గ్రూప్–1 ఫలితాలను విడుదల చేస్తున్న సవాంగ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ పి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. మంగళవారం గ్రూప్–1 తుది ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెలలో 110 గ్రూప్–1 పోస్టులు, 182 గ్రూప్–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.
670 జూనియర్ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్ ముందుకు వెళ్తుందన్నారు.
గ్రూప్–1 కేడర్‌లోనూ సీపీటీ పరీక్ష
గ్రూప్–1 కేడర్ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్‌మెంటల్ టెస్ట్ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు.
గ్రూప్–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు.
గవర్నర్‌కు వివరణలు పంపించాం
గ్రూప్–1పై ఇటీవల కొందరు అభ్యర్థులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సవాంగ్ సమాధానమిస్తూ.. ఈ అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున బయటకు స్పందించలేమన్నారు. సంబంధిత అంశాలపై గవర్నర్ కార్యాలయానికి వివరణలు పంపించామన్నారు. తెలుగు మాధ్యమం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనడం వాస్తవం కాదని, వీటిపై ఇంతకుమించి స్పందించలేమని పేర్కొన్నారు.
అన్ని ఫైళ్లను కోర్టు ముందుంచామన్నారు. సమాధాన పత్రాలను అభ్యర్థులకు అందుబాటులో ఉంచడమనే విధానం ఏపీపీఎస్సీలో లేదని, యూపీఎస్సీలో కూడా లేదని వివరించారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి వయోపరిమితి సడలించాలని అభ్యర్థుల నుంచి వస్తున్న వినతిపై స్పందిస్తూ దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో కమిషన్ సభ్యులు విజయకుమార్, ప్రొఫెసర్ పద్మ రాజు, డాక్టర్ సుధాకర్‌రెడ్డి, సలాంబాబు, రమణా రెడ్డి, పి.సుధీర్, ఎన్.సోనీవుడ్, ఎన్.సుధాకర్‌రెడ్డి, కార్యదర్శి అరుణకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment