సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. అప్పుచేసి హైదరాబాద్ బాట పట్టిన వాళ్లంతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. కోచింగ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు నగరాల్లో చేసేదేమీ లేక సొంతూళ్లకు వెళ్తున్నారు. మరికొంతమంది ఏదో ఒక ఉపాధి చూసుకునే యత్నంలో ఉన్నారు. కోచింగ్‌ల కోసం అప్పులు చేసిన వాళ్లు.. భవిష్యత్ ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు.
కొలువు వచ్చేదెన్నడు?
ఆర్నెల్ల క్రితం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో పోలీసు శాఖలో నియామకాల్లో మాత్రమే పురోగతి కన్పిస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష జరగాల్సి ఉంది. గ్రూప్–4 ఉద్యోగాలపై ఇంకా స్పష్టత రాలేదు. టీచర్ల నియామకాల విషయంలో అడ్డంకులు ఎదురవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 18 వేల టీచర్ పోస్టులున్నట్టు అధికారులు అంటుంటే, 12 వేల ఖాళీలున్నట్టు ప్రభుత్వం ఏడాది క్రితం తెలిపింది. బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే తప్ప ఈ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయనేది స్పష్టమయ్యేలా లేదు. ఈ ప్రక్రియ ఇప్పట్లో అయ్యేలా లేదు. టెట్ ఉత్తీర్ణులు టీచర్ పోస్టుల కోసం పెద్దఎత్తున కోచింగ్ తీసుకున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఇంజనీరింగ్ పోస్టుల భర్తీపైనా అడుగులు పడాల్సి ఉంది.
కోచింగ్ కోసం రూ. లక్షల్లో...
నోటిఫికేషన్లు వస్తాయనే సమాచారం రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు కల్పించింది. దీంతో నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో 25 వేల కోచింగ్ సెంటర్లలో 3.5 లక్షల మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి శిక్షణ తీసుకున్నట్టు ఓ కోచింగ్ సంస్థ నిర్వాహకుడు తెలిపారు. కోచింగ్ ఫీజులు కూడా నాలుగు రెట్లు పెంచారు.
అయితే, ఇప్పుడు నగరంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో సైతం కోచింగ్ పెద్దగా సాగడం లేదు. గ్రూప్–1 కోచింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ పరీక్ష జరిగితే నిరుద్యోగులు గ్రూప్–4పై దృష్టి పెడతారు. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలూ ఇదే ధోరణితో ఉన్నాయి. టీచర్ పోస్టుల కోసం ఇచ్చే కోచింగ్ చాలాచోట్ల ఆపేశారు. కోచింగ్ తీసుకునే వాళ్లు టీచర్ల నియామకాలు ఇప్పట్లో లేవని సొంతూళ్లకు వెళ్లిపోయారు. నోటిఫికేషన్ వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుందని, దీనికి మళ్లీ ఖర్చవుతుందని ఆందోళన చెందుతున్నారు.
ఓయూలో మళ్లీ మొదలు పెడతాం
గ్రూప్–1 పరీక్ష తర్వాత గ్రూప్–4 శిక్షణ మొదలు పెడతాం. తాత్కాలికంగానే కోచింగ్ ఆపేశాం. అయితే, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనే యోచనలో ఉన్నారు. కోచింగ్ తీసుకున్న వాళ్లు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్లు వస్తే మళ్లీ కోచింగ్ తీసుకోవాలని భావిస్తున్నారు.
–ప్రొఫెసర్ డి.రవీందర్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ
కోచింగ్ తీసుకుని ఎదురుచూస్తున్నాం
టీచర్ పోస్టు కోసం అప్పు చేసి కోచింగ్ తీసుకున్నా. ఇంకా హైదరాబాద్‌లో ఉండాలంటే సాధ్యం కావడం లేదు. ప్రైవేటు టీచర్‌గా పనిచేశాను. ఇప్పు డు ఏదో ఒక ఉపాధి చూసుకోవాలి. నియామకాలు చేపడతారనే ఆశతో ఉన్నాను.
–ఆర్.నరేంద్ర, వరంగల్, టెట్ కోసం కోచింగ్ తీసుకున్న అభ్యర్థి
Comments
Please login to add a commentAdd a comment