వార్డు సచివాలయాలు 3,775 | Ward Secretaries are 3775 | Sakshi
Sakshi News home page

వార్డు సచివాలయాలు 3,775

Published Sun, Jul 21 2019 2:57 AM | Last Updated on Sun, Jul 21 2019 11:56 AM

Ward Secretaries are 3775 - Sakshi

సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కొత్తగా ఏర్పాటుకానున్న వార్డు సచివాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, విద్యార్హతలు, బడ్జెట్‌ కేటాయింపు, విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ నూతన వ్యవస్థకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇకపై పట్టణ ప్రజలు తాము నివాసం ఉండే ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే ఏర్పాటు కానున్న వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. మున్సిపల్‌ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు పట్టణాలు, నగరాల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుతం వార్డుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు 34,350 మందిని కొత్తగా నియమిస్తామని మున్సిపల్‌ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. పోస్టుల భర్తీకి ఈ నెల 22న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలిపారు.
 
18 సేవలు 10 విభాగాలుగా విభజన
పట్టణాల్లో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. ప్రతి 5,000 మందికి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే, ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సత్వరం అందించాలన్న యోచనతో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం మున్సిపాల్టీలు 18 రకాల సేవలు అందిస్తున్నాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, అర్బన్‌ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, రహదారులు, పార్కుల నిర్మాణాలు, జనన మరణాల నమోదు, వీధిలైట్లు, పార్కింగ్, బస్‌స్టాఫ్‌ల ఏర్పాటు వంటి సేవలు అందిస్తున్నాయి. ఇకపై ఈ 18 సేవలను 10 విభాగాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తారు. వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూకు సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీస్‌ శాఖ పర్యవేక్షించనున్నాయి. మిగిలిన సేవలన్నింటినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తాయి. 

అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష 
వార్డు కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్డు సచివాలయాల్లో నిర్వహించాల్సిన విధులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పట్టభద్రులు, ఇంజినీర్లు, పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్‌వర్క్, నర్సింగ్‌లో ఫార్మాడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహించనున్న రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

రూ.629.99 కోట్లు కేటాయింపు 
వార్డు సచివాలయాల నిర్వహణకు, కొత్తగా నియమితులు కానున్న వార్డు కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.629.99 కోట్లు కేటాయించింది. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణా కాలంలో రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. వార్డు సచివాలయాల కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి ఒక గదిని అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సచివాలయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్‌ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 
 
వార్డు కార్యదర్శుల విధులు 
- వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి. 
- ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. 
- లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి. 
- ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్‌ డెలివరీ అయ్యే విధంగా చూడాలి. 
- విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. 

వార్డు కార్యదర్శుల నియామక షెడ్యూల్‌ 
- నోటిఫికేషన్‌: జూలై 22 
- దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 5 
- పరీక్షల నిర్వహణ: ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15  
- సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబరు 16 నుంచి 18 
- ఎంపికైన అభ్యర్థుల జాబితా: సెప్టెంబరు 20  
- వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ: సెప్టెంబరు 23 నుంచి 28  
- నగరాలు, పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు: సెప్టెంబరు 30 
- వార్డు కార్యదర్శుల బాధ్యతలు, ప్రాక్టికల్‌ తదితరాలపై శిక్షణ: అక్టోబరు 7 నుంచి నవంబరు 16 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement