సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ) పరీక్షలు, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపిక విధానాన్ని శాస్త్రీయంగా, మరింత సమర్థంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు కమిషన్ చైర్మన్ గౌతం సవాంగ్ తెలిపారు. అభ్యర్థుల వాస్తవిక నైపుణ్యాన్ని అంచనా వేసి పూర్తి సమర్థులైన వారిని ఎంపిక చేసేలా కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. విజయవాడలోని ఏపీపీఎస్‌సీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరీక్షా విధానాల మార్పునకు సంబంధించి జరుగుతున్న కసరత్తు గురించి వివరించారు.
పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవసరమైన మార్పులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నతాధికారులతో ఒక కమిటీ నియమించిందని తెలిపారు. దానికి అనుబంధంగా ఏపీపీఎస్‌సీలో అంతర్గతంగా తాము రెండు కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియామక విధానాలపై ఏపీపీఎస్‌సీ సభ్యుడు సలాం బాబు నేతృత్వంలో అపార నైపుణ్యం ఉన్న ఐదుగురితో ఒక కమిటీ, వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్లతో మరో కమిటీ నియమించినట్లు వివరించారు. దీంతోపాటు వివిధ రంగాలకు చెందిన మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రస్తుత విధానాలపై అభ్యర్థులు, తల్లిదండ్రులు, సమాజంలోని పలువురి నుంచి రకరకాల అభ్యంతరాలు వస్తున్నాయని, అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వీటన్నింటికి పరిష్కారం చూపేలా సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తాము నియమించిన కమిటీలు వివిధ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న నియామక విధానాలు, ఉత్తమ ప్రాక్టీసులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తాయని చెప్పారు. ఐఐఎం వంటి అత్యుత్తమ సంస్థల ప్రొఫెసర్ల నుంచి సైతం అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలిపారు.
ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రశ్నపత్రాలు ఎలా ఉండాలి? ఎలా రూపొందించాలి? మూల్యాంకనం ఎలా ఉండాలి? ఎలా చేయాలి? ఇతర రాష్ట్రాలు, యూపీఎస్‌సీ వంటి సంస్థలు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నాయి? అనే అంశాలను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నట్లు సవాంగ్ వివరించారు. కమిటీలు ఇచ్చిన సిఫారసులు, ప్రజలు, మేధావుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిశీలించి మార్పులు చేపడతామని చెప్పారు.
మార్పులు ఇలా...!
ప్రస్తుతం గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉన్నాయని, దాన్ని ఒక పేపర్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు గౌతం సవాంగ్ తెలిపారు. స్క్రీనింగ్ దశ పరీక్ష కాబట్టి ఒక పేపర్ సరిపోతుందనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. గతం కన్నా సులభంగా ప్రిలిమ్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెయిన్స్‌లో కూడా ఇప్పుడు ఉన్న ఐదు పేపర్లను నాలుగు పేపర్లకు తగ్గించి, అందులో రెండు పేపర్లు వ్యాసరూప ప్రశ్నలు (డిస్క్రిప్టివ్), రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో రూపొందించాలనే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే, సిలబస్ మారదని, ఉన్నదాన్నే కొంత రీఫ్రేమ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. సిలబస్ గురించి అభ్యర్థులకు ఎలాంటి అపోహలు, ఆందోళన అవసరం లేదన్నారు. మూల్యాంకన విధానాన్ని మార్చేందుకు అధ్యయనం జరుగుతోందన్నారు. మొత్తంగా నియామక విధానాన్ని సులభంగా, సౌలభ్యంగా మార్చే దిశగా కసరత్తు చేస్తున్నామన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వారిలో వాస్తవ సామర్థ్యాన్ని వెలికితీసేలా కొత్త విధానం ఉంటుందన్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ నెల రోజల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. గ్రూప్–2 పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment