పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం | CM YS Jagan Says That We were given 4 lakh jobs in 4 months | Sakshi
Sakshi News home page

పేదవాడి ముఖంలో చిరునవ్వే లక్ష్యం

Published Tue, Oct 1 2019 4:02 AM | Last Updated on Tue, Oct 1 2019 1:15 PM

CM YS Jagan Says That We were given 4 lakh jobs in 4 months - Sakshi

విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాణి సుష్మకు ఉద్యోగ నియామక పత్రం అందిస్తున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: ‘సొంత మండలంలో పని చేసే అవకాశం కొద్ది మందికే వస్తుంది. ఈ అవకాశం దక్కించుకున్న అదృష్టవంతులుగా మీరు మీ ప్రాంత ప్రజల రుణం తీర్చుకోవాలి. మనం అధికారం చెలాయించడం కోసం కాకుండా ప్రజలకు చేరువుగా ఉంటూ వారికి సేవలు అందించేందుకే ఈ ఉద్యోగం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనిని ఉద్యోగంగా కాకుండా ఒక ఉద్యమంలా తీసుకోవాలి. వివక్ష, అవినీతి లేని, పారదర్శక పాలన కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆ పాలన మీ భుజస్కందాల మీద పెడుతున్నాను. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని కోరుతున్నాను’ అని కొత్తగా గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన వారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కేవలం నాలుగు నెలల కాలంలోనే తమ ప్రభుత్వం నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిందని సగర్వంగా ప్రకటించారు. ఇందులో దాదాపు 1.40 లక్షలు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలేనని, ఇది నిజంగా దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు అని చెప్పారు. ఒకే సమయంలో 1,34,534 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలకు ఎంపికైన వారికి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నియామక ప్రతాలను అందజేసే కార్యక్రమాన్ని విజయవాడలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారినుద్దేశించి ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ నియామకం సహా, నాలుగు నెలలు తిరగక ముందే అక్షరాల 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

అర్హులందరికీ పథకాల లబ్ధి అందించాలి 
‘‘గ్రామాల్లో మంచి నీరు, మంచి పాఠశాల, ఆసుపత్రి.. తదితర కనీస సదుపాయాలు ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. ఇవేవీ గ్రామాల్లో అందుబాటులో లేని పరిస్థితి. చివరికి బియ్యం కూడా నాసిరకం. అది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి నేడు గ్రామాల్లో కనిపిస్తోంది.  రేషన్‌ కార్డు కావాలన్నా లంచం.. పెన్షన్‌ కావాలన్నా లంచం.. ఇల్లు లేక ఇంటి స్థలం కావాలంటే ఎవరిని అడగాలో తెలియదు. ఎక్కడకు పోవాలో తెలియదు. ఎవరి చుట్టూ తిరగాలో తెలియదు. మండలాఫీసుల చుట్టూ తిరుగుతూ ఎవరికి పడితే వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని చూశాం. జన్మభూమి కమిటీల పేరుతో పెన్షన్లు, రేషన్, పనిముట్లు, చివరికి మరుగుదొడ్ల కోసం కూడా లంచం లేనిదే ఎక్కడా పని జరగని పరిస్థితిని చూశాం. గ్రామ వలంటీర్‌ 50 ఇళ్లకు సంబంధించిన బాధ్యత తీసుకుంటారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారి చేయి పట్టుకుని గ్రామ సెక్రటేరియట్‌ వద్దకు తీసుకువస్తారు. వారి సమస్యపై స్పందిస్తూ 72 గంటల్లో రేషన్‌ కార్డు, పెన్షన్, ఇల్లు.. ఏదైనా కావచ్చు.. వాటిని వారికి అందిస్తే.. కనీసం ఎప్పుడు చేస్తామో తెలిపే ధ్రువపత్రం వారి చేతుల్లో పెడితే వారి ముఖంలో ఎటువంటి ఆనందం కనిపిస్తుందో ఆలోచించండి. నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలను కూడా గ్రామ సచివాలయం పక్కనే దుకాణాలు పెట్టి అందజేసే ఏర్పాటు చేస్తున్నాం. 

ప్రజలందరికి తెలిసేలా లబ్ధిదారుల జాబితా
అక్టోబర్‌ 2వ తేదీన కొత్తగా ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లో చాలా చోట్ల కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేషన్‌ పరికరాల వంటివి ఏర్పాటు చేయడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. వాటి కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ఖరారవుతుంది. డిసెంబర్‌ మొదటి వారం నాటికి అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి గ్రామ వలంటీర్‌కు నవంబర్‌ చివరి వారం నాటికి ఒక స్మార్ట్‌ ఫోన్‌ అందజేస్తాం. ఇందుకు సంబంధించి టెండర్లను పిలిచాం. రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతుల్లో మరో రెండు రోజుల్లో వాటిని ఓపెన్‌ చేస్తాం. ఇవన్నీ పూర్తి చేసుకుని, డిసెంబర్‌ మొదటి వారంలో అన్ని సదుపాయాలతో గ్రామ సచివాలయాలు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత చిన్న చిన్న సమస్యలేవైనా ఉంటే డిసెంబర్‌ నెలాఖరు నాటికి పరిష్కరిస్తాం. జనవరి ఒకటో తేదీ నుంచి పూర్తి స్థాయిలో గ్రామ సచివాలయాలు, వలంటీర్ల ఆధ్వర్యంలో 500 సేవలు అందుబాటులోకి వస్తాయి. జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, రేషన్‌ కార్డులు మీ ఆధీనంలోకి వస్తాయి. పూర్తి పారదర్శకంగా వాటిని ఇవ్వాలి. లబ్ధిదారుల జాబితాలు పారదర్శకంగా మీ గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలి. దీంతో ప్రజల మధ్యే సోషల్‌ ఆడిట్‌ జరుగుతుంది. సంక్షేమ పథకాలు అర్హత కలిగిన వారికి మాత్రమే అందాలి. కులాలు, మతాలు, రాజకీయాలు, పార్టీలు కూడా చూడొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మనకు ఓటు వేయని వారు కూడా మనం చేసిన మంచిని చూసి వచ్చే ఎన్నికల్లో మనకు ఓటు వేసేలా మారాలి. 

అవినీతికి పాల్పడితే ఉపేక్షించం..
ఎక్కడైనా వివక్ష, అవినీతి జరుగుతుంటే 1902 అనే కాల్‌ సెంటర్‌ నంబర్‌కు ఎవరైనా ఫొన్‌ చేయొచ్చు. అది ఏకంగా సీఎం పేషీకే కనెక్ట్‌ అవుతుంది. ఎక్కడా అవినీతిని ఉపేక్షించం. మీ పనితీరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. పరిపాలన బాగుండాలంటే మన ఉద్యోగులు ప్రజలతో బాగుండాలి. ఈ వ్యవస్థలో మార్పు తేవడం కోసం ఈ ప్రయోగం చేయాలనిపించింది. మీ అందరిపై నమ్మకం ఉంది. అందుకే ఈ బాధ్యతను మోపాను. చిన్న తప్పు కూడా జరక్కుండా ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నిర్వహించిన పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలతో పాటు ప్రతి కలెక్టర్, ఎస్పీని అభినందిస్తున్నా. వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నా.
ఇప్పుడు ఉద్యోగాలు రాని వారు బాధ పడాల్సిన పనిలేదు. ఏటా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తాం. ప్రతి ఏటా జనవరి నెలను ఎగ్జామినేషన్‌ నెలగా భావిస్తాం. త్వరలో జవనరి వస్తుంది. మళ్లీ తర్వాత జనవరి వస్తుంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతరం గ్రామ సచివాలయ మ్యానువల్, ఉద్యోగుల జాబ్‌ చార్ట్‌ నియామావళి పుస్తకాలను సీఎం జగన్‌ అవిష్కరించారు. 

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయండి 
ప్రజలకు మేలు చేసేందుకు కొత్త తరహా పాలన కావాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచించి గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. కొత్తగా ఉద్యోగాలకు ఎంపికైన వారు సీఎం ఆశయాలకు అనుగుణంగా పని చేసి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. వైఎస్‌ జగన్‌ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ శ్రీ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణనిధి, కైలా అనిల్‌ కుమార్, సింహాద్రి రమేష్, దూలం నాగేశ్వరరావు, పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, కమిషనర్‌ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, సీఎం ప్రసంగాన్ని తిలకించేందుకు అన్ని జిల్లాలో ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు నియామక పత్రాలను అందజేశారు.   

రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉద్యోగ నియామక ప్రక్రియకు ఏకంగా 20 లక్షల పైచిలుకు అభ్యర్థులు రాత పరీక్షలకు హాజరవ్వడం.. ఎనిమిది రోజుల పాటు పరీక్షలు జరగడం.. సువర్ణాక్షరాలతో నిలిచిపోయే రికార్డు. ఉజ్జాయింపుగా ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగామని సగర్వంగా చెబుతున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement