ఉద్యోగాలు వచ్చేశాయ్‌! | APPSC arrangements for 23 consecutive notifications in November | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు వచ్చేశాయ్‌!

Published Thu, Nov 2 2023 3:40 AM | Last Updated on Thu, Nov 2 2023 6:21 PM

APPSC arrangements for 23 consecutive notifications in November - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఈ నెలలో వరుసగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. వీటిల్లో 900 వరకు గ్రూప్‌–2 పోస్టులుండగా వందకుపైగా గ్రూప్‌–1 పోస్టులు­న్నాయి. డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్‌ కాలేజీ లెక్చ­రర్ల పోస్టులతో కలిపి మొత్తం 23 నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇప్పటికే నోటిఫికేషన్‌ వెలువడిన యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి డిసెంబర్‌లో సర్వీస్‌ కమిషన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

గతేడాది ఎలాంటి వివాదాలకు తావు లేకుండా గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ జారీ చేసి 11 నెలల వ్యవధిలో పారదర్శకంగా ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. ఏఈ నియామకాలను కూడా అతి తక్కువ సమయంలోనే పూర్తి చేశామన్నారు. గత నాలుగేళ్లల్లో న్యాయపరమైన పలు వివాదాలను అధిగమించి సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌ తెలిపారు. గ్రూప్‌–1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, సమర్థంగా ఎంపిక, హేతుబద్ధంగా అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాలను అంచనా వేసేందుకు కొత్త విధానాన్ని రూపొందించినట్లు వివరించారు. 

ఇందుకోసం దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలైన ఐఐటీ, హెచ్‌సీయూతో పాటు రాష్ట్రంలోని పలు వర్సిటీల్లోని నిపుణులతో చర్చించి సిలబస్‌లో సమూల మార్పులు తెస్తున్నట్లు చెప్పారు.

తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
ఓ వర్గం మీడియా ప్రభుత్వంపై, కమిషన్‌పై తప్పుడు కథనాలను ప్రచురిస్తూ నిరుద్యోగ యువతలో ఆందోళన రేకెత్తించేందుకు ప్రయత్నించటాన్ని ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో ఖండించింది. గ్రూప్‌ 2 విషయంలో ఇప్పటికే దాదాపు 900 ఖాళీల భర్తీకి ఆర్థికశాఖ నుంచి అనుమతులు లభించాయని, 54 శాఖల నుంచి జోన్ల వారీగా జీవో నం.77కు అనుగుణంగా సమాచారం రావడం ఆలస్యమైందని పేర్కొంది.

ఈ అంశంపై కసరత్తు దాదాపు పూర్తయిందని, ఈ నెలలోనే నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొన్ని పత్రికలు ఉద్దేశపూర్వకంగా సర్వీస్‌ కమిషన్‌పై తప్పుడు కథనాలను వెలువరిస్తూ నిరుద్యోగులను ఆందోళననకు గురి చేస్తున్నాయని పేర్కొంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, గ్రూప్‌–1, గ్రూప్‌–2 నోటిఫికేషన్ల జారీపై తప్పుడు వార్తలు ప్రచురించడాన్ని ఖండించింది.

సాధారణంగా ఏపీపీఎస్సీ పరిధిలోని నియామకాలకు మాత్రమే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ వినియోగిస్తామని, శాసనసభ ప్రత్యేక చట్టం ద్వారా కమిషన్‌ పరిధిలోకి రాని పోస్టుల నియామక బాధ్యతలను తమకు అప్పగించినప్పుడు వాటి భర్తీ ఖర్చును ఆయా శాఖలే భరిస్తాయని తెలిపింది.

2018లో కూడా ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పరీక్షల ఖర్చును ఆయా విద్యాసంస్థలే భరించాయని గుర్తు చేసింది. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుసరించి పరీక్ష నిర్వహణ ఖర్చు అంచనాలను ఉన్నత విద్యా మండలికి పంపించామని తెలిపింది. ఈ లేఖను వక్రీకరిస్తూ కథనాలు ప్రచురించడం బాధాకరమని, వీటిని నమ్మవద్దని సూచించింది. ఈ నెలలోనే 23 నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు వెల్లడించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement