సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసిన ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో స్పందన లభించింది. సబ్‌ఇన్‌స్పెక్టర్, తత్సమాన పోస్టులతో పాటు కానిస్టేబుల్, ఆ స్థాయిలోని వివిధ విభాగాల్లోని మొత్తం 18,428 పోస్టులకు దరఖాస్తు చేసుకునే గడువు శనివారంతో ముగిసింది. అయితే, శనివారం రాత్రి వరకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇంకా అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉండటంతో మరో 10 నుంచి 15 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు.
వచ్చిన దరఖాస్తులు ఇవీ...
శనివారం సాయంత్రం వరకు సబ్‌ఇన్‌స్పెక్టర్ సివిల్, ఏఆర్, బెటాలియన్, ఎస్‌పీఎఫ్, డిప్యూటీ జైలర్, అసిస్టెంట్ మాట్రన్ పోస్టులకు 1,82,285 దరఖాస్తులు వచ్చాయి. సబ్‌ఇన్‌స్పెక్టర్ ఐటీ విభాగం పోస్టులకు 13,241 దరఖాస్తులు, ఫింగర్ ప్రింట్స్ అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులకు 7,308 దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు తెలిపింది. సివిల్,ఏఆర్, బెటాలియన్, ఫైర్‌మెన్, వార్డర్ పోస్టులకు 4,64,319 దరఖాస్తులు వచ్చాయి. ఐటీ కానిస్టేబుల్ పోస్టులకు 14,284, డ్రైవర్ పోస్టులకు 12,830, మెకానిక్ కానిస్టేబుల్ పోస్టులకు 1,782 మంది దరఖాస్తు చేసుకున్నట్టు బోర్డు తెలిపింది. అన్ని పోస్టులకు మొత్తంగా 6,96,049 దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
గతంకన్నా తగ్గిన దరఖాస్తులు...
పోలీసు శాఖ 2015లో 9,211 పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్‌కు మొత్తం 6.5లక్షల దరఖాస్తులు రాగా, తాజా నోటిఫికేషన్‌కు సుమారు 9 లక్షలనుంచి 10 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని బోర్డు అధికారులు భావించారు. కానీ, కేవలం 7 లక్షల పైచిలుకు దరఖాస్తులే రావడం వారిని ఆశ్చర్యానికి గురిచేసినట్టు తెలుస్తోంది.
ఎడిట్ ఆప్షన్‌పై సందిగ్దం
అభ్యర్థులకు దరఖాస్తులో లోపాలు, పొరపాట్ల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఉంటుందా? లేదా అన్న దానిపై బోర్డు అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే వారం లేదా పదిహేను రోజుల తర్వాత కనీసం 5 రోజుల పాటు ఎడిట్ ఆప్షన్‌ను కల్పించే అవకాశం ఉన్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఏడు లక్షలు దాటిన ‘పోలీస్’ దరఖాస్తులు
Published Sun, Jul 1 2018 3:06 AM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment