గ్రూప్‌–1 ఫైనల్‌ ఫలితాలు విడుదల | | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1 ఫైనల్‌ ఫలితాలు విడుదల

Published Fri, Aug 18 2023 5:22 AM | Last Updated on Fri, Aug 18 2023 12:48 PM

Andhra Pradesh APPSC Group1 final results released - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 111 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలి­తాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవ­ధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ మీడి­యాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువరించగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సీ నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించిన ఒక పోస్టుకు ఎంపికపై క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) నుంచి నివేదిక రావాల్సి ఉంది. 

పోటీపడ్డ ఉన్నత విద్యావంతులు..
మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది (53.6 శాతం) మహిళలు 51 (46.4 శాతం) మంది ఉన్నారు. టాప్‌ 10 ర్యాంకుల్లో ఆరుగురు మహిళలుండగా నలుగురు పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) మెయిన్స్‌ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూలకు వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు.

విద్యార్హతల పరంగా చూస్తే.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు.

ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు అఖిల భారత సర్వీస్‌ అధికారులు, సబ్జెక్టు నిపుణులు, వైస్‌ చాన్సలర్లు, ఐఐటీ, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థల ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపికలు జరిగి రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికలను పూర్తి చేసింది.

మెయిన్స్‌ పరీక్షలకు 6,455 మంది ఎంపిక..
గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది సెప్టెంబర్‌ 30న నోటిఫికేషన్‌ వెలువరించింది. మొత్తం 1,26,450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8న నిర్వహించిన ప్రిలిమ్స్‌కు 86,494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్‌ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్‌ వెల్లడించింది. ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 6,455 మందిని ఎంపిక చేసింది.

జూన్‌ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్‌ పరీక్షలకు 4,688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లోనే ఏపీపీఎస్సీ పూర్తి చేయించింది. జూలై 14న మెయిన్స్‌ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు మూడు బోర్డులతో వీటిని నిర్వహించింది.

టాప్‌–5 ర్యాంకర్లు వీరే..
భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
భూమిరెడ్డి పావని
కంబాలకుంట లక్ష్మీప్రసన్న
కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి
భానుప్రకాశ్‌రెడ్డి మిమ్మితి



టాపర్స్‌ ఇలా..
పేరు: గణేశ్న భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష
విద్యార్హత: గ్రాడ్యుయేషన్, ఢిల్లీ యూనివర్సిటీ
స్వస్థలం: సీసలి, కాళ్ల మండలం, పశ్చిమ గోదావరి
తండ్రి: వెంకట రామాంజనేయులు ( ప్రభుత్వ ఉపాధ్యాయుడు, డీఈవో కార్యాలయంలో ఏపీవో)
► భాను శ్రీలక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష గ్రూప్‌–1లో మొదటి ర్యాంకు సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీలోని లేడీ శ్రీరామ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో ప్రిలిమ్స్‌ పూర్తిచేసి సెప్టెంబర్‌ 15 నుంచి జరగనున్న మెయిన్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నట్టు తండ్రి రామాంజనేయులు తెలిపారు. 

పేరు: భూమిరెడ్డి పావని 
విద్యార్హత: బీటెక్‌ (ఈసీఈ)
తండ్రి: భూమిరెడ్డి గంగయ్య (రైతు)
తల్లి: లక్ష్మీదేవి
స్వస్థలం: మైదుకూరు, వైఎస్సార్‌ జిల్లా
► పావని గ్రూప్‌–1 ఫలితాల్లో 2వ ర్యాంకు సాధించారు. 2016 నుంచి హైదరాబాద్‌లో గ్రూప్స్‌కి సన్నద్ధమవుతున్నారు. 2016, 2017లో గ్రూప్‌–2 మెయిన్స్‌వరకు వెళ్లారు. 2018లో గ్రూప్‌–1 ఇంటర్వ్యూ వరకు వెళ్లగలిగారు. తల్లిదండ్రులు, సోదరి భాగ్య, సోదరుడు గణేష్‌ సహకారంతో కష్టపడి చదివి ఈసారి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

పేరు: కె.లక్ష్మీప్రసన్న
విద్యార్హత: బీటెక్‌ (ఐటీ) 2013, రాజంపేట
స్వస్థలం: టంగుటూరు గ్రామం, అన్నమయ్య జిల్లా
భర్త: పి.చంద్రదీప్‌ (పంచాయతీ సెక్రటరీ)
తండ్రి: కె.సుబ్బారాయుడు (ఆర్టీసీ రిటైర్డ్‌ కండక్టర్‌)
తల్లి: సరస్వతి
► లక్ష్మీ ప్రసన్న గ్రూప్‌–1 ఫలితాల్లో 3వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆమె టీవీ పురం పంచాయతీలో గ్రామ–వార్డు సచివాలయ వ్యవస్థలో పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నారు. 2014 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నారు.

పేరు: కుప్పిరెడ్డి ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి
విద్యార్హత: బీటెక్‌ (ఈఈఈ), 2009, మదనపల్లె 
స్వస్థలం: ప్రొద్దుటూరు, వైఎస్సార్‌ జిల్లా
తండ్రిపేరు: కేసీ వెంకటరెడ్డి(డీసీసీబీ రిటైర్డ్‌ సూపర్‌వైజర్‌)
తల్లి: కె.రామసుబ్బమ్మ
► ప్రవీణ్‌కుమార్‌రెడ్డి గ్రూప్‌–1 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించారు. ఆయన 2018లో గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో పరీక్ష రాయగా.. 2022లో రిజల్ట్స్‌ వచ్చాయి. 47వ ర్యాంకు సాధించగా.. అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌గా సెలక్టయ్యారు. కానీ.. 2018లోనే గ్రూప్‌–2 పరీక్ష రాయగా.. 2020లో వెలువడిన ఫలితాల్లో 11వ ర్యాంక్‌ సాధించి అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఎంపికై ప్రస్తుతం మదనపల్లెలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు ఎనిమిదేళ్లు ఒరాకిల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశారు. 2018 నాటి గ్రూప్‌–1 ఫలితాలు 2022లో వెలువడే నాటికే ఆయన అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరిపోవడంతో.. మరింత మెరుగైన ర్యాంకు కోసం శ్రమించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement