయింపులను మాత్రం పెంచలేదు. 2023–24లో 38,000 కిలోమీటర్ల మేర పక్కా రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటికి ఓకే... (పీఎంఏవై) గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి పెద్దపీట వేసేలా తాజా బడ్జెట్లో కొంత మెరుగ్గానే కేటాయింపులు జరిపారు. ప్రధానంగా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్ తరహాలోనే పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ఫండ్‌ను నెలకొల్పుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. ఏటా రూ.10,000 కోట్లను ఈ ఫండ్‌కు ఖర్చు చేస్తామని, దీన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ప్రకటించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలకు 2023–24లో 57.33 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. స్వచ్ఛ భారత్ మిషన్... దేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన (ఓడీఎఫ్)ను పూర్తిగా తుడిచిపెట్టడానికి 2014లో ఆరంభమైన ఈ స్వచ్ఛ భారత్ పథకం (ఎస్బీఎం) కిందికి ఘన వర్ధాల (చెత్త నిర్మూలన), జల వ్యర్థాల నిర్వహణను కూడా తీసుకొచ్చారు. ఈ పథకానికి మాత్రం తాజా బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కాగా, పట్టణ ప్రాంతాల్లో 2023–24లో 13,500 కమ్యూనిటీ/పబ్లిక్ టాయిలెట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే, 3 లక్షల గ్రామాలను ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీరు నిర్వహణ కిందికి తీసుకురావాలనేది కేంద్రం లక్ష్యం. తాగునీటికి నిధుల పెంపు... స్వచ్ఛమైన తాగునీటిని అందరికీ అందించేందుకు 2019–20లో జల్ జీవన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. దీనిలో భాగంగా 2023–24లో 4 కోట్ల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులను పెంచారు. భారత్ నెట్... భారత్ నెట్ కింద దేశంలోని పల్లెలన్నింటికీ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలనేది కేంద్రం లక్ష్యం. దీనిలో భాగంగా 2023–24లో 17,000 గ్రామ పంచాయితీలను కొత్తగా హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించనున్నారు. అలాగే 78,750 కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5,50,000 ఫైబర్–టు–హోమ్ కనెక్షన్లు కూడా ఇవ్వాలనేది లక్ష్యం. రహదారులపై ప్రగతి పయనం ఎన్హెచ్ఏఐకు 2022–23 బడ్జెట్లో కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు కేటాయించగా, 2023–24 బడ్జెట్లో రూ.1.62 లక్షల కోట్లు కేటాయించింది. ఈసారి కేటాయింపులను రూ.20,000 కోట్లు(13.90 శాతం) పెంచింది. జాతీయ రహదారుల రంగానికి 2022–23లో రూ.1.99 లక్షల కోట్లు కేటాయించగా, దీన్ని తర్వాత రూ.2.17 లక్షల కోట్లుగా సవరించింది. తాజా బడ్జెట్లో ఈ రంగానికి రూ.2.70 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. -
Union Budget 2023-24: రక్షణశాఖకు ఎన్ని కోట్లంటే..?
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్లో ఈ ఏడాది రక్షణ రంగానికి ప్రాధాన్యం లభించింది. మొత్తం రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాది కంటే రూ. 69 వేల కోట్లు ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రక్షణ రంగ కేటాయింపుల్లో రూ. 1.62 లక్షల కోట్లు మూల ధన వ్యయమని తెలిపారు. ఈ మొత్తాన్ని కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర మిలటరీ పరికరాల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగిస్తారన్నమాట. 2022–23 మూలధన కేటాయింపులు రూ.1.52 లక్ష కోట్లు మాత్రమే. అంచనాల సవరణ తరువాత ఇది రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది రక్షణ రంగ కేటాయింపుల్లో రూ.2.70 లక్షల కోట్లు ఆదాయ వ్యయం అంటే సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల కోసం ఖర్చు పెట్టనున్నారు. గత ఏడాది ఈ ఖర్చుల కోసం ముందుగా 2.39 లక్షల కోట్లు కేటాయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (సివిల్) మూలధన వ్యయం రూ.8774 కోట్లు. ఫించన్ల కోసం విడిగా రూ.1.38 లక్షల కోట్లు కేటాయిపులు జరిగాయి. దీంతో రక్షణ శాఖ ఆదాయ వ్యయం మొత్తమ్మీద రూ.4.22 లక్షల కోట్లకు చేరింది. భద్రతకు పెద్దపీట దేశంలో అంతర్గత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్లో కేంద్ర హోంశాఖకు ఏకంగా రూ.1,96,034.94 కోట్లు కేటాƇుుంచడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది బడ్జెట్లో ఈ కేటాయింపులు రూ.1,85,776.55 కోట్లు. ఈసారి కేటాయింపులను రూ.10,258.39 కోట్లు పెంచినట్లు స్పష్టమవుతోంది. మొత్తం కేటాయింపుల్లో సింహభాగం కేంద్ర సాయుధ పోలీసు దళాలు, నిఘాసమాచారం సేకరణ కోసం ఖర్చు చేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పోలీసు దళాల ఆధునీకరణ కోసం పెద్ద ఎత్తున వెచ్చించబోతున్నారు. మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు గత ఏడాది రూ.1,19,070 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1,27,756 కోట్లు కేటాయించారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు 2022–23లో రూ.31,495 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ.31,772 కోట్లు కేటాయించారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), అస్సాం రైఫిల్స్ తదితర దళాలకు కేటాయింపులను పెంచారు. నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ), ఇంటెలిజెన్స్ బ్యూరో, ప్రత్యేక భద్రతా విభాగం(ఎస్పీజీ)కి గణనీయమైన కేటాయింపులు లభించాయి. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.3,545.03 కోట్లు, పోలీసు మౌలిక సదుపాయాల కోసం రూ.3,636.66 కోట్లు, పోలీసు దళాల ఆధునీకరణ కోసం రూ.3,750 కోట్లు కేటాయించారు. భద్రతకు సంబంధించిన ఖర్చుల కోసం రూ.2,780.88 కోట్లు, జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన పనులకు రూ.1,564.65 కోట్లు, మహిళా భద్రత పథకాలకు రూ.1,100 కోట్లు, ఫోరెన్సిక్ సదుపాయాల ఆధునీకరణకు రూ.700 కోట్లు, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల నిర్వహణకు రూ.350.61 కోట్లు,సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు దళాల ఆధునికీకరణ ప్రణాళిక–4 కోసం రూ.202.27 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అంతరిక్షానికి 12,544కోట్లు అంతరిక్ష రంగానికి బడ్జెట్లో రూ.12,544 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపులు గత ఏడాది ఇచ్చిన రూ.13,700 కంటే 8 శాతం తక్కువ కావడం గమనార్హం. వచ్చే ఏడాది చంద్రుడు, చుట్టూ ఉన్న గ్రహాల అధ్యయనం కోసం మానవసహిత గగన్‌యాన్‌ను నిర్వహించేందుకు అంతరిక్ష విభాగం ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇచ్చిన కేటాయింపుల్లో అధికభాగం రూ.11,669.41 కోట్లను గగన్‌యాన్, శాటిలైట్ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఇస్తారు. థియరిటికల్ ఫిజిక్స్‌తోపాటు వివిధ అంశాలపై పరిశోధనలు నిర్వహించే అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి రూ.408.69 కోట్లు కేటాయించారు. ఈ విభాగానికి గత ఏడాది రూ.411.11 కోట్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగాన్ని పర్యవేక్షించేందుకు కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగిల్‌విండో విభాగమైన ఇన్–స్పేస్‌కు గత ఏడాది రూ.21 కోట్లు ఇవ్వగా, తాజా బడ్జెట్లో రూ.95 కోట్లను కేటాయించా రు. వచ్చే ఏడాది చంద్రయాన్ మిషన్ చేపడుతున్న ఇస్రో.. సూర్యుడు, శుక్రు డు, అంగారక గ్రహాలపైనా పరిశోధనలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ అణు ఇంధన ఉత్పత్తి కెపాసిటీని పెంచేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్)కు గత బడ్జెట్లో కన్నా రూ. 2,859 కోట్లు ఈ బడ్జెట్లో అధికంగా ఇచ్చారు. న్యూక్లియర్ ఎనర్జీకి బూస్ట్ నిచ్చేందుకు ఎన్పీసీఐఎల్ రూ. 9,410 కోట్లు ఈ బడ్జెట్ ద్వారా అందుకోనుంది. అంతర్గత, బహిర్గత వనరుల ద్వారా ఎన్పీసీఐఎల్ రూ. 12,863 కోట్లు సమకూర్చుకోనుంది. అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్కు రూ. 25,078.49 కోట్లు కేటాయించారు. దేశంలో 6,780 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్లు ఉన్నాయి. 2031 నాటికి ఈ సామర్థ్యాన్ని 15,700 మెగావాట్లకు పెంచే లక్ష్యంతో మరో 21 పవర్ జనరేషన్ యూనిట్లను స్థాపించనున్నారు. . చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
Budget 2023: ఆరోగ్య రంగానికి బడ్జెట్ పెంచండి..!
దేశవ్యాప్తంగా ఆరోగ్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాల అవసరం పెరుగుతున్నందున ఆరోగ్యరంగానికి 2023–24 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు పెంచాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయాను ఒక్కసారి పరిశీలిస్తే... న్యూఢిల్లీ కేటాయింపులు 40 శాతం పెరగాలి వరుసగా, 2021–22 – 2022–23 ఆర్థిక సంవత్సరాలను చూస్తే, ఆరోగ్య రంగం కోసం బడ్జెట్ కేటాయింపులు సుమారు 16.5 శాతం పెరిగాయి. రానున్న బడ్జెట్లో ఆరోగ్య రంగానికి నిధులు 30–40 శాతం పెరగాలి. ఆరోగ్యం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిండానికి ప్రయత్నం జరగాలి. పాఠశాల పాఠ్యాంశాల్లో ఆరోగ్యవంతమైన జీవన ప్రాముఖ్యతను తప్పనిసరిగా చేర్చాలి. మధుమేహం, ఇతర జీవనశైలి వ్యాధులపై స్థానిక సంస్థలు, చాంబర్లు, సంఘాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రభుత్వం తప్పనిసరిగా పంచాయతీ స్థాయిలో ప్రాథమిక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలి. అవి సక్రమంగా పనిచేసేలా కూడా చూసుకోవాలి. టెలిమెడిసిన్‌ను సులభతరం చేయడానికి వీలుగా ఆయా క్లినిక్‌లను డిజిటలీకరించాలి. – సాకేత్ దాల్మియా, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ రోగనిర్ధారణ వేగంగా జరగాలి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరిత, ఖచ్చిత, వేగవంతమైన రోగనిర్ధారణ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన డిమాండ్. సమర్థవంతమైన ఆరోగ్య నిర్వహణ, అంటువ్యాధుల వ్యాప్తిని నియంత్రణ, రోగికి వేగవంతంగా కోలుకోవడం వంటి కీలక సానుకూలతకు దోహదపడే అంశం ఇది. ఈ దిశలో దేశంలో బహుళ–వ్యాధుల నిర్ధారణ ప్లాట్‌ఫారమ్‌లు అలాగే తక్కువ ధరలో సేవలు లభించే డయాగ్నోస్టిక్స్, వెల్నెస్ ప్రమోషన్ సెంటర్లు అవసరం. ఈ అంశాలపై రానున్న బడ్జెట్ దృష్టి సారించాలి. వెల్నెస్ పరీక్షలు, ఆయుష్ చికిత్సలను ఆరోగ్య బీమాలో కవర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ఇందుకు తగిన నిధుల కల్పన అవసరం. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ వ్యయాలు ప్రతి వ్యక్తికి సంవత్సరానికి దాదాపు రూ. 1,000 వరకూ తగ్గుతాయి. – అజయ్ పొద్దార్, సైనర్జీ ఎన్విరానిక్స్ చైర్మన్, ఎండీ ఆరోగ్య బీమాపై దృష్టి అవసరం భారత్‌లో హెల్త్‌కేర్‌పై తలసరి బీమా వ్యయం ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. దేశంలో 75 శాతం మందికిపైగా ప్రజలకు ఆరోగ్య బీమానే లేదు. ఈ సమస్యను ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ దృష్టి పెట్టాలి. – సిద్ధార్థ ఘోష్, ఎన్ఎంఐఎంఎస్ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ గత రెండేళ్లలో ఇలా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె బడ్జెట్ రూపకల్పనపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.73,932 కోట్లు. 2022–23లో ఈ కేటాయింపులు దాదాపు 16.5 శాతం పెరిగి రూ.86,200 కోట్లకు చేరాయి. మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) ఆరోగ్య రంగానికి కేటాయింపులు దాదాపు ఒక శాతంగా ఉండడం గమనార్హం. -
చైనా రక్షణ బడ్జెట్ 7% పెంపు
బీజింగ్: చైనా తన సాయుధబలగాల కోసం ఈస ారి బడ్జెట్ కేటాయి ంపులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 7.1 శాతం ఎక్కు వగా 230 బిలియన్ డాలర్లకు డిఫెన్స్ బడ్జెట్‌ను పెంచుకుంది. భారత్ తన రక్షణ అవసరాలకు కేటాయిస్తున్న బడ్జెట్ మొత్తంతో పోలిస్తే ఈ బడ్జెట్ ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1.45 ట్రిలియన్ యువాన్ల రక్షణ బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలను చైనా ప్రధాని లీ కెకియాంగ్ శనివారం ఆ దేశ పార్లమెంట్(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)లో ప్రవేశపెట్టారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమ ప్రాభల్యాన్ని కొనసాగించేందుకు చైనా ఇలా తన రక్షణ బడ్జెట్‌ను ప్రతి ఏటా పెంచుకుంటూ పోతోంది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)ను మరింత పటిష్టచేసేందుకు, చైనా సమగ్రత, సార్వభౌమత్వం, దేశ ప్రయోజనాలు, రక్షణలను దృష్టిలో ఉంచుకుని రక్షణ బడ్జెట్ పెంచామని ముసాయిదా పత్రాల్లో కెకియాంగ్ పేర్కొన్నారు. అయితే, 2017లో చైనా మొత్తం సాయుధ బలగాల సంఖ్యను 23 లక్షల నుంచి 20 లక్షలకు కుదించుకోవడం గమనార్హం. 2012లో అధికార పగ్గాలు చేపట్టాక అధ్యక్షుడు జిన్‌పింగ్ ముఖ్యంగా సైన్యం పటిష్టతపైనా దృష్టిపెట్టారు. -
రాష్ట్రానికి రిక్తహస్తమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది. ఈ సారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోల‘వరం’ లభించలేదు.. ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ► ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి రూ.3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.4 వేల కోట్లు వెరసి.. 2022–23 బడ్జెట్లో కనీసం రూ.ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ► ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి రూ.26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది. ► ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2016–17 బడ్జెట్ నుంచి ఇదే తీరు ► పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు.. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని, రాష్ట్రానికి విడుదల చేస్తామని పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. దాంతో 2016–17 నుంచి బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించని కేంద్రం.. నాబార్డు ద్వారా రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తోంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రూ.751.80 కోట్లను పోలవరానికి విడుదల చేసిన కేంద్రం.. ఇటీవల బడ్జెట్లో మిగిలిన రూ.320 కోట్లను విడుదల చేసింది. 2022–23లోనూ ఇదే రీతిలో పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏకాభిప్రాయం తర్వాతే నదుల అనుసంధానం ► నదుల అనుసంధానాన్ని కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో.. కెన్–బెత్వా నదుల అనుసంధానాన్ని రూ.44,605 కోట్లతో చేపట్టింది. ఈ పనులకు బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించింది. ► నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన నీటిని కావేరికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నాలుగు నదుల పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా.. ► ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్), నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) తదితర పథకాలను కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా అమలు చేస్తోంది. ► ఏఐబీపీకి బడ్జెట్లో రూ.3,239 కోట్లు, కాడ్వామ్‌కు రూ.1,044 కోట్లు, ఎన్‌హెచ్‌పీకి రూ.800 కోట్లను కేటాయించింది. ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కేంద్ర విద్యా సంస్థలకు మొండిచెయ్యి ► కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు. ► రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ► ఆయా సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి, బోధన, బోధనేతర అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సరైన విధంగా నిధుల కేటాయింపు కావడం లేదు. ఫలితంగా ఆయా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు. ► ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ వర్సిటీకి రూ.56.56 కోట్లు కేటాయించినట్లు చూపించారు. 2020–21లో కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2021–22లో రూ.60.35 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా, విడుదల చేసింది మాత్రం రూ.20.11 కోట్లు మాత్రమే. ► ఏపీ, తెలంగాణలకు కలిపి గిరిజన వర్సిటీల ఏర్పాటుకు రూ.44 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపించారు. ఏపీకి ఇందులో రూ.22 కోట్లు కేటాయించారు. 2020–21లో గిరిజన వర్సిటీకి కేటాయించింది కేవలం రూ.89 లక్షలు మాత్రమే. 2021–22లో రూ.26.9 కోట్లు కేటాయింపులు చూపి, కేవలం రూ.6.68 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తక్కిన సంస్థల ఊసేలేదు ► బడ్జెట్లో సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది. ► తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఐఐఐటీడీ), గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ► మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, విశాఖపట్నంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ రిఫైనరీ తదితర సంస్థల గురించి కనీస ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు. -
సంక్షేమానికి దీటుగా అభివృద్ధి
సాక్షి, అమరావతి: సంక్షేమం, అభివృద్ధే గీటురాయిగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు, వ్యయం చేస్తోందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విశ్లేషించింది. 2019 – 20 నుంచి వరుసగా పరిశీలిస్తే అభివృద్ధి వ్యయం ఏటా పెరుగుతోందని ఆర్బీఐ నివేదికతో స్పష్టమవుతోంది. అభివృద్ధి వ్యయం 2020–21తో పోల్చితే 2021–22లో ఏకంగా 33.5 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది. సామాజిక రంగాల వ్యయం కూడా భారీగా పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. బడ్జెట్ కేటాయింపులు, వ్యయాలపై ఆర్బీఐ విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. ఇక 2019–20 నుంచి ఉద్యోగుల జీతభత్యాలు బాగా పెరిగాయని, అలాగే గతంలో చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులూ అధికమయ్యాయని నివేదిక పేర్కొంది. గత రెండేళ్లగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై వ్యయం పెరిగిందని తెలిపింది. పెరిగిన జీతభత్యాల పద్దు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 27 శాతం మధ్యంతర భృతి పెంచారు. వైద్య ఆరోగ్య రంగంలో పెద్ద ఎత్తున శాశ్వత ఉద్యోగాలను కల్పించడంతో పాటు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను తెచ్చారు. చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్న చిరు ఉద్యోగుల వేతనాలను భారీగా పెంచారు. దీంతో జీత భత్యాల పద్దు భారీగా పెరిగింది. గత సర్కారు హయాంలో 2018–19లో ఉద్యోగుల జీతభత్యాల పద్దు రూ.32,743.40 కోట్లు ఉండగా 2021–22లో అది రూ.50,662.20 కోట్లకు చేరిందని ఆర్బీఐ నివేదిక తెలిపింది. సామాజిక సేవలు, గ్రామీణాభివృద్ధి, ఆహారం నిల్వ తదితర రంగాల వ్యయం 2019–20లో మొత్తం బడ్జెట్లో 45.4 శాతం ఉండగా 2021–22లో 49.4 శాతానికి పెరిగింది. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమంపై గత మూడు సంవత్సరాలుగా బడ్జెట్లో వ్యయం పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. 2019–20లో బడ్జెట్లో ఈ రంగంపై 4.3 శాతం వ్యయం చేయగా 2020–21లో 5.2 శాతం వ్యయం చేసినట్లు తెలిపింది. 2021–22లో 6.1 శాతం మేర కేటాయింపులు చేసినట్లు వెల్లడించింది. అభివృద్ధికే ఎక్కువ వ్యయం ప్రధాన ఆర్థిక సూచికల ప్రకారం చూస్తే మూడు ఆర్ధిక సంవత్సరాల్లో అభివృద్ధియేతర వ్యయం కన్నా అభివృద్ధికే ఎక్కువ వ్యయం చేస్తున్నట్లు ఆర్బీఐ అధ్యయన నివేదిక తెలిపింది. -
పల్నాటి ప్ర'జల కల'
సాక్షి, అమరావతి: తీవ్ర దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న ‘పల్నాటి సీమ’ను సుభిక్షం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రూ.1,750 కోట్లతో వరికపుడిశెల ఎత్తిపోతల పథకం, రూ.6,020 కోట్లతో వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను ‘వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్’ కింద చేపట్టి వరద జలాలను తరలించడం ద్వారా పల్నాడును సస్యశ్యామలం చేయాలని నిర్ణయించింది. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికల్)ను ఏర్పాటు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది. పల్నాటి ప్రజల 70 ఏళ్ల స్వప్నం.. వరుసగా వర్షాభావంతో పల్నాడు కరవు కోరల్లో చిక్కుకుపోయింది. గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుస్థితి నెలకొంది. పల్నాడు ప్రజల ఏడు దశాబ్దాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేయడం, పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించిన గోదావరి జలాలను వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా అందచేసి ఆ ప్రాంత తాగు, సాగునీటి కష్టాలను కడతేర్చ డానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జలవనరుల శాఖను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం ఇదీ.. ► పోలవరం కుడి కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి తరలించిన జలాల్లో కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి(80 కి.మీ. వద్దకు) ఎత్తి పోస్తారు. కుడి కాలువ ఆయకట్టుకు నీటిని అందిస్తూనే పల్నాటి సీమకు గోదావరి జలాలను తరలిస్తారు. ► ప్రకాశం బ్యారేజీ నుంచి గోదావరి జలాలను నాగా ర్జునసాగర్ కుడి కాలువలోకి ఎత్తిపోసే పనులను రెండు ప్యాకేజీలుగా చేపడతారు. వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం మొదటి ప్యాకేజీ పనులను రూ.2,845 కోట్ల వ్యయంతో, రెండో ప్యాకేజీ పనులను రూ.3,175 కోట్ల వ్యయంతో చేపట్టాలని జలవనరుల శాఖ అధికారులు చేసిన ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేశారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం ఇదీ.. వరికపుడిశెల వాగు వరద జలాలను ఒడిసి పట్టి పల్నాటి సీమను సస్యశ్యామలం చేయాలనే ప్రతిపాదన ఏడు దశాబ్దాలుగా కాగితాలకే పరిమితమైంది. ఈ ఎత్తిపోతల పథకానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వరికపుడిశెల ఎత్తిపోతల పథకం తొలిదశను రూ.350 కోట్లతో, రెండో దశను రూ.1,400 కోట్లతో చేపట్టే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్‌కు శ్రీకారం.. వరికపుడిశెల ఎత్తిపోతల పనులను రూ.1,750 కోట్లతోనూ, వైఎస్సార్ పల్నాడు ఎత్తిపోతల పథకం పనులను రూ.6,020 కోట్లతో వెరసి రూ.7,770 కోట్ల వ్యయంతో వైఎస్సార్ పల్నాడు దుర్భిక్ష నివారణ మిషన్ కింద చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ జలవనరుల శాఖను ఆదేశించారు. ఈ పనులను వేగంగా పూర్తి చేయడానికి నిధుల సమీకరణ కోసం ఎస్పీవీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు తెచ్చి ఈ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి పల్నాడులో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా సుభిక్షం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు ముఖ్యమంత్రిని కలిసిన పల్నాడు ప్రజాప్రతినిధులు పల్నాడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీర్చే వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకరరావు, అంబటి రాంబాబు కలిశారు. పల్నాటి ప్రజల చిరకాల స్వప్నమైన వరికపుడిశెల ఎత్తిపోతల పథకాన్ని సాకారం చేసే దిశగా చర్యలు చేపట్టినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 70 ఏళ్లుగా పల్నాటి ప్రజలకు కలగా మిగిలిన వరికపుడిశెల లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరగా పూర్తి చేసేందుకు వైఎస్సార్ పల్నాడు దుర్బిక్ష నివారణ మిషన్‌లో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. -
చదువే భవితకు పెట్టుబడి
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో ఆదాయమార్గాలు సన్నగిల్లి ఆర్థిక పరిస్థితి మందగమనంలో ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యా శాఖకు భారీగా కేటాయింపులు చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో విద్యా శాఖకు రూ.25,737.62 కోట్లు కేటాయించింది. ► ఇందులో పాఠశాల విద్యకు ఏకంగా 22,604.01 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్నే మానవ వనరుల అభివృద్ధి, విద్యాభివృద్ధి ద్వారా మెరుగైన సమాజాభివృద్ధి అంశాలతో ప్రారంభించడం విశేషం. ► అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఈ అంశాలను నొక్కిచెప్పింది. ► ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక వసతుల కల్పనకు ‘మన బడి నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ► కుల, మత, వర్గ, ప్రాంత వివక్ష లేకుండా 1 నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదువులు కొనసాగించడానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల పిల్లల తల్లులకు అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ► నాడు–నేడు పథకం కింద తొలి దశలో 15,715 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 వేల కోట్లు ప్రతిపాదించింది. ► 2020–21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు మూడు జతల యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్‌గా జగనన్న విద్యాకానుక కింద అందించనున్నారు. ► విద్యార్థులకు జగనన్న గోరుముద్ద కింద నాణ్యమైన, శుచికరమైన పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నారు. బెల్లం, చిక్కీ, పులిహోర, పొంగలి, కూరగాయల పలావు తదితరాలు వడ్డిస్తున్నారు. వంట పని వారికి నెలవారీ పారితోషికం రూ.వేయి నుంచి రూ.3 వేలకు పెంచారు. ► జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద ఉన్నత విద్యకు కూడా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. ► ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా ఎంపిక చేసి రూసా పథకం కింద నిధులు కేటాయించనుందని ప్రభుత్వం పేర్కొంది. ► ఉన్నత విద్యకు బడ్జెట్లో రూ.2,276.97 కోట్లు కేటాయించడం విశేషం. ► సాంకేతిక నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం రూ.856.64 కోట్లు కేటాయించింది. యూనివర్సిటీలకు నిధుల వరద ► ప్రభుత్వం ప్రతి వర్సిటీ న్యాక్ గ్రేడ్,, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) వంటివి సాధించి ఉన్నత ప్రమాణాలతో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో రెవెన్యూ గ్రాంటుతోపాటు కేపిటల్ గ్రాంట్‌ను కూడా కేటాయించింది. ► అరకులో వైఎస్సార్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది. ► కడపలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్సిటీ, ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీల ఏర్పాటుకు వీలుగా కేటాయింపులు చేసింది. ► ఇవే కాకుండా కొత్తగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ అనే సంస్థకు కూడా రూపకల్పన చేసి నిధుల కేటాయింపులు జరిపింది. ► ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్చ్ఠులను సాధించేందుకు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు కేపిటల్ గ్రాంట్‌ను కేటాయించింది. మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్య, వైద్య రంగాలకు ప్రాముఖ్యతనిస్తూ నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ బడ్జెట్లో విద్యకు ఇతోధిక కేటాయింపులు చేశారు. ముఖ్యంగా జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ బలోపేతం కావాలన్న లక్ష్యం ప్రభుత్వంలో కనిపిస్తోంది. మానవాభివృద్ధే అసలైన అభివృద్ధి’ అని అంటున్నారు.. ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన ఏమన్నారంటే.. ► నాడు–నేడు, ఇంగ్లిష్ మీడియం, డిగ్రీ కళాశాలల అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా మారబోతోంది. ► గతంలో విద్యారంగానికి కేటాయింపులు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ముక్కలు ముక్కలుగా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా సమగ్రంగా చేస్తున్నారు. ► పరిశ్రమలు ఎవరు పెట్టాలన్నా భూమి, విద్యుత్ వంటివే కాకుండా నైపుణ్యం కలిగిన మానవ వనరులు కూడా ఎంతో అవసరం. దీనికోసం ముఖ్యమంత్రి పాఠశాల స్థాయి నుంచే ఒక ప్రణాళికాబద్ధ కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ► ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్ పునాది వంటిది. రాబోయే నాలుగైదేళ్లలో మంచి పరిణామాలు కనిపిస్తాయి. ► పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలతోపాటు విశాఖ కేంద్రంగా నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ► నాలుగు త్రిబుల్ ఐటీల్లోని నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏకీకృతం చేసి సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళిక చేపడుతోంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పడమే లక్ష్యంగా ఈ నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక ఉంటుంది. ► విద్యారంగ బడ్జెట్ ఒక్కటే కాకుండా నవరత్నాల్లోని పలు సంక్షేమ కార్యక్రమాలు విద్యకు, తద్వారా మానవాభివృద్ధికి దోహదపడేవే. వాటిని కూడా కలుపుకుంటే విద్యా కేటాయింపులు మరింత ఎక్కువవుతాయి. సంక్షేమంపై చాలా ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. బడ్జెట్, పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం ఉభయ సభలు ప్రారంభం కావడానికి ముందు మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో బడ్జెట్‌ను ఆమోదించారు. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అరగంట పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ ప్రసంగాన్ని, సాధారణ, వ్యవసాయ బడ్జెట్లను, పలు బిల్లులను ఆమోదించారు. అత్యుత్తమ బడ్జెట్ విద్యారంగానికి 6.4 శాతం బడ్జెట్ కేటాయిస్తున్న నార్వే దేశాన్ని ప్రపంచంలోనే మొట్ట మొదటి స్థానంగా చెప్పుకుంటాం. మన భారత దేశ బడ్జెట్లో కూడా విద్యకు కేటాయిస్తున్నది 3.4 శాతమే. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకు అత్యధికంగా రూ.22,604 కోట్లు, అంటే 10.05 శాతం కేటాయించడం చాలా సంతోషం. ప్రజలందరూ హర్షించదగ్గ విషయం. సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకు, అసమానతలకు ఏకైక మార్గం విద్యే అనే జగమెరిగిన సత్యాన్ని, మన ముఖ్యమంత్రి జగన్ ఆచరణలో చూపించారు. – డాక్టర్ బీవీఎస్ కుమార్, చైర్మన్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కృష్ణా జిల్లా -
కరోనా కాటులోనూ సాగు బాగు
సాక్షి, అమరావతి: కరోనా వంటి విపత్కర కాలంలోనూ రాష్ట్ర బడ్జెట్లో అన్నదాతకు ప్రభుత్వం అండగా నిలిచింది. గత ఏడాది కన్నా మిన్నగా కేటాయింపులను ప్రతిపాదిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భోజన విరామం తర్వాత సభ మంగళవారం సా.4.25 గంటలకు ప్రారంభమైనప్పుడు మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ‘నేను రైతు పక్షపాతిని, నాది రైతు ప్రభుత్వం’ అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను’ ఉటంకిస్తూ మొదలైన ప్రసంగం సుమారు అరగంటసేపు సాగింది. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో ఇప్పటికే చేపట్టిన అన్ని పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని పథకాలను మంత్రి ప్రతిపాదించారు. ► మార్కెటింగ్ వ్యవస్థను పటిష్టం చేసి కమీషన్ వ్యాపారులను కట్టడి చేసేలా ఈ ఏడాది కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ► రైతు పండించే పంటల్ని ప్రజానీకానికి అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్సార్ జనతా బజార్లను ప్రారంభిస్తామన్నారు. ► ప్రతి గ్రామంలో గ్రేడింగ్, ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటుచేయనున్నట్లు మంత్రి తెలిపారు. ► రాయలసీమలో ప్రకృతి వ్యవసాయ పరిశోధన, శిక్షణ, విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ► ఆహార శుద్ధికి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు కన్నబాబు వివరించారు. ముఖ్యాంశాలు ఇలా.. ► చెప్పిన దానికంటే ఎక్కువగా వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఇస్తున్నాం. ఇప్పటికే రూ.10,209.32 కోట్లను జమ చేశాం ► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కౌలు రైతులు లబ్ధిపొందేలా చర్యలు చేపట్టాం. కౌలు రైతులకిచ్చే పెట్టుబడి సాయం మొత్తం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచే ఇస్తున్నాం. ► వ్యవసాయ మార్కెటింగ్‌కు పెద్దపీట వేసేలా రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేశాం. లాక్డౌన్ సమయంలో రూ.2,215 కోట్లతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేశాం. ► వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు నూతన విధానాన్ని తీసుకువచ్చాం. ► దళారుల నియంత్రణకు త్వరలో కొత్తచట్టాన్ని తీసుకువస్తాం. ► వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం, ఏఎంసీల అధ్యక్షులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాదే. ► రైతుభరోసా కేంద్రాలతో అన్నదాతలకు సమగ్ర సేవలు. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలుకు ఈ ఏడాది ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు. ► విత్తనాలు, ఎరువుల నాణ్యత నిర్ధారణకు వ్యవసాయ ప్రయోగశాలల ఏర్పాటు. ► చిన్న, సన్నకారు, కౌలు రైతులకు మేలు చేసేలా వైఎస్సార్ వడ్డీలేని పంట రుణాలు. ► రైతు సంక్షేమం కోసం కస్టమ్ హైరింగ్ సెంటర్లు ► విజయవాడ సమీపంలోని గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్–155251 ఏర్పాటు ► శీఘ్రగతిన వ్యవసాయ మండళ్ల ఏర్పాటు ► త్వరలో విలేజ్ హార్టీకల్చర్ అసిస్టెంట్ల నియామకం ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ప్రోత్సహించి పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి రైతు ఆదాయం పెంపు. ► ఉద్యాన వర్శిటీ నుంచి కొత్త వంగడాల రూపకల్పన ► బైవోల్టిన్ పట్టు పరిశ్రమ ప్రోత్సాహానికి చర్యలు.. ‘ఉపాధి’ పథకం కింద మల్బరీ తోటల పెంపకం ► 147 నియోజకవర్గస్థాయి పశువ్యాధి నిర్ధారణా కేంద్రాల ఏర్పాటు ► మత్స్యకారుల ప్రమాద బీమా హెచ్చింపు, డీజిల్ ఆయిల్‌పై సబ్సిడీ పెంపు ► జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు జీఎస్పీసీ నుంచి రూ.70.53 కోట్ల చెల్లింపు ► సహకార రంగ సంస్కరణకు చర్యలు, త్వరలో కంప్యూటరీకరణ ► పగటి పూట ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ► వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చేసి బంజరు భూములను వ్యవసాయ భూములుగా మారుస్తాం. ► ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ద్వారా వచ్చే ప్యాకేజీలన్నింటినీ ఉపయోగించుకుంటాం. పెద్దఎత్తున నిధులు వచ్చేలా ఏర్పాట్లుచేస్తున్నాం. ► 2019–20లో రికార్డ్ స్థాయిలో 180.54 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి రాజన్న బిడ్డ వచ్చిన వేళ.. ‘బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ’.. అనే జన సామాన్య సామెతను నిజం చేసేలా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ వచ్చిన వేళ రాష్ట్రంలో వ్యవసాయం కళకళలాడుతోందని మంత్రి కన్నబాబు చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది. జగన్ వచ్చిన వేళ రాష్ట్రం అత్యధిక ఆహార ఉత్పత్తులను సాధించిందని, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన పాలకుడు ఎప్పటికీ రాజనీతిజ్ఞుడు కాలేడని ఏనాడో సోక్రటీస్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. ఒత్తిడి లేని వ్యవసాయమనేది సీఎం సంకల్పమన్నారు. సీఎం సంకల్ప బలం.. ప్రకృతి సహకారం సీఎం వైఎస్ జగన్ సంకల్పం, ప్రకృతి సహకారంతో రాష్ట్ర వ్యవసాయ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. దానికి నిదర్శనమే మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్. 2019–20లో రాష్ట్ర మొత్తం బడ్జెట్ రూ.2,27,974.99 కోట్లయితే వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు రూ.28,866.23 కోట్లు. అంటే మొత్తం బడ్జెట్లో అది 12.66 శాతం. 2020–21లో ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం వల్ల మొత్తం బడ్జెట్‌ను గత ఏడాది కంటే 1.4 శాతం తగ్గించారు. దీంతో ఈ ఏడాది దానిని రూ.2,24,789.18 కోట్లకు కుదించినా వ్యవసాయానికి మాత్రం ప్రాధాన్యత కల్పించారు. ఈ ఏడాది వ్యవసాయానికి రూ.29,159.97 కోట్లు ప్రతిపాదించారు. అంటే మొత్తం బడ్జెట్లో ఇది 12.97 శాతం. వరుసగా రెండో ఏడాది కూడా రెండంకెల శాతం నిధులు వ్యవసాయానికి కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. – ఎంవీఎస్ నాగిరెడ్డి, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించని పక్షంలో ప్రభుత్వమే రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్లో భారీగా రూ.3 వేల కోట్లను కేటాయించారు. రైతులకు అందుబాటులో ఉండేలా గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణాలకు సైతం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. లాక్డౌన్ కాలంలో పంటల సేకరణకు ధరల స్థిరీకరణ నిధి ఎంతగానో ఉపయోగపడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్లో రూ.3,000 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ► ప్రస్తుతం 22 ఈ–నామ్ మార్కెట్లు రైతులకు సేవలందిస్తున్నాయి. వీటికి తోడు మరో 12 ఈ–నామ్ మార్కెట్లను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంటలకు మంచి ధర కల్పించేలా ఈ–నామ్లో ఎక్కువ మంది రైతుల పేర్లను నమోదు చేయించాలని భావిస్తోంది. ► ప్రస్తుతం 130 రైతు బజార్లు ఉండగా.. ఈ ఏడాది 29 రైతు బజార్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ► మొత్తంగా ధరల స్థిరీకరణ నిధి, ఇతర ఖర్చుల నిమిత్తం మార్కెటింగ్ శాఖకు రూ.3,110 కోట్లను కేటాయించారు. సహకార శాఖకు చేయూత ► సహకార శాఖకు రూ.248.38 కోట్ల మేర బడ్జెట్లో కేటాయింపులు చేశారు. రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ► రాష్ట్రంలో 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేయనున్నారు. ► సహకార సంఘాల పరిధిలోని గోదాములకు మరమ్మతులు చేయడంతోపాటు కొత్తగా 70 గోదాములు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ► తూర్పు గోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఐసీడీపీ ప్రాజెక్టులను అమలులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ► తద్వారా 1,761 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 5 లక్షల మంది రైతులు, కౌలుదారులకు ప్రయోజనం కలగనుంది. ► సహకార పరపతి సంఘాలకు ఆర్థిక సాయం కింద రూ.1.25 కోట్లు, ఐసీడీపీ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంగా రూ.11.65 కోట్లు, కో–ఆపరేటివ్ ట్రైనింగ్‌కు రూ.5.66 కోట్లు కేటాయించారు. ► ఎన్సీడీసీ ప్రాజెక్ట్ స్కీమ్‌ల అమలుకు రూ.74.74 కోట్లు, ఎన్సీడీసీ ప్రాజెక్టులకు రుణం కింద రూ.12.84 కోట్లు, ఇతర ఖర్చులు, జీతాల నిమిత్తం రూ.142.24 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. రైతు సంక్షేమానికి ఊతం వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి సర్కారు తగినన్ని నిధులు కేటాయించింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ సేవలు అందించడానికి బడ్జెట్ ఊతమిచ్చింది. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ రంగంలో ప్రధాన పాత్ర పోషించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అందుకనుగుణంగానే బడ్జెట్ సాగింది. పెట్టుబడి ఖర్చులు తగ్గించి దిగుబడి పెంచడానికి అనేక ప్రతిపాదనలు ఈ బడ్జెట్లో ఉన్నాయి. గిట్టుబాటు ధరలు దక్కడానికి సమపాళ్లలో ప్రాధాన్యత కల్పించిందీ బడ్జెట్. – అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ విద్యుత్తుకు పవర్! విద్యుత్ రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం రూ.6,949.65 కోట్లు కేటాయించింది. 2018–19తో పోలిస్తే ఇది రూ.4,811.43 కోట్లు ఎక్కువ. వ్యవసాయానికి 9 గంటలు పగటిపూట విద్యుత్‌కు బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేసేందుకు వీలుగా 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బడ్జెట్లో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రధానంగా ప్రస్తావించారు. ► అత్యధిక ఓల్టేజీ పంపిణీ విధానం (హెచ్‌వీడీఎస్) ద్వారా లో వోల్టేజీ లేకుండా విద్యుత్ సరఫరా కోసం పంపిణీ, సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తారు. కడప, అనంతపురంలో పవన విద్యుత్ విస్తరణ చేపడతారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలను విద్యుదీకరిస్తారు. ► బడ్జెట్ కేటాయింపులే కాకుండా ట్రాన్స్‌కో చేపట్టే పలు ప్రాజెక్టులకు రుణాలు పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది. ఇందులో విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ కూడా ఉంది. విద్యుత్ సరఫరా బలోపేతానికి 132, 220, 33 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి వివిధ ఆర్థిక సంస్థల నుంచి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇప్పిస్తారు. ► 9 గంటల ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.4,500 కోట్లు కేటాయించింది. రబీ నాటికి వంద శాతం ఫీడర్ల ద్వారా సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు, సబ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పశు సంవర్థక, మత్స్యశాఖకు.. రూ. 1,280 కోట్లు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే పశు సంవర్థక, మత్స్య శాఖలకు బడ్జెట్లో ప్రభుత్వం రూ.1,280.11 కోట్లు కేటాయించింది. పశు సంవర్థక శాఖకు రూ.980.48 కోట్లు.. మత్స్యశాఖకు 299.63 కోట్లు ప్రతిపాదించింది. వ్యవసాయం తరువాత పశుపోషణ ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పశు నష్టపరిహారం, రాజన్న పశువైద్యం, పశు విజ్ఞానబడి వంటి పథకాలను అమల్లోకి తెచ్చింది. అలాగే, రైతుభరోసా కేంద్రాల్లో పశువులకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకురావడానికి గత ఏడాది పశు సహాయకులను నియమించింది. పాల ఉత్పత్తిని పెంచేందుకు పలు పథకాలు.. పాల ఉత్పత్తి సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంది. అంతేకాక.. 3.50 కోట్ల పశువులకు వాక్సిన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా తీసుకుంది. పాలు, కోడిగుడ్లు, మాంసం ఉత్పత్తులను గత ఏడాది కంటే 20 శాతం అధికంగా పెంచాలని లక్ష్యంగా తీసుకుంది. ఇక తీర ప్రాంతాన్ని ఉపాధికి నెలవుగా మార్చేందుకు ఒకవైపున ఆక్వాసాగు ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకుండా వారి ఉపాధి కోసం హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను నిర్మించాలని నిర్ణయించింది. శాశ్వత ప్రాతిపదకన వీటిని నిర్మించనుంది. ఇందుకు బడ్జెట్లో అవసరమైన కేటాయింపులు చేసింది. కేటాయింపులు ఇలా.. నవరత్నాల్లో భాగంగా ఆవులు, గేదెలు,గొర్రెలు చనిపోయినప్పుడు పోషకులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వైఎస్సార్ పశు నష్టపరిహారం పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకానికి రూ.50 కోట్లను కేటాయించింది. -
రహదారులు రయ్.. రయ్..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్లు, రవాణా అభివృద్ధికి బడ్జెట్లో ప్రభుత్వం పెద్దమొత్తంలో కేటాయింపులు చేసింది. ఆర్అండ్బీ, రవాణా రంగాలకు రూ. 6,588.58 కోట్లు కేటాయించింది. పర్యావరణ అనుకూల విధానంలో వంతెనలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టనున్నారు. రహదారి భద్రతకు నిధులు కేటాయింపు ద్వారా 15 శాతం ప్రమాదాలు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గత బడ్జెట్ (2019–20)లో రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 6,202.98 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో 6.22 శాతం అధికంగా నిధులిచ్చారు. కాగా, టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ (2018–19)లో ఈ రంగానికి రూ. 4,703.45 కోట్లు కేటాయించినా.. రూ. 2,599.81 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులతో పాటు నాబార్డు, ఇతర సంస్థల నుంచి నిధులు సమకూర్చుకుంటోందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 256 కి.మీ. మేర జాతీయ రహదారుల అభివృద్ధి, మూడు వంతెనల నిర్మాణం, సెంట్రల్ రోడ్ ఫండ్ కింద 505 కి.మీ. రహదారుల్ని అభివృద్ధి చేశామని చెప్పారు. వీటితో పాటు ఈఏడాది బడ్జెట్ నిధులతో మరో 700 కి.మీ. రహదారుల్ని అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించారు. ► న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సాయంతో 70:30 నిష్పత్తిలో ఖర్చులు భరించే పద్ధతిలో ప్రభుత్వం 2 ప్రాజెక్టులు ప్రారంభించింది. ► ఆ రెండు ప్రాజెక్టుల్లో ఏపీ రోడ్ అండ్ బ్రిడ్జెస్ రీకనస్ట్రక్షన్ ప్రాజెక్టు రాష్ట్ర రహదారులు, వంతెనల అభివృద్ధిపై దృష్టిపెడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ మండల కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు జిల్లా, మండల, కేంద్ర కార్యాలయాల మధ్య రెండు వరుసల రోడ్డు వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందుకు రోజుకు 2 వేల ప్యాసింజర్ కార్ యూనిట్ల కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్లను ఎంపిక చేస్తారు. ఈ 2ప్రాజెక్టుల ద్వారా 3,104 కి.మీ. పొడవైన రోడ్లు, 479 వంతెనలు నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ► ఈ ఆర్థిక సంవత్సరంలో 325 కి.మీ. రాష్ట్ర రహదారుల మరమ్మతులు, నిర్వహణ చేపడతారు. 1,900 కి.మీ. వరకు మేజర్ జిల్లా రహదారుల మరమ్మతులు, గుంతల్లేని రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. ► విశాఖపట్నం మెట్రో పాలిటన్ ప్రాంతంలో రవాణా సదుపాయాన్ని మెరుగుపరిచేందుకు 140.11 కి.మీ. మేర మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టంను అభివృద్ధి చేయడం ద్వారా భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అనకాపల్లి వరకు రోడ్డు అభివృద్ధి చెందుతుంది. ► 140.11 కి.మీ. మేర ఏర్పాటు కానున్న ఈ రోడ్డులో 79.91 కి.మీ. మేర కారిడార్లు లైట్ మెట్రో రైల్ అభివృద్ధి, 60.20 కి.మీ. మేర కారిడార్లు కాటినరీ ఫ్రీ మోడరన్ ట్రామ్/లైట్ మెట్రో సిస్టం కోసం వినియోగించనున్నారు. ► కాస్ట్ షేరింగ్‌లో 50 శాతం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏపీలో 175 కి.మీ. కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి రూ. 150 కోట్లు, రైల్వే సేఫ్టీ వర్కుల కింద రూ. 50 కోట్లు కేటాయించారు. ► విద్యార్థులకు, ఇతరులకు అర్హత ప్రకారం 28.32 లక్షల రాయితీ బస్ పాస్‌లు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం రూ. 3,059 కోట్లు కేటాయించారు. ► ‘వైఎస్సార్ వాహన మిత్ర పథకం’ కింద ఆర్థిక సాయం అందించడానికి బడ్జెట్లో రూ. 275.52 కోట్లు కేటాయించారు. -
బడ్జెట్‌పై సంక్షేమ సంతకం
సాక్షి, అమరావతి: సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించి పేదలకు అండగా ఉన్నామనే భరోసాను ప్రభుత్వం కల్పించింది. 2020–21 బడ్జెట్లో గత సంవత్సరం కంటే కేటాయింపులు పెరిగాయి. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మందికి లబ్ధి చేకూరుస్తామనే వివరాలు (టార్గెట్) కూడా బడ్జెట్లో పొందుపరిచారు. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలు ఈ బడ్జెట్ ద్వారా వెల్లడయ్యాయి. ఇప్పటికే సంక్షేమ పథకాలు ఎదురు లేకుండా అమలవుతున్నాయి. కేటాయింపులు ఘనంగా ఉన్నా ఖర్చు చేస్తారనే నమ్మకం లేదని విమర్శించేందుకు తావే లేదు. ఎందుకంటే ఆయా పథకాల లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. బీసీ సంక్షేమం ► బీసీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో కాంపోనెంట్ ద్వారా రూ.25,331.30 కోట్లు కేటాయించారు. ఇంత భారీ మొత్తంలో కేటాయించడం ఇదే మొదటి సారి. ► గత సంవత్సరం రూ.15,061.64 కోట్లు కేటాయించారు. అంటే ఈ సంవత్సరం 68.18 శాతం ఎక్కువ బడ్జెట్ కేటాయింపు జరిగింది. నవరత్నాల ద్వారా రూ. 23,458.8 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఎస్సీ సంక్షేమం ► షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం 2020–21 బడ్జెట్లో రూ.15,735.68 కోట్లు కేటాయించారు. ఇది గత సంవత్సరం బడ్జెట్ కంటే 4.90 శాతం ఎక్కువ. ► గత ఏడాది రూ.15,000.85 కోట్లు కేటాయించారు. 47 ప్రభుత్వ శాఖల ద్వారా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు వివిధ పథకాల కోసం ఖర్చు చేస్తారు. నవరత్నాల అమలుకు రూ.7,525.02 కోట్లు ఖర్చు చేస్తారు. ఎస్టీల సంక్షేమం ► గిరిజనుల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో ప్రభుత్వం రూ. 5,177.53 కోట్లు కేటాయించింది. 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే 3.79 శాతం ఎక్కువ. ► నవరత్న పథకాల అమలుకు రూ.1,840.71 కోట్లు ఖర్చు చేయనున్నారు. మైనార్టీల సంక్షేమం ► రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్లో ప్రభుత్వం రూ.2,050.22 కోట్లు కేటాయించింది. ► 2019–20 బడ్జెట్‌తో పోలిస్తే ఇది 116.10 శాతం ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో మైనార్టీల సంక్షేమానికి నిధులు కేటాయించడం ఇదే మొదటి సారి. ► మైనార్టీలకు నవరత్నాల అమలుకు ఈ సంవత్సరం రూ.1998.56 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ నిధుల ఖర్చు ఇలా.. ► వివిధ పథకాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ లబ్ధిదారులను ఇప్పటికే ఎంపిక చేశారు. వైఎస్సార్ నవశకం ద్వారా ప్రతి సంవత్సరం కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఆయా వర్గాల విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, తదితర పథకాలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు. ► అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం (విదేశీ విద్య) ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.15 లక్షలు, ఈబీసీలకు రూ.10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. డిగ్రీ పాసైన వారికి బీసీ, ఎస్సీ స్టడీ సర్కిళ్ల ద్వారా రూ.6 లక్షల లోపు ఆదాయం ఉన్న విద్యార్థినీ విద్యార్థులకు యూపీఎస్ఈ, గ్రూప్1, 2, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఏపీపీఎస్సీ, ఇతర ఎంట్రెన్స్ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్ స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేస్తారు. ► వైఎస్సార్ పెళ్లి కానుక ద్వారా బీసీలకు రూ.75 వేలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,00,000, దివ్యాంగులకు రూ. 1.20 లక్షలు ఇస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందజేస్తారు. ► బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, ఈబీసీ, ఎంబీసీలకు సామాజిక భవనాల నిర్మాణాలు, పెళ్లిళ్లు, ఇతర సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ► సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడేందుకు ఆర్థిక సహాయ పథకాలు అమలు చేస్తారు. ► 28.59 లక్షల మంది బీసీలకు పెన్షన్ కానుక, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీలకు కూడా పెన్షన్ కానుక. ► ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల వసతి సౌకర్యాలకు ప్రత్యేక కేటాయింపులు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి పథకం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున నిధుల కేటాయింపు. ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీల్లోని ఆటో, ట్యాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు రూ.10 వేల ఆర్థిక సాయం. ఆయా వర్గాల్లోని రైతులకు ఉచితంగా బోర్లు. రైతులకు వడ్డీ లేని రుణాలు. ► వైఎస్సార్ ఆసరా ద్వారా డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం. ► వృత్తిని నమ్ముకుని బతుకుతున్న చేనేతలకు రూ.24 వేల ఆర్థిక సాయం. ► వైఎస్సార్ చేయూత పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో 45 నుంచి 60 సంవత్సరాలలోపు మహిళలకు ఒక్కొక్కరికి రూ.18,750ల లెక్కన నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ► వైఎస్సార్ రైతు భరోసా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు ఆర్థిక సాయం అందిస్తారు. కాపు కార్పొరేషన్‌కు రూ.2845.60 కోట్లు కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ బడ్జెట్లో గత ఏడాది కంటే రూ.830.95 కోట్లను అధికంగా కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్లో రూ.2845.60 కోట్లు కేటాయించింది. గత ఏడాది రూ.2014.65 కోట్లు కేటాయించింది. కాపు నేస్తం పథకం కింద మహిళలు చిన్న చిన్న వ్యాపారులు చేసుకోడానికి సాలీనా రూ.15 వేలు చొప్పున ప్రతి కాపు మహిళకు జీవనోపాధి నిమిత్తం బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో ఉన్న 1.20 కోట్ల కాపులు ఈ కేటాయింపుల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద సమ్మె కాలాన్ని ఇటీవలే చవిచూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆర్టీసీ పరిరక్షణ , బలోపేతం కోసం భారీ కార్యాచరణ ప్రకటించటంతో బడ్జెట్ కేటాయింపులపై భారీ ఆశలే నెలకొన్నాయి. బడ్జెట్లో ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని సీఎం చెప్పడంతో ఈసారి భారీ నిధులే వస్తాయని అధికారులు అంచనా వేశారు. అన్నీ కలుపుకొని రూ.వెయ్యి కోట్లు మాత్రమే ప్రకటించడంతో మరో ఏడాది నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా ఇచ్చే బడ్జెట్ నిధులకు అదనంగా, సీఎం ప్రకటించిన రూ.వెయ్యి కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. తాజా బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు ప్రస్తావించడంతో, సీఎం చెప్పింది ఈ నిధులేనని సరిపుచ్చుకుంటున్నట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. టీఎస్ఆర్టీసీకి రుణాల పద్దు కింద రూ.400 కోట్లు, వివిధ కేటగి రీ వ్యక్తులకు కేటాయించిన బస్సు పాస్‌లకు సంబంధించిన రాయితీల మొత్తం తిరిగి చెల్లించేందుకు రూ.600 కోట్లు చూపారు. వెరసి రూ. వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటా యించినట్లు అయింది. రూ.3 వేల కోట్లు ఇవ్వాలని అధికారులు కోరారు. సమ్మె కాలానికి సంబంధించి ఉద్యోగులకు జీతం ఇవ్వనున్నట్లు సీఎంకేసీఆర్ ప్రకటించగా.. తాజా బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. -
అదనపు ఆదాయం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్వేషణ మార్గాలను వెతుక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడులు కూడా అం తంత మాత్రంగానే ఉంటా యనే అంచనాల నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్... బడ్జెట్ ప్రతిపాదనలకు తగినట్లు నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టారు. బడ్జెట్ తయారీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్ రెడ్డి తదితరులతో బడ్జెట్ రూపకల్పనపై నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఈ మేరకు చర్చిస్తున్నారు. బడ్జెట్ నిర్వహణకు అడ్డంకులు కలగకుండా ఉండేందుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అం దులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను పెంపు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంచడం ద్వారా స్థానిక సంస్థలకు సర్దుబాటు చేయాల్సిన నిధుల్లో వెసులుబాటు వస్తుందనే చర్చ జరిగింది. పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పేరుతో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు పలు అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టి ఠంచన్‌గా నెలవారీ నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రాకపోవచ్చనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. అయితే పన్ను పెంచడమా లేక లీకేజీలు లేకుండా పన్ను 100 శాతం వసూలు చేయడమా అనే అంశంపైనా చర్చ జరిగింది. గ్రామ పంచా యతీల విషయానికి వస్తే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల లాంటి జిల్లాలు మినహా మిగిలిన చోట్ల ఇంటి పన్ను నామమాత్రంగానే వసూలవుతోందని, ఈ పన్నును సజావుగా రాబట్టుకోవడం ద్వారా ఏటా రూ.200 కోట్ల వరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, లీకేజీలు అరికట్టడమే లక్ష్యం గా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గించుకోవచ్చనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తిపన్ను ప్రతి పాదనను సీఎం తోసిపుచ్చలేదని కూడా సమాచా రం. ఇక విద్యుత్ టారిఫ్ పెంపు అంశాన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణ కేటగిరీలో ఉండే ప్రజలకు భారం పడకుండా విద్యుత్ చార్జీల ను పెంచుకోవడం ద్వారా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం నుంచి ప్రభుత్వానికి ఊరట కలుగుతుం దని, విద్యుత్ సబ్సిడీల రూపంలో ఇస్తున్న దాంట్లో దాదాపు రూ. 2 వేల కోట్ల భారం తగ్గించుకోవచ్చనే భావనతో త్వరలోనే చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువలు సవరిస్తే...! ఇక భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశం కూడా ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించలేదు. కారణమేదైనా రెండేళ్లకోసారి సవరించాల్సిన ఈ ధరలు ఆరేళ్లయినా మార్చలేదు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లలోనే ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతోపాటు భూముల విషయంలో ప్రజల అభిప్రాయం కూడా రిజిస్ట్రేషన్ విలువల సవరణకు అనుకూలంగానే ఉంటుందనే చర్చ ఈ సమావేశంలో జరిగింది. దీంతో ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని తద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా నెలవారీ వచ్చే అదనపు ఆదాయంతో నెలవారీగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు గతేడాది ప్రతిపాదించిన విధంగానే మరోమారు భూముల అమ్మకాలను కూడా ప్రతిపాదించాలనే దానిపైనా ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఈ ఏడాది కొత్తగా ఆపద్బంధు పథకం, కుట్టు మిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండడంతోపాటు నెలనెలా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ. 500 కోట్ల వరకు అవసరం అవుతున్నందున ఖజానాకు లోటు రాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవసరానికి తగినట్లు భూముల విక్రయాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 10–12 వేల కోట్ల వరకు ఆదాయాన్ని రిజర్వు చేసుకోవాలని, మిగిలిన మార్గాల్లో కలిపి మొత్తం రూ. 20 వేల కోట్లను అదనంగా అందుబాటులో ఉంచుకొనే విధంగా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. -
బడ్జెట్లో కూతపెట్టని రైల్వే!
సాక్షి, హైదరాబాద్: రైల్వే బడ్జెట్ అనగానే యావత్తు దేశం ఎదురుచూసేది.. ఏ ప్రాంతానికి ఏ రైలు వస్తుంది, కొత్త రైల్వే లైన్లు ఏ ప్రాంతానికి మంజూరవుతాయి అని ప్రజలు టీవీలకు అతుక్కుపోయేవారు. కానీ, శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో రైల్వే ప్రస్తావనకు కేటాయించిన సమయం రెండుమూడు నిమిషాలు మాత్రమే.అందులోనే కొన్ని విషయాలు ప్రస్తావించారే తప్ప కొత్త రైళ్లు, లైన్లు, సర్వేలు వంటి వాటి ఊసే లేదు. రైల్వే బడ్జెట్‌ను విడిగా ప్రవేశపెట్టకుండా సాధారణ బడ్జెట్లో కలిపేసిన తర్వాత, రైల్వేకు చెందిన వివరాలను సంక్షిప్తంగా వెల్లడిస్తున్నారు. కానీ తాజా బడ్జెట్ ప్రసంగంలో నామమాత్రపు ప్రస్తావనతోనే సరిపుచ్చటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థూలంగా నాలుగైదు విషయాలతో సరిపుచ్చినప్పటికీ, జోన్ల వారీగా వివరాలను ఆ తర్వాత కూడా వెల్లడించలేదు. పింక్‌బుక్ పేరుతో ఉండే పూర్తి వివరాల పుస్తకాన్ని మరుసటి రోజో, ఆ తర్వాతనో విడుదల చేసేవారు. ఈసారి ఆ పింక్ బుక్‌ను ఐదో తేదీన విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే అప్పటి వరకు జోన్ల వారీగా కేటాయింపుల విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉండదు. రైల్‌నిలయానికి సమాచారం లేదు దక్షిణ మధ్య రైల్వేకు చేసిన కేటాయింపులకు సంబంధించి రైల్ నిలయంకు ఎలాంటి సమాచారం అందలేదు. ‘బడ్జెట్లో రైల్వేలకు సం బంధించి కనీస వివరాలు కూడా వెల్లడించకపోవటాన్ని తొలిసారి చూస్తున్నాం. కొన్ని ప్రధాన ప్రాజెక్టులు, చేపట్టబోయే కొత్త సంస్కరణలు, కొత్త రైళ్లు లాంటి వివరాలైనా వెల్లడించాల్సింది. ఇక జోన్ల వారీగా కేటాయింపు లు ఎప్పుడిస్తారో కూడా సమాచారం లేదు. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి అడిగినా చెప్పలేదు. ఐదో తేదీన పార్లమెంటు లో పింక్‌బుక్‌ను విడుదల చేసిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉంది’అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు దాదాపు రూ.6,100 కోట్ల మేర నిధులు కేటాయించారని, ప్రస్తుతం పనులు జరుగుతున్న మనోహరాబాద్–కొత్తపల్లి, మహబూబ్‌నగర్ డబ్లింగ్, కాజీపేట–బల్లార్షా, కాజీపేట–విజయవాడ మూడో లైన్ పనులు, మెదక్–అక్కన్నపేట, భద్రాచలం–సత్తుపల్లి ప్రాజెక్టులకు రూ.1,200 కోట్ల మేర కేటాయింపులున్నాయని సమాచారం. ఓ హైస్పీడ్ కారిడార్, రెండు రైళ్ల ప్రస్తావన ఉందని చెబుతున్నారు. -
100 టీఎంసీలు కావాలి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది యాసంగి సీజన్లో రాష్ట్ర తాగు, సాగు నీటి అవసరాలకు 100 టీఎంసీల మేర అవసరం ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేస్తోంది. నాగార్జునసాగర్ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించడంతో అక్కడి అవసరాలు,ఏఎంఆర్పీ, హైదరాబాద్ తాగునీరు, కల్వకుర్తికి కలిపి ఈ నీళ్లు సరిపోతాయని తేల్చింది. నీటి లభ్యత పుష్కలంగా ఉన్న దృష్ట్యా బోర్డు నుంచి అభ్యంతరాలు ఉండబోవని భావిస్తోంది. లభ్యత పుష్కలం.. సాగర్కింద ఈ యాసంగిలో 6.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు. గతేడాది పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరిచ్చిన సందర్భాల్లోనూ 45 నుంచి 50 టీఎంసీల నీటిని ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన విడుదల చేశారు. ఈ ఏడాది సైతం 50 టీఎంసీల నీటితో సాగు అవసరాలు తీర్చవచ్చని నీటి పారుదల శాఖ లెక్కలేస్తోంది. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీలకు గానూ 294.55 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో తెలంగాణకు దక్కే వాటాల్లోంచి సాగర్‌కు అవసరమయ్యే నీటి విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. ఇక సాగర్ కిందే ఏఎంఆర్పీ ఎస్ఎల్బీసీ కింద 2.80లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించగా, దీని అవసరాలకు మరో 20 టీఎంసీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మరో 10 టీఎంసీలు అవసరం పడతాయని అంచనా వేస్తున్నారు. సాగర్ కిందే మొత్తంగా 80 టీఎంసీలకు అవసరం ఉంటోంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ కల్వకుర్తికింద 1.80 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరివ్వనున్నారు. దీనికి, తాగునీటి అవసరాలకు కలుపుకొని మొత్తంగా 20 టీఎంసీలు శ్రీశైలం నుంచి తీసుకో నున్నారు. శ్రీశైలంలోనూ 215 టీఎంసీలకు గానూ 182.61 టీఎంసీల లభ్యత ఉంది. మొత్తం రెండు ప్రాజెక్టుల్లోనూ ఉన్న నీటి లభ్యతలోంచి తెలంగాణకు ఇప్పటివరకు వినియోగించిన వాటా, ఇకపై వినియోగించే వాటాలు కలిపి గరిష్టంగా 175 టీఎంసీల వాటా దక్కే అవకాశం ఉందని ఇరు రాష్ట్రాలకు రాసిన లేఖలో కృష్ణా బోర్డు పేర్కొంది. ఈ వాటాల్లోంచే 100 టీఎంసీల నీటిని తెలంగాణ వినియోగించనుండగా, మిషన్ భగీరథతో పాటు జిల్లాల తాగునీటి అవసరాలకు మరింత నీటిని వినియోగించుకునే వెసులుబాటు తెలంగాణకు ఉండనుంది. ఎజెండాలో మళ్లింపు జలాలను చేర్చిన రాష్ట్రం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వచ్చే జూన్ వరకు నీటి కేటాయింపులకు సంబంధించి చర్చించేందుకు ఈనెల 3న మంగళవారం కృష్ణాబోర్డు భేటీ కానుంది. బోర్డు భేటీలో నీటి కేటాయింపులతో పాటు, కార్యాలయాన్ని అమరావతికి తరలింపు, బడ్జెట్ కేటాయింపులు, వర్కింగ్ మాన్యువల్, ఇతర అంశాలపై ఇందులో చర్చిద్దామని ప్రతిపాదించింది. ఇందులో పట్టిసీమ, పోలవరం ద్వారా మళ్లిస్తున్న జలాల్లో తెలంగాణకు దక్కే వాటా, తాగునీటికి కేటాయిస్తున్న నీటిలో వినియోగాన్ని కేవలం 20%గా మాత్రమే పరిగణించాలన్న అంశాలను చేర్చాలని కోరుతూ తెలంగాణ బోర్డును కోరింది. దీనికి బోర్డు అంగీకరించింది. -
ముగింపు ..తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంద్యం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారింది. మరీ ముఖ్యంగా ముగింపు దశలోని ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు భారీగా తగ్గాయి. మరో రూ.వెయ్యికోట్లు కేటాయించినా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తయ్యేవి. కానీ, ప్రభుత్వం కేవలం రూ.87 కోట్లు మాత్రమే కేటాయించింది. పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు. కోయిల్సాగర్ల కింద మొత్తంగా 8.78 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే 6.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేలా పనులు పూర్తిచేయగా, మిగతా ఆయకట్టుకు వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల పరిధిలో మిగిలిన పనుల పూర్తికి, 12 శాతం మేర మిగిలిన భూసేకరణకు రూ.1,200 కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కల్వకుర్తి ప్రాజెక్టుకు కనిష్టంగా రూ.400 కోట్లు కేటాయించాలని కోరినా కేవలం రూ.4 కోట్లతో సరిపెట్టారు. ఈ ప్రాజెక్టు కింద పనులకు సంబంధించి రూ.70 కోట్లు, భూసేకరణకు సంబంధించి రూ.17 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఈ ప్రాజెక్టు కింద 4.24 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎక రాల కు నీరిచ్చే అవకాశాలుండగా, మిగతా ఆయకట్టు ను వచ్చే ఏడాదికి సిద్ధం చేయాల్సి ఉంది. ఈ నిధులతో అధి సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇక భీమా, నెట్టెంపాడుల పరిధిలోనూ పెండింగ్ బిల్లులు రూ.33 కోట్ల మేర ఉన్నాయి. భూసేకరణకు మరో రూ.17 కోట్లు అవసరం. వీటి కింద నిర్ణయించిన చెరో 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే కనిష్టంగా రూ.400 కోట్లు అవసరంకాగా కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్.. ప్రాణహిత మూలకే.. ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లోని టన్నెల్ పనులు గాడిన పడే అవకాశం కనబడటం లేదు. పనుల పూర్తికి నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడమే దీనికి కారణం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా రెండు టన్నెళ్లు తవ్వాల్సి ఉంది. మొదటి టన్నెల్‌ను శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.89 కి.మీ. కాగా, మరో 10 కి.మీ లకు పైగా టన్నెల్‌ను తవ్వాల్సి ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 23.07 కి.మీ. టన్నెల్ పూర్తవగా తర్వాత ఐదేళ్లలో 9 కి.మీ. మేర తవ్వారు. కన్వేయర్ బెల్ట్, ఇతర యంత్రాలను మార్చాల్సి రావడంతో వాటిని తిరిగి ఏర్పాటు చేసేందుకు ఏజెన్సీకి రూ.80 కోట్లను అడ్వాన్సు కింద చెల్లించాలని ప్రతిపాదన వచ్చినా తుది రూపం తీసుకోలేదు. పనులకు సంబంధించి రూ.80 కోట్ల మేర పెండింగ్ బిల్లులున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాణహిత ప్రాజెక్టుకు కేటాయింపులు తగ్గిపోయాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.22 కోట్లు, భూసేకరణకు రూ.270 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ దృష్ట్యా ప్రాజెక్టుకు రూ.300 కోట్ల మేర కేటాయింపులు కోరినా రూ. 17.31 కోట్లను మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమ్మిడిహెట్టి కాకుండా దానికి ఎగువన వార్ధా నదిపై దీన్ని నిర్మించాలని భావిస్తుండ టంతో ప్రభుత్వం కేటాయింపులు తగ్గించింది.