replacement of jobs
-
ఆగస్టు 7, 8న గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, 2, 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆయా ఉద్యోగ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏడాది చివరినాటికల్లా గ్రూప్ సర్వీసులకు సంబంధించి అన్నిరకాల అర్హత పరీక్షలను పూర్తి చేసేలా ఈ షెడ్యూల్‌ను రూపొందించింది. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్పీఎస్సీ.. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఇక పెండింగ్‌లో ఉన్న గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న పరీక్షల్లో.. టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్లో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసినా.. పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు. అభ్యర్థులు సన్నద్ధతకు సమయం కోరడం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను దాదాపు మూడుసార్లు మార్చింది. ఇక 2022 ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. డిసెంబర్ నాటికి ఫలితాల ప్రకటనతోపాటు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దయింది. గత ఏడాది జూన్‌లో మరోమారు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా.. పరీక్షల నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. రెండోసారి కూడా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీలో మార్పులు చేయడంతోపాటు ఆ గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజాగా గత నెల 19న 563 పోస్టులతో కొత్తగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్నాళ్లూ పరీక్షల రద్దు, ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశలో ఉన్న నేపథ్యంలో.. ఉత్సాహం నింపేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది. సన్నద్ధతకు సమయం టీఎస్పీఎస్సీ ముందస్తుగా గ్రూప్ ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఆయా పరీక్షలు జరగలేదు. ఈ క్రమంలో షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఏయే పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావొచ్చనే దానిపై అభ్యర్థులు వ్యూహాత్మక ప్రణాళిక తయారు చేసుకునే వీలు కల్పించినట్టు అయిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో గ్రూప్–1 ప్రిలిమ్స్ జరగనుంది. అంటే ఈ పరీక్షలకు మూడు, నాలుగు నెలల వ్యవధి లభించింది. తర్వాత గ్రూప్–2 పరీక్షలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఆ తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు రెండు నెలల వ్యవధి ఉండటంతో సిద్ధమయ్యేందుకు వీలవనుంది. ఇక గ్రూప్–1 మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్–3 పరీక్షలు ఉన్నాయి. మొత్తంగా పరీక్షలకు సమయం సంతృప్తికర స్థాయిలో ఉందని, అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావొచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. -
గురుకుల కొలువులు 9,231
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 9,231 ఉద్యోగాల భర్తీకోసం తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఏకకాలంలో తొమ్మిది నోటిఫికేషన్లను జారీచేసింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను టీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్సైట్ (http://treirb.telangana.gov.in)లో అందుబాటులో ఉంచింది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లను ప్రకటనలో నిర్దేశించిన తేదీల్లో విడుదల చేస్తామని బోర్డు కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు. దాదాపు ఏడాదిపాటు కసరత్తు చేసిన టీఆర్‌ఈఐఆర్‌బీ.. ఎట్టకేలకు ప్రకటన జారీచేయడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాల్లో పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. నెల రోజులు గడువుతో.. గురుకుల బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లు ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పోస్టుల వారీగా దరఖాస్తుల తేదీ ప్రారంభం, ముగింపు, పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఎప్పుడు పెడతారన్న వివరాలను వాటిలో వెల్లడించారు. కొన్నిరకాల పోస్టులకు ఈనెల 17వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా.. మరికొన్నింటికి ఈ నెల 24న, 28న మొదలుకానున్నాయి. అన్ని కేటగిరీల పోస్టులకు దరఖాస్తులు మొదలైన నాటి నుంచి నెలరోజుల పాటు గడువు ఉంటుంది. దాదాపు అన్ని పోస్టులకు మే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. గడువు ముగిశాక నెలన్నర నుంచి రెండు నెలల పాటు సన్నద్ధతకు అవకాశం ఉంటుందని.. తర్వాత అందుబాటులో ఉన్న తేదీల్లో పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రస్థాయిలో ఇతర నియామక బోర్డులతో సమన్వయం చేసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌లను పూర్తిగా పరిశీలించి.. ఇబ్బందిలేని రోజుల్లో పరీక్షల నిర్వహణను ఖరారు చేయనున్నట్టు వెల్లడించాయి. సైలెంట్‌గా ప్రకటన విడుదల గురుకుల పోస్టుల భర్తీ నోటిఫికేషన్లను టీఆర్‌ఈఐఆర్‌బీ గుట్టుచప్పుడు కాకుండా విడుదల చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఉద్యోగ నియామక ప్రకటనలను సదరు నియామక సంస్థ విడుదల చేయడం, మీడియా సమావేశం పెట్టి వెల్లడించడం జరుగుతుంది. గతంలో గురుకుల నియామకాల బోర్డు ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశారు. కానీ ఇప్పుడు భారీగా గురుకుల ఉద్యోగాల భర్తీ చేపడుతున్నా.. కేవలం ఒకట్రెండు పత్రికల్లో యాడ్ (అడ్వర్టైజ్మెంట్) రూపంలో ఇవ్వడం గమనార్హం. ఓటీఆర్ ఉంటేనే దరఖాస్తు... తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మాదిరిగానే గురుకుల నియామకాల బోర్డు కూడా ఓటీఆర్ (వన్‌టైమ్ రిజిస్ట్రేషన్) విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని నిర్ణయించింది. ఐదేళ్ల క్రితం కేవలం డిగ్రీ లెక్చరర్ కేటగిరీకి మాత్రమే ఓటీఆర్‌ను అనుసరించగా.. ఇప్పుడు ప్రతి దరఖాస్తుకు ఓటీఆర్ తప్పనిసరి చేసినట్టు నోటిఫికేషన్లో ప్రకటించింది. ఓటీఆర్ ప్రక్రియ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు ముందుగా ఓటీఆర్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాకే గురుకుల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జోనల్ విధానానికి అనుగుణంగా ఓటీఆర్ ఆప్షన్లను సిద్ధం చేశారు. ప్రతి అభ్యర్థి విద్యార్హతలు, బోనఫైడ్లు, కుల ధ్రువీకరణ వంటి సర్టిఫికెట్లన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓటీఆర్ ప్రక్రియతో వెబ్‌సైట్‌పై తీవ్ర ఒత్తిడి పడేఅవకాశం ఉండడంతో.. దరఖాస్తులకు ఐదు రోజుల ముందుగానే ప్రారంభించినట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. గురుకుల కొలువుల దరఖాస్తు ఫీజు గతంలో రూ.600గా ఉండేది. ఇప్పుడు కూడా అంతేస్థాయిలో ఫీజు నిర్ధారించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో దాదాపు 12వేల ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9వేల ఉద్యోగాల భర్తీకి గతేడాది జూన్‌లోనే అనుమతులు వచ్చాయి. 2022–23 విద్యా సంవత్సరంలో బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మరిన్ని విద్యాసంస్థలు తెరవడంతో.. వాటిలోని పోస్టులను కూడా ఒకేదఫాలో భర్తీ చేయాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ల జారీ కోసం బోర్డు వేచిచూసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం మరో 2,225 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చింది. అయితే తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లలో 9వేలకుపైగా ఉద్యోగాలనే ప్రకటించారు. మిగతా కొలువులకు సంబంధించి త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు, ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజీలు, ఇతర సాంకేతిక కాలేజీల్లో పోస్టులు మంజూరైనా.. వాటికి సంబంధించిన సర్వీసు నిబంధనలు ఖరారు కాలేదు. దీనిపై స్పష్టత రాగానే ఉద్యోగ ప్రకటనలు రానున్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. -
TSPSC Paper Leak: ఆరు పరీక్షలు మళ్లీ.. అన్నీ కొత్తగానే..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు రద్దు చేసిన పరీక్షలు, వాయిదా వేసిన పరీక్షల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఇదివరకే నిర్వహించిన నాలుగు పరీక్షలు రద్దు కాగా... మరో రెండు పరీక్షలను చివరి నిమిషంలో వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై ఇప్పటికే పలు రకాల సమీక్షలు నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. అతి త్వరలో ఈ పరీక్షల తేదీలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది. కాగా పరీక్షల నిర్వహణ విషయంలో సమూల మార్పులు చేయనున్నట్లు కమిషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హాల్ టికెట్లు మొదలు.. టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు ఏడు అర్హత పరీక్షలను నిర్వహించింది. ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్... వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... ఈనెల 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. దీంతో ఆరు పరీక్షలను టీఎస్పీఎస్సీ తిరిగి నిర్వహించాల్సి వస్తోంది. ఈ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల వద్ద హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాల వివరాలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ సమూలంగా మార్చి కొత్తగా పరీక్షలు నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో పరీక్ష నిర్వహించే వారం రోజుల ముందు కొత్త నంబర్లతో అభ్యర్థులకు తిరిగి హాల్ టిక్కెట్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే అభ్యర్థులకు కొత్తగా పరీక్షా కేంద్రాలు కేటాయించనున్నారు. కొత్త ప్రశ్నపత్రాలను కూడా రూపొందించనున్నారు. కమిషన్ రహస్య కంప్యూటర్లలోని సమాచారం బయటకు లీక్ కావడంతో అన్ని రకాల ప్రశ్నపత్రాలు సమూలంగా మారనున్నాయి. ఈ మేరకు కొత్త ప్రశ్నలతో ప్రశ్నపత్రాల తయారీకి నిపుణులకు సూచనలు అందినట్లు సమాచారం. కాగా ప్రశ్నపత్రాల్లో జంబ్లింగ్ విధానాన్ని అనుసరించే అంశాన్నీ అధికారులు పరిశీలిస్తున్నారు. గత పరీక్షల తాలూకు అనుభవాలను దృష్టిలో పెట్కుఉని... ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అత్యంత గోప్యంగా ఈ ప్రక్రియ నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
ఖాళీ ఉద్యోగాల భర్తీలో నిర్లక్ష్యం: ఆర్. కృష్ణయ్య
చైతన్యపురి: ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రావస్థలో ఉన్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏ సీ చైర్మన్ నీల వెంకటేశ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సమావేశంలో ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. తెలంగాణలో 44 వేల ఉపాధ్యాయ పోస్టులు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యం కావటంతో లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవితాలు అగమ్యగోచరంగా మారాయని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. -
కోచింగ్ పూర్తాయె.. కొలువు రాదాయె!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. అప్పుచేసి హైదరాబాద్ బాట పట్టిన వాళ్లంతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నగరాల్లో చేసేదేమీ లేక సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది ఏదో ఒక ఉపాధి చూసుకునే యత్నంలో ఉన్నారు. కోచింగ్‌ల కోసం అప్పులు చేసిన వాళ్లు.. భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు. కొలువు వచ్చేదెన్నడు? ఆర్నెల్ల క్రితం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పోలీసు శాఖలో నియామకాల్లో మాత్రమే పురోగతి కన్పిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష జరగాల్సి ఉంది. గ్రూప్–4 ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. టీచర్ల నియామకాల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల టీచర్ పోస్టులున్నట్టు అధికారులు అంటుంటే, 12 వేల ఖాళీలున్నట్టు ప్రభుత్వం ఏడాది క్రితం తెలిపింది. బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప ఈ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనేది స్పష్టమయ్యేలా లేదు. ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా లేదు. టెట్ ఉత్తీర్ణులు టీచర్ పోస్టుల కోసం పెద్దఎత్తున కోచింగ్ తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపైనా అడుగులు పడాల్సి ఉంది. కోచింగ్ కోసం రూ. లక్షల్లో... నోటిఫికేషన్లు వస్తాయనే సమాచారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించింది. దీంతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో 25 వేల కోచింగ్ సెంటర్లలో 3.5 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ తీసుకున్నట్టు ఓ కోచింగ్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. కోచింగ్ ఫీజులు కూడా నాలుగు రెట్లు పెంచారు. అయితే, ఇప్పుడు నగరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సైతం కోచింగ్ పెద్దగా సాగడం లేదు. గ్రూప్–1 కోచింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ పరీక్ష జరిగితే నిరుద్యోగులు గ్రూప్–4పై దృష్టి పెడతారు. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలూ ఇదే ధోరణితో ఉన్నాయి. టీచర్ పోస్టుల కోసం ఇచ్చే కోచింగ్ చాలాచోట్ల ఆపేశారు. కోచింగ్ తీసుకునే వాళ్లు టీచర్ల నియామకాలు ఇప్పట్లో లేవని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నోటిఫికేషన్ వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని, దీనికి మళ్లీ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఓయూలో మళ్లీ మొదలు పెడతాం గ్రూప్–1 పరీక్ష తర్వాత గ్రూప్–4 శిక్షణ మొదలు పెడతాం. తాత్కాలికంగానే కోచింగ్ ఆపేశాం. అయితే, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే యోచనలో ఉన్నారు. కోచింగ్ తీసుకున్న వాళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు. –ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కోచింగ్ తీసుకుని ఎదురుచూస్తున్నాం టీచర్ పోస్టు కోసం అప్పు చేసి కోచింగ్ తీసుకున్నా. ఇంకా హైదరాబాద్‌లో ఉండాలంటే సాధ్యం కావడం లేదు. ప్రైవేటు టీచర్‌గా పనిచేశాను. ఇప్పు డు ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి. నియామకాలు చేపడతారనే ఆశతో ఉన్నాను. –ఆర్.నరేంద్ర, వరంగల్, టెట్ కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థి -
వచ్చే నెలలో గ్రూప్–1, 2 నోటిఫికేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు. 670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు. గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు. గవర్నర్‌కు వివరణలు పంపించాం గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు. అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు. -
ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ సన్నాహాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు ప్రభుత్వానికి లేఖరాశారు. గతంలో ప్రభుత్వం భర్తీకి అనుమతించిన పోస్టుల్లో మిగిలి ఉన్న 1,180 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు అనుమతివ్వాలని సోమవారం రాసిన లేఖలో కోరారు. వాటితోపాటు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లలో అర్హులైన అభ్యర్థులు లేకపోవడం, పోస్టులకు ఎంపికైనవారు చేరకపోవడం వంటి కారణాలతో 150 పోస్టులు మిగిలి ఉన్నాయని వివరించారు. వీటినీ భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. అలాగే ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్ల కోటా అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినందున రోస్టర్ పాయింట్లను ఖరారు చేయాలని కోరారు. -
పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం
సాక్షి, అమరావతి: ‘సొంత మండలంలో పని చేసే అవకాశం కొద్ది మందికే వస్తుంది. ఈ అవకాశం దక్కించుకున్న అదృష్టవంతులుగా మీరు మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి. మనం అధికారం చెలాయించడం కోసం కాకుండా ప్రజలకు చేరువుగా ఉంటూ వారికి సేవలు అందించేందుకే ఈ ఉద్యోగం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనిని ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంలా తీసుకోవాలి. వివక్ష, అవినీతి లేని, పారదర్శక పాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ పాలన మీ భుజస్కందాల మీద పెడుతున్నాను. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని కోరుతున్నాను’ అని కొత్తగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే తమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిందని సగర్వంగా ప్రకటించారు. ఇందులో దాదాపు 1.40 లక్షలు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలేనని, ఇది నిజంగా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు అని చెప్పారు. ఒకే సమయంలో 1,34,534 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రతాలను అందజేసే కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకం సహా, నాలుగు నెలలు తిరగక ముందే అక్షరాల 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ఇంకా ఏం చెప్పారంటే.. అర్హులందరికీ పథకాల లబ్ధి అందించాలి ‘‘గ్రామాల్లో మంచి నీరు, మంచి పాఠశాల, ఆసుపత్రి.. తదితర కనీస సదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. ఇవేవీ గ్రామాల్లో అందుబాటులో లేని పరిస్థితి. చివరికి బియ్యం కూడా నాసిరకం. అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి నేడు గ్రామాల్లో కనిపిస్తోంది. రేషన్ కార్డు కావాలన్నా లంచం.. పెన్షన్ కావాలన్నా లంచం.. ఇల్లు లేక ఇంటి స్థలం కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడకు పోవాలో తెలియదు. ఎవరి చుట్టూ తిరగాలో తెలియదు. మండలాఫీసుల చుట్టూ తిరుగుతూ ఎవరికి పడితే వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని చూశాం. జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లు, రేషన్, పనిముట్లు, చివరికి మరుగుదొడ్ల కోసం కూడా లంచం లేనిదే ఎక్కడా పని జరగని పరిస్థితిని చూశాం. గ్రామ వలంటీర్ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యత తీసుకుంటారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి చేయి పట్టుకుని గ్రామ సెక్రటేరియట్ వద్దకు తీసుకువస్తారు. వారి సమస్యపై స్పందిస్తూ 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్, ఇల్లు.. ఏదైనా కావచ్చు.. వాటిని వారికి అందిస్తే.. కనీసం ఎప్పుడు చేస్తామో తెలిపే ధ్రువపత్రం వారి చేతుల్లో పెడితే వారి ముఖంలో ఎటువంటి ఆనందం కనిపిస్తుందో ఆలోచించండి. నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను కూడా గ్రామ సచివాలయం పక్కనే దుకాణాలు పెట్టి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరికి తెలిసేలా లబ్ధిదారుల జాబితా అక్టోబర్ 2వ తేదీన కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో చాలా చోట్ల కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్ పరికరాల వంటివి ఏర్పాటు చేయడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. వాటి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామ వలంటీర్‌కు నవంబర్ చివరి వారం నాటికి ఒక స్మార్ట్ ఫోన్ అందజేస్తాం. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచాం. రివర్స్ టెండరింగ్ పద్ధతుల్లో మరో రెండు రోజుల్లో వాటిని ఓపెన్ చేస్తాం. ఇవన్నీ పూర్తి చేసుకుని, డిసెంబర్ మొదటి వారంలో అన్ని సదుపాయాలతో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలేవైనా ఉంటే డిసెంబర్ నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం. జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఆధ్వర్యంలో 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు మీ ఆధీనంలోకి వస్తాయి. పూర్తి పారదర్శకంగా వాటిని ఇవ్వాలి. లబ్ధిదారుల జాబితాలు పారదర్శకంగా మీ గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలి. దీంతో ప్రజల మధ్యే సోషల్ ఆడిట్ జరుగుతుంది. సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారికి మాత్రమే అందాలి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కూడా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఓటు వేయని వారు కూడా మనం చేసిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మారాలి. అవినీతికి పాల్పడితే ఉపేక్షించం.. ఎక్కడైనా వివక్ష, అవినీతి జరుగుతుంటే 1902 అనే కాల్ సెంటర్ నంబర్‌కు ఎవరైనా ఫొన్ చేయొచ్చు. అది ఏకంగా సీఎం పేషీకే కనెక్ట్ అవుతుంది. ఎక్కడా అవినీతిని ఉపేక్షించం. మీ పనితీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలంటే మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలి. ఈ వ్యవస్థలో మార్పు తేవడం కోసం ఈ ప్రయోగం చేయాలనిపించింది. మీ అందరిపై నమ్మకం ఉంది. అందుకే ఈ బాధ్యతను మోపాను. చిన్న తప్పు కూడా జరక్కుండా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నిర్వహించిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు ప్రతి కలెక్టర్, ఎస్పీని అభినందిస్తున్నా. వారందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఇప్పుడు ఉద్యోగాలు రాని వారు బాధ పడాల్సిన పనిలేదు. ఏటా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి నెలను ఎగ్జామినేషన్ నెలగా భావిస్తాం. త్వరలో జవనరి వస్తుంది. మళ్లీ తర్వాత జనవరి వస్తుంది’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ మ్యానువల్, ఉద్యోగుల జాబ్ చార్ట్ నియామావళి పుస్తకాలను సీఎం జగన్ అవిష్కరించారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి ప్రజలకు మేలు చేసేందుకు కొత్త తరహా పాలన కావాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆలోచించి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. వైఎస్ జగన్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణనిధి, కైలా అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ప్రసంగాన్ని తిలకించేందుకు అన్ని జిల్లాలో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియకు ఏకంగా 20 లక్షల పైచిలుకు అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవ్వడం.. ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం.. సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు. ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాం. -
ఎల్లో మీడియా, ఓ అధికారి ద్వారా దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యానికి ఊపిరిలూదుతూ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయడం.. ఏకంగా 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా, రాజ్యాంగ పదవిలోని ఓ అధికారి జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని ముఖ్యంగా సీఎం జగన్ ప్రతిష్టను మసకబార్చడమే లక్ష్యంగా చౌకబారు లీకు కుట్రలకు ఎల్లో మీడియా తెర తీసింది. బురద జల్లే యత్నాలు.. రికార్డు స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దాదాపు 19.50 లక్షల మంది హాజరు కాగా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా రాతపరీక్ష నిర్వహించడంతో ప్రభుత్వ ప్రతిష్ట మరింత ఇనుమడించింది. ఇది ఏ మాత్రం రుచించని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎలాగైనా సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చాల్సిందేనని ఎల్లో మీడియా ద్వారా అసత్య కథనాలకు పథకం వేశారు. సచివాలయ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయంటూ ఆధారాలు లేని వార్తలతో బురద జల్లుతున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ అధికారి కూడా లీకు వార్తల కుట్రలో భాగస్వామిగా ఉన్నారు. ఉత్తీర్ణత 10.15 శాతమే.. ఎంత మంది పరీక్షలు రాశారు? ఉత్తీర్ణులు ఎంతమంది? ఏ పోస్టులు ఎన్ని? అందుకు తగినట్లు ఉత్తీర్ణత శాతం ఉందా? లేదా? అనే విషయాలను పరిశీలిస్తే వాస్తవం తేలిపోతుంది. 1,26,728 పోస్టులకు గాను 19,50,582 మంది పరీక్షలు రాస్తే కేవలం 1,98,164 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 10.15 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారో? సాధారణంగా ఏ పరీక్ష నిర్వహించినా 50 శాతానికిపైగానే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే సచివాలయ ఉద్యోగాల ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ చాలా పటిష్టంగా చేపట్టడంతో పరీక్ష రాసిన వారిలో కేవలం 10.15 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఎల్లో మీడియా, ప్రతిపక్ష నేత గగ్గోలు పెడుతున్నట్లు పశ్నప్రతం లీక్ అయితే సగం మందికిపైగా పరీక్షలు రాసిన వారు ఉత్తీర్ణులయ్యే వారనే ఆలోచన కూడా లేకుండా ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రశ్నపత్రాలతో సంబంధం లేని యూనివర్సిటీలకు వాటి రూపకల్పన బాధ్యతలు అప్పగించినట్లు కూడా ఎల్లో మీడియా అసత్యాలను వండి వారుస్తోంది. దీనికి ఏమంటారో..? - ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 4,000 ఉండగా 10,786 మంది పరీక్ష రాశారు. వీరిలో కేవలం 2,622 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. నిజంగానే ఈ ప్రశ్నాపత్రం లీక్ అయితే మొత్తం పరీక్ష రాసిన వారు లేదా అందులో సగం మందైనా ఉత్తీర్ణత సాధించాలి కదా? - డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 11,158 ఉంటే ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష రాసిన వారిలో కేవలం 1.33 శాతమే ఉత్తీర్ణులైతే ప్రశ్నాపత్రం లీకైనట్లు కనీస పరిజ్ఞానం లేకుండా అసత్య కథనాలు ప్రచురిస్తున్నారు. - వార్డు శానిటేషన్ పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాశారు. కేవలం 1,474 మంది అంటే 2.8 శాతమే ఉత్తీర్ణత సాధించారు. -
సెప్టెంబర్ 8న కూడా సచివాలయాల పరీక్ష
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుభవార్త. అర్హతలు ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడేందుకు వీలుగా కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న రాత పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నియామకాల ప్రక్రియలో విద్యుత్ శాఖ భర్తీ చేసే లైన్మెన్ ఉద్యోగాలతో కలిపి మొత్తం 20 రకాల ఉద్యోగాలన్నింటికీ సెప్టెంబర్ 1న రాతపరీక్ష నిర్వహించాలని మొదట ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒకే అభ్యర్థి రెండు రకాల పోస్టుల పరీక్షలకు హాజరయ్యేలా సెప్టెంబర్ 1న ఉదయం, సాయంత్రం పరీక్షలు పెట్టడానికి నిర్ణయించింది. అయితే, ఇలా కూడా కొందరు అర్హతలు ఉండి కొన్ని పోస్టులకు పరీక్ష రాయడానికి అవకాశం కోల్పోతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని పోస్టులకు సెప్టెంబర్ 8న ఉదయం, సాయంత్రం పరీక్ష నిర్వహించనున్నామని పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌లో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉద్యోగాన్ని సాధించాలన్న కసితో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటున్నారు. మార్కెట్లోకి వెల్లువలా వచ్చిపడిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు వస్తున్న అభ్యర్థులతో బుక్‌స్టాళ్లు రద్దీగా మారిపోయాయి. విజయవాడ లెనిన్ సెంటర్లోని పుస్తకాల షాపులు యువతీయువకులతో నిత్యం కిటకిటలాడుతున్నాయి.. – సాక్షి, విజయవాడ పంచాయతీరాజ్ కమిషనర్‌తో నేడు సాక్షి టీవీ లైవ్ షో రాష్ట్ర చరిత్రలోనే రికార్డు స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత కోసం శనివారం ‘సాక్షి’ టీవీ ప్రత్యేక లైవ్ షో కార్యక్రమం నిర్వహించనుంది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌తో ‘సాక్షి’ టీవీ శనివారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే లైవ్ షో ద్వారా అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు: 040–23310680, 23310726. కేటగిరీ–1 1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–5 2. మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్(లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4. వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 ఉదయం కేటగిరీ– 2 (గ్రూప్–ఏ) 1. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్–2 2. వార్డు ఎమినిటీస్ సెక్రటరీ గ్రేడ్–2 కేటగిరీ–2 (గ్రూప్–బి) 1. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్–2 2. విలేజ్ సర్వేయర్ గ్రేడ్–3 రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం కేటగిరీ–3 1. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 4. డిజిటల్ అసిస్టెంట్ (పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5. పశుసంవర్ధక శాఖ సహాయకుడు 6. ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ (గ్రేడ్–3) 7. విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ రాతపరీక్ష: సెప్టెంబర్ 1 సాయంత్రం 8. వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీ (గ్రేడ్–2) 9. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్–2) 10. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ రాత పరీక్ష: సెప్టెంబర్ 8 ఉదయం 11. వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ పరీక్ష: సెప్టెంబర్ 8 సాయంత్రం -
వార్డు సచివాలయాలు 3,775
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో కొత్తగా ఏర్పాటుకానున్న వార్డు సచివాలయాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటి ఏర్పాటు, ఉద్యోగాల భర్తీ, విద్యార్హతలు, బడ్జెట్ కేటాయింపు, విధివిధానాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సచివాలయాల ఏర్పాటుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఈ నూతన వ్యవస్థకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇకపై పట్టణ ప్రజలు తాము నివాసం ఉండే ప్రాంతాలకు కూతవేటు దూరంలోనే ఏర్పాటు కానున్న వార్డు సచివాలయాల్లో ఉద్యోగులను సంప్రదించి, సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు పట్టణాలు, నగరాల్లో 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం వార్డుల్లో పని చేస్తున్న ఉద్యోగులతో పాటు 34,350 మందిని కొత్తగా నియమిస్తామని మున్సిపల్ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు చెప్పారు. పోస్టుల భర్తీకి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలిపారు. 18 సేవలు 10 విభాగాలుగా విభజన పట్టణాల్లో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం ఏర్పాటు కానుంది. ప్రతి 5,000 మందికి ఒక వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని తొలుత అధికారులు భావించారు. అయితే, ప్రజలకు మరింతగా అందుబాటులో ఉండడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సత్వరం అందించాలన్న యోచనతో ప్రతి 4,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పట్టణ ప్రాంత ప్రజలకు ప్రస్తుతం మున్సిపాల్టీలు 18 రకాల సేవలు అందిస్తున్నాయి. అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, అర్బన్ ప్లానింగ్, రక్షిత మంచినీటి సరఫరా, అగ్నిమాపక సేవలు, పారిశుధ్యం, మురికివాడల అభివృద్ధి, బలహీన వర్గాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, రహదారులు, పార్కుల నిర్మాణాలు, జనన మరణాల నమోదు, వీధిలైట్లు, పార్కింగ్, బస్‌స్టాఫ్‌ల ఏర్పాటు వంటి సేవలు అందిస్తున్నాయి. ఇకపై ఈ 18 సేవలను 10 విభాగాలుగా ఏర్పాటు చేసి, ఒక్కో విభాగానికి ఒక్కో కార్యదర్శిని నియమించనున్నారు. వీరు తమ పరిధిలోని వాలంటీర్లతో ఆ విభాగానికి చెందిన సమస్యలను పరిష్కరించడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తారు. వార్డు సచివాలయంలో ఆరోగ్యానికి సంబంధించిన సేవలను వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూకు సంబంధించిన సేవలను రెవెన్యూ శాఖ, మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన సేవలను పోలీస్ శాఖ పర్యవేక్షించనున్నాయి. మిగిలిన సేవలన్నింటినీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ పర్యవేక్షిస్తాయి. అభ్యర్థుల ఎంపికకు రాత పరీక్ష వార్డు కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వార్డు సచివాలయాల్లో నిర్వహించాల్సిన విధులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. పట్టభద్రులు, ఇంజినీర్లు, పాలిటెక్నిక్‌లో డిప్లొమా పూర్తి చేసిన వారు, డిగ్రీలో సోషల్‌వర్క్, నర్సింగ్‌లో ఫార్మాడి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహించనున్న రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రూ.629.99 కోట్లు కేటాయింపు వార్డు సచివాలయాల నిర్వహణకు, కొత్తగా నియమితులు కానున్న వార్డు కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలలకు వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం రూ.629.99 కోట్లు కేటాయించింది. ఒక్కో వార్డు కార్యదర్శికి శిక్షణా కాలంలో రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. వార్డు సచివాలయాల కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఒక గదిని అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. వార్డు సచివాలయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. వార్డు కార్యదర్శుల విధులు - వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి. - ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. - లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి. - ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. - ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి. - విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. వార్డు కార్యదర్శుల నియామక షెడ్యూల్ - నోటిఫికేషన్: జూలై 22 - దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 5 - పరీక్షల నిర్వహణ: ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 15 - సర్టిఫికెట్ల పరిశీలన: సెప్టెంబరు 16 నుంచి 18 - ఎంపికైన అభ్యర్థుల జాబితా: సెప్టెంబరు 20 - వార్డు కార్యదర్శులుగా ఎంపికైన వారికి శిక్షణ: సెప్టెంబరు 23 నుంచి 28 - నగరాలు, పట్టణాల్లో వార్డు కార్యదర్శుల కేటాయింపు: సెప్టెంబరు 30 - వార్డు కార్యదర్శుల బాధ్యతలు, ప్రాక్టికల్ తదితరాలపై శిక్షణ: అక్టోబరు 7 నుంచి నవంబరు 16 -
‘కొత్త’గా గురుకుల బోధన!
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తికావస్తుంది. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాల ప్రక్రియ ఆలస్యమవుతుందన్న కారణంతో ప్రభుత్వం టీఆర్‌ఈఐఆర్‌బీ (తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు) ఏర్పాటు చేసింది. గతేడాది జూన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ బోర్డు ఇప్పటివరకు 3,679 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. ఆర్నెల్లలో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో గతేడాది జూలై నుంచి వరుసగా నోటిఫికేషన్లు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో ప్రక్రియ ఆలస్యమైనప్పటికీ వేగం పెంచడంతో నియామకాల అంశం కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ పూర్తి కానున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. వచ్చే విద్యా ఏడాదికల్లా అన్ని కేటగిరీల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. దీంతో కొత్త విద్యా ఏడాదిలో కొత్త గురువులు పాఠాలను బోధించనున్నారు. పీజీటీ నియామకాలు పూర్తి... నాలుగు కేటగిరీలకు సంబంధించిన పోస్టుల భర్తీలో ఇప్పటికే పీజీటీకి సంబంధించిన నియామకాల ప్రక్రియ దాదాపు పూర్తయింది. అభ్యర్థుల తుది జాబితాను సంబంధిత సొసైటీలకు బోర్డు పంపించింది. తుది జాబితా ఆధారంగా సొసైటీలు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించి నియామక పత్రాలను అందిస్తోంది. టీజీటీ కేటగిరీకి సంబంధించి 1:2 జాబితాను పరిశీలిస్తోంది. టెట్ మార్కుల పరిశీలన కోసం టెట్ డైరెక్టర్‌కు నివేదిక పంపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వివరాలు వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియ కొలిక్కి రానుంది. మొత్తంగా నెలాఖరులోగా పూర్తి కానుంది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్‌కు సంబంధించి కూడా 1:2 జాబితా రూపొందిస్తున్నారు. వీలైనంత త్వరితంగా ఈ జాబితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పూర్తిస్థాయిలో నియామకాలు జరిగేలా... గురుకుల బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేసేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఒకే అభ్యర్థికి రెండేసి పోస్టులు వస్తే... అతని ప్రాధాన్యత ఆధారంగా అవసరం లేని పోస్టుకు అంగీకార పత్రాన్ని తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గురుకుల బోర్డు తొలుత పెద్ద పోస్టులను భర్తీ చేస్తోంది. పీజీటీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అంగీకార పత్రాలను ఇస్తున్నారు. దాదాపు 125 మంది అంగీకార పత్రాలు ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు గురుకుల బోర్డు వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తోంది. అభ్యంతరాలను వెబ్సైట్లో పొందుపరిచి తక్షణమే రంగంలోకి దిగుతున్న అధికారులు వీలైనంత తక్కువ సమయంలో అభ్యర్థులకు నివృత్తి చేస్తున్నారు. నెలాఖరులోగా టీజీటీ, వెనువెంటనే జేఎల్, డీఎల్ పోస్టుల భర్తీ పూర్తి చేసేలా బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. -
ఈడబ్ల్యూఎస్ నిర్ధారణ ఎలా?
సాక్షి, హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) ధ్రువీకరణపై అయోమయం నెలకొంది. అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈమేరకు చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్రం ఆ దిశగా ఉద్యోగ నియామకాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ ప్రకటనల్లో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ కేటాయిస్తోంది. ఈ మేరకు గత నెలలో పలు నోటిఫికేషన్లు జారీ చేసింది. అయితే, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై స్పష్టత కొరవడింది. వాస్తవానికి ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపత్రాల జారీ ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలి. కానీ ఈడబ్ల్యూఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ దరఖాస్తు ప్రశ్నార్థకంగా మారింది. ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే తమకెలాంటి ఆదేశాలు లేవని, ధ్రువీకరణపత్రం ఇవ్వడం సాధ్యం కాదని సమాధానమివ్వడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ధ్రువీకరణ లేకుంటే ఓపెన్ కేటగిరీ... రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ), వేర్‌హౌస్ కార్పొరేషన్, జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) తదితర విభాగాల్లో పెద్దసంఖ్యలో ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో దాదాపు వెయ్యికిపైగా పోస్టులున్నట్లు అంచనా. ఒక్క ఆర్ఆర్బీలోనే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 326 పోస్టులున్నాయి. ఆన్లైన్ ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే సందర్భంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీని ఎంపిక చేసుకుంటే అందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రం సంఖ్యను ఎంట్రీ చేయాలి. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేయడం లేదు. దీంతో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో చివరకు ఓపెన్ కేటగిరీలో దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రానికి సంబంధించి ఆ కేటగిరీలోని ఉద్యోగాలభర్తీ కావు. జనరల్ కేటగిరీకే దరఖాస్తు ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కేటగిరీని నిర్ధారించి ఉద్యోగాల భర్తీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆయా వర్గాలకు అన్యాయం జరుగుతోంది. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. గత నెలలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలో అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు జారీ చేయకపోవడంతో వారంతా ఓసీ కేటగిరీకే దరఖాస్తు చేసుకోవల్సి వస్తోంది. – అయ్యప్పరెడ్డి, తొర్రూర్, మహబుబాబాద్ జిల్లా -
పోస్టింగుల్లేవ్.. ఊస్టింగులే
సాక్షి, అమరావతి: తాము అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా నిరుద్యోగులను నిలువునా ముంచేస్తోంది. రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలేవీ ఇవ్వకపోగా, ఉన్న పోస్టులనే ఊడగొడుతోంది. పలు శాఖల్లో ఖాళీ పోస్టుల రద్దు ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఖాళీ పోస్టుల భర్తీ సంగతిని పక్కన పెడితే, అసలు ఉన్న పోస్టులనే రద్దు చేస్తూ ఖాళీలు లేవని చెప్పేందుకు సర్కారు ఎత్తుగడ వేస్తోంది. రాష్ట్ర విభజన నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత నాలుగున్నరేళ్లలో 90 వేల మందికిపైగా ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే ఖాళీ పోస్టుల సంఖ్య 2 లక్షలు దాటింది. ఇందులో చాలా పోస్టులను రద్దు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆఖరికి పోలీసు కానిస్టేబుళ్లు, అటెండర్లు వంటి నాలుగో తరగతి పోస్టులను సైతం వదలడం లేదు. అంటే పెద్ద చదువులు చదువుకోలేక పదో తరగతి, ఇంటర్‌తో ఆపేసిన పేద కుటుంబాల్లోని నిరుద్యోగులకు సర్కారు కొలువులు ఎండమావిగా మారిపోతున్నాయి. నోరు విప్పని ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పోస్టులను ఒకవైపు ఇష్టానుసారంగా రద్దు చేస్తూమరోవైపు అవసరమైతే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానం కింద సిబ్బందిని నియమించుకోవాలని శాఖలకు సూచిస్తోంది. ఆసుపత్రులు, మున్సిపాల్టీలు, పంచాయతీల్లో నాలుగో తరగతి పోస్టులను భర్తీ చేయకుండా ఔట్సోర్సింగ్ విధానంలో ఏజెన్సీలకు అప్పగిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అప్పటి చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 22,523 నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, ఏకంగా ఆ పోస్టులనే రద్దు చేస్తోంది. పోస్టులను రద్దు చేస్తున్నా ఉద్యోగ సంఘాల నేతలు నోరు విప్పడం లేదు. సర్కారు చర్యలను ఖండించకుండా ప్రభుత్వ పెద్దలతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లలో 98,273 మంది ఉద్యోగుల తగ్గుదల రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదు. మరోవైపు పదవీ విరమణ చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం నిబంధనల మేరకు ఉద్యోగుల సంఖ్యను, రాష్ట్ర ద్రవ్య నివేదికను శాసనసభకు సమర్పిస్తుంది. దీని ప్రకారం చూస్తే రాష్ట్ర విభజన అనంతరం 2014 డిసెంబర్ 31 నాటికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4,43,854 అని ద్రవ్య నివేదికలో సర్కారు పేర్కొంది. 2018 మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి సమర్పించిన ద్రవ్య నివేదికలో 2018 జనవరి నాటికి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 3,45,581 అని వెల్లడించింది. అంటే గత నాలుగేళ్లలో 98,273 మంది ప్రభుత్వ ఉద్యోగులు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోంది. నిర్దాక్షిణ్యంగా చిరుద్యోగుల తొలగింపు గత ప్రభుత్వంలో పని చేశారనే నెపంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే పలువురు చిరుద్యోగులపై వేటు వేశారు. 29,439 మంది ఆదర్శ రైతులను తొలగించారు. గృహ నిర్మాణ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న 3,500 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. గ్రామీణాభివృద్ధి శాఖలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న 3,800 మందిని ఇళ్లకు పంపించేసింది. అర్హత లేదన్న సాకుతో 1,000 మందికి పైగా గోపాలమిత్రలను తొలగించారు. 4,500 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను, ఆయుష్‌లో 800 మందిని, వయోజన విద్యలో 20 వేల మంది మండల, గ్రామ రిసోర్స్ పర్సన్లను టీడీపీ సర్కారు తొలగించింది. అంగన్వాడీ కేంద్రాల్లో వంటచేసే వర్కర్లను దశలవారీగా వేల మందిని తొలగించి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. అలాగే న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్లలో పనిచేస్తున్న న్యూట్రిషనిస్టులను, సహాయకులను కూడా తొలగించింది. సాధారణ పరిపాలన శాఖలో పోస్టులు రద్దు సాధారణ పరిపాలన శాఖలో 15 ఆఫీస్ సబార్టినేట్ పోస్టులతోపాటు మరో 15 చౌకీదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను రద్దు చేయడం వల్ల ఏటా మిగిలే రూ.75 లక్షలతో ఈ–ఆఫీస్ కోసం ఇద్దరు ప్రాజెక్టు మేనేజర్లు, 8 మంది అసిస్టెంట్ మేనేజర్లను కాంట్రాక్టు విధానంలో తీసుకుంటామని సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇలా 30 ప్రభుత్వ పోస్టులను రద్దు చేసి పది మందిని కాంట్రాక్టు విధానంలో తీసుకుంటే ఏడాదికి రూ.63.60 లక్షల వ్యయం మాత్రమే అవుతుందని, దీనివల్ల నిధులు మిగులుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి శ్రీకాంత్ జీవో జారీ చేసిన తరువాత ఆ ప్రతిపాదనలను ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. కానిస్టేబుల్ పోస్టులు కనుమరుగు అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో ఖాళీగా ఉన్న 103 సివిల్ పోలీసు కానిస్టేబుల్ పోస్టులను కనుమరుగు చేస్తూ ఆ స్థానంలో 58 మంది సైంటిఫికల్ అసిస్టెంట్లను తీసుకోవాలని హోంశాఖ ప్రతిపాదన చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి నిధులు మిగులుతాయని అందులో పేర్కొంది. దీన్ని కూడా ఇటీవల మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 5 టైపిస్ట్ పోస్టులను కనుమరుగు చేస్తూ ముగ్గురు సీనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలని హోంశాఖ ప్రతిపాదించగా ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లా పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఐదు టైపిస్ట్ పోస్టులను కనుమరుగు చేస్తూ ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లను తీసుకోవాలని హోంశాఖ చేసిన ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగం లేదు.. భృతి రాదు ఇంటికో ఉద్యోగం, లేదంటే నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి చెల్లిస్తామని గత ఎన్నికల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా నాలుగున్నరేళ్లు గడిచాక ఎన్నికలకు నాలుగు నెలల ముందు నెలకు కేవలం రూ.1,000 చొప్పున భృతి ఇస్తామంటూ మాట మార్చారు. గత ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించినా ఏ ఒక్కరికీ రూపాయి కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇంటికి ఒకరు చొప్పున ఉద్యోగం లేదా భృతి ఇవ్వాల్సి ఉండగా సవాలక్ష ఆంక్షలతో నిరుద్యోగుల సంఖ్యను 9.38 లక్షలకు తగ్గించేశారు. ఏరివేతల అనంతరం కేవలం 1.98 లక్షల మందికే అరకొరగా భృతి చెల్లించడం గమనార్హం. -
‘ఉద్యోగాల భర్తీ చేసేవారికే మా మద్దతు’
హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేసే వారికే తమ మద్దతు ఉంటుం దని తెలంగాణ నిరుద్యో గ సంఘం స్పష్టం చేసిం ది. విద్యానగర్‌లో మంగళవారం జరిగిన బీసీ యువజన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి బీసీ సంఘం నేత, టీటీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో పాటుగా తెలంగాణ నిరుద్యోగ సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్‌ను నియమిస్తూ నియామక పత్రాన్ని కృష్ణయ్య అందజేశారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నర ఏళ్ల పాలనలో 18వేల ఉద్యోగాల ను మాత్రమే భర్తీ చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 40 వేల టీచర్ పోస్టుల తోపాటుగా ప్రభుత్వ జూనియర్, డీగ్రీ, వర్సిటీ ల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులకు నోటిఫి కేషన్ జారీ చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు టీఆర్ చందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి
మిర్యాలగూడ టౌన్: తెలంగాణ ఏర్పడితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు 1.7 ల క్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ ..ఆ మేరకు ఉద్యోగాలిచ్చిన తరువాతనే ఎన్నికల్లోకి వెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నాలుగు ఏళ్లలో భర్తీ చేయలేని ఉద్యోగాలను, కేసీఆర్ ఈ పది నెలల్లో ఏ విధంగా భర్తీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టులు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నాయన్నారు. ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ వేయ కుండా నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. కోర్టు వివాదాల్లో లేకుండా ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మెహన్‌రెడ్డి కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ధర్నాలో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి, నాయకులు సలీం, బాలకృష్ణారెడ్డి, రవికుమార్, మేష్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టు 26 నుంచి ‘పోలీస్’ ప్రిలిమినరీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష తేదీలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. సబ్ ఇన్స్పెక్టర్ సివిల్, ఇతర విభాగాల్లోని పోస్టులకు ఆగస్టు 26న 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని 10 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నామని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్ సోమవారం తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ ఐటీ, కమ్యూనికేషన్ పరీక్ష సెప్టెంబర్ 2న ఉదయం 10 నుంచి 1 వరకు.. ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నామని తెలిపారు. హైదరా బాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలుంటాయన్నారు. కానిస్టేబుల్, ఇతర విభాగాలకు చెందిన తత్సమాన పోస్టులకు సెప్టెంబర్ 30న ఉదయం 10 నుంచి 1 వరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 40 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. తప్పులు సవరించుకోండి దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇస్తున్నట్లు బోర్డు చైర్మన్ తెలిపారు. అభ్యర్థులు రిజిస్టర్డ్ ఈ–మెయిల్ ఐడీ ద్వారా support@tsprb.inకు సవరణ అంశాలు తెలపాలని సూచించారు. పుట్టిన తేదీ, కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్, స్థానికత, లింగ భేదం, పరీక్ష మాధ్యమం, ఫొటో, సంతకం తదితరాలను సవరించుకోవచ్చని.. ఇందుకు మెయిల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, సవరించాల్సిన అంశాలను పేర్కొనాలని చెప్పారు. సవరణకు జూలై 14 వరకు గడువిచ్చామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. -
ఏపీపీఎస్సీ గాడిన పడేనా?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కమిషన్‌కు గత కొద్ది రోజులుగా పూర్తిస్థాయి కార్యదర్శి లేకుండాపోయారు. దీంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు, కింది స్థాయి అధికారుల మధ్య సమన్వయలేమితో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా ముందుకు సాగడం లేదు. ఇన్చార్జ్ కార్యదర్శిగా వ్యవహరించిన అడిషనల్ కార్యదర్శి డి.రమాదేవి గత నెల 30న పదవీ విరమణ చేశారు. సాధారణంగా పదవీ విరమణ చేసే అధికారి ఎవరైనా తదుపరి వచ్చే అధికారికి బాధ్యతలు అప్పగించి వెళ్లాలి. ఆర్థికాంశాలతోపాటు అప్పటివరకు జరిగిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో వివరించి వెళ్లాలి. కళావతి అనే అధికారిణికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఆ పని చేయకుండానే రమాదేవి వెళ్లిపోయారు. ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగానికైనా సమాచారం ఇచ్చి వెళ్లాల్సి ఉన్నా అదీ చేయలేదని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కళావతి చార్జ్ తీసుకోలేకపోవడంతో కమిషన్.. కార్యదర్శి/ఇన్చార్జ్ కార్యదర్శి లేక అనాథగా మారింది. రమాదేవికి, కళావతికి మధ్య విభేదాలుండడంతోనే చార్జ్ అప్పగించలేదని, రమాదేవి అగ్రకులానికి చెందినవారు కావడం, కళావతి ఇతర వర్గానికి చెందినవారనే కారణంతో రమాదేవి చార్జ్ ఇవ్వకుండా వెళ్లిపోయినట్లు కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. కమిషన్‌కు కార్యదర్శి లేదా ఇన్చార్జ్ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలి. ఆ పోస్టు ఖాళీగా ఉండకూడదనే నిబంధన ఉంది. గత వారం రోజులుగా ఆ పోస్టులో ఎవరూ లేకపోయినా కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం విచిత్రం. చార్జ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన రమాదేవి మళ్లీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా వచ్చి చక్రం తిప్పాలనే ప్రయత్నాల్లో ఉన్నారని కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. బోర్డు తీరూ అంతే.. కాగా, కమిషన్ బోర్డు తీరూ అలాగే ఉందనే విమర్శలు ఉన్నాయి. కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ. తప్పనిసరిగా చైర్మన్ లేదా బోర్డు సభ్యుడు కమిషన్‌లో ఉండాలి. ప్రస్తుతం కమిషన్ బోర్డులో చైర్మన్‌తోపాటు ఆరుగురు సభ్యులున్నారు. ఇటీవల వీరంతా కలసి పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు అధ్యయనం కోసం వెళ్లారు. దాదాపు 5 రోజుల పాటు కమిషన్ ఎవరూ లేకుండా ఉంది. కమిషన్ నిబంధనల ప్రకారం.. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. చైర్మన్ లేదా ఒక్క సభ్యుడైనా కమిషన్‌లో ఉండాల్సి ఉన్నా అందుకు భిన్నంగా చైర్మన్ అందరినీ టూర్‌కు తీసుకుపోయారు. పనిచేయడానికి ముందుకురాని అధికారులు ప్రస్తుతం కమిషన్‌లోని పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కార్యదర్శిగా పనిచేయడానికి సమర్థులైన అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఇంతకు ముందు కార్యదర్శిగా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి సాయి డిప్యుటేషన్ గడువు ముగియగానే తన శాఖకు వెళ్లిపోయారు. ఆయన తీసుకున్న నిర్ణయాలపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన్నే మరికొన్ని రోజులు కొనసాగాలని అడిగినా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావును కార్యదర్శిగా నియమించినా ఆయన పట్టుమని పదిరోజులు కూడా ఇక్కడ పనిచేయడానికి ఇష్టపడలేదు. ప్రయత్నాలు చేసుకొని మరీ ఇక్కడి నుంచి వేరే పోస్టులోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలన్నీ కమిషన్‌లో పరిస్థితికి దర్పణం పడుతున్నాయని కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఏడు లక్షలు దాటిన ‘పోలీస్’ దరఖాస్తులు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. సబ్ఇన్స్పెక్టర్, తత్సమాన పోస్టులతో పాటు కానిస్టేబుల్, ఆ స్థాయిలోని వివిధ విభాగాల్లోని మొత్తం 18,428 పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు శనివారంతో ముగిసింది. అయితే, శనివారం రాత్రి వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉండటంతో మరో 10 నుంచి 15 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన దరఖాస్తులు ఇవీ... శనివారం సాయంత్రం వరకు సబ్ఇన్స్పెక్టర్ సివిల్, ఏఆర్, బెటాలియన్, ఎస్పీఎఫ్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రన్ పోస్టులకు 1,82,285 దరఖాస్తులు వచ్చాయి. సబ్ఇన్స్పెక్టర్ ఐటీ విభాగం పోస్టులకు 13,241 దరఖాస్తులు, ఫింగర్ ప్రింట్స్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ పోస్టులకు 7,308 దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు తెలిపింది. సివిల్,ఏఆర్, బెటాలియన్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులకు 4,64,319 దరఖాస్తులు వచ్చాయి. ఐటీ కానిస్టేబుల్ పోస్టులకు 14,284, డ్రైవర్ పోస్టులకు 12,830, మెకానిక్ కానిస్టేబుల్ పోస్టులకు 1,782 మంది దరఖాస్తు చేసుకున్నట్టు బోర్డు తెలిపింది. అన్ని పోస్టులకు మొత్తంగా 6,96,049 దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. గతంకన్నా తగ్గిన దరఖాస్తులు... పోలీసు శాఖ 2015లో 9,211 పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మొత్తం 6.5లక్షల దరఖాస్తులు రాగా, తాజా నోటిఫికేషన్‌కు సుమారు 9 లక్షలనుంచి 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని బోర్డు అధికారులు భావించారు. కానీ, కేవలం 7 లక్షల పైచిలుకు దరఖాస్తులే రావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఎడిట్ ఆప్షన్‌పై సందిగ్దం అభ్యర్థులకు దరఖాస్తులో లోపాలు, పొరపాట్ల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? లేదా అన్న దానిపై బోర్డు అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే వారం లేదా పదిహేను రోజుల తర్వాత కనీసం 5 రోజుల పాటు ఎడిట్ ఆప్షన్‌ను కల్పించే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తోంది. -
ఉద్యోగ భర్తీల్ని ఆపండి
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ నియామకాల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాలనే నిర్ణయానికి అనుగుణంగా జూన్ 4 వరకు ఉద్యోగాల భర్తీ చేయరాదని హైకోర్టు మధ్యంతర ఆదేశాలిచ్చింది. వెయిటేజీ మార్కుల వివాదంపై పలు వ్యాజ్యాలు విచారణ దశలోనే ఉన్నందున జూన్ 4వ తేదీ వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వరాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్ ట్రాన్స్‌కోలకు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం ఆదేశాలిచ్చింది. టీఎస్ ట్రాన్స్‌కోలో ఇంజనీరింగ్ పోస్టులు, స్టాఫ్ నర్సు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ సమయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా చేయడం వల్ల ఓపెన్ కేటగిరీలో ప్రతిభ చూపే అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతుందంటూ పలు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపే వ్యవధి లేనందున విచారణ జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు నియామకాలు చేపట్టరాదని మధ్యంతర ఆదేశాలిచ్చింది. -
ఉర్దూ అధికారి పోస్టులకు 10న నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారి ఉద్యో గాల భర్తీకి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు డు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉర్దూ అధికారి గ్రేడ్–1 విభా గంలో 6 పోస్టులు, గ్రేడ్–2 విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉర్దూ అధికారులు ఉర్దూ నుంచి ఆంగ్లం, తెలుగులోకి అనువాదం చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఉర్దూ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మైనార్టీలకూ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ పాల్గొన్నారు. -
త్వరలో ఓయూలో అధ్యాపక ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
హైదరాబాద్: ఓయూలో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన విడుదల చేయనున్నట్లు వీసీ ప్రొఫెసర్ రాంచంద్రం శనివారం తెలిపారు. జూలై నాటికి అధ్యాపక ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి పర్మనెంట్ అధ్యాపకుల కొరతను తగ్గించనున్నట్లు చెప్పారు. ఓయూలోని వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 415 అధ్యాపక ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. పలు విభాగాలలో సబ్జెక్టుల వారీగా రూలాఫ్ రిజర్వేషన్లు, ఇతర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి త్వరలో(వచ్చే నెల) నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. -
వంద నోటిఫికేషన్లు.. 30 వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మూడేళ్లలో 30 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. అందులో 6వేల వర కు పోస్టుల భర్తీ పూర్తికాగా, మిగతా నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 3,878 ఉద్యోగాల భర్తీకి వచ్చే 3 నెలల్లో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. టీఎస్పీఎస్సీ ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మూడో వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇప్పటివరకు జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ చేసిన ఉద్యోగాలు, భర్తీ చేయనున్న ఉద్యోగాలు, జారీ చేయనున్న నోటిఫికేషన్ల వివరాలను అందులో పొందుపరిచింది. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో 5,932 ఉద్యోగాలను భర్తీ చేయగా.. 23,953 ఉద్యోగాలు ఫలితాలు రావాల్సిన/ప్రక్రియ కొనసాగుతున్న దశలో ఉన్నాయి. ఇందులో 8,657 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతోంది. వీటి ఫలితాలను జనవరిలో ప్రకటించనుంది. 3,226 పోస్టులకు సంబంధించి జవాబుల ‘కీ’లపై అభ్యంతరాలను స్వీకరిస్తోంది. మిగతా పోస్టులకు సం బంధించి దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ‘టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం’ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల సమగ్ర వివరాలను, ఫలితాలను ప్రకటించేందుకు, డిపార్ట్మెంటల్ టెస్టులకు హాజరయ్యే వారి ఫలితాలను ‘టీఎస్పీఎస్సీ ఉద్యోగ సమాచారం’ వెబ్ జర్నల్ను అందుబాటులోకి తెచ్చింది. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం దీనిని విడుదల చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని, ఏపీపీఎస్సీలో ఉన్నంత మంది సిబ్బంది లేకపోయినా సాంకేతిక పరి జ్ఞానాన్ని వినియోగించుకుని అత్యుత్తమంగా పనిచేస్తోందని నారాయణ పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 3 నెలలకోసారి టీఎస్పీఎస్సీ జర్నల్స్‌ను వెబ్సైట్లో పొందుపరుస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. జర్నల్స్‌లో ఇచ్చే ఫలితాలు ప్రభుత్వ ఉత్తర్వులతో సమానంగా చెల్లుబాటు అవుతాయన్నారు. ఏపీపీఎస్సీ 2004 నుంచి 10 ఏళ్లలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే.. టీఎస్పీఎస్సీ మూడేళ్లలో 30 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టిం దని టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ అన్నారు. ఇతర విభాగాలు మరో 20 వేల ఉద్యోగాలను భర్తీ చేశాయని.. రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందన్నా రు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు చంద్రా వతి, రామ్మోహన్‌రెడ్డి, మతీనుద్దీన్ ఖాద్రీ, సాయన్న, కమిషన్ కార్యదర్శి వాణిప్రసాద్ పాల్గొన్నారు. మూడు రోజుల్లో టీజీటీ ఫలితాలు గురుకులాల ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) ఫలితాలను మరో మూడు రోజుల్లోగా విడుదల చేస్తామని ఘంటా చక్రపాణి వెల్లడించారు. వారం రోజుల్లో పీజీటీ ఫలితాలను కూడా విడుదల చేస్తామన్నారు. మొత్తంగా ఇప్పటివరకు 98 నోటిఫికేషన్లు జారీచేయగా... సోమవారం మహిళా శిశుసంక్షేమ శాఖలో 79 గ్రేడ్–1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (సూపర్వైజర్), వైద్య శాఖలో 200 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. వీటితో మూడేళ్లలో ఇచ్చిన నోటిఫికేషన్ల సంఖ్య 100కు చేరిందన్నారు. కోర్టు తీర్పు రాగానే గ్రూప్–2, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఫలితాలను ప్రకటిస్తామన్నారు. పోస్టుల భర్తీ పరిస్థితి.. - 81 నోటిఫికేషన్ల ద్వారా నోటిఫై చేసిన పోస్టులు: 29,757 (గ్రూప్–1 పాత నోటిఫికేషన్ 128 పోస్టులు పోగా.) - పరీక్షలు పూర్తి/భర్తీ చేసిన ఉద్యోగాలు: 5,932 (1,032 పోస్టుల గ్రూప్–2 పరీక్షలు పూర్తి, కోర్టు కేసుతో పెండింగ్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ 340) - ఫలితాలు రావాల్సినవి/ అండర్ ప్రాసెస్‌లో ఉన్నవి: 23,953 - నోటిఫికేషన్లు జారీ చేయాల్సినవి: 3,878 -
రాజకీయ నిరుద్యోగుల కోసమే ‘కొట్లాట’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కొలువులపై జేఏసీ చైర్మన్ కోదండరాం అసత్య ప్రచారం చేస్తున్నారని మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కొలువుల కొట్లాటంతా రాజకీయ నిరుద్యోగుల కోసమేనని విమర్శిం చారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయం లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యో గాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖ వ్యూహం తో ముందుకు వెళుతోందని, లక్షా 12 వేల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికే 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 63 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉందని వివరించారు. ఎన్నికలప్పుడు కోటి ఉద్యోగాలిస్తామని బీజేపీ హామీ ఇచ్చిం దని, కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దాన్ని తుంగలో తొక్కిందని తెలిపారు. మీ పోరాటం బీజేపీ మీద చేయకుండా ఆ పార్టీ సాయం తీసుకుంటారా అని నిలదీశారు. నిరుద్యోగ సమస్యను పెంచి పోషించిన కాంగ్రెస్‌తో కోదండరాం ఎలా కలిసి పనిచేస్తారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై నిరుద్యోగులు పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. -
ప్రభుత్వ అనుమతితోనే టీటీడీలో ఉద్యోగాల భర్తీ
రూ.300 స్లాట్ తరహాలో దివ్యదర్శనానికి ఏర్పాట్లు: టీటీడీ ఈవో అనిల్ కుమార్ తిరుపతి అర్బన్: ఖాళీగా ఉన్న టీటీడీ ఉద్యోగాలను రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే భర్తీచేస్తామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ టీటీడీ ఈవోతో ‘మీట్ ద ప్రెస్’ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 5 ఏళ్ల లోపు పిల్లల తల్లి దండ్రుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. నడిచివచ్చే భక్తులకు అమలు చేస్తున్న దివ్య దర్శనం విధానాన్ని రద్దుచేసే ఆలోచన లేదన్నారు. రూ.300 స్లాట్ తరహాలో ఈ నెల 17 నుంచి దివ్యదర్శనం భక్తులకు ప్రత్యేక విధానం ద్వారా రోజుకు 20వేల మందికి దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించి ప్రయో గాత్మకంగా పరిశీలిస్తామన్నారు. గదుల మంజూరుకూ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ విధానంతో గదులు పొందే సౌలభ్యాన్ని అమలులోకి తేనున్నా మని ఈవో వెల్లడించారు. భక్తులు గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద వివరాలను టీటీడీ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగానే రెఫరెన్స్ టోకెన్ ఇచ్చి పంపేస్తారన్నారు. కేటాయించిన కాటేజీ, గది నంబర్లను వారి మొబైల్‌కు మెసేజ్ ద్వారా పంపుతామన్నారు. భక్తుడు ఆ సమయానికి కౌంటర్ వద్దకు వచ్చి డబ్బు చెల్లిస్తే గది మంజూరు చేస్తామన్నారు.